Tags

, , , ,

షరియత్‌ను అంటే తాలిబాన్లు, మరి హిందూత్వను రుద్దే వారు జీహాదీలు కాదా ?

ఎం కోటేశ్వరరావు

పవిత్ర మత యుద్ధం జరపాలనే వారందరూ వున్మాదులే, వుగ్రవాదులే ఎవరికి నచ్చిన పేరు పెట్టుకోండి.మన దేశానికి వస్తే అకుపచ్చ తాలిబాన్లు మైనారిటీ, కాషాయ తాలిబాన్లు మెజారిటీ. ఎవరు చెప్పినా మతాన్ని రక్షించాలి, మతం చెప్పినదాన్ని పాటించాలి లేకుంటే అంతు చూస్తాం, ఇదేగా జరుగుతోంది. స్వతంత్ర పార్టీ మితవాద శక్తులు ప్రారంభించిన స్వరాజ్య పత్రికను ఇప్పుడు చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా స్వరాజ్య నినాదం, వుద్యమాలతో సంబంధం లేని, మతవాదులు దానిని స్వాధీనం చేసుకొని భారత దేశ మితవాద అభిప్రాయాలు చదవండనే తోక తగిలించుకొని మరీ దానిని ప్రచురిస్తున్నారు.పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.

రోహిత్‌ వేముల కారల్‌ సగాన్‌ అనే శాస్త్రవేత్త అంతటి వాడు కావాలనుకున్నాడు, కానీ కారల్‌ మార్క్స్‌ నాశనం చేశాడు అనే పేరుతో ఆ పత్రికలో తేజస్వి సూర్య అనే కర్ణాటక బిజెపి లాయర్‌ ఒక వ్యాసం రాశాడు. భారతీయ విశ్వవిద్యాలయాలలో కమ్యూనిస్టు-జీహాదిస్టులు వుమ్మడిగా ఎక్కించిన దానికి ఒక దళిత విద్యార్ధి ఎలా బలయ్యాడో చూడండనే ఆర్గ్యుమెంట్‌ను సదరు లాయరు వినిపించాడు. వామపక్ష-దళిత విద్యార్ధి రాజకీయాలకు వేముల రోహిత్‌ బలయ్యాడని ఆరోపించారు. ఒక బిజెపి నేత అంతకంటే భిన్నంగా చెబుతాడని ఎవరైనా ఎలా వూహిస్తారు. అతని ఆత్మహత్యకు నేటి రాజకీయ వ్యవహారాలు,దేశంలో విద్యార్ధి రాజకీయాలు నడుస్తున్న తీరు, మన విద్యావిషయాల స్ధితితో పాటు దేశంలో దళితుల కార్యాచరణ అవినీతి గురించి మర్చిపోవద్దంటారు.

ఇంతకీ ఈ పెద్ద మనిషి కడుపు మంట ఏమిటంటే దేశంలో నేడు అత్యధిక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ‘కమ్యూనిస్టు లేదా మార్క్సిస్టు బ్రాండ్‌లైన దళిత-ఇస్లామిక్‌ రాజకీయాలకు కేంద్రాలుగా మారాయట, ప్రేమ ముద్దుల ప్రచారం, శిక్షపడిన వుగ్రవాది యూకూబ్‌ మెమెన్‌ సంస్మరణ సభలూ, మహిషాసుర దినాలను పాటించటం, గొడ్డు మాంస విందుల వంటి వాటన్నింటినీ వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో, మైనారిటీ, ఇతర వుప హక్కుల పేరుతో వామపక్ష-జీహాదీ కుమ్మక్కు విశ్వవిద్యాలయాలలో నడుస్తోందట.

కాలం చెల్లిన కమ్యూనిజంతో యువత బుర్రలను పాడు చేయటంతో పాటు హిందూ అంటేనే దేన్నయినా వ్యతిరేకించటం నేర్పాయట, ఇది వందలాది దారుణమైన దాడులకు ముఖ్యంగా కేరళ, బెంగాల్‌, తెలంగాణాలో వారికి వ్యతిరేకమైన సిద్ధాంతాలున్నవారిపై జరిగేందుకు దోహదం చేశాయట. ఇలా సాగిన ఆ వ్యాసం చివరికి ఎటు తిప్పి వుంటారో ఊహించటం కష్టం కాదు. కేవలం తోటి విద్యార్ధి ఎబివిపికి చెందిన వాడైన కారణంగానే అతని మీద దారుణమైన దాడికి రోహిత్‌ పాల్పడ్డాడట.

ఈ లాయర్‌ తప్పుడు కేసులు వాదిస్తాడనటానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.ఈ కట్టుకధను గుడ్డిగా నమ్మే కేంద్ర మంత్రులు విశ్వవిద్యాలయంపై వత్తిడి తెచ్చి రోహిత్‌ మరణానికి కారకులయ్యారన్నది దాస్తే దాగని సత్యం. ఎబివిపి విద్యార్ధిని రోహిత్‌, ఇతరులు కొట్టినట్లు, గాయాలైనట్లు ఎక్కడా లేదు, గాయాల కోసం ఆసుపత్రిలో చేరలేదని అపెండిసైటిస్‌ కారణంగా చేరినట్లు పోలీసులు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి సదరు లాయర్‌ కేరళ,బెంగాల్లో జరిగాయని చెబుతున్న దాడులలో నిజం ఎంతుందో అర్దం చేసుకోవచ్చు. సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు ఎంత సాధు పుంగవులో అనేక ప్రాంతాలలో జరిగిన మత కొట్లాటలలో పాల్గొన్న తీరు లోకం చూసింది. గుజరాత్‌ మారణకాండకు పాల్పడిన వారందరూ సాధుపలవలు అని ఈ లాయర్‌ నమ్మబలుకుతున్నారా ? కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల చేతిలో ఎందరు అమాయకులు బలయ్యారో లోకానికి తెలియదా ? కుమారుడిపై జరిగిన దాడే అవాస్తవమని పోలీసులు చెబుతుంటే తనపై కూడా దాడికి ప్రయత్నించారని ఎబివిపి విద్యార్ధి తల్లి కొత్త కథను చెప్పారు. తల్లులందు పుణ్యతల్లులు వేరయా అంటే ఇదేనేమో.

ఇక ఆ లాయర్‌ మనువాది సావర్కర్‌, దానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన అంబేద్కర్‌ శత్రువులు కాదని దళిత విద్యార్ధులు తెలుసుకోవాలట. ఎంత చక్కని వ్యాఖ్యానం ! అంటే అంబేద్కర్‌ కూడా మనువాదే అని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పటమే.అంతే కాదు కమ్యూనిజం, ఇస్లాంకు వ్యతిరేకంగా అంబేద్కర్‌ తన జీవితాంతం పోరాడారని ఈ విషయాలను దళితుల్లో ఎబివిపి సైద్ధాంతికంగా ప్రచారం చేయాలని బోధనొకటి.ఇంతటి పచ్చి అసత్యాలను చెప్పిన ఆ పెద్దమనిషి లాయర్‌ కాదు లయర్‌ !