Tags

, , ,

ఎంకెఆర్‌

అదేమి చిత్రమో గానీ అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎంత గట్టిగా కళ్లు మూసుకున్నా కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు పదేపదే దర్శనమిస్తున్నారు. వద్దనుకున్నవారు ఇలా కనపడటమేమిటని వారికి మనోవ్యాధి పట్టుకుంది. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు అనే సంస్ధ ఈ వారంలో ఒక నివేదిక విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో ప్రచురించిన పదిలక్షలకు పైగా సిలబస్‌ పుస్తకాల జాబితాలో ఏది ఎక్కువగా వుందని విశ్లేషిస్తే కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు ప్రపంచం ముందుంచిన ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’ పుస్తకం మూడవ స్ధానంలో వుందని తేలింది.’విఫలమైన సిద్ధాంతం విశ్వవిద్యాలయాల సిలబస్‌లో ఇప్పటికీ బహుళంగా వుంది’ అనే శీర్షికతో కెయిరెన్‌ అండర్‌ వుడ్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేకి కడుపు మంటతో ఒక వ్యాసం రాశాడు.

ప్లాటో రచన ‘రిపబ్లిక్‌ ‘ రెండవ స్ధానంలో ఇబి వైట్‌ మరియు విలియం స్ట్రంక్‌ జూనియర్‌ వుమ్మడి రచన ‘ఎలిమెంట్స్‌ ఆఫ్‌ స్టైల్‌ ‘ ప్రధమ స్ధానంలో వుంది. కమ్యూనిస్టు మానిఫెస్టోకు ఇంత ఆదరణ ఎందుకు వుందంటే దానిలో చరిత్ర, రాజకీయాలు, సామాజిక శాస్త్రాలతో సహా అనేక అంశాలున్నాయి గనుక విశ్వవిద్యాలయ అధ్యాపకులు దానిని తరచూ సిలబస్‌లో పెడుతున్నారు. పెట్టుబడిదారీ విధానానికి మౌలిక పాఠాలు చెప్పే ఆర్ధికాంశాలతో కూడిన ఆడమ్‌ స్మిత్‌ రచన ‘ వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ ‘ 37 వ స్ధానంలో వుందట. ప్రచ్చన్న యుద్ధంలో తామే విజయం సాధించామని పాతికేళ్ల క్రితం పెట్టుబడిదారులు ప్రకటించుకున్న తరువాత కూడా వారి వ్యవస్ధను కూల్చివేయాలని పిలుపు నిచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ప్రాధాన్యత ప్రపంచంలో తగ్గలేదన్నది సుస్పష్టం. అమెరికా రాజ్యంగానికి ఆమోద ముద్ర వేయించేందుకు ఫెడరలిస్టు అనే పత్రికలో 1787 ఆక్టోబరు 1788 ఆగస్టు మధ్య రాసిన అనేక వ్యాసాలను తరువాత ఫెడరలిస్టు పేపర్స్‌గా పిలిచారు. ఆ పుస్తకం విశ్వవిద్యాలయాల సిలబస్‌ పుస్తకాల జాబితాలో 294వ స్ధానంలో వున్నట్లు తేలింది.

తనను సోషలిస్టుగా అభివర్ణించుకొని ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనను బలపరచమని కోరుతూ ప్రచారం జరుపుతున్న బెర్నీ శాండర్స్‌ తన ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు చెమటలు పట్టిస్తున్నాడు.ఆయన అసలు సోషలిస్టు కాదు, నకిలీ అని మన దేశంలో నగ్జల్స్‌ వంటి గ్రూపులు అమెరికాలో వ్యతిరేకిస్తున్నాయి. అనేక మంది వామపక్ష వాదులు ఆయనను బలపరుస్తున్నారు. శత్రువులు ఆయన కరడు గట్టిన కమ్యూనిస్టు అని ముద్రవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. యువతరం ఆయనకు జేజేలు పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు శాండర్స్‌ ఏమిటి అనే విషయం పక్కన పెడితే ఆయన నిజమైనా, నకిలీ అయినా సోషలిస్టు పేరుతో మద్దతు పెంచుకుంటే ఒకసారి వామపక్ష భావజాలం తలకెక్కితే యువతరంలో దిగటం అందునా సోషలిజం,కమ్యూనిజానికి మారుపేరుగా వున్న సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పాతిక సంవత్సరాల తరువాత , అమెరికాకు అనేక ఎదురు దెబ్బలు తగులుతున్న స్ధితిలో, అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఒకసారి సోషలిస్టు భావజాలంవైపు మొగ్గితే వెనక్కు తిరగటం కష్టం, నకిలీ అయితే ఆచరణలో అసలు వారిని ఎంచుకుంటారని కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నారు.ఈ నేపధ్యంలోనే ‘ప్రమాదకరమైన వామపక్షం వైపునకు అమెరికా మొగ్గుకు మూలాలు’ అనే పేరుతో ఈనెల ట్రంపెట్‌ అనే పత్రికలో గెరాల్డ్‌ ప్లరీ ఒక పెద్ద చాంతాండంత వ్యాసం రాశాడు.

‘ తీవ్రవాద వామపక్షం అమెరికాను స్వాధీనం చేసుకుంటున్న తీరును అవగాహన చేసుకోవాలంటే మీరు ముందుగా దాని భావజాలాన్ని అర్ధం చేసుకోవాలి.దీని గురించి గత యాభై సంవత్సరాలుగా మేము హెచ్చరిస్తూనే వున్నాం’ అంటూ ఆ వ్యాసాన్ని ప్రారంభించాడు. ‘అమెరికా తీవ్రమైన తిరోగమనంలో వుంది. అనేక మంది అమెరికన్లు తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. వామపక్ష తీవ్రవాదులు దేశంపై అదుపు సాధించారు.నేటి డెమోక్రటిక్‌ పార్టీని చూడండి. దేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా, నైతికంగా, మిలిటరీ పరంగా, భౌగోళిక రాజనీతి పరంగా బలహీన పరిచే విధానాలను ఆ పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తున్నది. వారి అదుపులోకి దేశం ఎలా వచ్చింది? దేశం ఈ స్దితికి దిగజారటానికి కారణాలేమిటి ?

ఈ దేశంలో అంతర్గతంగా ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మీరు అర్ధం చేసుకోవాల్సి వుంది.ప్రచ్చన్న యుద్ధ సమయంలో అమెరికాలో అంతర్గతంగా కమ్యూనిజం వ్యాప్తి గురించి ఎంతో భయం వుండేది. ఈ రోజు దానితో ముప్పుందని ఏమాత్రం భయపడనవసరం లేదని ఎక్కువ మంది అమెరికన్లు భావిస్తున్నారు. కానీ ఇది తీవ్ర ఆందోళనకరమైనది. కొద్ది మంది దీన్ని గుర్తించారు. కానీ తిరిగి వెనక్కు చూసుకుంటే అమెరికాలోని ప్రధాన స్రవంతి రాజకీయ అభిప్రాయాలలో అనేక మంది వెనక్కు తిరిగి నేరుగా కమ్యూనిజంపై విశ్వాసం, భావజాలంతో వున్నట్లు కనిపిస్తోంది.

అందరికీ బాగా తెలిసిన ఒక అభ్యర్ధి సోషలిస్టుగా చెప్పుకొని డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోరుతున్నాడు. అనేక మంది కమ్యూనిస్టులు తాము సోషలిస్టులమని చెప్పుకుంటారు.ఆయన ఎంతో మద్దతు పొందటాన్ని బట్టి అమెరికా జనం ఎంతటి ప్రమాదకర అమాయక స్ధితిలో వున్నారో తెలుస్తోంది.మీకు కమ్యూనిజం గురించి ఏమి తెలుసు? ఆరోగ్య సంరక్షణ,జాతీయ ఆర్ధిక వ్యవస్థలోని ఇతర ప్రధాన విభాగాలను ప్రభుత్వం తీసుకోవాలనే మద్ధతుదారుల సంఖ్య పెరుగుతోంది. దానితో పాటు కమ్యూనిస్టు వ్యవస్ధ వస్తుందనే ప్రమాదాన్ని అర్ధం చేసుకోవటంలో వారు విఫలమయ్యారు.’ ఇలా సాగి కమ్యూనిజాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని పాఠకుల ముందుంచారు. చివరకు మతాన్ని జోడించి వర్తమాన అమెరికా సమస్యలన్నింటికీ అమెరికా చేసిన పాపాల ప్రత్యక్ష ఫలితం. ఏ రాజకీయ అభ్యర్ధి మరోసారి అమెరికాను గొప్పగా రూపొందించబోవటం లేదు.దేవుడే మరోసారి అమెరికాను గొప్పదానిగా చేస్తాడు.మనం ఎంత తిరుగుబాటు చేసినా ఆయనే మన సమస్యలను పరిష్కరించబోతున్నాడు అని ముగించారు.