Tags

, ,

మన్మోహన్‌ సింగ్‌ శంకుస్ధాపన – నరేంద్రమోడీ ప్రారంభోత్సవం

ఎంకెఆర్‌

అటు కాకలు తీరిన పాలకపార్టీ పెద్దలు నిండు పేరోలగంలో ప్రతిపాదిస్తే ఇటు తలలు పండిన ఎందరో ప్రతిపక్ష యోధులు ఆమోదించారు. (సిపిఎం మినహా) వారూ వీరూ , వారితో చేరినవారూ చేతులు కలిపి లేదా కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా, లోటు భర్తీకి నిధులు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రారంభోత్సవంగా భావించి క్యా సీన్‌ హై అనుకోకండి. వట్టిస్తరి మంచినీళ్లు మాత్రమే. శంకస్ధాపన మాదిరి కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి నిర్ణయం జరిగినపుడే అంతసీన్‌ లేదని తేలిపోయింది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆఫ్ఘనిస్తాన్‌ పార్లమెంట్‌ భవనం గురించి. వేసిన అంచనాల కంటే ఎక్కువ కావటం, పనులు ఇంకా పూర్తి గాక పోవటంతో సవరించిన అంచనా ఖర్చు రు.960 కోట్లకు చేరుకోవటంతో బుధవారం నాడు జరిగిన మన కేంద్ర కాబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఇంకా అయితే తరువాత ఎలాగూ చెల్లిస్తారు లెండి. ఇదేమిటి ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్‌ ! ఎక్కడి మోడీ సర్కార్‌ !! వారి పార్లమెంట్‌ భవనం మనం కట్టటం ఏమిటి !!!

ఆఫ్ఘనిస్తాన్‌ సర్వనాశనం కావటానికి కారకులు నూటికి రెండువందల శాతం అమెరికా, దాని చుట్టూ తోకాడించుకుంటూ తిరిగే ఐరోపా ధనిక, సౌదీ అరేబియావంటి అమెరికా తొత్తు దేశాలు. దాన్ని పునరుద్ధరించేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ తలాకాస్త సాయం చేయాలంటూ అమెరికా ఆదేశించింది. అదే లెండి దొరగారు తలా కాస్త చేయండి అంటే చేయకపోతే అయ్యగారితో ఎప్పుడు ఏతంటా వస్తుందో, ఎప్పడు ఏ అవసరం వస్తుందో పోయిందేముంది లే అనుకొని మన వాటాగా పార్లమెంట్‌ భవనం నిర్మాణం, మరికొన్ని చేస్తామని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వున్నపుడు వాగ్దానం చేసి వచ్చారు. అది సకాలంలో పూర్తిగాక చివరికి డిసెంబరులో పూర్తి కావటంతో 25వ తేదీన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడితో కలసి నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. మిగిలిన ఎలక్ట్రానిక్‌ పరికరాల బిగింపు వంటి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 31 నాటికి భవనాన్ని అఫ్ఘన్‌ అధికారులకు అందచేయాల్సి వుంది. అందుకుగాను పెరిగిన ఖర్చుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ సంబంధాలు సజావుగా కొనసాగటానికి ఎవరి హయాంలో ఏ నిర్ణయం జరిగినా దానిని కొనసాగించటం తరువాత అధికారంలో వున్న వారి బాధ్యత అనుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాల మాటేమిటి ? ఆంధ్రులు అంత నోరు లేనివారా ?

కన్నమ్మకు కూడు పెట్టని కొడుకు పిన్నమ్ముకు ఒంటి నిండా బంగారు ఆభరణాలు తొడిగిస్తా అని చెప్పినట్లుగా చ ంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో కురిపించని వాగ్దానాలు లేవు. హైదరాబాదు నుంచి ఏటా 45వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందంటే ఆ శ్రమ తనదే అని చంద్రబాబు నాయుడు చెప్పారు, నైజాం నవాబులు హైదరాబాదును 400 సంవత్సరాలలో, బ్రిటీష్‌ వారు సికిందరాబాదును 200 సంవత్సరాలలో తీర్చిదిద్దితే ఈ రెండింటికీ ప్రపంచ పటంపై కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే ఎనలేని కీర్తి తెచ్చి పెట్టానని, హైటెక్‌ సిటీని కేవలం 15నెలల్లోనే నిర్మింపచేయించిన ఘనత తనదేనని, తాను ఆనాడు అభివృద్ధి చేయకపోయి వుంటే ఈ రోజున తెలంగాణా ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు అమలు జరపటం సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు హైదరాబాదు వీధుల్లో చెప్పారు. అంతేనా ! కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పధకాల్లో తెలంగాణాకు అన్యాయం జరగకుండా చూస్తానని, అవసరమైతే ప్రధాని మోడీని ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మరీ చెప్పారు. పిట్టల దొర గుర్తుకు రావటం లేదూ ?

ఈ వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వారికి కూడా తెలిసి వుంటే బాబ్బాబు….. ఐదు సంవత్సరాలలో ఇప్పటికే మూడోవంతు అయిపోయింది. లేస్తే మనిషిని కాను అని దారిన పొయ్యేవారిని బెదిరించి దండుకున్న కుంటి మల్లయ్య కధ మాదిరిగాక ముందే కొత్తవి రాకపోతే పోయే చేసిన వాగ్దానాల అమలుకు కేంద్రాన్ని ఒప్పిద్దురూ మీకు పుణ్యముంటుంది అని ఆంధ్రప్రదేశ్‌ జనాలు పోకిరి సినిమాలో మాదిరి విజయవాడ రాగానే చంద్రబాబు వెంట బడటం ఖాయం.

రాజధాని అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి వచ్చినపుడు తాను కూడా దాని నిర్మాణానికి కొంత విరాళం ప్రకటిద్దామని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ అంతటి వ్యక్తే పిడికెడు మట్టి, కుండెడు నీళ్లు ఇచ్చినపుడు తాను విరాళం ప్రకటిస్తే తెలంగాణాపై మోడీ ఎక్కడ మరింత కక్ష పెంచుకుంటాడోనని తాను ప్రకటించలేదని, అయినా అమరావతికే దిక్కులేదు, హైదరాబాదుకేం వరాలిస్తారని అటు బిజెపిని ఇటు తెలుగుదేశం పార్టీని తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గాలితీశారు. వెంకయ్య(నాయుడు) ప్రాసకోసం ఎన్నయినా మాట్లాడతాడు, అలా మాట్లాడటం నాకూ వస్తుంది, ఆయనకంటే తెలుగు సాహిత్యం నాకే బాగా వచ్చు అని కూడా చెప్పారు.

ఏ దేశం వెళితే అక్కడి తెలుగు వారిని, భారతీయులను పొగడటం, మీరే ఆ దేశాలను పెంచి పోషిస్తున్నారన్నట్లుగా చెప్పటం చంద్రబాబు బ్యాండు బృందానికి బాగా వచ్చు. కానీ ఆయన మాత్రం సావిత్రీ నీ పతి ప్రాణంబు దక్క మరొక్క వరం కోరుకో అని యమధర్మరాజు చెప్పినట్లుగా తెలుగువారి రాజధాని నిర్మాణ రూపకల్పన బాధ్యత మాత్రం తెలుగు వారికీ ఇవ్వలేదు, భారతీయులకు ఇవ్వలేదు. ఎంత రాష్ట్ర భక్తి, ఎంత దేశ భక్తి ? పోనీ మనవారేమైనా తక్కువ వారా ?

మయసభకు ప్రతిరూపాన్ని నిర్మించారే, ప్రపంచ స్దాయి కట్టడాలకు ఏ విషయంలో తక్కువ తిన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయులు నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రపంచంలో అత్యుత్తమ పార్లమెంట్‌ భవనాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న అరాచక పరిస్దితులు, భద్రతా సమస్యల కారణంగా 2009లో ప్రారంభమై 2012లో పూర్తి కావాల్సింది 2015 వరకు సాగింది.దీనిలో ప్రధాన ఆకర్షణ ఏమంటే 17.15 మీటర్ల ఎత్తుండే కంచు గుమ్మటం ఆసియాలోనే పెద్దదట. ఇక భవనం లోపలా బయటా ఆకర్షణలు చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదట. ఇంత మంచి కన్సల్టెంట్స్‌, నిర్మాణ కంపెనీలు, నిపుణులైన పనివారు మన దగ్గర వుండగా అందునా మేకిండియా పిలుపు ఇచ్చిన ప్రధాని కేంద్రంలో వుండగా రాజధాని అమరావతిని సింగపూర్‌ వారికి ఎందుకు కట్టబెట్టినట్లు ? నీకిది నాకది అని పక్కా అవగాహనలతో పంచుకొనే రోజుల్లో ఏది ఎందుకు జరుగుతుందో ? గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు అలాంటి విషయాల్లో పండిపోయిన వారే చెప్పాలి. కాకపోతే అలాంటి వారికి విస్వసనీయత వుండదు, అందరికీ తెలుసు ఏదో జరుగుతోందని. అదేమిటి ?