Tags

, , ,

సత్య

ఈ పదవికి నేను అసలే కొత్త చిక్కులు,తికమకలు తెలుసుకోవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అనుకున్నాను, కానీ అంత వ్యవధి అవసరం లేదని మొదటి నెలలోనే అర్ధం అయింది అని ప్రధాని నరేంద్రమోడీ 2014 జూన్‌ 26న దేశ ప్రజానీకానికి లేఖ రాసి పందొమ్మిది నెలలైంది.ఆంటే ఆయన పదవిలోకి వచ్చి 20నెలలు పూర్తయింది. పదవీ కాలంలో మూడోవంతు అయిపోయింది. పదవిలోకి రాకముందు తానేం చెప్పారో, వచ్చిన తరువాత ఏం చేశారో, ఎందుకు చేయలేకపోయారో నెలనెలా జనానికి చెబుతారని తొలి నెల లేఖతో అనేక మంది ఆశించారు. విలేకర్లకు దూరంగా వున్న మన్మోహన్‌ సింగ్‌ మౌన ముని అని పేరు తెచ్చుకుంటే నరేంద్రమోడీ ఆయనే మంచోడు అనిపిస్తున్నారు. ఏకపక్షంగా మన్‌కీ బాత్‌(మనసులోని మాట) పేరుతో నెల నెలా రేడియోలో చేస్తున్న వుపన్యాసాలలో ఏం చెబుతున్నారో కనీసం బిజెపి వారికి అయినా అర్ధం అవుతోందో లేదో తెలియదు కానీ సామాన్య జనానికి అంతుబట్టటం లేదు.

కొండంత రాగం తీసినట్లుగా అనేక అంశాలను దేశం ముందుకు వదిలారు. వాటిలో గుజరాత్‌ మోడల్‌ను దేశం మొత్తానికి వర్తింప చేయటం ఒకటి. ఇన్ని నెలలు అవుతున్నా అదొక బ్రహ్మ పదార్ధంగానే వుంది. మచ్చుకు నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించాల్సి వుండగా ముఖ్యమంత్రిగా మోడీ 13 సంవత్సరాల పాలనతో సహా గత 35 సంవత్సరాల తరువాత కూడా లక్షా 17వేల హెక్టార్లకు మాత్రమే నీరిందించారు, 21శాతం పిల్లకాలవలే పూర్తి చేశారు. గుజరాత్‌ మోడల్‌ అంటే ఇదేనా ! దీన్ని దేశానికంతటికీ వర్తింప చేస్తారా ?

కమ్యూనిస్టులంటే గిట్టని వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని మేకిండియా పిలుపునిచ్చిన మోడీ స్వరాష్ట్రంలో లేక దేశంలోనే తయారు చేసే ఫౌండ్రీలే లేకనా కమ్యూనిస్టు చైనాలో తయారు చేయిస్తున్నారు? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు చైనాను చూసి మన దేశంలో కూడా వస్తువులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటూ మేకిండియా పిలుపునిచ్చారు. కొత్తగా తయారు చేయటం దేవుడెరుగు , ఇప్పటికే తయారు అవుతున్నవే కొనేవారులేక ఎగుమతులు నెలనెలా తగ్గిపోతున్నాయి. ఆర్ధిక వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తానని, వురుకులు పరుగులు పెట్టిస్తానని చెప్పారు ? ధరల పెరుగుదల, మత వుద్రిక్తతలు, అసహనం తప్ప మిగిలిన అన్ని రంగాలలో 20 నెలల క్రితం కంటే తిరోగమనం తప్ప పురోగమనం ఎక్కడా కనపడటం లేదు. మోడీ అధికారానికి రాక ముందు ఐదేళ్ల సగటు పారిశ్రామిక వృద్ధి రేటు 9.9శాతం వుండగా ఏడాది క్రితంతో పోల్చితే నవంబరులో 3.2 నమోదైంది. పారిశ్రామిక రంగంలో గుజరాత్‌ మోడల్‌గా దీన్ని పరిగణించాలా ? పెట్టుబడుల సమీకరణ, దేశ ప్రతిష్టను పెంచేందుకే విదేశీ పర్యటనలు అని చెప్పిన ప్రధాని గతేడాది 26 దేశాలలో పర్యటించారు. నెలకు కనీసం రెండు దేశాలు వెళ్లి వచ్చారు.వుల్లి పాయలు, కందిపప్పుల ధరలు పెరిగి జనాన్ని వురుకులు పరుగులు పెట్టించి రికార్డుల మీద రికార్డులు నమోదు చేశాయి.

మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ 24,716గా వుంది, తరువాత 30వేల వరకూ పెరిగింది. ఈనెల 25న 24,486 పాయింట్లుగా నమోదైంది. నాలుగువేల పాయింట్లు పడిపోయింది.అంటే మన పరిశ్రమలు, వాణిజ్యం పనితీరు బాగోలేదని ప్రతిపక్షాలు చెప్పనవసరం లేదు. సెన్సెక్స్‌ ప్రమాణం కాదు అని ఎవరైనా అంటే ఒక్క మహారాష్ట్రలోనే మూడువేల మంది రైతులు గతేడాది ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయమూ గిట్టుబాటు కావటం లేదనేగా, కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ బీమా పధకం ఎలా వుపయోగపడుతుందో ఇంకా చూడాల్సి వుంది.

తమ మోడీ అధికారానికి వస్తే బక్క చిక్కిన రూపాయి పాపాయి బొద్దుగా తయారై 2013లో వున్న రికార్డు విలువ 68.6 నుంచి డాలరుకు రు.40-45కు పెరుగుతుందని ఆయన మద్దతుదారులు చెప్పారు. ప్రస్తుతం రు 68-67 మధ్య కదలాడుతోంది. ఈ కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గిపోయినా ఆమేరకు వినియోగదారులకు పెట్రోలు డీజిల్‌ ధరలు తగ్గకపోగా కేంద్రం, రాష్ట్రాలు పన్నులు పెంచాయి.ఏదో ఒక సాకుతో పన్నులు పెంచటంలో మోడీ సర్కార్‌ ముందుంది. స్వచ్చభారత్‌ పేరుతో పన్నులపై సెస్‌ వడ్డించటం దీనిలో భాగమే. ఏటా ఆరులక్షల కోట్ల రూపాయల వరకు వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులు, డ్యూటీలు మినహాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం దానిలో ఒకేడాది సగం తగ్గించినా జనం మీద అదనపు భారం లేకుండా చూడవచ్చు.అటువంటి ఆలోచనే లేదు.

ముంబై-అహమ్మదాబాదు మధ్య ఇప్పటికే ఎన్నో రైళ్లు, విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలు వున్నాయి. ఇప్పుడు జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అయినా 98వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి(2015 అంచనా ప్రకారం, అది పూర్తయ్యే 2024 నాటికి ఇంకా ఎంత అవుతుందో తెలియదు) ధనికులు తప్ప సామాన్యులు అడుగు పెట్టటానికి వీలులేని ఖరీదైన బుల్లెట్‌ రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించారు. దాని నిర్వహణకే ఏడాదికి నాలుగున్నరవేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. ఇది అంత అత్యవసరమా ? మిగతా ప్రాంతాలలో రైలు సర్వీసులు మెరుగు పరచాలని జనం నెత్తీ నోరు కొట్టుకుంటున్న విషయం మోడీ జమానాకు పట్టలేదు.

సంఘపరివార్‌ అంటేనే పిల్లిని చంకన పెట్టుకున్నట్లని అనేక మంది భావిస్తారు. అనేక సంస్ధలలో ఆ పరివార్‌ అనుయాయులు, వీర విధేయులతో నింపివేస్తున్నారు, లేదా వున్న సంస్ధలు తమ భావజాలానికి అనుగుణంగా నడిచేట్లు వత్తిడి తెస్తున్నారు. దానిలో భాగమే తన అవార్డు పొందిన కన్నడ రచయిత కలుబర్గి హిందూ మతోన్మాదుల చేతిలో హత్యకు గురైనా కేంద్ర సాహిత్య అకాడమీ ఖండించటానికి ముందుకు రాలేదు. అ ందుకు నిరసనగా కవులు, కళాకారులు అవార్డుల వాపసు నిరసన తెలిపారు. దాని మీద నోరు మెదపకుండా నరేంద్రమోడీ అనుసరించిన వైఖరి దానిని నిర్ధారించింది.హిందూత్వను గట్టిగా వ్యతిరేకించే హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం వారిపై కక్షగట్టి ఐదుగురు విద్యార్ధులను బహిష్కరించటం,వారిపై తప్పుడు కేసులు పెట్టటం , కేంద్ర మంత్రులు ఇద్దరు వత్తిడి తేవటం , వారిలో ఒక విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. దానిపై కూడా సానుభూతి ప్రకటించటానికి ప్రధానికి ఐదు రోజులు పట్టింది.

విదేశాల్లో దాచుకున్న నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికీ పదిహేను లక్షల చొప్పున పంచుతామని చెప్పిన ఎన్నికల ప్రచారం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.దాన్నసలు మరిచేపోయారు. ఒక్కటంటే ఒక్క ఖాతా నుంచి కూడా నల్లధనాన్ని తెచ్చిందిలేదు.అందుకు ప్రయత్నాలు కూడా లేవు.చిన్న ప్రభుత్వం పెద్ద పాలన అంటూ కబుర్లు చెప్పి 66 మందితో పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పోనీ అదేమన్నా పని చేస్తోందా అంటే లోక్‌పాల్‌ గురించి తాను రాసిన లేఖలకు ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి సమాధానం కూడా రాలేదని అన్నా హజారే ఇటీవలనే వాపోయిన విషయం తెలిసిందే. ఇలాంటివే ఇంకా ఎన్నో. మోడీ ప్రభుత్వ తీరు తెన్నులు చూస్తుంటే మరో 40 నెలలు కూడా మనం ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుందేమో ?