Tags

, , ,

సత్య

వినదగు నెవ్వరు చెప్పిన………

     వినినంతనే వేగపడక గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అసలేం జరుగుతోందో తెలుసుకోవాలి? ముందు ముందు ఏం చేయాలో ఆలోచించాలి. అంతకు మించి మరొక మార్గం లేదు. వుద్రేక పడితే ప్రయోజనం లేదు. ఈ మధ్య సామాజిక మీడియాలో అనేక అంశాలపై చర్చ జరుగుతోంది. అది మంచిదే, కానీ కొందరు మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పిన మాదిరి ఎదుటివారిపై మరకలు పడేస్తున్నారు. కొన్ని అంశాలను ఈ సందర్బంగా అవలోకించ మనవి. కొందరు తీవ్ర బ్రాహ్మణ వ్యతిరేకత చూస్తుంటే బాధేస్తోంది అంటున్నారు. దానిలో వాస్తవం లేకపోలేదు. నిజమే తాము బాధ్యులం కాని దానికి తమను నిందిస్తే ఒక్క బ్రాహ్మణులేమిటి ఏ కులం వారిపై నిందవేసినా, విమర్శలు చేసినా , వివక్ష చూపినా బాధపడటం సహజం.హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మ హత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడిగా పుట్టటం నేరమా అంటూ వేసిన ప్రశ్న అలాంటి బాధలోంచి వచ్చిందే. కొన్ని సమస్యలను కూలంకషంగా అర్ధం చేసుకోకపోతే కొన్ని సందర్బాలలో అపార్ధాలకు దారితీయటం, అనేక పర్యవసానాలకు మూలం అవుతోంది.

     అలాంటి వాటిలో బ్రాహ్మణ వ్యతిరేకత ఒకటి. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత్‌, పశ్చిమ ప్రాంతాలలో ఇదొక ప్రధాన చర్చనీయాంశం. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లు దీనికి ఎవరు కారకులు అన్న చర్చలోకి పోతే తేలదు. ఏం చేయాలో ఆలోచించాలి. చరిత్రలో ఇలానే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు అంటే కొన్నింటికి సమాధానాలు దొరకవు.దేవుడి దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పే వారు అదే దేవుడు కొందరిని అంటరాని దళితులుగా , వారితో సమంగా వివక్షకు గురి అవుతున్న మహిళలుగా ఎందుకు పుట్టించాడు. శాఖా బేధాలు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ ఘనీభవించి పోయిన మన దేశంలో అవి అగ్ర అనుకొనేవా లేక అధమ అనిపిలిచేవా ఏవైనప్పటికీ అంతర్గతంగా ఒకరి నొకరు తక్కువగా చూసుకోనివి, విభేదాలతో కొట్టుకోని కులాలు ఏమున్నాయి? తమకు మొత్తంగా ఎసరు వచ్చిందనుకున్నపుడు రాజీపడుతున్నాయి.

     బ్రాహ్మణిజం-బ్రాహ్మణ వ్యతిరేకత విషయానికి వస్తే మనుస్మృతి, వేదాలు,పురాణాలు, వుపనిషత్తులు ఇంకా అలాంటి వాటన్నింటిలో చెప్పినవి,మధ్యలో చొప్పించినవి,భిన్న వ్యాఖ్యానాలు చేసినవి కలిపి హిందూయిజం లేదా హిందుత్వ, హిందూ జీవన విధానం ఏ పేరుతో అయినా పిలవనివ్వండి వేల సంవత్సరాలుగా హిందూగా చలామణిలోకి వచ్చాయి. అవి సమాజంలోని మెజారిటీ ప్రజానీకాన్ని అణచివేశాయి, అవకాశాలు దక్కకుండా చేశాయి, చీకట్లో వుంచాయి. రాజులు, రంగప్పలు, భూస్వాములు,జమిందార్లు, జాగీర్దార్లు ప్రాంతాన్ని బట్టి పేర్ల మార్పు తప్ప అలాంటి ఫ్యూడలిస్టు(భూస్వామిక) పాలకవర్గాలన్నింటికీ ఆశ్రిత తరగతిగా, సలహాదారులుగా, అవకాశాలు దొరికితే మంత్రులుగా, పాలకులుగా, హిందూయిజానికి భాష్యం చెప్పేవారిగా బ్రాహ్మణులు కొనసాగుతూ వచ్చారు, అందుకే హిందూయిజానికి మారుపేరుగా దానిని బ్రాహ్మణిజం అని కూడా పిలిచారు. ఎవరైనా తాము అ పురాతన భావాలకు ప్రతినిధులం అని భావిస్తే తిరోగమన వాదుల ప్రశంసలతో పాటు పురోగమన వాదుల విమర్శలనూ ఒకే విధంగా తీసుకోకతప్పదు.

    బ్రాహ్మణిజంతో పాటు బ్రాహ్మలను వ్యతిరేకించాలని పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ పిలుపునందుకొని బ్రాహ్మణిజానికి ప్రతిరూపంగా వున్న బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించిన రోజులు గతంలో వున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో రామస్వామి నాయకర్‌ స్ధాపించిన జస్టిస్‌ పార్టీ అనుయాయులు బ్రాహ్మణ వ్యతిరేకతలో భాగంగా పెళ్లి మంత్రాలు చదువుకొని కమ్మ, రెడ్డి బ్రాహ్మణులుగా అవతారమెత్తి వివాహాలు చేయించిన వుదంతాలు కూడా వున్నాయి. నిజానికి మంత్రతతంగం బ్రాహ్మణిజంలో భాగమే అని వారు గుర్తించలేకపోయారు.అంటే బ్రాహ్మణులను తప్ప బ్రాహ్మణిజాన్ని వారు వ్యతిరేకించ లేదు. పెరియార్‌ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా హేతువాదిగా మారితే తరువాత తరంలో పుట్టిన అంబేద్కర్‌ తన జీవితాంతం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడి అలసిపోయి చివరి దశలో బౌద్దమతాన్ని పుచ్చుకున్నాడు తప్ప బ్రాహ్మణులను వ్యతిరేకించలేదు. అలా వ్యతిరేకించి వుంటే అంబేద్కర్‌ అనే ఒక బ్రాహ్మణుడి ఇంటి పేరును తన ఇంటి పేరుగా కొనసాగించి వుండేవారు కాదు, ఒక బ్రాహ్మణ యువతిని ద్వితీయ వివాహం చేసుకొని వుండేవారు కాదు. అందువలన బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వారిలో రెండు ధోరణులూ వున్నాయి.ఇప్పుడు పెరియార్‌ అనుచరులుగా వున్నవారు కూడా బ్రాహ్మణులను వ్యతిరేకించాలని పిలుపు ఇవ్వటం లేదు. అదే జరిగి వుంటే తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఎలా అవుతారు. ఎవరైనా ఫేస్‌బుక్కులో అలాంటి సందేశాలు పెట్టి వుంటే వాటిని పట్టించుకోనవసరం లేదు. బ్రాహ్మణిజానికి పాలకవర్గాలు మద్దతు ఇచ్చినంత కాలం దాని ఫలాలను అనుభవించిన బ్రాహ్మణులు ఇపుడు ఆ పరిస్ధితి లేదు, దాని దుష్పరిణామాలను తాము అనుభవించాల్సి వస్తోంది కనుక వారు కూడా సమాజంతో పాటు మారాల్సిన అవసరం వుంది.

       ఇక బ్రాహ్మణులుగా పుట్టి బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించినవారు మన దేశంలో కోకోల్లలు. బెంగాల్‌లో 1772లో పుట్టిన రాజా రామమోహనరాయ్‌ పేరు ఇప్పటికీ ఏదో ఒక మూలన పెట్టుకుంటూనే వుంటున్నారు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణిజం లేదా హిందూయిజం రుద్దిన సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్త.అదే ప్రాంతంలో పుట్టిన మరో గొప్ప సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ కూడా బ్రాహ్మణుడే.తెలుగువాడైన గురజాడ అప్పారావు పంతులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి పరంపరగా తరువాత కాలంలో ఎందరో బ్రాహ్మణులు సంఘసంస్కరణ వుద్యమం నుంచి మరొక అడుగు ముందుకు వేసి కమ్యూనిస్టులుగా కూడా కూడా మారిన చరిత్ర మన కళ్ల ముందు వుంది.

     ఇలాంటి వారందరినీ హిందూత్వ పదికాలాల పాటు కొనసాగాలనుకొనే ఛాందసులు కులంలో తప్పు పుట్టారని నిందించారు. అలా కులంలో తప్పు పుట్టిన వారిగా పేరు తెచ్చుకున్నవారిలో తెలుగునాట పోలేపెద్ద నరసింహమూర్తి( ఆంధ్రకమ్యూనిస్టు కమిటి తొలి కార్యదర్శి) పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, నండూరి ప్రసాదరావు, కంభంపాటి సత్యనారాయణ , చండ్రరాజేశ్వరరావు, మగ్దుం మొహిద్దీన్‌, గుంటూరు బాపనయ్య, రావినారాయణ రెడ్డి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎందరో మనకు కనిపిస్తారు. వర్తమాన తరానికి వస్తే ఈ పరంపరను కొనసాగిస్తున్న సీతారామ్‌ ఏచూరి సిపిఎం జాతీయ కార్యదర్శి. బ్రాహ్మణులతో పాటు వివిధ కులాలకు చెందిన వీరందరూ తమ జీవితకాలాల్లో బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వారే. సకల శ్రామికవర్గాన్ని పీల్చిపిప్పి చేసే పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ధను కూల్చివేయాలని పిలుపునిస్తూ కమ్యూనిస్టు ప్రణాళిక రూపొందించిన కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు ఆ పెట్టుబడిదారీ వర్గంలోనే పుట్టారు. తన కంటే ముందున్న మతంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏసుక్రీస్తు, హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధాన్ని స్ధాపించిన గౌతమ బుద్దుడూ, అంతెందుకు రాక్షసరాజు కుటుంబంలో పుట్టిన ప్రహ్లాదుడు తాము పుట్టిన వర్గానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే. అంతకంటే మనకు మరొకరి మార్గదర్శకత్వం అవసరం ఏముంది? మనం ఒక కులం లేదా మతం, కుటుంబంలో పుట్టటం అనేది యాదృచ్ఛికం తప్ప మరొకటి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు కాకుండా మన జీవితానికి ఒక అర్ధం, సంతృప్తి వుండాలంటే మనం ఎక్కడ పుట్టినా శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అన్నట్లు మనం సమాజ పురోగమనానికా తిరుగమన ప్రతినిధులమా అన్నది నిర్ణయించుకోవాలి.

    హిందూయిజం లేదా బ్రాహ్మణిజాన్ని విమర్శించినంత మాత్రాన బ్రాహ్మణులందరూ తమనే విమర్శిస్తున్నారని భావించనవసరం లేదు.ముందే చెప్పుకున్నట్లు హిందూయిజం మన సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. దయానంద సరస్వతి వంటి వారు హిందూపురాణాలు పేర్కొంటున్న విగ్రహారాధన, అంటరానితనం, బాల్యవివాహాల వంటి ఇతర మూఢనమ్మకాలను వ్యతిరేకించి హిందూ సమాజ సంస్కరణలో భాగంగా కులవివక్షలేని వేదకాలాన్ని పునరుద్దరించాలని కోరుకున్నారు. అందుకోసం ఆర్యసమాజాన్ని స్ధాపించారు. అయితే దానితో పాటు ఇతర మతాలలోకి మారిన వారిని శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి మార్చాలనే వివాదాస్పద కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రతిపాదించారనేది వేరే విషయం. ఇప్పుడు సంఘపరివార్‌ సంస్ధలు చెప్పే ఘర్‌వాపసీ కార్యక్రమానికి మూలం అదే.

      హిందూత్వ లేదా బ్రాహ్మణిజాన్ని విమర్శిస్తున్నారని బాధపడే వారు బ్రాహ్మణులైనా, లేదా ఇతర కులాల వారి ముందు రెండే మార్గాలు వున్నాయి. బిడ్డ తల్లి గర్భంలోంచి ఒకసారి బయటకు వచ్చిన తరువాత తిరిగి వెనక్కు వెళ ్లటం ఎంత అసాధ్యమో రోసిపోయిన హిందూత్వ కూడా అలాంటిదే. ఒక వేళ ఎవరైనా చరిత్రను వెనక్కు తిప్పాలని అమలుకు పూనుకుంటే ఇస్లామ్‌లో షరియత్‌పేరుతో ఛాందసులుగా, వుగ్రవాదు లుగా మారిన తాలిబాన్లను అనుసరించటం. అందుకు పూనుకున్నపుడు విమర్శలు , ప్రతిఘటనలు రాకుండా ఎలా వుంటాయి బాధ పడటమెందుకు అనుకోవాలి లేదా కాలం చెల్లిన హిందూత్వ లేదా బ్రాహ్మణిజానికి మేం కూడా వ్యతిరేకం అనుకున్నపుడు ఎవరైనా వాటిని విమర్శించినందుకు చింతించాల్సిన అవసరం లేదు. అందువలన ముందు ఎటు వుండాలో తేల్చుకోవాల్సి వుంది. కుండలో కూడు కుండలోనే వుండాలి, పిల్లాడు దుడ్డుగా తయారు కావాలి అన్నట్లుగా అనేక అవలక్షణాలున్న హిందూత్వ లేదా బ్రాహ్మణిజం అలాగే వుండాలి, దాన్ని ఎవరూ పల్తెత్తు మాట అనకూడదంటే కుదరదు.

     రాజారామ్మోహనరాయ్‌, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, జ్యోతిబాపూలే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి ఎందరో సంస్కర్తల పతాకను సమున్నతంగా ఎగురవేస్తూ , విమర్శలను సహించే ఏకత్వంలో భిన్నత్వానికి ప్రాతినిధ్యం వహించే మహత్తర భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకుపోయే, తాతగారి నాన్నగారి భావాలకు పాడెకట్టే ముందుయుగం దూతల వారసులు వున్న దేశం ఇది. విమర్శలను సహించక తప్పదు. మీరూ విమర్శించండి, నిజాల నిగ్గు తేల్చండి, మా మనోభావం, మా నమ్మకం అంటే కుదరదు. ఎవరి నమ్మకాలు, ఎవరి మనోభావాలు వారికీ వుంటాయని గుర్తించండి.జనాన్ని మెప్పించండి, నొప్పించకండి.