Tags

, , , , ,

– వి. శ్రీనివాసరావు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయ రీసెర్చి స్కాలర్‌ వేముల రోహిత్‌ చక్రవర్తి బలవన్మరణంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగు తోంది. మూడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన దేశ వ్యాప్త నిరసనోద్యమం తర్వాత అంత కన్నా తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమమిది. అప్పటి ప్రభుత్వం చేతులు కాలాక ఆలస్యం గానైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పలేదు. కానీ నేటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దళితోద్ధరణ కోసమే తాను జన్మించినట్లుగా మాటల గారడీతో నమ్మ బలుకుతున్నట్లు నటించే ప్రధాని ఐదు రోజుల మౌనం తర్వాత దీనిపై బలవంతంగా నోరు తెరిచినా చేతల్లో మాత్రం ఏ చొరవా చూపలేదు. పైగా లక్నో సభలో రోహిత్‌ ఘటనపై ప్రధాని స్పందించాలని నిలదీసిన ముగ్గురు దళిత విద్యార్థులను కూడా హాస్టల్‌ ఖాళీ చేయించి ఇంటికి పంపా రు. ముంబాయిలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై ఆర్‌యస్‌యస్‌ మూక అడ్డంగా దాడి చేసి అనేక మందిని కిరాతకంగా గాయపరిచారు. ఈ దేశంలో న్యాయం చేయక పోయినా, కనీసం న్యాయం చేయమని అడిగే హక్కు కూడా లేదా? ఇలా నోళ్లు కుట్టేస్తారా? ప్రశ్నించేవారిని వేధిస్తారా? ఒక ప్రజాస్వామిక దేశంలో ఫాసిస్టు ప్రభుత్వమా?
రోహిత్‌ బలవన్మరణానికి కారకుడైన వైస్‌-ఛాన్సలర్‌ పొదెల అప్పారావుపై ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకో లేదు. ఆయనపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదైనా కనీసం అరెస్టు చేయలేదు. పేరుకు సెలవులో ఉన్నా పదవిలోనే కొనసాగు తున్నాడు. అంతకన్నా దుర్మార్గం అతని స్థానంలో తాత్కాలిక విసిగా ఈ ఘటనకు కారకులైన మరొక శిఖండిని నియమిం చడం. ఇది విద్యార్థులను రెచ్చగొట్టడం కాక మరేమవు తుంది? నిందితులపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు వారిని కనీసం విచారించను కూడా విచారించలేదు. తద్విరు ద్ధంగా రోహిత్‌ కుటుంబ చరిత్రను తొవ్వడానికి నానా యాతనలు పడుతున్నారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్‌, నిర్భయ ఘటనల్లో సారూప్యతలు న్నాయి. నాడు కూడా జరిగిన దుర్మార్గాన్ని పట్టించుకోకుండా నిర్భయ శీలాన్ని శంకించే ప్రకటనలు చేశారు. నాడూ ఇలాగే మనువాదానికి ప్రాతినిధ్యం వహించే ఫ్యూడల్‌ ఛాందస శక్తులు ఆడపిల్లల వస్త్రధారణ గురించి, రాత్రిపూట అబ్బాయి లతో కలిసి సంచరించడంపై సందేహాలు లేవనెత్తారు. అవే శక్తులు ఇప్పుడు రోహిత్‌ కులాన్ని, వామపక్షాల నిజాయితీని శంకిస్తున్నాయి. రోహిత్‌ బతికున్నంత వరకు వేపుకు తిన్నారు. అడుగడుగునా కులవివక్షను ప్రదర్శించారు. ఆఖరికి చనిపోయాక కూడా వదల్లేదు. తనను తాను అంతం చేసుకోవడం ద్వారా ఈ కులరాక్షసి కబంద హస్తాల నుంచి బయట పడాలనుకున్నాడు. కానీ రోహిత్‌ ఆత్మను కూడా వారు వదలదలచుకోలేదు. నీదే కులం అంటూ వెంటాడి పీడిస్తూనే ఉంది. రోహిత్‌ తల్లి రాధిక అతను చనిపోయిన నాటి నుంచి గుండెలవిసిపోయేలా కన్నీళ్ల పర్యంతమవు తూనే ఉంది. కానీ పాలకుల గుండెలు మాత్రం కరగడం లేదు. కేంద్రం గద్దెపై కూర్చున్న పాలకులను ”మను”వ్యాధి పీడిస్తోంది. దెబ్బకు దెయ్యం వదులుతుంది అన్నట్లుగా మనువ్యాధి పీడితులకు పోరాటమే చికిత్స. అదే నేడు విద్యార్థులు ఐకమత్యంతో చేస్తున్న పోరాటం.
ఘటన జరిగిన రోజు నుంచే దీన్ని దళిత-దళితేతర సమస్యగా చిత్రీకరించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పేరుతో అగ్రకులాలను తమ వైపు తిప్పుకోవాలన్న దుర్బుద్ధి వారిలో కనిపిస్తుంది. కానీ వారి ఆశలను అడియాసలు చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా విద్యార్థులంతా ఏకమై ఆందోళన చేస్తు న్నారు. తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం మరొకరికి జరగ కూడదన్న పట్టుదలతో వారున్నారు. సెమిస్టర్‌ కొద్దిరోజుల్లో ముగియనుండగా తమ చదువులను సైతం లెక్క చేయ కుండా క్లాసులను బహిష్కరించి, విశ్వవిద్యాలయ పాలక వర్గాన్ని నిలదీస్తున్నారు. ఐదుగురు దళిత విద్యార్థుల ”సామాజిక బహిష్కరణ”కు విరుగుడే ఈ తరగతుల సమైక్య బహిష్కరణ. తెరవెనుక నుంచి ఎబివిపి ద్వారా విద్యార్థుల్లో చీలికలు పెట్టడానికి నానా యాతన పడుతున్నాయి బిజెపి, ఆర్‌యస్‌యస్‌లు. విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులే కాదు బయట కూడా దళిత సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రగతిశీలురు గళం విప్పి వారికి అండగా నిలబడుతున్నారు. ఇదొక సమై క్యతా శంఖారావం. దీన్ని కులం పరిధిలో ఇరికించి బలహీన పరచాలనుకునే వారి కుట్రలు సాగవని విద్యార్థిలోకం నిరూపిస్తోంది.
రాజకీయ శక్తులు జొరబడి ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నాయని బిజెపి మరొక అస్త్రాన్ని బయటకు తీసింది. అసలు ఈ సమస్యంతా బిజెపి రాజకీయ జోక్యంతోనే మొదలైంది. కన్నంలో దొరికిన దొంగలా ఉంది బిజెపి పరిస్థితి. ఆఖరికి దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఇతరులు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇరు వర్గాలకు చెందిన విద్యార్థుల గొడవను రాజకీయం చేసింది బిజెపి. క్యాంపస్‌లో జొరబడి ఈ ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేసేదాకా వదల్లేదు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తమ అనుచరుల్ని వెంటేసుకొని వైస్‌ ఛాన్సలర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాస్తవాలేమిటో తెలుసుకోకుండానే వారిని జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేశారు. కేంద్రమంత్రి ఇరానీ చర్య తీసుకునేదాకా వదల కుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. ఇదంతా వారి రాజకీయ జోక్యాన్నే తెలియచేస్తున్నది. ఆఖరికి అదే తమకు ఎదురు తిరిగేసరికి ఎవరో రాజకీయం చేస్తున్నారంటూ కాకిగోల చేస్తున్నారు.
పనిలో పనిగా తమ కొమ్ముకాసే కొందరు దళిత మేధావులు, సంఘాలను ఉపయోగించుకొని ఉద్యమంపై నీచమైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి కొండంత అండగా నిలబడ్డ వామపక్షాలపై వారి దాడి ఎక్కుపెడుతున్నారు. నానా రకాల ఆరోపణలు చేసి వామ పక్షాలను అప్రతిష్టపాలు చేయాలన్న దుష్టతలంపుతో వ్యవహరిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆర్‌యస్‌యస్‌ నెట్‌వర్క్‌ ద్వారా రకరకాల ఆకాశరామన్న పేర్లతో వామపక్షా లపై విషం కక్కుతున్నారు. తెలిసో తెలియకో కొందరు ఈ వలలో పడిపోతున్నారు. వామపక్షాలు, విద్యార్థిసంఘాలు, దళితసంఘాలు కలసికట్టుగా వ్యవహరించడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఐక్యతను దెబ్బ తీయడానికే వామపక్షాలను కేంద్రంగా చేసుకొని కాలం చెల్లిన విమర్శనాస్త్రాలను తిరిగి తమ అంబులపొది నుంచి బయటకు తీసి సంధిస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వామపక్షాల్లో ప్రత్యేకించి సిపియంలో అగ్రకులాలదే పెత్తనమని, దళితులు నాయకత్వస్థానాల్లో లేరని, అలాంటి వారు రోహిత్‌ సమస్యను ఆసరా చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ అరిగిపోయిన రికార్డులే. గతంలో పట్టించుకోవడం లేదని విమర్శించిన వారే ఇప్పుడు పట్టించుకుంటున్నందుకు అభినందించాల్సింది పోయి విమర్శలెందుకు చేస్తున్నారు? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరిని సంతృప్తి పర్చడానికి ఈ అబద్ధాలు వల్లిస్తున్నారు? ఇలాంటి చర్చ సమస్య పరిష్కారానికి తోడ్పడుతుందా? లేక ఉద్యమాన్ని బలహీనపర్చడానికి ఉపయోగపడుతుందా? అలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిత్‌, తదితరుల మీద చర్య తీసుకున్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ ఎక్కడ ఉంది అంటూ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాసం రాస్తూ అడిగాడు. అతనెక్కడున్నాడో ముందు చెప్పాలి? తన పదవి కోసం బిజెపికి దళిత ఉద్యమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం? ఆయనొకప్పుడు ఏం చేశాడనేది కాదు ఇప్పుడెక్కడున్నాడనేది ముఖ్యం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపి దళిత సమస్యను చర్చించాలని దళిత శోషిత్‌ ముక్తిమంచ్‌ (డిఎస్‌యంయం) డిమాండు చేస్తూ పార్లమెంటు సభ్యులకు విన్నపం చేసుకోడానికి ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లిన కార్యకర్తలను బూతులు తిట్టి పంపాడు. అదీ ఆయన నైజం. దీనిపై ఢిల్లీలో నిరసన కూడా వ్యక్తమైంది. ఇలాంటివారే మరికొంత మంది వామపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై తక్షణమే స్పందించి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకే వారికి కంటగింపుగా ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ప్పుడు చురుగ్గా ఉండే కొంతమంది నాయకులు ఈసారి కనుమరుగయ్యారు. అలాంటి వారికి కూడా వామపక్షాల చొరవ నచ్చడం లేదు. ఏది ఏమైనా వామపక్షాలు తాము నమ్మిన మార్గాన్ని వదిలిపెట్టవు. దళితులు, దళిత ఉద్యమాలు వామపక్ష ఉద్యమ స్రవంతిలో అంతర్భాగం. వారిని విడదీయం అంత సులభం కాదు.
ఐదుగురు దళిత విద్యార్థులపై అన్యాయంగా చర్య తీసున్నప్పటి నుంచి వారి సంఘం(అసా)తో తమకున్న విబేధాలను పక్కన పెట్టి ఎస్‌ఎఫ్‌ఐ చొరవతో వ్యవహరించింది. తాము యూనియన్‌లో గెలిచినప్పటికీ దానితో నిమిత్తం లేకుండా అసాతో సహా అన్ని సంఘాలను కలిపి ”సామాజిక న్యాయం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ”ని ఏర్పరచింది. దానిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆ సమయంలోనే ఈ రచయిత కూడా వారిని పలకరించాడు. సంఘీభావం తెలిపాడు. ఈ మధ్యలో రోహిత్‌ ఘోరం జరిగింది. దానితో ఉద్యమం మరింత ఊపందుకుంది. అన్ని రిపోర్టులూ ఆ అయిదుగురు విద్యార్థులు ఏ తప్పూ చేయలేదని ఘోషిస్తున్నా కావాలని రాజకీయ ఒత్తిళ్లతో చర్య తీసుకున్నారు. తన కొడుకుపై చర్య తీసుకుంటే ఎందుకు ఇంతవరకు-చని పోయిన తర్వాత కూడా- తనకు తెలియజేయలేదని రోహిత్‌ తల్లి నిలదీస్తుంటే దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? తనకు న్యాయం కావాలని ఆ తల్లి అడుగుతుంటే సమాధా నం చెప్పరా? ఇదేనా విశ్వవిద్యాలయాలు నేర్పించే చదువు? రోహిత్‌ మరణానికి నిరసనగా హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆందోళన సాగుతోంది. వివిధ చోట్ల దళితుల పట్ల ఎంతగా వివక్షత సాగుతుందో కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఆఖరికి ప్రఖ్యాతిగాంచిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్శిటీలోనూ దళిత విద్యార్థుల పట్ల వివక్షత కొనసా గుతున్నదంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
రోహిత్‌ చనిపోయి ఇప్పటికి మూడు వారాలవు తోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌ కేందీయ విశ్వవిద్యా లయ విద్యార్థులు సమ్మెలో ఉన్నారు. వారి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ యాజమాన్యంపై ఉంది. విద్యా సంవత్సరం నష్టపోతే అందుకు వారిదే బాధ్యత అవుతుంది. విద్యార్థుల కోర్కెలన్నీ చట్టబద్ధమైనవి, న్యాయమైనవి. చట్టాన్ని అమలు చేయమని విద్యార్థులు కోరుతున్నారు. వాటిని ధిక్కరిస్తున్నది కేంద ప్రభుత్వం, విశ్వవిద్యాలయ పాలకవర్గం. తాజాగా తమిళనాడులోని విల్లుపురంలో ముగ్గురు విద్యార్థినులు ఇదే విధంగా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దానికి బాధ్యులైన ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండుకు పంపారు. కానీ హైదరాబాద్‌లో రోహిత్‌ మరణానికి కారకులైన వారు దర్జాగా, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఎదుటివారిపై ఆరోప ణలు చేస్తున్నారు. ఇంతకన్నా వివక్షత ఇంకేమన్నా ఉందా? వైస్‌ఛాన్సలర్‌ను వెంటనే అరెస్టు చేయడం పోలీసు ధర్మం. కానీ వారు కేంద్రం ఒత్తిడితో తమ విధుల్ని నిర్వహించడంలో విఫలమవుతున్నారు. రేపు విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతే అందుకు పోలీసు కూడా బాధ్యత వహించాలి. సవరించిన ఎస్‌స్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం ప్రకారం అలక్ష్యంగా వ్యవహరించే పోలీసులు కూడా శిక్షార్హులే. వెంటనే విద్యార్థుల న్యాయసమ్మతమైన కోర్కెలను పరిష్క రించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. లేకుంటే ఈ తరహా బాధ్యతారాహిత్యం మరింత మంది రోహిత్‌లను బలిచేయడానికే తోడ్పడుతుంది. మనకెందుకులే అని మిగతావారు నోరు మూసుకున్నా లేదా రోహిత్‌ దళితుడు గదా మనకెందుకులే అని ఇతర కులస్తులు అనుకున్నా ఈరోజు రోహిత్‌ అయితే రేపు మరొకరవుతారు. అన్యా యాన్ని ప్రశ్నించకపోతే అదే రేపు మనల్ని బలితీసు కుంటుందని మరచిపోరాదు. అందుకే ప్రతి ఒక్కరూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమానికి అండగా ముందుకు రావాలి. ఈ దేశానికి శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవాలి.
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)

This article first published in Prajasakti