Tags

, ,

సత్య

తనంతట తానుగా లొంగిపోయి విచారణకు సహకరించిన ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్‌ మెమెన్‌ను వురితీయటం సరికాదన్న హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ అంబేద్కర్‌ విద్యార్ధి సంఘ సభ్యులను జాతి వ్యతిరేక శక్తులని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర సంఘపరివారమంతా నానాయాగీ చేస్తోంది.మరి జాతి పిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సేను కీర్తిస్తూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు బిజెపినేత పర్యవేక్షణలో వున్న ప్రభుత్వ హాలును అనుమతిస్తే, స్వయంగా రావటానికి ఆ నేత అంగీకరిస్తే అది ఏమౌతుంది? సరిగ్గా మహాత్ముడిని హత్య చేసిన రోజునే పుస్తక ఆవిష్కరణకు ఎంచుకోవటాన్ని కూడా గమనిస్తే వారెంతటి దేశభక్తులో అర్ధం చేసుకోవచ్చు.

ఇదెక్కడో కాదు, బిజెపి ఏలికలోని గోవాలో తలపెట్టారు.’ ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటనల్లో మహాత్మాగాంధీ గురించి చెబుతుంటారు ఇక్కడి గోవా ప్రభుత్వమేమో గాంధీ భావజాల మైన శాంతి, అసత్యమాడకపోవటం, సామాజిక న్యాయాన్ని భ్రష్టు పట్టించే వారికి ఎంతో చురుకుగా సాయం చేస్తోందని గోవా ప్రముఖులు ఒక ప్రకటనలో విమర్శించారు. శనివారం నాడు గాంధీ హంతకుడు గాడ్సేపై రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు మార్మగోవాలోని ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను ఎంచుకున్నారు. దానికి అధ్యక్షుడిగా వున్న దామోదర్‌ నాయక్‌ తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని, అనుమతిని రద్దు చేయాలని పౌర ప్రముఖులు డిమాండ్‌ చేశారు. గాంధీ హంతకుడి గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ వుత్సవానికి రవీంద్ర భవనాన్ని వుపయోగించుకొనేందుకు అనుమతించటం ద్వారా బహిరంగంగా ప్రోత్సహించినట్లయిందని, ప్రభుత్వానికి చెందిన వారు పాల్గొనటం అంటే ప్రభుత్వ కార్యక్రమంతో సమానమని, ప్రభుత్వ ప్రతినిధుల జాతి వ్యతిరేక వైఖరిని ఇది వెల్లడిస్తోందని పౌర ప్రముఖులు పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పడిన గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఒక ప్రకటన చేస్తూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని తాము సత్యాగ్రహంతో అడ్డుకుంటామని ప్రకటించింది. స్వతంత్ర ఎంఎల్‌ఏ విజయ్‌ సర్దేశాయి దీని గురించి మాట్లాడుతూ ఏదో అమాయకంగా అనుమతించినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ ఎంచుకున్న రోజును బట్టి అలా భావించటానికి లేదంటూ నిరసనలో తానూ పాల్గొంటానని చెప్పారు. ఇంకా అనేక సంస్ధలు తమ మద్దతు తెలిపాయి. కాగా అనుమతిని రద్దు చేసే ప్రసక్తే లేదని నిర్వాహకులు అందరి మాదిరే హాలును బుక్‌ చేసుకున్నారని రవీంద్ర భవన్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఏదైనా అభ్యంతరాలు వెల్లడైతే తాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే విషయమై పునరాలోచిస్తాను తప్ప అనుమతిని రద్దు చేసేది లేదని బిజెపి నేత అయిన రవీంద్ర భవన్‌ అధ్యక్షుడు దామోదర నాయక్‌ ప్రకటించారు. గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేసిన విషయం తెలిసినదే.