Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

      చచ్చినా చలించని లోకం అని తెలియని పసివాని స్ధితిలో హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ రోహిత్‌ బలవన్మరణం పాలయ్యాడు. దేశమంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. సమాజ చరిత్రలో ఎందరో వీరులు సమాజం కోసం, జన హితం కోసం వురికొయ్యలతో వూయలులూగారు, ప్రత్యక్ష పోరులో వీరమరణం పొందారు. ముందుగా ప్రకటించి మరీ ప్రాణత్యాగాలు చేశారు. అయినా చలించలా. అందుకు లోకాన్ని నిందిస్తామా ? ఎవరైనా అలాచేస్తే వచ్చే వుపయోగం వుండదు, తాము చెయ్యాల్సిన కర్తవ్యాన్ని కూడా నీరసంతో నిర్వర్తించలేరు. ఇలాంటి వుదంతాలు జరిగినపుడు అందరూ ఒకే విధంగా స్పందిస్తారని ఆశించకూడదని ఇప్పుడు మరోసారి రుజువైంది.ఈ సందర్బంగా సహజంగానే దళిత వుద్యమాలు, భవిష్యత్‌ గురించి అనేక మందిలో చర్చ, అంతర్మధనం మొదలైంది.

    వినదగునెవ్వరు చెప్పిన వినిన0తనే వేగ పడక అన్నట్లు చర్చలో ముందుకు వచ్చే అన్ని అంశాలను ప్రతి వుద్యమకారుడూ వుద్రేక పడకుండా సహనంతో మంచిచెడుల గురించి ఆలోచించాలి. గతంలో జరిగిన దాని గురించి గుణపాఠాలు తీసుకోవాలే తప్ప దెప్పి పొడుపులు, ఎవరి బాధ్యత ఎంత అన్నది ముందుకు రాకూడదు. ఇది వ్యక్తిగతమైనదో లేక కొందరు వ్యక్తులకు సంబంధించినదో కాదు. ఆర్ధిక వ్యవస్ధతో ముడిపడిన ఒక పెద్ద సంక్లిష్ట సామాజిక సమస్య. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సమస్యను మనదైన పరిష్కారంతోనే స్వస్థి పలకాల్సి వుంది. ఒక విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు అటువంటి పరిస్ధితి ఎందుకు వచ్చింది, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఎలా చూడాలి అన్నది సభ్య సమాజ వైఖరిగా వుండాలి పోయి, అతడు దళితుడు కాదు బీసి అని, బీసి బంధువు దత్తాత్రేయ మీద విమర్శలా అని సమస్యను పక్కదారి పట్టించటానికి బిజెపి పార్టీకి చెందిన రెండు విభాగాలే పూనుకోవటాన్ని చూశాము. అలాగే ‘ విశ్వవిద్యాలయ అవమానత్వం, పెత్తందారీతనం, క్రూరత్వం, కుల,మత రాజకీయం ఎంత కారణమో -వాటి మీద పోరాడుతున్న దళిత, బహుజన వుద్యమాలూ, ప్రగతిశీల శక్తులూ కూడా రోహిత్‌ మరణానికి అంతే కారణం’ అని ఒక వ్యాఖ్యాత చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? నిరాశా, నిస్పృహలు వుండవచ్చు గానీ ఇలాంటి వ్యాఖ్యలు, నిర్ధారణలకు రావటం వలన పైన పేర్కొన్న శక్తులకే ప్రయోజనం తప్ప వాటిని వ్యతిరేకించే వారికి కాదు. నిజానికి రోహిత్‌ మరణం చుట్టూ తిరుగుతున్న అంశాలను చూస్తే అవి కేవలం తక్షణ దళిత సమస్యలు కావు. దేశం మొత్తానికి సవాలు విసిరిన హిందూత్వను వ్యతిరేకించే , ఒక వుదంతంపై తమ అభిప్రాయం చెప్పుకొనే ప్రజాస్వామిక స్వేచ్ఛ హక్కు ఇమిడి అంశం. రోహిత్‌ చెప్పిన అంశాలంటూ సామాజిక మీడియాలో తిరుగుతున్న వీడియోలో అదే వుంది. ఎంతో స్పష్టంగా తన భావాలను రోహిత్‌ వెల్లడించాడు.

     నిజమే మూకుమ్మడి వుద్యమం చేసి వుంటే రోహిత్‌ బతికి వుండేవాడే. జరగకపోవటానికి కారకులు ఎవరు ? అటువంటి వుద్యమాలు చేసే వాతావరణం వున్నదా ? ఆ వ్యాఖ్యాతే చెప్పినట్లు ‘ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్ధులు అంబేద్కరిస్టు స్టూడెంట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన వాళ్లు,యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించుకోవటం మీదే వారి ప్రధాన దృష్టి. బయటి సంస్ధలతో వారికి పెద్ద సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం దళిత సంఘాలతో కూడా వారికున్నది అరకొర మైత్రి మాత్రమే’ అంటూనే ప్రగతిశీల వుద్యమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం విచారకరం.

    ఈ రోజు అస్థిత్వ ధోరణులు సమాజాన్ని వూపివేస్తున్నాయి. వాటికి గురికాని వారు దాదాపుగా లేరంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా అక్కడి వారు పిలిచినా పిలవక పోయినా తెలియచేయకపోయినా తెలిస్తే చాలు వుద్యమకారులు వాలిపోయి వారితో మమేకమైన వుదంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడా పరిస్ధితి వుందా?

      అవినీతి వ్యతిరేక ఆందోళనలో భాగంగా న్యూఢిల్లీలో అన్నా హజారే నాయకత్వంలో జరిగిన దీక్షలు, నిరసనల గురించి తెలిసినదే. మొత్తం రాజకీయ పార్టీలన్నీ ఒకటే అనే పేరుతో అవినీతికి దూరంగా వున్న వామపక్షాలతో సహా అన్నింటినీ దూరంగా పెట్టి రాజకీయ రహితం పేరుతో నడిపించిన విషయం తెలిసిందే. తరువాత దానిలో ఒకరైన కేజ్రీవాల్‌ స్వంత రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు. కిరణ్‌బేడీ బిజెపిలో చేరిపోయారు.జనరల్‌ వీకె సింగ్‌ ఇపుడు మోడీ మంత్రివర్గంలో సభ్యుడు. అన్నా హజారేను అరెస్టు చేసినపుడు వామపక్షాలు ఖండించాయి తప్ప అంతకు మించి ముందుకు పోతాయని ఎవరైనా ఎలా ఆశిస్తారు. ప్రతి వుద్యమం వెనుక ఏదో ఒక లక్ష్మం వుంటుంది. బయటకు చెప్పనిదేదో వుంది కదా అని అవినీతి వ్యతిరేక వుద్యమానికి మద్దతు పలకకుండా ఎలా వుంటారు? ఈ వుద్యమం పట్ల దళితనేతల లేదా మేధావుల వైఖరి ఏమిటి ? అది అగ్రవర్ణాల వుద్యమం అని చంద్రభాను ప్రసాద్‌ వ్యాఖ్యానిస్తే, మనువాది వుద్యమం, సామాజిక న్యాయ వ్యతిరేకం, దళితులు, గిరిజనులు, ఓబిసీలకు దానితో సంబంధం లేదు, వ్యతిరేకిస్తామని కంచె ఐలయ్య పేర్కొన్నారు.

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక సంఘం ఏర్పడి ఆందోళనలు చేస్తుంటే దళిత సంఘాలు దూరంగా ప్రేక్షక పాత్ర వహించాయి. దానిలో సిపిఎంలో పని చేసే కార్యకర్తలు చురుకుగా పనిచేస్తుండవచ్చు, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వున్న బివి రాఘవులు రంగారెడ్డి జిల్లాలో యాత్ర చేస్తే దాన్నొక రాజకీయ ప్రయోజన చర్యగా చూశారు. అంతెందుకు అస్ధిత్త ధోరణులు ఎంతగా పెరిగి పోయాయంటే స్త్రీల సమస్యలను స్త్రీలే పరిష్కరించుకోవాలి, దళితులు సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలి , బీసిల సమస్యలను బీసీలే పరిష్కరించుకోవాలి. ఇతరులకు వాటిలో స్ధానం లేదు, వారికి అసలు ఆ సమస్యలు తెలియవు అన్న ధోరణి ప్రబలిందా లేదా ? చివరికి అది ఇంకా ముదిరి పోయింది. లేకుంటే ‘వివిధ రంగాలలో వివిధ కోణాల నుంచి దళిత బహుజన జీవితాన్ని, అనుభవాల్ని విశ్లేషించుకుంటూ కొత్త కొత్త పోరాట రూపాల్ని ఆవిష్కరించటం ఇక్కడ మృగ్యం.ఎవరి కుల సంక్షేమం కోసం వారు కట్టుబడి వుండటం తప్ప వుమ్మడి పోరాటాల్ని చేపట్టటానికి ఇరుకు విబేధాల్ని పక్కన పెట్టే సమన్వయం లేదు.’ అని పైన నేను పేర్కొన్న వ్యాఖ్యాత వాపోవటం నూటికి నూరు పాళ్లు నిజం. ‘ సరైన అంబేద్కరిస్టు దృష్టితో కుల నిర్మూలనోద్యమాన్ని బలోపేతం చేయగలిగే వుద్యమాలు రూపొందక పోవటం దళిత బహుజన ప్రపంచానికి చెందిన తక్షణ ప్రశ్న. మన కోసం మనం నిలబడుతూ అందరి కోసం పోరాడాలనే పూలే స్ఫూర్తిని విస్మరించిన దళిత బహుజన సంఘాలు రోహిత్‌ లాంటి ఎంతో మంది విలువైన వ్యక్తుల్ని నిలుపుకోలేకపోతున్నాయి. కనుక ఈ కోణంలో రోహిత్‌ మరణానికి వర్తమాన దళిత బహుజన వుద్యమాలే ఎక్కువ బాధ్యత వహించాల్సి వుంది’ అని కూడా పేర్కొన్నారు. చివరకు రోజువారీ కుల నిర్మూలనా పోరాటాలతో మమేకమవ్వటమే మన ముందున్న కర్తవ్యం అని సూత్రీకరించారు.

    అంబేద్కర్‌ ప్రారంభించిన కుల నిర్మూలన ఒక ఆదర్శం. అది సాధ్యమా, సాధ్యం కావటానికి ఎంత సమయం పడుతుంది అనేవి వూహాజనిత ప్రశ్నలు. పై రచయితే చెబుతున్నట్లు ఎవరి కుల సంక్షేమం కోసం వారు కట్టుబడి వుంటున్నపుడు కుల నిర్మూలన ఎలా సాధ్య పడుతుంది? సమరశీల కుల నిర్మూలనా పోరాటాలు ఎలా జరుగుతాయి? అసలు ఐక్యత ఎలా కుదురుతుంది? అందువలన కుల గిరి ఆలోచనా పరిధి నుంచి బయట పడాలి. కమ్యూనిస్టులు తమ అంతిమ లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం అని చెబుతారు. దాన్ని చేరుకోవటానికి ఎన్నో మెట్లు ఎక్కాలి. మెట్టు ఎక్కకుండా మేడమీదకు ఎగిరితే నడుములు విరుగుతాయి తప్ప పైకి ఎక్కలేరు. అందుకే అలాంటి మెట్టుగా మన దేశంలో సిపిఎం జనతా ప్రజాస్వామిక విప్లవ దశ గురించి తన కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్లుగానే ప్రపంచంలో ప్రతి కమ్యూనిస్టు పార్టీ తన కార్యక్రమాన్ని రూపొందించుకుంటుంది. దాన్ని సాధించటానికి అనుసరించే ఎత్తుగడలు, మార్గాల గురించి విబేధాలు వేరే విషయం.

     పెట్టుబడిదారీ విధాన వయస్సుతో పోల్చితే మన దేశంలో ఘనీభవించి పోయిన కుల, మనువాద వ్యవస్ధ ఎన్నో రెట్లు ఎక్కువ. పెట్టుబడిదారీ విధానంలో 99శాతం కార్మిక వర్గానికి కనిపించే ప్రత్యక్ష శతృవు ఒక శాతం యజమాని మాత్రమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో అలా కాదు. ప్రతి మెట్టుకూ ప్రతి కులమూ ఒక యజమాని. అందువలన ఎదుర్కోవటం అంత తేలిక కాదు. అందువలన దళిత బహజన సంఘాలు కూడా అంతిమ లక్ష్యంగా కుల నిర్మూలన లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు.  సాధనకు మిత్రులను కలుపుకో తప్పదు. అనేక అవలక్షణాలున్న ఈ సమాజం నుంచి ఆదర్శవంతమైన కొత్త సమాజం రావాలి రావాలి తప్ప వేరే ఎక్కడి నుంచో ఊడి పడదు. అందుకే సామాజికోద్యమాలతో పాటు వర్గ వుద్యమాలనూ జమిలిగా సాగిస్తేనే ప్రయోజనం. ఏది ముందు, ఏది వెనుక,దేనికి మొదటి ప్రాధాన్యత, దేెనికి రెండవ ప్రాధాన్యత అన్న వృధా చర్చలోకి పోకుండా అంతిమ లక్ష్యానికి అనుగుణంగా ఏది ముందుకు వస్తే దానిపై కేంద్రీకరించి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. ఒకదాని కోసం మరొక దానిని వాయిదా వేయాల్సిన పనిలేదు. పక్కదారి పట్టాల్సిన అవసరం లేదు. కుల వ్యవస్ధలో సామాజిక అణచివేతతో పాటు వర్గ దోపిడీ కూడా మిళితమై వుంది. అందువలన కుల వ్యవస్ధపై పోరాటానికి వర్గదోపిడీని వ్యతిరేకించే శక్తులన్నీ కలసి వస్తాయి. ఒక సంస్ధలో వుండి పనిచేయలేమనుకుంటారా విడివిడిగా వుండొచ్చు, సమన్వయం చేసుకోవచ్చు, కలసి పనిచేయవచ్చు. ఈ దిశగా దళిత వుద్యమం, వామపక్షాలూ, ఇతర భావ సారూప్యత గల శక్తులు, వ్యక్తులూ అందరూ కలసి పనిచేయటమే రోహిత్‌కు సరైన నివాళి అవుతుంది.