Tags

, ,

ఎంకెఆర్‌

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమదే అని వ్యాపారవర్గాలకు చెందిన వారు అనేక మంది భావించటం సహజం. ఎందుకంటే వ్యాపారమే వృత్తిగా వున్న కులాలకు చెందిన వారు ఇప్పటికీ వుత్తరాదిలో ఆ పార్టీ మద్దతుదార్లుగా వున్నారు. అలాంటి వారంతా పునరాలోచించాల్సిన సమయం ముంచుకు వస్తోంది. రిటైల్‌ వ్యాపారం మన దేశంలో కోట్లాది మందికి వుపాధి కల్పిస్తోంది.అనేక మంది తమ కాళ్లమీద తమను నిలబెట్టటమే కాదు, నలుగురికి పని కలిపిస్తున్నారు. వారికి తగిన వేతనాలు ఇస్తున్నారా లేదా అన్నది వేరే విషయం. ఇప్పుడా పని కూడా దొరకని పరిస్ధితి వస్తోంది. ఇప్పటికే ధోరణులు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం లేదా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఒక్కసారిగా అనుమతిస్తే తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కు గండిపడుతుందనే ఆందోళనతో బిజెపి క్రమంగా పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు దుకాణాలు మూసుకోక తప్పదు అని సంప్రదాయ దుకాణదారులే అనుకొనే విధంగా పావులు కదుపుతోంది.

విదేశీ బడా కంపెనీలు, వాటితో భాగస్వాములుగా చేరుతున్న స్వదేశీ పెద్ద వాణిజ్యవేత్తలు మొత్తం కలిసి 2014-15 సంవత్సరంలో ఇంటర్నెట్‌ వ్యాపారంలో నాలుగు బిలియన్‌ డాలర్ల మేరకు అంటే 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. గతేడాది డిసెంబరు నాటికి ఇంటర్నెట్‌ లేదా ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీల విలువ 12 బిలియన్‌ డాలర్లు.( ఒక బిలియన్‌ డాలర్లు అంటే ప్రస్తుత మారక ధరను బట్టి ఆరువేల ఆరువందల కోట్ల రూపాయలు) అంతకు ముందు సంవత్సరం 4.5 బిలియన్‌ డాలర్లతో పోల్చితే ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరిగింది. భారత రిటైలర్స్‌ అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం సంఘటిత లేదా ఆధునిక చిల్లర వ్యాపార వాటా 17నుంచి 13శాతానికి పడిపోయింది. 2014లో అంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రెండు శాతంగా వున్న ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం ఆయన పదవీ కాలం లేదా దిగిపోయే 2019 నాటికి 11శాతానికి పెరగనుందని అంచనా.

రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌కు ఇంటర్నెట్‌ కంప్యూటర్లే వుండనవసరం లేదు. ఇప్పటికే ఫోన్ల ద్వారా వున్న సౌకర్యాన్ని త్వరలో ఎక్కడబడితే అక్కడ వైఫై సౌకర్యం కల్పించి మరింత ముమ్మరంగా వస్తువులకు ఆర్డర్లు చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ధనికులు, కాస్త మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్‌ వంటి ఖరీదైన వస్తువుల నుంచి క్రమంగా జడ పిన్నులు, పిన్నీసులను కూడా ఆన్‌లైన్‌ ద్వారా కంపెనీలు సరఫరా చేసినా ఆశ్చర్యం లేదు.అన్ని వస్తువులు మన ఇంటికే వస్తున్నపుడు జడ పిన్నుల కోసం మార్కెట్‌కు వెళ్లటం శుద్ధ దండగ కదా !

ఇప్పుడు మన దేశంలోని చట్టాలు ఒక వాణిజ్య సంస్ధ నుంచి మరొక వాణిజ్య సంస్ధ మధ్య(బి టు బి) జరిగే లావాదేవీలలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను మన సర్కార్‌ అనుమతిస్తోంది.అంటే మనకు రోజూ వినిపించే ఫ్లిప్‌ కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటివి. వాణిజ్యం నుంచి వినియోగదారునికి వస్తువులు చేరే విభాగంలో మాత్రం వందశాతానికి అనుమతి లేదు. అయినా మనం రోజూ వాటిలో వస్తువులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నాం గనుక అవి ఇప్పటికే దొడ్డిదారి చూసుకున్నాయన్నది స్పష్టం. అవేం చెబుతాయంటే అబ్బే వస్తువులను మేం సరఫరా చేయం, మార్కెట్‌ స్ధలాలలో పెద్ద మొత్తంలో సరకులను నిల్వచేయటానికి గోదాములు, వాటికి చేర్చటానికి రవాణా, చెల్లింపులు చేయటానికి మాత్రమే పరిమితం అవుతున్నాయని నమ్మబలుకుతున్నాయి. మన మోడీ, కెసిఆర్‌, చంద్రబాబు నాయుడు వంటి రాష్ట్ర సర్కార్‌లన్నీ నిజమే కదా అని ఆమోద ముద్ర వేస్తున్నాయి. చట్ట వ్యతిరేక చర్యలను పట్టపగలు ఆమోదించటమే ఇది.

ఇటీవల రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా ఫుట్‌వేర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అండ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్ధలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్నాయని ఆ కారణంగా అవి పెద్ద ఎత్తున వినియోగదార్లకు డిస్కౌంట్లు ఇస్తున్నాయని, సంప్రదాయ రిటైలర్లు అలా ఇవ్వలేరని కోర్టుకు ఫిర్యాదు చేశాయి. అందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని ఎఫ్‌డిఐ నిబంధనల వుల్లంఘన జరుగుతోందని ప్రభుత్వం తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర పారిశ్రామిక విధాన మరియు అభివృద్ధి విభాగం(డిఐపిపి) ప్రారంభించిన చర్యలతో వాణిజ్య సంస్ధల నుంచి వినియోగదారులకు(బి టు సి) ఎలక్ట్రానిక్‌ వాణిజ్యంలో ఎఫ్‌డిఐలకు అనుమతి లేదని అలాగే మార్కెట్‌ స్థలాలకు వస్తువులను చేరవేసే పద్దతికి కూడా గుర్తింపు లేదని తేలింది.అయితేనేం ఆ తరువాత కూడా ప్రతి పండుగ ఇతర సందర్బాలలో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చిమరీ ఆ సంస్ధలు వస్తు విక్రయాలు జరుపుతూనే వున్నాయి.మన పాలకులు గుడ్లప్పగించి చూస్తూనే వున్నారు. అందుకే చిల్లర దుకాణదారులకు ముప్పు ముంచుకు వస్తోంది.