Tags

ఎం కోటేశ్వరరావు

మూడు పైసలు అంటే ఎంత అంకుల్‌ అని అడిగాడు మా పక్కింటి ఎలిమెంటరీ స్కూలు పిల్లవాడు. వాడికి ఎలా చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే నాణెం లేదు కదా ! అందుకని చిరాకు వేసి నరేంద్రమోడీ బొమ్మ చూపించాను అంత అని. డీజిల్‌ ధరలు మూడు పైసలు, పెట్రోలు ధరలు కొన్ని ప్రాంతాలలో నాలుగు పైసలు, కొన్ని చోట్ల ఐదు పైసలు తగ్గించినట్లు ప్రభుత్వం వుదారంగా ప్రకటించిన సందర్బంగా మూడు పైసలు అంటే నరేంద్రమోడీ గొప్ప అనుకున్నాడో లేక మరో విధంగా అనుకున్నాడో తెలియదు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు తగ్గించాడు, మన ఘనమైన నరేంద్రమోడీ ముష్టి తగ్గింపు గురించి మాట్లాడుకోవటం సిగ్గు చేటు. అసలు దేశంలో ఏం జరుగుతోంది?

తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై లీటరుకు ఒక రూపాయి, డీజిల్‌పై రూపాయిన్నర ఎక్పైజ్‌ సుంకాన్ని పెంచింది.ఈ పెంపుదల మనపై ఏడాదికి దాదాపు 20వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నది.ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు చేసిన ఒక ప్రకటనలో 2013-14 సంవత్సరాలలో వాస్తవ ధరకంటే పెట్రోలియం వుత్పత్తుల అమ్మకం తరుగు రు.1,39,869 కోట్ల నుంచి రు.72,314 కోట్లకు (మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తం ఇది) తగ్గిపోయాయి. మరో రెండు నెలల్లో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో ఈ మొత్తం ఇంకా గణనీయంగా తగ్గనుంది.ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఎంతగా తగ్గాయంటే పేదలకు ఇస్తున్న సబ్సిడీ కిరోసిన్‌పై జనవరి నెలలో ఒక లీటరుకు ప్రభుత్వానికి రు.9.16పైసలు పడితే ఈనెల నుంచి రు.5.11కు తగ్గనుంది.ఇదే విధంగా ఎల్‌పిజి ిబ్సిడీ కూడా గణనీయంగా తగ్గిపోయింది.

నరేంద్రమోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన గత 20నెలల్లో చమురు ధరలు, రూపాయి విలువలు, పెట్రోలు ధరలలో వచ్చిన మార్పులు ఎలా వున్నాయో చూడండి.(పీపా ఖరీదు డాలర్లలో, మిగిలిన ధరలు రూపాయలలో, డీ.మా( డీలర్ల మార్జిన్‌) ఢిల్లీ మార్కెట్‌ ధరలివి. వ్యాట్‌ రేట్లలో అంతకంటే ఎక్కువ వుంటే రేట్లు పెరుగుతాయి, తక్కువ వుంటే తగ్గుతాయి.

తేదీ             పీపాధర    రిఫైనరీ  ధర డీలరు ధర రూపాయి విలువ కేంద్ర పన్ను రాష్ట్ర పన్ను డీ.మా మొత్తం

07.06.14  120.21    45.22     48.11              58.81  9.48   11.92   2.00    71.51

16.12.14   76.70     30.48     35.74              61.95  13.34  10.22   2.03    61.33

01.02.16   45.11      19.69     23.51              67.68  21.48   12.75  2.25    60.00

దీన్ని బట్టి మనకు ఏం అర్ధం అవుతోంది? పెట్రోలు లీటరు ధర దాదాపుగా 60 రూపాయలుగా ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గితే ఆ మేరకు పన్నులు పెంచి అక్కడే వుండేట్లు చేస్తారు. లేదూ పెరిగితే ధరలు పెరిగితే వినియోగదారులపై మోపే విధానం అనుసరిస్తున్నాం అని చెబుతున్నాం కదా అని రేటు పెంచుతారు. దేశంలో ఏం జరిగినా మనకెందుకులే, మనమేం చేస్తాంలే అనే నిర్లిప్తత ప్రదర్శించే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. దీన్ని అవకాశంగా తీసుకొని పాలకులు భారాలు పెంచుతున్నారు.అవి చివరికి సామాన్యులపైకే నెట్టబడుతున్నాయి.