Tags

, , ,

పంజాబ్‌ గోసేవ కమిషన్‌ అధ్యక్షుడు కిమిటీ భగత్‌ ఒక ప్రకటన చేస్తూ రోడ్లపై వదలి వేసిన ఆవులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని కోరారు.ఇదెక్కడో బయట చేసిన ప్రకటన కాదు, జలంధర్‌ నగరంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలోనే చెప్పారు.

ఎం కోటేశ్వరరావు

     ఈ శాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో కేంద్రం విధించిన రాష్ట్ర పతి పాలన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్నోసార్లు అక్రమంగా ఆ అస్త్రాన్ని వాడుకున్న మీకు మా చర్యను విమర్శించే హక్కు లేదని కాంగ్రెస్‌ నేతలను బిజెపి పెద్దలు చీల్చి చెండాడుతున్నారు. రాజభవన్‌ వెలుపల జరిగిన గోవధ కారణంగా అక్కడ శాంతి భద్రతలు దిగజారిపోయాయని గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ రాజ్‌కోవా కేంద్రానికి పంపిన నివేదికలలో వున్నదంటే నమ్ముతారా ? రాష్ట్ర పతి పాలన విధింపునకు గల కారణాలను తెలపాలని అడిగిన సుప్రీం కోర్టుకు గవర్నర్‌ న్యాయవాది సత్యపాల్‌ జైన్‌ సమర్పించిన ఆధారాలలో గోవధకు సంబంధించిన ఫొటోలు కూడా వున్నాయి.అరుణాచల్‌లో ఆవును మిథున్‌ అని పిలుస్తారు, దానిని రాష్ట్ర జంతువుగా ప్రకటించారు.అసెంబ్లీ సమావేశాలను ముందుగానే జరపాలని గవర్నర్‌ జారీ చేసిన ఆదేశాలను గౌహతి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసిన తరువాత డిసెంబరు 17న రాజభవన్‌ ఎదుట అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పాల్గొని ఆవును బలి ఇవ్వటం కూడా శాంతి భద్రతలు దిగజారాయనటానికి ఒక కారణంగా గవర్నర్‌ పేర్కొన్నారు.

    దేశంలో రాజకీయాలు ఎటు పోతున్నాయి? ఏదైనా ఒక వ్యాసం రాయమంటే అటు తిప్పి ఇటు తిప్పి ఆవు మీద రాసినట్లుగా కాషాయపరివార్‌ ప్రతిదానికీ ఆవును రాజకీయాలలోకి తెస్తోందన్నది ఇంకా అర్ధం కాని వారెవరైనా వుంటే తెలుసుకోవటం మంచిది.ఆవును వధించిన వారిని చంపాలని వేదాలు చెప్పాయని ఈ రోజుల్లో చెప్పటమంటే సమాజాన్ని మధ్యయుగాల్లోకి, అంతకు ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. గొడ్డు మాంసం తినటానికి, అమ్మటానికి వీల్లేదని ఆంక్షలు విధించటం, తిన్నవారిని ఆవు మాంసం తిన్నారనే పేరుతో చంపివేయటం పచ్చి అనాగరికం.

     భారత్‌లో పశువధ శాలలు ఎక్కువగా పాలఫ్యాక్టరీలు ఎక్కువగా అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం పాల ఫ్యాక్టరీలు ఎక్కువ అని. కానీ వాస్తవాలు అలా లేవు మరి. మన కేంద్ర ప్రభుత్వ పశుసంరక్షణ, పాడి పరిశ్రమ, మరియు మత్స్యశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం పశువధ శాలలే ఎక్కువగా వున్నాయి.అధికారికంగా నమోదైన పశువధ శాలలు 1,623, పాల ఫ్యాక్టరీలు 213 , శీతలీకరణ కేంద్రాల వంటివి 793 వున్నాయి. ఆసక్తికరమైన దేమంటే పశుమాంసంపై నిషేధం గురించి బహుళ ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్ర 316 పశువధ కేంద్రాలతో ముందున్నది.తరువాత వరుసగా వుత్తర ప్రదేశ్‌ (285), తమిళనాడు(130) కేరళ(55) పశ్చిమ బెంగాల్‌ (11) సిక్కిం(4) మిజోరం(2) వున్నాయి.ఇవన్నీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినవే అని పాల ఫ్యాక్టరీల కంటే మాంస ఫ్యాక్టరీలకు ఎక్కువగా అనుమతిచ్చారని సమాచార హక్కు కార్యకర్త ఒకరు పేర్కొన్నారు.పైన పేర్కొన్నవి ప్రభుత్వం వద్ద నమోదైనవి మాత్రమే. ఇవిగాక స్ధానిక సంస్ధల వద్ద నమోదైన వధశాలలు 4000, నమోదు కానికి 25వేలు వుండవచ్చని అంచనా. అనేక చోట్ల అనుమతి లేకుండా వధిస్తున్నవి రెట్టింపు వుంటాయని వెల్‌కన్‌ యానిమల్‌ హెల్త్‌ సాంకేతిక విభాగ అధిపతి డాక్టర్‌ అవినాష్‌ శ్రీవాత్సవ అంటున్నారు.

    బీహార్‌ ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ఆవు రాజకీయం చేసిందని, తమిళనాడులో ఎద్దుల రాజకీయం చేసిందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కేరళ, పశ్చిమ బెంగాల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలో అవులతో సహా దేని వధపైనా ఎలాంటి నిషేధాలు లేవు.

పశువధ నిషేధం-ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం

    ప్రపంచంలోని పశు సంపదలో 13శాతం(19.1కోట్లు) మన దేశంలోనే వుంది, ప్రపంచ గేదె(బర్రెలు)లలో 56శాతం(11 కోట్లు) మనవే.ఇంత పశుసంపద వున్నపుడు వాటిని మాంసం కోసం వధించకుండా నిషేధిస్తే ఆర్ధిక వ్యవస్ధపై దాని ప్రభావం తప్పుకుండా వుంటుంది. ప్రపంచంలో ఎక్కువగా పాలు వుత్పత్తి చేసే మనదే అయినప్పటికీ వాటిలో 55శాతం గేదె పాలే. మాంస వుత్పత్తిలో ప్రపంచంలో ఐదవ స్ధానంలో వున్నాము.ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం మధ్య, తూర్పు రాష్ట్రాలలో కోడెలు, ఎద్దులను మాత్రమే వధించటానికి అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఎంపీ, పంజాబ్‌, రాజస్ధాన్‌,యుపిలలో పూర్తి నిషేధం వుంది. ఈ కారణంగానే ఈ రాష్ట్రాల నుంచి పశుసంపదలను తరలించటం అక్రమంగా పరిగణించి కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో అదే జరిగింది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్‌,నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో కొన్ని షరతులకు లోబడి పశువధకు అనుమతి వుంది.

     ఆవు, పశుమాంస రాజకీయాల కారణంగా మాంస ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. రాయిటర్‌ వార్తా సంస్ధ వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఏప్రిల్‌-సెప్టెంబరు)ఆరునెలల్లో 13.2శాతం గేదె, దున్న మాసం ఎగుమతులు పడిపోగా 15.5శాతం ఆదాయం పడిపోయింది. తోళ్ల పరిశ్రమపై 25లక్షల మంది వుపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులే అని చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ పరిశ్రమలోని వారు కూడా ఎప్పుడేం జరుగుతుందో ఎవరు వచ్చి ఆవుతోళ్లను తీస్తున్నారని దాడులు చేస్తారోనని భయపడుతున్నారు.చివరకు చచ్చిపోయిన ఆవులను ముట్టుకొనేందుకు కూడా భయపడుతున్నారని కాన్పూరుకు చెందిన ఒక తోళ్ల శుద్ది యజమాని వాపోయారు. పులి చర్మకంటే ఆవు చర్మ రవాణా ప్రమాదకరంగా మారిందన్నారు.దీంతో అనేక కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయి.

    సాధారణంగా రైతులు వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయిస్తారు. వాటిని కొన్నవారు పశువధ శాలలకు తరలిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు మాంసం, వధపై నిషేధం విధించటంతో రైతులు వాటిని వీధులలో వదలి వేస్తున్నారు. అది వారికి ఆర్ధికంగా నష్టంతో పాటు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఎవరైనా వాటిని పట్టుకొని తరలిస్తే సంఘపరివార్‌ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, వాటిని వీధుల్లో వదలి వేస్తే పర్యావరణ సమస్యలు ముఖ్యంగా పట్టణాలలో రవాణా, తదితర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. 2012 గణాంకాల ప్రకారం దేశంలో 53లక్షల పశువులు అటు పాడికి, ఇటు వ్యవసాయానికి పనికిరానివి వున్నాయని అంచనా.వాటిలో పదిలక్షల పశువులను పట్టణాల్లో వదలి వేశారని లెక్కలు చెబుతున్నాయి. వీటికి ఆహారం, వైద్యం ఏవీ అందవు. ఎవరూ బాధ్యత తీసుకోరు. అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలకు ఈ పశువులు కారణమౌతున్నాయి. భారత దేశం ఎదుర్కొంటున్న అపరిశుభ్రత సమస్య లలో ఇలా వదలి వేసిన పశువుల నుంచి కూడా వుత్పన్నమౌతోందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చెప్పింది. పర్యావరణ సమస్యలతో పాటు అనేక వ్యాధులను ఇవి ఒక చోటి నుంచి మరోచోటికి వ్యాపింప చేస్తున్నాయి.

ఆవులకూ స్మార్ట్‌ సిటీలు !

     నరేంద్రమోడీ సర్కార్‌ సమాజంలోని ధనికులకే కాదు, వారితో సమంగా వీధులలో తిరిగే ఆవులూ, గేదెలకూ స్మార్ట్‌ సిటీలను నిర్మిస్తుందా ? మానవులకు అన్ని వసతులూ ఒకేచోట కల్పించినట్లుగా ఈ పశువులకూ కల్పించని పక్షంలో అవొక సమస్యగా మారేట్లు వున్నాయని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ గోసేవ కమిషన్‌ అధ్యక్షుడు కిమిటీ భగత్‌ ఒక ప్రకటన చేస్తూ రోడ్లపై వదలి వేసిన ఆవులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని కోరారు.ఇదెక్కడో బయట చేసిన ప్రకటన కాదు, జలంధర్‌ నగరంలో జరిగిన ఒక అధికారికి సమావేశంలోనే చెప్పారు.కొంత మంది కేవలం ఆవులకు మాత్రమే పునరావాసం ఎందుకు కల్పించాలి? మిగతా పశువులను ఎందుకు మినహాయిస్తున్నారని అభ్యంతర పెట్టారు.వీధి కుక్కలు అనేక మందిని బలిగొన్నాయని, వాటిని స్మార్ట్‌ సిటీ పరిధిలోకి ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. గోవులకు మాత్రమే గోవుల బోర్టు వుంటే అంతరిస్తున్న మిగతా జంతువుల సంగతేమిటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు మాత్రమే సరిపోయే జంతువుల గురించే మాట్లాడటం సరైనది కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    పంజాబ్‌లోని అనేక పట్టణాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. లూధియానా చుట్టూ ఒక్క్కొ దానిలో 70వేల ఆవులున్న రెండు పెద్ద డైరీలు వున్నాయి. చిన్నవి చాలా వున్నాయి. వట్టి పోగానే వాటినుంచి వీధులలోకి వదలి వేస్తున్నారు. వీధి ఆవుల సంరక్షణకు లూధియానా నగరపాలక సంస్ధ ఏటా కోటీ 30లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.అయినా సమస్య తీరలేదు.ఏడాది కేడాది పెరుగుతూనే వున్నాయి. నిధుల కొరతను అధిగమించేందుకు పంజాబ్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌ ఆవు సెస్సు పేరుతో వినియోగదారులను బాదటం మొదలు పెట్టింది.యూనిటక్‌ పది పైసల వంతున విధిస్తే నెలకు అదనంగా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట.