Tags

, , ,

ఎంకెఆర్‌

షెడ్యూలు కులాలు, తరగతులపై అత్యాచారాల నిరోధ చట్టానికి 2015లో ఆమోదించిన సవరణలు రిపబ్లిక్‌ దినోత్సవం రోజు నుంచి అమలులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్ట సవరణకు ప్రతిపాదించిన, ఆమోదించిన అన్ని పార్టీలకు ఈ సందర్బంగా అభినందనలు చెప్పాలి. మన దేశంలో పేరుకు అనేక చట్టాలు వున్నా అవి ధనికుల చుట్టాలుగా మారాయి తప్ప సామాన్యులకు వుపయోగం లేకుండా పోతోంది. అలాంటి వాటిలో ఈ అత్యాచారాల నిరోధ చట్టం ఒకటి. దీని కింద ఎవరైనా బాధితులు కేసులు పెడితే మన పోలీసు యంత్రాంగం వాటిని నిర్ధారించుకొనే పేరుతో కాలయాపన చేస్తుంది. అ లోగా పెత్తందార్లు లేదా దాడికి పాల్పడిన వారితో కుమ్మక్కై బాధితులపై ఇతర నేరాలు ఆరోపిస్తూ వెంటనే కేసులు నమోదు చేస్తారు. దాంతో డబ్బూ పోయె శనీ పట్టె అన్నట్లుగా అవమానాలు, అత్యాచారాలకు తోడు ఎదురు కేసులా అని బాధితులు తల పట్టుకొని ఫిర్యాదుల వుపసంహరణకు దిగి వస్తారన్నది పెత్తందారుల, అధికార యంత్రాంగ ఎత్తుగడ. ఈ పూర్వరంగంలో వీటిని తట్టుకొని నిలబడాలనుకొనే వారికి ఈ చట్ట సవరణ మరింత బలాన్ని ఇస్తుంది. దీనిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. వీటిని బాధితులుగా మారుతున్న దళితులు, గిరిజనులే కాదు, పెత్తందారులు, పెత్తందారీ మనస్తత్వం వున్న వారు కూడా తెలుసుకోవటం అవసరం.

అత్యాచారాల నిరోధ చట్ట సవరణ బిల్లు 2015ను 2015 ఏప్రిల్‌ నాలుగున లోక్‌సభ, డిసెంబరు 21న రాజ్య సభ ఆమోదించాయి. ఈ సవరణలకు డిసెంబరు 31న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జనవరి ఒకటిన అసాధారణ గజెట్‌లో ప్రచురించారు. వాటి అమలుకు నిబంధనలు రూపొందించిన తరువాత 2016 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

గుండు కొట్టించటం, మీసాలు గొరిగించటం లేదా అలాంటి అవమానాలకు గురి చేయటం, చెప్పుల దండలు వేయటం, సాగునీటి వనరుల సౌకర్యాలను లేదా అటవీ హక్కులను అడ్డుకోవటం, మానవ లేదా జంతు కళేబరాలను తొలగించాలని లేదా గోతులు తవ్వాలని వత్తిడి చేయటం, మలమూత్రాలను ఎత్తి మోయించటం,అందుకు అనుమతివ్వటం, మహిళలను దేవదాసీలుగా మార్చటం, కులంపేరుతో దూషించటం, మాయ మంత్రాలు, చేతబడుల వంటివి చేశారనే పేరుతో అత్యాచారాలు చేయటం, సామాజిక, ఆర్ధిక బహిష్కరణలకు గురిచేయటం, ఎన్నికలలో పోటీకి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, మహిళలను వివస్త్రలను గావించటం, గ్రామ లేదా నివాస బహిష్కరణకు వత్తిడి చేయటం, దళితులు, గిరిజనులు పవిత్రంగా భావించే వాటిని అవమానించటం లేదా ధ్వంసం చేయటం, లైంగిక స్వభావం కలిగిన పదాలు వినియోగించటం, అంటుకోవటం లేదా అలాంటి వాటిని ప్రదర్శించటం వంటి చర్యలు చట్ట ప్రకారం నిషేధం.

నేర శిక్షా స్కృతిలో వున్న ఇతర నేరాలైన గాయపరచటం, తీవ్రంగా గాయపరచటం, బెదిరింపు, అపభహరణ వంటి చర్యలకు పదేళ్లలోపు మాత్రమే శిక్షలు వేసే అవకాశం వుంది. దళితులు, గిరిజనులపై అలాంటి నేరాలకు పాల్పడినపుడు వాటిని అత్యాచార నిరోధ చట్టం కింద ఫిర్యాదులను ఆమోదించినపుడు పదేళ్లకు పైగా శిక్షలు పడే అవకాశం కల్పించారు.

అత్యాచార నిరోధ చట్టం కింద దాఖలైన కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలుగా వీటిని మాత్రమే విచారించేందుకు ప్రత్యేక కోర్టులతో పాటు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తారు. ఈ కోర్టులు చార్జిషీటు దాఖలైన రెండు నెలల లోపే విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. బాధితులు, సాక్షులకు వున్న హక్కుల గురించి ఒక అధ్యాయాన్ని చట్టంలో పొందుపరిచారు.

ఫిర్యాదు నమోదు దగ్గర నుంచి చట్టంలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవటంలో అన్ని స్ధాయిలలోని ప్రభుత్వ వుద్యోగులు కావాలని నిర్లక్ష్యం చేసినట్లయితే వాటిని విధులను విస్మరించినట్లుగా స్పష్టంగా నిర్వచించారు. నిందితులు బాధితులు లేదా వారి కుటుంబాలతో పరిచయం వున్నట్లయితే ఇతర విధంగా రుజువు చేసుకోనట్లయితే నిందితులకు బాధితుల కులం లేదా గిరిజన గుర్తింపు తెలిసినట్లుగానే కోర్టు పరిగణిస్తుంది.

దేశంలో నానాటికీ దళితులు, గిరిజనులపై అత్యాచారాలు పెరిగిపోతూనే వున్నాయి. 2013లో 13,975 కేసులు నమోదు కాగా 2014లో 47,064 నమోదయ్యాయి.మహిళలపై అత్యాచారాల విషయానికి వస్తే గత దశాబ్దంతో పోల్చితే 47 శాతం పెరిగాయి.ఈ కేసులలో శిక్షలు ఒక శాతం కంటే తక్కువ కేసులలోనే పడుతున్నాయి. అత్యాచార నిరోధ చట్టం కింద నమోదైన కేసులలో 2014 చివరి నాటికి విచారణ పెండింగ్‌లో 85శాతం వున్నాయి. శిక్షలు పడిన కేసులు 28శాతం మాత్రమే.