Tags

, ,

సత్య

పాతబడి చివికి పోయిన బట్టను ఎవరైనా ఏం చేస్తారు, భారతీయులం కనుక దేన్నీ ఒక పట్టాన పారవేయటానికి చేతులు రావు , కాబట్టి ఒకసారి అటూ చూసి మరీ పారవేస్తాం. దానికి ఒక చోట చిరుగు కనిపించిందనుకోండి, కొంతమంది మాసిక వేసి దేనికైనా వుపయోగపడుతుందేమో అని ప్రయత్నిస్తారు. మాసికను కుట్టగానే మరో చోట పిగిలి పోతుంది. ఎందుకంటే సూదీ, దారాన్ని కూడా భరించే స్ధితిలో అది వుండదు. ఖాకీ నిక్కర్‌ వాలాల పరిస్ధితి కూడా అలాంటిదే.

అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, రఘురామ్‌ రాజన్‌,నారాయణ మూర్తి, అమ్రిష్‌ పూరీ, కరణ్‌ జోహర్‌, తాజాగా మన దేశంలో ఇంటింటా వినిపించే టాటా కుటుంబానికి చెందిన రతన్‌ టాటా. ఆయన కూడా కాషాయ తాలిబాన్ల పట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు గనుక ఆయనను కూడా దేశభక్తిలేని వారి జాబితాలో చేర్చి మన ఖాకీ నిక్కర్‌ వాలాలు పాకిస్థాన్‌ పంపుతారేమో చూడాలి.

రతన్‌ టాటా మన దేశంలోని బడా వాణిజ్య, పారిశ్రామిక గ్రూపులలో ఒక అతి పెద్దదానికి అధిపతి.ఆయన ఈనెల 25న చెన్నయ్‌లోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ విద్యార్ధులతో మాట్లాడుతూ భారత్‌ ఇప్పుడుగానీ భవిష్యత్‌లో గానీ అభివృద్ధి చెందాలంటే జనానికి నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలి, ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలపాలను నిర్వహించగలిగి వుండాలి గాని జనమేమి చేయాలో చెప్పే పాత్రధారిగా వుండకూడదు. కేంద్రంలో వున్న పాలకులు, వారి అనుయాయులలో పెరిగిపోతున్న అసహన ధోరణుల గురించి దేశంలో ఎంతో పెద్ద చర్చ జరిగిన తరువాత రతన్‌ టాటా వంటి పెద్ద మనిషి ఈ వ్యాఖ్యలు చేసిన తరువాతైనా భిన్నాభిప్రాయం వింటేనే అసహనానికి గురౌతున్న శక్తులు పునరాలోచిస్తాయా ? అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం.

కొత్త దేవుడి వంటి నరేంద్రమోడీ మహిమలపై ఎన్నో ఆశలు, భ్రమలు పెంచుకున్న స్వదేశీ, విదేశీ పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి అని ధ్వజమెత్తేందుకు సిద్ధం అవుతున్నారు.ఫస్ట్‌ పోస్ట్‌ అనే ఇంటర్నెట్‌ పత్రిక వ్యాఖ్యాత దినేష్‌ వున్ని కృష్ణన్‌ పారిశ్రామికవేత్తల వాదనను ప్రతిబింబించారు. దాని సారాంశం ఇలా వుంది. ‘నరేంద్రమోడీ 2014 అక్టోబరులో అమెరికన్‌ -భారత్‌ పెట్టుబడిదారుల కౌన్సిల్‌ బృందంతో సమావేశమైనపుడు వాణిజ్యం చేయటం ప్రభుత్వ రోజువారీ కార్యకలాపం కాదు అని చెప్పారు. మోడీ ప్రమాణస్వీకారం చేసి 20నెలలు గడిచింది. ఆయన చెప్పిన దానికి అర్ధం ప్రయివేటీకరణ ఎంతో అవసరం వుందన్నదే. ప్రభుత్వం ఇప్పటికీ 27 ప్రభుత్వరంగ బ్యాంకుల తో సహా 277 ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వహిస్తున్నది. వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నాయి. ఈ సంస్ధలు తమకు ఏది ప్రయోజనమో నిర్ణయించుకొనే ముందు మంత్రిత్వశాఖలు ఏం చెబితే దానిని అనుసరించాలి, వాటి నష్టాలకు ఒక పెద్ద కారణం ఇదొకటి అంటే సులభంగా చెప్పాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెబుతోంది. ప్రభుత్వం వాణిజ్యాన్ని పర్యవేక్షించాలి తప్ప ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో జనానికి చెప్పకూడదని రతన్‌ టాటా చెప్పిన అంశం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వచ్చే ఏడాది బడ్జెట్‌ తయారీలో వున్నారు.వచ్చే మూడు సంవత్సరాలలో ప్రభుత్వరంగ బ్యాంకులు బేసల్‌-3 ప్రమాణాలను అందుకోవాలంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. దీనికి గాను ప్రభుత్వం తాను 70వేల కోట్ల రూపాయలు అందచేస్తానని మరో 1.1లక్ష కోట్ల రూపాయలను మార్కెట్ల నుంచి సేకరించమని చెబుతోంది. అసమర్ధంగా నిర్వహిస్తున్నవి, పారు బాకీలు ఎక్కువగా వున్న ప్రభుత్వ రంగ బ్యాంకులలో మదుపు చేయటానికి ఎవరూ ఆసక్తి చూపరు.దాంతో బొచ్చె పట్టుకొని తిరిగి ప్రభుత్వం వద్దకు రావాలి.అది ఖజానాకు మరింత భారం అవుతుంది.ఇప్పటికే జెట్లీ ఏడవ వేతన సంఘం సిఫార్సులను 2016-17లో అమలు జరపటానికి అవసరమైన ఖర్చు గురించి సాముగరిడీలు చేస్తున్నారు. ద్రవ్యలోటును 2015-16లో 3.5శాతానికి తగ్గించటం ముప్పులో పడినట్లు కనిపిస్తోంది, 70వేల కోట్ల రూపాయలను పెట్టుబడుల వుపసంహరణ ద్వారా సేకరించాలని నిర్ణయింస్తే వచ్చింది రు.12,648 కోట్లు మాత్రమే. దీన్ని పూడ్చుకోవాలంటే ప్రభుత్వ ఖర్చును గణనీయంగా తగ్గించటం, లేదా పన్నులు భారీగా పెంచటం,ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలను మరింతగా అమ్మటం చేయాల్సి వుంటుంది.

సిద్ధాంత పరంగా 113 ప్రభుత్వ సంస్ధలను వాటాలను అమ్మితే వర్తమాన మార్కెట్‌ ధరలలో 14,5లక్షల కోట్ల రూపాయలను సేకరించవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో 2.9లక్షల కోట్ల రూపాయలను పెట్టి అభివృద్దికి వూపు తేవొచ్చు.ఇక్కడ సమస్య ఏమిటంటే గుడ్డిగా ఇంట్లో వున్న వెండి,బంగారాలను నామమాత్రపు ధరలకు అమ్మమనటం లేదు. ఎక్కడ వీలైతే అక్కడ ఆంక్షల తొలగింపునకు ముందు సుముఖత చూపాలి.

గత ఎన్‌డిఏ ప్రభుత్వం మారుతి, బాల్కో, హిందుస్తాన్‌ జింక్‌, విఎస్‌ఎన్‌ఎల్‌, ఐపిసిఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మివేసినపుడు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. ముందుగా చిన్న ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎయిరిండియా వంటి వాటిని అమ్మివేసి వాటి అనుభవంతో మిగతావాటి సంగతి తరువాత చూసుకోవచ్చు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం అనేక కంపెనీల యజమానిగా నడపటం ఏమిటని టాటా సలహా చెప్పినట్లుగా ప్రభుత్వ పర్యవేక్షించాలి తప్ప ఏమిచేయాలో జనానికి( సంస్ధలకు ) చెప్పకూడదని పెద్దగా ధ్వనిస్తున్నది.’ అని పేర్కొన్నారు.

ఇక్కడ వ్యాఖ్యాత అంతరంగం ప్రయివేటీకరణ కోరుతున్న బడా కార్పొరేట్ల వాంఛను చక్కగా ప్రతిబింబించారు. దాన్నే ఇంకొక విధంగా చెప్పాలంటే చెయ్యాల్సినవి చేయకుండా అసహనం వంటి అనసవసర విషయాలపై మోడీ సర్కార్‌ ఆసక్తి చూపుతున్నదనే కార్పొరేట్ల అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు.