Tags

, , , , ,

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు.

సత్య

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఏ కులానికి చెందిన వాడన్నది నాకు ముఖ్యం కాదు, ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ? దానికి దారితీసిన పరిస్ధితులు ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం దాని మంత్రులు ,ఎబివిపి, విశ్వవిద్యాలయ అధికారులు ఇంకా తెరవెనుక ఎవరైనా వుంటే ఎందుకీ పుణ్యం కట్టుకున్నారు ? అన్నదే ముఖ్యం, సమాధానం రావాల్సిన ప్రశ్న.

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు. హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ వర్తిస్తాయి . మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని అలా మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

అందువలన అన్యాయాన్ని అన్యాయంగా ఖండించకుండా, నిరసించకుండా వుంటే చివరికి నీవరకు వచ్చే సరికి నిరసించటానికే కాదు, అయ్యో పాపం అనటానికి కూడా ఎవరూ మిగలరు.

అసలు మొదలైన వివాదం ఏమిటి ? రోహిత్‌ కులం గురించి కాదు. ఆ విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని ఘటనల గురించి కదా ! అవేమిటి? యాకూబ్‌మెమెన్‌ వురి తీతకు నిరసన తెలపటం, సంస్మరణ సభ జరపటం. నిరసన తెలిపిన వారు కులతత్వవాదులు, వుగ్రవాదులు, దేశవ్యతిరేక శక్తులు అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. దీనికి నిరసన తెలిపిన దేశభక్తుడైన ఎబివిపి విద్యార్ది సుశీల్‌ కుమార్‌పై దాడి చేసిన ఫలితంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఇటు వంటి ఘటనలు జరుగుతున్నా విశ్వవిద్యాలయ యంత్రాంగం మౌన ప్రేక్షకురాలిగా వుండి పోయింది కనుక సహించలేక సంగతేమిటో చూడమని కేంద్రమంత్రి దత్తాత్రేయ రాశారు. ఆయన రాసిన తరువాత పట్టించుకోకపోతే ఎలా అంటూ మరో మంత్రి స్మృతి ఇరానీ రాశారు. సుశీల్‌ కుమార్‌ పై దాడి, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కట్టు కధ అన్నది తేలిపోయింది. ఈ విషయాలు మంత్రికి తెలియకుండా వుండవు. అయినా ఎందుకు రాశారంటే రోహిత్‌ వ్యతిరేకించిందీ, చావక ముందు వరకు వ్యతిరేకిస్తున్నదీ, ద్వేషిస్తున్నదీ హిందూత్వను. దానికి బండారు దత్తాత్రేయ ఒక స్థంభం వంటి వ్యక్తి. అందుకే అంతగా స్పందిచారు.

విద్యార్ధులు చెబుతున్నది, బయటికి వారికి కనిపిస్తున్నదీ దత్తాత్రేయ, సంబంధిత శాఖ మంత్రిని స్మృతి ఇరానీ ఒకదాని తరువాత ఒకటిగా లేఖలు రాసిన తరువాత విశ్వవిద్యాలయ అధికారులు తీసుకున్న చర్యల పర్యవసానం రోహిత్‌ బలవన్మరణం. అసలు వీటన్నింటిలో అతని కుల ప్రస్తావన ఎక్కడ వుంది? అతను విశ్వవిద్యాలయంలో దళితుడిగానే పరిచయమయ్యాడు, దళితులు ఎక్కువగా వుండే అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యకర్తగానే మరణించిన తరువాత దళిత విద్యార్ధి ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి తప్ప మరొకటి కాదు.

దళిత విద్యార్ధి, అందునా వ్యక్తిగత కారణాలు కాకుండా ఒక సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక కారణాలతో బలవన్మరణం చెందాడు కనుక సహజంగానే యావత్‌ దేశంలో కదలిక వచ్చింది. దాని తీవ్రత తగ్గించటానికి సంఘపరివార్‌ మేథావులు కనుగొన్న చిట్కా రోహిత్‌ దళితుడు కాదు బిసి అని చెప్పటం. కులాంతర వివాహాలు చేసుకున్న వారి కులం ఏదవుతుంది, వారికి పుట్టిన బిడ్డల కులం ఏది అనే వివాదాలపై కోర్టులలో అనేక కేసులు నడిచాయి. హిందూ పర్సనల్‌ లా ప్రకారం తండ్రిది ఏ కులమైతే బిడ్డలకు ఆ కులం అన్నది ఒక అంశం. ఇక్కడ తల్లి దళిత తండ్రి బిసి, సాధారణ సూత్రం ఇక్కడ వర్తించదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బిడ్డలు ఏ వాతావరణంలో పెరిగారనే దానిపై ఏ కులం వర్తిస్తుందనేది నిర్ణయించాలని కొన్ని సందర్బాలలో కోర్టులు చెప్పాయి. ఇక్కడ ప్రభుత్వ గుర్తింపును బట్టి బిసి వడ్డెర కులం ఒక అడుగు దళిత కులం కంటే ముందు వుండవచ్చు గానీ సామాజికంగా చూస్తే అగ్రకులాలనబడే వారి దృష్టితో చూసినా జీవన పరిస్ధితులను చూసినా రెండూ ఒకటిగానే వుంటాయి. రోహిత్‌ చిన్న తనం నుంచి తల్లికి చెందిన దళిత కుల వాతావరణంలోనే పెరిగాడు తప్ప వేరు కాదు. అసలు ఇక్కడ తేలాల్సిన సమస్య అది కాదు. దళితుడైనా, బిసి అయినా ఓసి అయినా సంఘప్రచార్‌ హిందూత్వ పోకడలను వ్యతిరేకించటం దగ్గర మొదలైంది. అందువలన తేల్చాల్సింది, తేల్చుకోవాల్సింది దాని గురించి, హిందూత్వను వ్యతిరేకించేవారందరినీ ఏదో విధంగా వేధిస్తారా ? దాన్ని సమాజం సహించాలా ?