Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

     ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అనటానికి అనేక కొలమానాలు వుంటాయి.  ఎక్కడో ఒక దగ్గర చోటు దక్కితేనే మనం కూడా ఆ రేసులో వున్నట్లు లెక్క. మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ చెబుతున్నదాని ప్రకారం చైనా కంటే కూడా అభివృద్ధి రేటులో ముందున్నాం. జైట్లీ గారి వేద గణితం ప్రకారం దేశం కంటే చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. కావాలంటే పెట్టుబడులకు అనువైన వాతావరణం వున్న రాష్ట్రాలలో మన స్ధానం ఏమిటో ప్రపంచబ్యాంకు నివేదికలను చూడండి అంటారు. వారు చెప్పే మాటలనే తీసుకొనేట్లయితే మనం ఇంక పెద్దగా అభివృద్ధి చెందాల్సిన పని లేదు.

     మన దేశానికి చెందిన సిఐఐతో సహా ప్రపంచంలో అనేక సంస్ధల ప్రతినిధులు, నిపుణులతో కూడిన బృందం రూపొందించే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌(ప్రపంచ నవకల్పన సూచీ)లో మనం ఎక్కడ అని చూసుకుంటే మన స్ధితి ఏమిటో తెలుస్తుంది. దీనికిగాను అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని భిెన్న సూచికలను తయారు చేస్తారు. ఏడాదికొకసారి ఈ నివేదికను విడుదల చేస్తారు. దీనిలో పైకి పోతున్నామా కిందికి దిగజారుతున్నామా అన్నది వ్యాఖ్యానం లేకుండానే మన స్ధితిని తెలుపుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అమెరికా మొదటి స్ధానంలో వుంది. తరువాత స్ధానంలో ఇప్పుడు చైనా చేరింది. త్వరంలోచైనాను మనం అధిగమించబోతున్నామని మన నేతలు చెబుతున్నారు. బహుశా ఇది కూడా వేదాల్లోనే చెప్పి వుంటారు.

      ఈ ఏడాది నవకల్పన సూచీలలో వంద మార్కులకు గాను 68.3తో స్విడ్జర్లాండ్‌ ప్రధమ స్ధానంలో,60.1తో అమెరికా ఐదవ, 47.47తో చైనా 29వ స్ధానంలో వుంది. 2013 జాబితాలో 36.17 మార్కులతో మన దేశం మొత్తం 71 దేశాలలో 66వ స్ధానంలో వుంది. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన తరువాత అసలు జాబితాలో పేరు లేకుండా పోయింది.మరో సూచిక ప్రకారం 2014లో 76వ స్ధానంలో వున్న మన దేశం 81కి దిగజారింది. 2011 నుంచి దిగజారుతూనే వుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ అనే సంస్ధ అనేక అంశాలను తులనాత్మకంగా విశ్లేషించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 90శాతానికి ప్రాతినిధ్యం వహించే 56 దేశాలను అది పరిగణనలోకి తీసుకుంది. తలసరి ప్రాతిపదికన ప్రపంచ నవకల్పనకు తోడ్పడటంలో ఫిన్లాండ్‌, స్వీడన్‌, బ్రిటన్‌ ముందు స్ధానాలలో వున్నాయి. భారత్‌, ఇండోనేషియా, అర్జెంటీనా చివరి దేశాలలో వున్నాయి.ఈ తోడ్పడటం అంటే ఏమిటి అంటే వాటిని అంగీకరించవచ్చు, విబేధించవచ్చు. పన్నులు ఎక్కువగా వుంటే, మేథో హక్కుల పరిరక్షణ బలహీనంగా వుంటే, స్ధానిక రక్షణ విధానాలను అనుసరిస్తే ప్రతికూలంగానూ లేకుంటే అనుకూలంగానూ పరిగణిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్ధితులలో వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ తమ ఆర్ధిక వ్యవస్ధలకు దెబ్బతగుల కుండా చూసుకోవటం కత్తిమీద సామువంటిదే. చైనా, వియత్నాం, లావోస్‌, కంపూచియా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కాపాడు కుంటూ సంస్కరణలతో ముందుకు పోతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన సంక్షోభం లేదా అననుకూలతలను అవి వినియోగించుకొంటున్నాయి.ఈ క్రమంలో నవకల్పనలకు ప్రోత్సాహమిచ్చిన దేశాలు లబ్ది పొందుతాయని వేరే చెప్పనవసరం లేదు.అటువంటి చొరవ చూపటానికి బదులు వేద విద్య, ఆవు,ఎద్దుల రాజకీయాల చుట్టూ తిప్పుతూ తిరోగమనంవైపు దేశాన్ని నడిపిస్తున్నారనేదే ఇక్కడ విమర్శ.

    ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువగా వున్న బ్రిటన్‌ ప్రచురితమైన పరిశోధనాంశాలలో 16శాతం కలిగి వున్నదని ఆ దేశ మంత్రి లూసీ నెవిలే చెప్పారు. ప్రపంచ నవకల్పన సూచీలో రెండవ స్ధానంలో కొనసాగటానికి ఇలాంటి పరిశోధనే ప్రధాన కారణం అని చెప్పనవసరం లేదు.మన దేశంలో పరిశోధనకు కేటాయిస్తున్న నిధులే చాలా తక్కువగా కాగా వాటికి కూడా కోత విధించటానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డీలకు నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌లకు కోత విధించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా గతేడాది విద్యార్ధులు యుజిసి ఆక్రమణ వుద్యమం జరిపిన విషయం తెలిసినదే. అన్ని రంగాలలో ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పరిశోధక రంగం నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది. దాని పర్యవసానమే ఇది. సామాజిక శాస్త్రాల పరిశోధనను నిరుత్సాహపరిచేందుకు ఈ చర్య అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సైన్సు పరిశోధనల పరిస్ధితి కూడా ఇంతే. పరిశోధనా రంగంవైపు యువత మొగ్గు చూపకపోవటమే ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదన్న విషయాన్ని వెల్లడిస్తోంది.