Tags

,

సత్య

     అగ్గిపుల్ల , సబ్బుబిళ్ల ,తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అని మహాకవి శ్రీశ్రీ చెప్పాడు.అలాగే పెట్టుబడిదారీ వ్యవస్ధలో ప్రతిదాన్నీ లాభాల సంపాదనకు వినియోగించటం ఎలాగో చూస్తున్నాం. వాటిలో ఒకటి సున్నతి. సుంతి లేదా సున్నతి ప్రాంతాలను బట్టి తెలుగులో ఏ పేరుతో పిలిచినా బాల్యంలో పురుషాంగం మొదటి భాగంలో వుండే చర్మాన్ని తొలగించే ప్రక్రియ ఇది. ముస్లింలలో దీనిని విధిగా ఒక పండుగగా కూడా చేసుకుంటారు. దీనిపై తరతరాలుగా పేరుకు పోయిన నమ్మకాలు లేదా మూఢనమ్మకాలు ఎలా వున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశీలనలో కొంత మంచి కూడా వుంటుందని తేలింది. ముఖ్యంగా పురుషులు పురుషులతో సంభోగించే వుదంతాలలో ఎయిడ్స్‌ వచ్చే అవకాశాలు తక్కువగా వున్నాయని చెబుతున్నారు. అయితే దీనితో ఎయిడ్స్‌ను పూర్తిగా నిరోధించలేమని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. అందువలన దీని మంచి చెడుల గురించి ఇక్కడ చర్చించబోవటం లేదు.మొరటు పద్దతులను వినియోగిస్తే ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు వచ్చిన వుదంతాలు కూడా వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ లేదా బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వారు ఇటీవలి కాలంలో సుంతీ గురించి ఎక్కువగా ప్రచారం లేదా ప్రోత్సహించటాన్ని అనేక మంది అనుమానిస్తున్నారు. సుంతీ చేస్తే పురుషాంగం శుభ్రంగా వుంటుందని, దానికి వచ్చే క్యాన్సర్‌లను నివారించవచ్చని, ఎయిడ్స్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని ప్రచారం చేస్తున్నారు.

     1980 దశకం నుంచి అమెరికాలో సుంతీ గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. తీరా దీనివెనుక వున్న కధేమిటంటే సుంతీ సమయంలో తొలగించిన చర్మాన్ని విపరీత లాభాలకు అమ్ముకుంటున్నారని తేలింది. ఆ చర్మాన్ని బయోమెడికల్‌, ఇన్సులిన్‌ తయారీ, సౌందర్యసాధనాల కంపెనీలు ఆపరేషన్ల ద్వారా ఆ చర్మాన్ని అమర్చటం, వయస్సు కనపడకుండా చేసే సౌందర్య సాధనాలలో వినియోగించటం, కణాలను కలిపి వుంచటం వంటి అనేక ప్రక్రియలకు వినియోగిస్తున్నారు. ఒక బాలుడి నుంచి సేకరించే చర్మంతో కొలెగాన్స్‌, ఫైబర్ల తయారు చేసేందుకు వుపయోపగడే కణాలు విలువ లక్ష డాలర్లు.

      అమెరికాలో ఏడాదికి 175 కోట్ల డాలర్ల నిఖర లాభాలు (మన రూపాయల్లో లక్షా 19వేల కోట్ల రూపాయలు) సుంతీ ద్వారా వస్తున్నట్లు అంచనా. ఒకరి అనుమతి అవసరం లేదు పెట్టుబడిలేని వ్యాపారం. ఒక్కొక్క సుంతీ చేస్తే వైద్యుడికి 167డాలర్లు వస్తాయట(2010 ధరల్లో) వారానికి ఐదు చేస్తారనుకుంటే నెలకు 3,340 డాలర్లు అంటే ఇప్పటి లెక్క రెండు లక్షల 27వేల రూపాయలు వస్తాయి. రాత్రీ పగలు పనిచేస్తూ మనకు కనిపించే డాక్టర్లకు ఇంకెంత మొత్తం వస్తుందో కదా ! సుంతీ చేయించుకొనే వారిలో ముస్లింలతో పాటు యూదులు కూడా వున్నారు.

    సుంతీ చర్మ వ్యాపారంలో జార్జి సోరస్‌ వంటి పెద్ద తలకాయలు వున్నాయి. వారంతా గేట్స్‌ ఫౌండేషన్‌కు, అమెరికా ఏనుగు, గాడిద రాజకీయ పార్టీలకు దండిగా విరాళాలు కూడా ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. సుంతీ చేయించుకున్నవారికి ఎయిడ్స్‌ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి సాధికారతతో చెప్పలేదు. పాక్షిక పరిశోధనలతోనే దానిని ప్రచారం చేస్తున్నారనేది ఒక విమర్శ.ఈ ప్రచారంలో ఆఫ్రికా ఖండంలో సుంతీ చేయించుకోవటాలు విపరీతంగా పెరిగాయి. పిల్లలు కాదు పెద్దలు చేయించుకోవటం మొదలు పెట్టారు. వారు కండోమ్‌లను వినియోగించకుండానే తమతో శృంగారంలో పాల్గొనమని వత్తిడి తెస్తున్నారని జింబాబ్వేకు చెందిన సెక్స్‌ వర్కర్లు వాపోయారు. వుగాండాలో తేలిన విషయం ఏమంటే 61శాతం ఎయిడ్స్‌ పెరుగుదల మహిళల్లో కనిపించిందట. సుంతీతో ఎయిడ్స్‌ నివారణ అనే అమెరికా సాయంతో 2011-13మధ్య ఆఫ్రికాలో 47లక్షల సుంతీలు చేయించుకున్నారట.అమెరికాలో 1982కు ముందు సుంతీ చేయించుకుంటే ప్రభుత్వం నిధులు ఇచ్చేది కాదు, తరువాత క్రమంగా ఒక్కొక్క రాష్ట్రం ఆ సౌకర్యాన్ని కల్సిస్తూ వస్తోంది. ఆది వున్న సుంతీలు పెరుగుతుండగా లేని చోట్ల తగ్గిపోతున్నట్లు తేలింది.