ఎం కోటేశ్వరరావు
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ దళితుడు కాదు బిసి: ఎబివిపి
అయితే ఏమిటట !
వారు చెబుతున్నదాని ప్రకారం దళితుడు కాదు, వెనుకబడిన తరగతికి చెందిన యువకుడు. కావచ్చు, కాకపోవచ్చు, లేదు బిసి కాకపోతే ఓసి, ఓసీలోకూడా హిందూత్వను వ్యతిరేకించే గట్టి కార్యకర్త అనుకోండి…. అంతమాత్రాన అందుకు కారకులుగా విమర్శలను ఎదుర్కొంటున్నవారిని నిలదీయ కూడదా ? ఎంతో భవిష్యత్ వున్న ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్ధితుల గురించి ప్రశ్నించకూడదా ? నేరగాళ్లను వదలి వేయాలా? శిక్షించాలా ? ఎబివిపి వారికి వచ్చిన సమస్య ఏమిటి ?
దొరల పాలనా భావజాలం నుంచి బయటకురాని రాజకీయ నేతలే బీసి బంధువైన దత్తాత్రేయపై కుతంత్రాలకు పాల్పడుతున్నారు : బిజెపి ఓబిసి మోర్చా
అయితే ఏమిటట !
ఒక విమర్శ రాగానే మోర్చావారికి మూర్ఛ రావాలా ? మోర్చా, ఎబివిపి రెండూ సంఘపరివార్ సంస్ధలే ఒకే నోటితో, అదీ నరం వున్న నాలుక నోటితో కదా మాట్లాడాల్సింది. విశ్వవిద్యాలయానికి దత్తాత్రేయ వుత్తరాల మీద వుత్తరాలు రాసి తోటి మంత్రి స్మృతి ఇరానీతో రాయించి ప్రతిభావంతుడైన ఒక బీసి విద్యార్ధి జీవితంతో అడుకుంటే అయన బీసి బంధువా ? బలి తీసుకొనే వ్యక్తా ? ఎన్ని నోళ్లు వున్నాయి ? వున్న నోటికి నరం వుందా ?
ఇక్కడ వీరి బాధ రోహిత్ ఎవరన్నది కాదు, దేశానికి విషంగా మారిన కాషాయ హిందూత్వ, ఎబివిపి, ఆర్ఎస్ఎస్ను గట్టిగా వ్యతిరేకించటమే అసలు సమస్య. దీర్ఘకాలం ఆర్ఎస్ఎస్ ప్రచార్‌క్‌గా వున్న దత్తాత్రేయ, వారి బాటలో నడుస్తున్న మరో మంత్రి స్మృతి ఇరానీ, విద్యార్ధులు చెబుతున్నదాని ప్రకారం దళితులు, బిసిల పొడగిట్టని విసి పొదిలి అప్పారావు అత్యుత్సాహం మ్తొత్తంగా హిందూత్వ వున్మాదం, దానికి లొంగిపోవటమే రోహిత్‌ను బలి తీసుకున్నాయన్నది స్పష్టం.
ముంబై పేలుళ్ల వుగ్రవాది యాకుబ్ మెమెన్‌ను వురితీస్తే దాన్ని ఖండిస్తూ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో రోహిత్ పాల్గొన్నాడు: సోషల్ మీడియా, కాషాయ మీడియా సేవకులు
అయితే ఏమిటట !
శవాల కోసం గగన విహారం చేయటమే రాబందుల పని, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ఎక్కడ సంఘపరివార్ సంస్ధలు, వ్యక్తులకు ఇబ్బంది వస్తుందా అని అక్కడ వాలి పోదామా అని రాబందుల మాదిరి హిందూత్వ ప్రచార సేవకులు వెంటనే సామాజిక మీడియాలో తమ పనిలోకి దిగి పోతారు. మెమెన్ వంటి ఒక జాతి వ్యతిరేక శక్తి మరణిస్తే అంతగా స్పందించిన రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా స్పందించాలా అన్నట్లు వ్యంగ్యోక్తులతో ప్రచారానికి దిగారు.
వుగ్రవాదులు విదేశాలలో కుట్ర చేసి దాడులకు పాల్పడ్డారా, స్వదేశంలోనే కుట్రలు చేశారా అన్నది సమస్య కాదు. ఎక్కడ చేసినా కుట్ర కుట్రే ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఎవరూ సమర్ధించరు. అనేక మంది హిందూ వుగ్రవాదులు జైళ్లలో వున్నారా లేదా ? స్వామి అసిమానంద ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అజ్మీర్ షరీఫ్, మక్కామసీదు, మాలెగావ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయా కాదా ? తన నేరాలను మెజిస్ట్రేట్ ముందు అంగీకరించాడా లేదా ? దర్యాప్తు సంస్ధలు తనపై వత్తిడి తెచ్చాని బుకాయించాడు. అందులో ఆశ్చర్యం లేదు.అలా బుకాయించిన తరువాత కారవాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వుగ్రదాడులకు ఆర్‌ఎసెస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ అంగీకరించాడని చెప్పాడు. తరువాత తానలా అనలేదన్నాడు. అయితే కారవాన్ పత్రిక ఆడియో టేపులను విడుదల చేసి అసిమానంద్ నిజస్వరూపాన్ని బయట పెట్టింది.యూకూబ్ మెమెన్ తనంతట తానుగా లొంగిపోయాడన్నది అందరికీ తెలిసిన నిజం. పేలుళ్ల కుట్రకు సంబంóంచి అనేక విషయాలు వెల్లడించాడు. వాటితో తనకు ఎలా సంబంధం లేదో చెప్పటానికే లొంగిపోయాడన్నది ఒక కధనం. దీన్ని కొంత మంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. యూకూబ్ మెమెన్ వురితీయాల్సిన వ్యక్తి కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ కాబినెట్ సెక్రటేరియట్లో అదనపు కార్యదర్శిగానూ, పరిశోధన మరియు విశ్లేషణ( రా) పాకిస్థాన్ విభాగానికి అధిపతిగా పనిచేసిన బి రామన్ ఒక వ్యాసంలో రాశారు. ఇదేమీ రహస్యం కాదు. అలా రాసినంత మాత్రాన ఆయన దేశవ్యతిరేక శక్తా ? వురి శిక్షలను మొత్తంగా వ్యతిరేకించే సిపిఎం మెమెన్ వురిని వ్యతిరేకించింది. యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరింది. ఇతర అనేక మంది ఈ అభిప్రాయాన్ని కలిగి వున్నారు. కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని కొందరు విద్యార్ధులు కూడా ఆ కారణంగానే సంతాపసభకు హాజరై వుండవచ్చు, వారిలో రోహిత్ ఒకరు కావచ్చు. తప్పేముంది ? ముంబైలో వేలాది మంది మెమెన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత మాత్రాన వారంతా జాతి వ్యతిరేక శక్తులా ?
జాతిపిత మహాత్మా గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ గాడ్సేకు గుడి కట్టేందుకు, వాడి వర్ధంతి,జయంతులను పాటింటే వారు, వారికి మద్దతు పలికే హిందూత్వ శక్తులు దేశ భక్తులుగా చలా మణి అవుతుండగా వాటి గురించి ఏమిటని ఏ చర్యలు తీసుకున్నారని లేఖలు రాయటంలో సిద్ధ హస్తుడైన దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేఖలు రాయటం లేదు? అంతెందుకు మజీతియా వేజ్ బోర్టు సిఫార్సులను మీడియా సంస్ధలు అమలు జరపటం లేదన్నది బహిరంగ రహస్యం. జర్నలిస్టులు స్వయంగా అయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పారు, రాతపూర్వకంగా ఇచ్చారు, ఆ సిఫార్సులను అమలు జరిపేందుకు కేంద్ర కార్మికశాఖా మంత్రిగా రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిన బాధ్యత ఆయనదే . ఎన్ని రాష్ట్రాలకు,ఎన్నిసార్లు రాశారు?్ల సమాధానం రాకపోతే గుర్తు చేస్తూ మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు లేఖలు రాశారో చెప్పగలరా ? పత్రికలకు వివరాలు విడుదల చేయగలరా ? ఒక ఎంపీ, కేంద్ర మంత్రి దేశంలో ఏం జరిగినా పట్టించుకోవాలి కదా ?
హిందుత్వను, కాషాయాన్ని తానెంతగా వ్యతిరేకిస్తున్నాడో రోహిత్ చెప్పే వీడియోను కమలం గ్రూపు పేరుతో వున్నవారు సామాజిక మీడియాలో తిప్పుతున్నారు. అతని నిజస్వరూపం ఇది, అందుకు సాక్ష్యం అది అంటున్నారు.
అయితే ఏమిటట !
వీడియోలో రోహిత్ చెప్పినదానిలో దానిలో తప్పేముంది? హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని ఆర్ఎస్ఎస్ చెప్పటం లేదా దాన్ని గోడల నిండా చెడరాయటం లేదా ? ఆవును చంపిన వారిని కొట్టి చంపమని వేదాలు చెప్పాయని ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్యలో వినయకృష్ణ చతుర్వేది రాయలేదా. రోహిత్ అంతకంటే దారుణంగా ఏమీ చెప్పలేదే. హిందూత్వ, దానికి విద్యార్ధులలో ప్రతినిధులుగా వున్న ఎబివిపి కనపడితే ఎదిరించమని తన సంస్ధ చెప్పిందన్నాడు .దళితులకు ఇంకేం నేర్పించిందంటే హిందూత్వగానీ, హిందువులుగానీ హిందూ పేరు చెప్పుకొని మైనారిటీలపైకి వచ్చే వాళ్లనిగానీ, దళితుల గురించి గానీ మాట్లాడే వారుగానీ కనపడితే ఎదిరించమని చెప్పింది అని చెప్పాడు. అంతే తప్ప కొట్టమనో, చంపమనో చెప్పింది అనలేదుగా !
ఇక్కడ దళితుల గురించి మాట్లాడటం అంటే వారి కులం పేరు చెప్పి తిట్టటం, వర్ణవ్యవస్ధ పేరుతో ఎక్కడుండాల్సినోళ్లు అ్కడుండాలని అంటరానితనం పాటించటం వంటి హిందూయిజం కనపడితే ఎదిరించటమని అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. . ఎబివిపి హిందుత్వ గురించి చెప్పినట్లుగానే అదే అంబేద్కర్ విద్యార్ధి సంఘమూ చెబుతోంది.తరతరాలుగా మానవత్వానికే మచ్చ తెచ్చిన హిందూత్వ గురించి ఘనంగా చెప్పుకుంటున్నవారు వుండగా లేనిది అందుకు తరతరాలుగా బలై అవమానాలు పొందిన వారు దానిని ఎదిరించమని చెప్పటం ఎలా తప్పవుతుంది. దోపిడీ వ్యవస్ధను కూల్చివేయమని కమ్యూనిస్టులు బహిరంగంగా చెప్పటం లేదా? ప్రత్యర్ధి పార్టీని ఓడించటమని పిలుపివ్వని, కార్యకర్తలకు చెప్పని పార్టీ ఏదో చెప్పమనండి.
గుజరాత్ మారణకాండ సందర్బంగా మూడు రోజుల పాటు ఏం చేయదలచుకుంటే అది చేయండని 2002లో ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ చెప్పారని నాడు భజరంగ దళ్ జాతీయ సమన్వయ కర్తగా వున్న హరేష్ భట్ చెప్పిన అంశాలు కూడా వీడియోలో వచ్చాయి. అంబేద్కర్ సంఘం లేదా సంఘపరివార్‌ను వ్యతిరేకించే వామపక్షాలు, ఇతర సంస్ధలు అలా చెప్పినట్లు వీడియోలు లేవే . సామాజిక మీడియాలో రోహిత్ వీడియోను తిప్పుతున్నవారు గుజరాత్ వీడియోను ఎందుకు చేయరు? అలాంటి వీడియోలను చూసిన తరువాత ఎవరైనా కాషాయ ముసుగులో జరిపే దారుణాలను వ్యతిరేకించనందుకు, అసహ్యించుకోనందుకు సిగ్గుపడాలి. వీడియో కనుక నిజమైనదైతే బ్యానర్లను చించి వుండవచ్చు, ప్రాణాలను తీయలేదే, గుజరాత్ మాదిరి మారణకాండకు రోహిత్ పాల్పడలేదే, ప్రోత్సహించలేదే ! వేలాది మంది ప్రాణాలు తీసిన గుజరాత్ మారణకాండలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరికీ వురి శిక్ష పడలేదేం ? శిక్షలు పడిన వారికి ఇంటి కంటే జైలు పదిలం అన్నట్లు సకల సౌకర్యాలు కల్పించటం సోషల్ మీడియాలోని కొంత మందికి కనిపించటం లేదా ? వారి బాధ ఏమిటి ?
విద్యార్ధులపై చర్యకు వత్తిడి చేయలేదు:బిజెపి నేతలు
అరచేతిని చూసుకొనేందుకు అద్దం కావాలా? వరుసగా తెరిపి లేకుండా రాసిన లేఖల తేదీలు చూస్తే వత్తిడి చేసిందీ లేనిదీ తేటతెల్లమైంది. నిజంగా ఒక ఎంపీ, ఒక మంత్రి లేఖ రాస్తే ఒక చిన్న విషయం మీద ప్రభుత్వ శాఖలు అంతగా వెంటపడటం ఆశ్చర్యమే. ఎన్నికలలో లోక్‌పాల్, నల్లధనం వెలికితీత గురించి తాను లేఖ రాస్తే కనీసం ప్రధాని కార్యాలయం స్పందించి తిరుగు జవాబు కూడా రాయలేదని 18 నెలల తరువాత అన్నా హజారే అంతటి పెద్ద మనిషి వాపోయిన విషయం తెలియదా ? అగస్టు నుంచి లేఖల మీద లేఖలు రెండు మంత్రిత్వశాఖలు రాయటం వత్తిడి కాదా ? వైస్ ఛాన్సలర్ కొత్తగా వచ్చి విద్యార్ధుల బహిష్కరణ మీద చూపిన శ్రద్ధ, ఆసక్తి అంతకు ముందు విశ్వవిద్యాలయంలో కమిటీలు చేసిన సిపార్సులపై లేదెందుకు?
మీ వ్యాసం చాలా బాగుంది, ఇక్కడ విషయం మోడి లేదా బిజేపి ఏమి చెసారని కాదు, రోహిత్ వేముల చేసిన పని అగ్రకులం వళ్ళు చేసినా ఎబివిపి వళ్ళు అలాగె స్పందిస్తారు అంతే కాని ఇది కుల పొరాటం కాదు, అయినా రోహిత్ వేముల దళితుడు అయినంత మాత్రాన అతనిని గుడ్డిగా సమర్థిస్తే , ప్రతి ఉగ్రవాదిని అతివాదుల్ని సమర్థించి నట్లే. ముస్లిములు దాడి చేస్తున్నరని అందరిని ఉగ్రవాదులు ఎలా అనలేమొ, కొంత మంది దళితులకు అన్యాయం జరిగిందని మొత్తం జాతినే తొక్కేస్తున్నారు అనడం అవివేకం అసమంజసం. ఓక వ్యక్తి చనిపోతూ తన చావుకి ఎవరు కారణం కాదని, ఎవర్ని నిందించ వద్దు అని లేఖ రాసినా , శవం మీద చిల్లర ఏరుకున్నట్టు అందరు తామేదో గాంధీకి వారసుల్లాగ ఉపన్యాసాలు దంచడం, దానికి కారణాలు వెతకడం. ఇలాంటి సంగటనలు కొత్త కాదు. కొన్ని రొజుల్లొ అందరు మర్చిపోతారు. దత్తాత్రేయ గారు ఎలాంటి వ్యక్తొ అందరికి తెలుసు, ఈ వయసులో పాపం ఆయనికి ఇవన్ని అవసరమా, పెద్దవాడు అని కూడ చూడకుండా ఎవరి ఇష్టానికి వారు ఆయన దోషి అని మాట్లడేస్తున్నరు. ఆయన తప్పేంటి రోహిత్ వేముల గురించి లేఖ రాయడం, ఒక సామాన్య వ్యక్తిగా నాకు రోహిత్ గురించి తెలీదు, అతను చనిపోయినా అతను చేసిన ప్రదర్శనలు , మాట్లాడిన మాటలు చూస్తే అన్నం తినే ఎవరికైనా అనుమానం వస్తుంది. కాని తమలాంటి ఆదర్శ వ్యక్తులకు మాత్రం కులం ఒక్కటే గుర్తుకు వస్తుంది, ముందు మనమందరం భారతీయులం తరువాతే కులమైనా మతమైనా, ఒక అత్త్యున్నత విద్యా సంస్థలో చదువుకోవడం ఎంత మందికి సాద్య పడుతుంది, ఎంత మంది అగ్రకులాల పిల్లలు బాగా చదివినా ఈ రిజర్వేషన్ వ్యవస్త వల్ల చదువుకి దూరమై తిండికి లేక ఇబ్బంది పడుతున్నారు, అన్యాయానికి కులం మతం పట్టదు. చివరిగా ఒక్కమాట చదువుకునే పిల్లలు అనేక కారనాలతొ చనిపొవడం దానిని ఎవరికో ఒకరికి ఆపాదించడం మన సమాజానికి బాగా అలవాటు అయింది, ఇక్కడ మనం మట్లాడుతుంది ఒక యువకుడి గురించి, చనిపోయిన వారిని తిరిగి బతికించలేం, అతని చావుకి ఎవరినో బాద్యుల్ని చెయడం ముఖ్యమా నిజ నిర్ధారణ ముఖ్యమా. పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రత్యక్షంగ తప్పు చేసిన తప్పించుకోవడం మన దేశంలో పెద్ద కష్టం కాదు, అలాంటిది ఒక లేఖ ను బూచిగా చూపించి ఎమి బావుకుంటారు, పైశాచిక ఆనందం తప్ప.
LikeLike