Tags

, , , , , ,

లేఖల మీద లేఖలు రాసే మీ తోటి మంత్రి దత్తన్న స్ఫూర్తితో ఒక బహిరంగ లేఖ

      వెంకయ్య నాయుడు గారూ తెలుగు రాష్ట్రాలలో ప్రాసలను గుమ్మరించి వుపన్యాసాలు చెబుతూ జనాన్ని ఆకట్టుకొనే దిట్టలలో మీరు ఒకరు. దానితో సమస్య లేదు. హైదరాబాదు నగరాభివృద్ధికి వాజ్‌పేయి ఆద్యులు-చంద్రబాబు బాధ్యులు అన్నది మీ మాటల పొది నుంచి తాజాగా తీసిన నినాదం. కొత్తవారు ఎవరైనా హైదరాబాద్‌ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే చార్మినార్‌ , హుస్సేన్‌ సాగర్‌, గోల్కోండ కోట, కొండలు, గుట్టలు మొదలు ఇక్కడ లక్షలాది మందికి వుపాధి కలిగిస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను వాజ్‌పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగానే వచ్చాయని అనుకొనే ప్రమాదం లేకపోలేదు.వారికి అంత సీన్‌లేని చెప్పటం అవసరమోమో ఆలోచించండి.

     ఒక బిహెచ్‌యిఎల్‌, ఒక ఇసిఐఎల్‌ ఇలా ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమను హైదరాబాదులో వారి హయాంలో నెలకొల్పకపోగా హెచ్‌ఎంటి, ప్రాగా, ఐడిపిఎల్‌, ఇలా ఎన్నో పరిశ్రమలను మూసివేయించి పుణ్యం కట్టుకున్న పెద్దలు అంటే అతిశయోక్తి కాదు.ఈ మాట చెప్పగానే రింగ్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, ఐటి కంపెనీల మాటేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఒక అందగత్తె గర్వంతో ఒక రోజు తన భర్తతో ఏమండీ నేనే గనుక పుట్టి వుండకపోతే మీరు ఎవరిని వివాహం చేసుకొని వుండేవారు అని అడిగిందట. దానికా భర్త నువ్వు గాక పోయివుంటే నీ అమ్మను చేసుకొని వుండేవాడిని అన్నాడట.

      వాజ్‌పేయి, చంద్రబాబు నాయుడు లేకుండానే ఐటి పరిశ్రమలు బెంగళూరులో,చెన్నయ్‌, పూనేలలో ఎలా వచ్చాయి. నరేంద్రమోడీ వంటి కారణజన్ముడు పుట్టిన గుజరాత్‌లో ఐటి పరిశ్రమలు ఎందుకు రాలేదు, బిజెపి బలంగా వున్న వుత్తరాది ఇతర రాష్ట్రాలలో ఎందుకు రాలేదు అంటే వెంకయ్య గారేమంటారు? చంద్రబాబు మాదిరి అడిగిన వారు ఆ రాష్ట్రాలలో లేకపోయారా ? విజయవాడ, విశాఖ, వరంగల్‌, చివరికి మీ నెల్లూరును ఎందుకు అభివృద్ధి చేయలేదు? కేవలం రాజధాని నగరాలను మాత్రమే అభివృద్ధి చేయాలనేది ఒక విధానమా లేక రహస్య అజెండాగా అమలు జరిపారా ? రింగ్‌ రోడ్‌ విషయానికి వస్తే వారి హయాంలో వేసినదాని కంటే పెద్దదాన్ని రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు సార్‌ ?అయినా వాజ్‌పేయి వంటి వ్యక్తి కేవలం హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేసి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆయనేమి జాతీయ నాయకుడు ? అడగటానికి ఇలా చాలా వుంటాయి. ఏదో ఓట్ల కోసం వచ్చారు, అడిగారు అంతవరకు మంచిది, మిగతా విషయాలపై మూసుకుంటే మంచిదేమో ?

      వెంకయ్యగారూ మీరు ఓట్ల కోసం హైదరాబాదు వస్తున్న సమయంలోనే కాంగ్రెస్‌ నేతో రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక రోజు దీక్ష కోసం వచ్చారు. మీ కడుపు మంట ఏమిటి ? కాంగ్రెస్‌, వామపక్షాలు ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ విషయమై రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు.అసలు ముందు అక్కడి వ్యవహారాలలో జోక్యం చేసుకున్నదెవరు? రాజకీయం చేసిందెవరు ? బిజెపి ప్రజాప్రతినిధులు, మంత్రులు కాదా ? రోహిత్‌ మరణాన్ని దళితేతర సమస్యగా మార్చే అతి పెద్ద రాజకీయానికి తెరతీసిందెవరు ? అసలు మీ సమస్య ఏమిటి ? హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అంతకు ముందు చాలా మంది మరణిస్తే, వరంగల్‌లో రాజయ్య కుటుంబంలో మరణాలు జరిగినపుడు ఎందుకు రాలేదు అంటున్నారు ? నిజమే సార్‌ రాలేదు, వాటి వెనుక కూడా మీ మంత్రులు, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏల లేఖలు, హస్తాలు, వత్తిడి వున్నాయా లేక నాటి కాంగ్రెస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధుల వత్తిడులు వున్నాయా చెప్పండి, అన్నింటినీ కలిపి అఖిలపక్ష ఆందోళన చేస్తే దళితులు ఎందుకు ఆత్మహత్య లు చేసుకుంటున్నారో తేలుతుంది. అన్నట్లు గుర్తొచ్చింది, దేశంలో అనేక మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి దాని మీద స్పందించకుండా కూడికలు-తీసివేతల లెక్కలు వేసుకొని ఐదు రోజులు అయినా ఇంకా ఇంత లాభం వస్తుంది అని వేద గణితంలో నిర్ధారణకు వచ్చిన తరువాతే కదా రోహిత్‌ వుదంతం మీద ప్రధాని నరేంద్రమోడీ స్పందించటం రాజకీయం కాదా ?

      హర్యానాలో ఇద్దరు దళితుల పిల్లలను సజీవ దహనం చేసిన దుర్మార్గం మీద ‘ఎవరో రాళ్లు వేసి వీధిలో ఒక కుక్కను చంపితే ప్రభుత్వం ఎలా బాధ్యురాలు అవుతుంది’ అన్న మీ మంత్రి వీకె సింగ్‌ మాదిరి రోహిత్‌ మరణాన్ని కూడా అలాగే తీసుకోవాలనా ? అసలు మీ సమస్య ఏమిటి ? ఈ వుదంతాన్ని అసలు ఖండించాలా వద్దా ? ఖండించాలి అనుకుంటే రాజకీయ వాసనలు తగల కుండా ఎలా ఖండించాలో కావాలనుకుంటే మీ తరహా యతి ప్రాసలను చేర్చి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక పత్రాన్ని రూపొందించి దేశం మీదకు వదలండి , దాన్ని నలుగురి చేతా కనీసం మీకు నొప్పితగలకుండా మోసే తెలుగుదేశం, పోనీలే, పోయింది ఒక దళితుడే మన వాడే కదా అయినా అతని కులమేమిటో నిర్ధారణ కాకుండా స్పందించటేమిటి అసహ్యంగా అన్నట్లు వున్న , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తెరాస వంటి పక్షాల చేత ముందు వప్పించండి, తరువాత దాని మీద అందరూ స్పందించి సంతకాలు చేస్తారు. అవేమీ లేకుండా ఎంతగా మాట్లాడినా జనం అదేదో సినిమాలో అడిగినట్లు అసలు నువ్వు ఎవరు ? అన్నట్లుగా అసలు వెంకయ్యగారి ఏమిటి అని అడుగుతూనే వుంటారు.

భవదీయుడు

ఒక పాఠకుడు