Tags

, , , , , ,

Snapshot of the front page of The Telegraph, January 23, 2016.

courtesy : The Telegraph

ఎం కోటేశ్వరరావు

ప్రధాని నరేంద్రమోడీ ! గొప్ప ‘పాలనా దక్షుడు’, అంతకంటే ఆయనో ‘మహానటుడు’ అన్నది హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి వేముల రోహిత్‌ మరణించిన ఐదు రోజుల వరకూ చాలా మంది గుర్తించలేదు. అన్నింటి కంటే ఆయన వెనుక వున్న మేథో చెరువు(మాయా బజార్‌ సినిమాలో ఘటోద్గజుడు చెప్పినట్లు ఎవరూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయి వేయండిరా వీడికో వీరతాడు అన్నట్లు థింక్‌ టాంక్‌కు నా అర్ధం)లో వున్న వ్యూహకర్తలు ఇంకా తెలివి గల వారు. ఆయనెంతటి పాలనా దక్షుడు కాకపోతే ముఖ్యమంత్రిగా తన పదమూడు సంవత్సరాల, తన విధానాల కొనసాగింపు వారసురాలి రెండు సంవత్సరాలు వెరసి 15 ఏళ్లలో గుజరాత్‌ నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్లకు నీరు అందించాల్సి వుండగా ఇప్పటి వరకు లక్షా 17వేల 026 హెక్టార్లకు అందించగలిగినా, ప్రధాన కాలవలు పూర్తయి, పొలాలకు నీరందించాల్సిన పిల్లకాలవల తవ్వకం 21శాతం పూర్తి కావటమంటే 35 సంవత్సరాల నర్మదా ప్రాజెక్టు చరిత్రలో సాధించిన ‘ఘనత ‘కాకపోతే మరేమిటి? అంతేనా నీటిలో పరిశ్రమలకు కేటాయించిన 0.20 ఎంఎఎఫ్‌(మిలియన్‌ యాకర్‌ ఫీట్‌)కు గాను ఇప్పటికే 0.25 కేటాయించటం మామూలు విషయమా? వ్యవసాయం కంటే పరిశ్రమలకు పెద్ద పీట వేసినట్లు కాదూ !!

ఇక నటుడిగా నరేంద్రమోడీ గురించి చెప్పాలంటే ఆయనొక మట్టిలో మాణిక్యం. తెలుగు సినిమాల్లో పేద పాత్రలు వేసేటపుడు కూడా చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటే మన హీరో, హీరోయిన్ల గ్లామర్‌ ఎక్కడ తగ్గిపోతుందో అని పట్టుబట్టలను చింపి వేయటమో , కలల్లో అందమైన దుస్తులతో కూడిన దృశ్యాలను చూపటమో చేసినట్లుగా నరేంద్రమోడీ సందర్బానికి తగినట్లు దుస్తులు మార్చటంలో పేరు మోశారంటే నటుడు కాకపోతే సాధ్య మౌతుందా ? ఆయన తనదైన బ్రాండ్‌ కుర్తాను ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వదిలిన విషయం తెలిసినదే.ఏంజెలా మెర్కెల్‌ పర్యటన సందర్బంగా ఆమె ఏ రంగు కోటు వేసుకుందో అదే రంగు కోటును తాను ధరించటం, మరొక సందర్బంలో ఒకే రోజు నాలుగు కార్యక్రమాలకు నాలుగు దుస్తులు మార్చిన ఘనత మోడీ వంటి సామాన్యుడు, టీ అమ్మిన వారికి తప్ప మరొకరికి సాధ్యంకాదు.ఏదో సమయానికి కనపడిన దుస్తులు వేసుకుంటాను తప్ప తనకు దుస్తుల డిజైనర్‌ ఎవరూ లేరని అదీ నేటితరం విద్యార్ధులతో చెప్పటం ఒక మహానటుడికి తప్ప మరొకరికి ఎలా సాధ్యం ? నరేంద్రమోడీ హావభావాల గురించి తాజాగా కొల్‌కతా నుంచి వెలువుడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక సచిత్రంగా వెల్లడించింది. వరుసగా సోమ, మంగళ,బుధ, గురువారాలలో వివిధ కార్యక్రమాలలో ఎంతో వుల్లాసంగా, వుత్సాహంగా కనిపించిన ప్రధాని శుక్రవారం నాటికి లక్నోలో తీవ్ర విచార సాగరంలో మునిగి పోయారు. రోహిత్‌ మరణం గురించి (ఐదురోజుల తరువాత) బొటబొటా కన్నీరు కార్చారు.అదీ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో, కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన తరువాత కూడా అలా చేయకపోతే ఎలా ! ఈ సందర్బంలో కూడా మా భారతి అంటూ రోహిత్‌ తల్లిని సంబోధించారు. రాధిక అన్న ఆమె పేరును పలకటానికి కూడా ఇచ్చగించలేదా ? సంఘపరివార్‌ ప్రచారక్‌లు ప్రతిదానికీ భారత్‌, భారతి అనే పదాలను ముందు, వెనుకా తగిలించటంలో పెద్ద శిక్షణే పొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తాను గొప్ప జాతీయ వాదినని ప్రదర్శించుకొనేందుకు తాను ఏర్పాటు చేసిన అనేక సంస్ధలకు వాటిని తగిలించింది. భారతీయ జన సంఘ్‌, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌,అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌, విద్యాభారతి, విజ్ఞాన భారతి, సంస్కార భారతి ఇలా….ఒక ప్రచార్‌క్‌గా పనిచేసేందుకు కట్టుకున్న భార్యనే వదిలేసిన నరేంద్రమోడీ జీవితకాలమంతా చేసే ప్రసంగాలలో భారత్‌, భారతి అని పదే పదే పలికి చివరికి రోహిత్‌ తల్లిని కూడా మా భారతి అన్నారేమో . మా మోడీ ఆ ఆర్ధంతోకాదు భారత మాత ఒక బిడ్డను కోల్పోయింది అన్నారని ఎవరైనా టీకా తాత్పర్యం చెప్పవచ్చు. ఏదైతే ఏమైంది వదిలేయండి, మొసలి కన్నీరు ఎవరికి కావాలి?

కులుబర్గి, దాద్రి వుదంతాల తరువాత కూడా నరేంద్రమోడీ ఏమీ నేర్చుకోలేదా ? ఆయన మేథో చెరువులోని కప్పలు అంతకు ముందు రాసిన స్ట్రిప్టులను కాపీ చేసి యధాతధంగా ఎప్పటి కప్పుడు అందిస్తున్నాయా? ఏమో అలాగే కనిపిస్తోంది. వారు మోడీ ప్రతిష్ట పెంచేందుకు చేస్తున్న సాయం, పడుతున్న కష్టం ఏమిటో తెలియదుగానీ దేశ పౌరులకు చేస్తున్న మేలుకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి. కులుబర్గి హత్యా వుదంతంలో కొంత మంది మేథావులను అయినా కదిలించగలిగారు, దేశంలో అసహన ధోరణుల గురించి తెలియని వారికి తెలియచెప్పారు.తమ పండగ సందర్బంగా గొడ్డు మాంసం తిన్న ముస్లిం కుటుంబం ఆవు మాంసం తింటున్నారంటూ దాడి చేసిన దాద్రి ఘటనలో కుటుంబ యజమానిని చంపివేసిన సందర్బంగా చాలా రోజుల వరకు మోడీ నోరు తెరవకుండా వ్యూహం రచించి ఆయనపై భ్రమలు పెంచుకున్న నయా వుదారవాద ముస్లింలలో సైతం పునరాలోచన కలిగించటంలో మోడీ తెరవెనుక మేథావులు జయప్రదమయ్యారు. ఇప్పుడు కూడా దళిత విద్యార్ధి రోహిత్‌ విషయంలో కూడా దానినే అమలు జరిపి బిజెపి దళిత మోర్చా కూడా భరించలేని పరిస్ధితిని తెచ్చి మొత్తం దళితులను, ఇతర బలహీన వర్గాలకు ఎంతో జ్ఞానోదయం కలిగించారు. నూటికి నూరు శాతానికి కలగదు అది వేరే విషయం.

ప్రపంచ చరిత్రలో ఒక చిన్న సంఘటన జనానికి సామూహిక చైతన్యం కలిగించి పెను మార్పులకు నాంది పలికిన వుదంతాలు చాలా వున్నాయి. రష్యాలో జనానికి జార్‌ ప్రభువుపై అసంతృప్తి వున్నప్పటికీ మరోవైపు ఎక్కడో నమ్మకం కూడా వుంది. అందుకే 1905లో జపాన్‌లో యుద్ధం సందర్భంగా లెనిన్‌ తదితరులు తిరుగుబాటుకు ప్రయత్నిస్తుండగా ఫాదర్‌ గోపన్‌ నాయకత్వంలో జార్‌కు తమ కోర్కెలను విన్నవించుకొనేందుకు వెళ్లిన జనంపై జార్‌ సైన్యం జరిపిన మారణ కాండ రష్యన్‌ విప్లవాన్ని వేగవంతం చేసింది. లెనిన్‌ తదితరులు జార్‌ను నమ్మవద్దని చేసిన హెచ్చరికలను జనం ఖాతరు చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జపాన్‌ ఓడిపోయి సలాంగొట్టిన స్ధితిలో హిరోషిమా,నాగసాకీలపై అమెరికన్లు అణుబాంబులు వేసి ప్రపంచాన్ని అణ్వాయుధ పోటీకి నెట్టి వనరులను ఎంత వృధా చేయటానికి కారకురాలైందో తెలిసిందే. అలాగే మోడీ ఆయన పరివారం ఇలాంటిది అని ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు, మధ్యలో మరికొందరు చెప్పినా ఆ , వారు రాజకీయం చేస్తున్నారు, అలాగే చెబుతారులే అని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు నిజమే అని కనీసం అంతరంగంలో అయినా అనుకుంటున్నారు. సమయం వచ్చినపుడు తామేం చేయగలరో నిర్ణయించుకోవటానికి అది చాలు.

నిజానికి కలుబుర్గి, దాద్రి, రోహిత్‌ వుదంతాలపై నరేంద్రమోడీ స్పందన సంఘపరివార్‌ వ్యవహారశైలికి అనుగుణంగానే వుంది. ముందు ఆత్మ సమర్ధన, ప్రత్యర్దులపై ఎదురు దాడికి దిగువ స్థాయి సైన్యాన్ని వినియోగిస్తారు.అది వికటించిన తరువాత నష్ట నివారణ చర్యలలో భాగంగా ఏదో ఒక మొక్కుబడి ప్రకటన చేయిస్తారు. కులుబర్గి హత్యను ఖండించకుండా కేంద్ర సాహిత్య అకాడమీపై వత్తిడి తెచ్చింది, అడ్డుకున్నదీ మోడీ సర్కారే. చివరికి అవార్డు వాపసీ వత్తిడితో ఒక ప్రకటన చేయించారు, తరువాత దాద్రి హత్యతో కేంద్రానికి సంబంధం ఏమిటని ఎదురుదాడి చేశారు. తిన్నది గోవు మాంసం కాదని తెలిసి కూడా జర్మన్‌ నాజీ గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని సమర్ధించుకోవటమేగాక గోవును చంపిన వారిని చంపివేయమని వేదాలు కూడా చెప్పాయంటూ స్వయంగా సంఘపరివార్‌ అధికార పత్రికలో రాశారు. తరువాత ఘనమైన నరేంద్రమోడీతో నోరు విప్పించారు. ఇప్పుడు రోహిత్‌ వుదంతంలో కూడా అదే జరిగింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎబివిపి పలుకుబడి ఏమిటో ప్రదర్శితం కావాలంటే దానిని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేసి మావారి జోలికి వస్తే మా తడాఖా చూపుతాం అని చెప్పేందుకే ఇద్దరు కేంద్రమంత్రులతో వత్తిడి తెప్పించి తమ నైజాన్ని ప్రదర్శించారు.అది వికటించటంతో దాన్ని తప్పుదారి పట్టించేందుకు, విశ్వవిద్యాలయ అధికారులపై కేంద్ర మంత్రులు తెచ్చిన వత్తిడి, జోక్యం విషయాన్ని మరుగుపరిచేందుకు కాషాయ పరివారం ఎన్ని పాట్లు పడిందో, పడుతోందో దేశమంతా చూసింది. అతను దళితుడు కాదు బిసి అంటూ ప్రారంభించి చెప్పని అబద్దం లేదు. పరివార్‌ సంస్ధ ఏబివిపి నాయకుడిని కొట్టారని, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కూడా కట్టుకధే అని పోలీసులే స్వయంగా కోర్టుకు తెలిపారు. మధ్యలో తాను జోక్యం చేసుకోకపోతే అసంపూర్ణంగా వుంటుందనుకున్నారేమో సుబ్రమణ్య స్వామి అందుకున్నారు. బహుశా నరేంద్రమోడీ స్క్రిప్ట్‌ రైటర్స్‌ దృష్టిలో ఈ పాత్ర లేదేమో ? సరిగ్గా మోడీతో లక్నోలో రోహిత్‌ మరణంపై విచార కన్నీరు కార్పించే సమయంలోనే సుబ్రమణ్యస్వామి తన ట్వీట్ల ద్వారా రోహిత్‌ మరణంపై కమ్యూనిస్టులు, వారికి విశ్వాసపాత్రంగా వుండే కుక్కలు మాత్రమే నిరసన అనే ఆందోళన డ్రామా ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌ విశ ్వరూపంలో ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ. ఇంకా చూడాల్సింది చాలా వుంది. హిట్లర్‌ పోయినా హిట్లరిజాన్ని సమర్ధించే, ఆచరించే వారసులు పుట్టుకు వస్తున్నట్లే ఇంత జరిగినా ఎవరైనా తామింకా పరివార్‌ సంస్ధలను, కార్యకలాపాలను సమర్ధిస్తామంటే చేసేదేముంది .ఇది స్వేచ్ఛా భారతావని !