Tags

, , , , ,

ఎంకెఆర్‌

     ఈనెల రెండున జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్ధ ఎన్నికలు అటు ఘన విజయం సాధించిన అధికార పార్టీని, ఇటు ఘోరపరాజయం పాలైన తెలుగుదేశం-బిజెపి కూటమి, కాంగ్రెస్‌ను ఆశ్చర్యంలో ముంచాయంటే అతిశయోక్తి కాదు. మూడు జిల్లాల పరిధిలోని 150 వార్డులకు గాను తెలంగాణా రాష్ట్రసమితి 99,  కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లాలోని నాచారం స్ధానంతో సరిపెట్టుకొని హైదరాబాదు జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక అసలైన పరాజయం గౌరవ ప్రద స్ధానంలో వుంటామని కలలు కన్న తెలుగుదేశం-బిజెపి కూటమిది. తెలుగు దేశం పార్టీ రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్టు స్థానాన్ని గెలుచుకొని ఎట్టకేలకు ప్రాతినిధ్యం సాధించింది, బిజెపి నాలుగు స్ధానాలు తెచ్చుకుంది.మజ్లీస్ 44 తెచ్చుకుంది

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధాని స్ధానిక ఎన్నికలలో పాల్గొనటం, ఘోరంగా ఓడిపోవటం మన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో.ఆ ఖ్యాతి ఎన్‌ చంద్రబాబు నాయుడికి దక్కింది. మరొకరెవరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా హెచ్చరికలు చేసింది. హైదరాబాదు ఎన్నికలలో తాము 99 స్ధానాలను గెలుచుకుంటామని అసలు తెలంగణా రాష్ట్ర సమితికే నమ్మకం లేదు.వుంటే ముందు జాగ్రత్త చర్యగా కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేసి ఎంఎల్‌సీల ఓట్లతో గద్దె నెక్కాలని చూసేది కాదు. దానిని కొట్టివేస్తామని కోర్టు సూచన ప్రాయంగా చెప్పటంతో ఎన్నికలు జరిగి-ఫలితాలు వెలువడే మధ్యలో ఒక అసాధారణ ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ తెచ్చి విమర్శలకు తావిచ్చింది. అయితే ఎంఎల్‌సి దొడ్డిదారితో నిమిత్తం లేకుండానే అప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నారని అది వూహించలేకపోయింది. ఏ మాత్రం పసిగట్టినా అపర ప్రజాస్వామికంగా వుండేది.

    విజయం సాధించింది కనుక చంద్రశేఖరరావు కోర్టు అభిప్రాయాన్ని మన్నించినట్లు ఆ ఆర్డినెన్సుకు కొత్త భాష్యం చెప్పారు. అంత మాత్రాన దానివెనుక వున్న దురాలోచన దాస్తే దాగేది కాదు. ఈ విజయం తెలంగాణా రాష్ట్రసమితిలో కొత్త పరిణామాలకు నాంది పలుకుతుంది. హైదరాబాద్‌ ఎన్నికలను చంద్రశేఖరరావు తనయుడు, మంత్రి కెటిఆర్‌ ఒక్కడే తన బాధ్యతగా ఎదుర్కొన్నారు. అదేదో యాదృచ్పికంగా జరిగిందంటే ఎవరూ నమ్మరు. ఎన్నికల స్క్రిప్టు, డైలాగులు, డైరెక్షన్‌ అంతా కెసిఆర్‌ వారసుడు ఎవరో స్పష్టం చేసేందుకే అన్నది సుస్పష్టం.ఈ విజయంతో తెరాసలో మిగిలిన మంత్రులు, ఇతరులు మరింతగా డమ్మీలుగా మారతారు. అధికారం మరింతగా కుటుంబపరంగా కేంద్రీకృతం అవుతుంది. అది వచ్చే ఎన్నికల నాటికి కొత్త సమస్యలకు నాంది పలుకుతుంది. అన్ని పాలక రాజకీయ పార్టీలలో జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేది ఇదే.

    ఒక వూరి మునసబు పక్క వూరికి వెట్టితో సమానం అన్నది ఒక సామెత.దీనిని వినయంతో ఎవరైనా గుర్తిస్తే పరువు నిలబడుతుంది. లేకుంటే చంద్రబాబు నాయుడి మాదిరి శృంగభంగం తప్పదు.కోటి మంది జనాభా వున్న హైదరాబాదు ఎన్నికలకు ప్రాధాన్యత లేదని ఎవరూ అనరు. స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే ప్రచారానికి దిగకుండా ఒక బహిరంగ సభ పెట్టి గౌరవ ప్రదంగా వ్యవహరించారు. ఒక వేళ ఓడిపోతే, తగినన్ని సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్లినా ఓడిపోయారంటారు. లేకపోతే సిఎం వచ్చి వుంటే విజయం దక్కేది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయం లేదా ఓటమిపై సంశయం కారణంగానే కెసిఆర్‌ ఈ విధంగా ప్రచారానికి దూరంగా వున్నారు. తన కొడుకును దించారు. ఓడిపోయినా ఇబ్బంది లేదు, గెలిస్తే చెప్పక్కర లేదు. కానీ మిగతావారి పరిస్ధితి అది కాదు.

   పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకంటే తెలుగుదేశంలో పలుకుబడిన నాయకుడిగా చక్రంతిప్పుతున్నారని కొందరంటే, రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నారని కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కుమారుడు నారా లోకేష్‌, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అంతటి పలుకుబడి కలిగిన మోడీ అంతరంగికులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు వంటి వారు ప్రచారం చేసినా , తమ కూటమి వారిని గెలిపించకపోతే కేంద్రం నుంచి నిధులు రావని బెదిరించినా పరాభవమే మిగిలింది. వారు చేసిన ప్రచారం ఓటర్లలో ఎంత వుత్సాహం నింపిందంటే తాము ఓటు వేయకపోయినా సరే తెలుగుదేశం-బిజెపి కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసంతో కాబోలు అసలు ఓటింగ్‌కే రాలేదు. కొన్ని పరిణామాలు మరికొన్నింటిని వేగవంతం చేస్తాయి. ఎక్కడో స్విచ్‌ వేస్తే ఎక్కడో లైటు వెలుగుతుంది.ఎన్నడూ ఓటింగ్‌కు రాని వారు కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో పనిగట్టుకొని వచ్చి హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో తెరాసకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. నగరం మరింతగా విస్తరిస్తోంది. పరిశ్రమలు పెరగటం లేదు,మూతపడుతున్నాయి, కొత్తగా వచ్చే వాటిలో వుపాధి తక్కువగా వుంటోంది. అసమానతలు తీవ్ర మౌతున్నాయి.నగరంలో పారిశుధ్యం, కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్య రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా కానుంది.వాటిని పరిష్కరించకుండా ఎక్కువ కాలం గడపలేరు.

     గతంతో పోలిస్తే తాను మారానని చెబుతూ చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదే పదే జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆయనలో ఎలాంటి మార్పూ లేదని ఎన్నికైన తరువాత ప్రతి చర్య ద్వారా జనాలలో గట్టి విశ్వాసం కల్పించేందుకు ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో హైదరాబాడు నగర ఎన్నికలలో తెలుగుదేశం, దానితో జతకట్టిన బిజెపి ఓడిపోవటం పార్టీల కన్నా చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా కలిగిన ఘోరపరాభంగానే పరిగణించాలి. తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి. చంద్రబాబు నాయుడు తనను తానే నమ్మడని ప్రతీతి. అందుకని ఇతరులను నమ్మే పరిస్ధితి వుండదు. అలాంటి వ్యక్తి ఎండమావులను కూడా సునామీ వరదలని నమ్మించగల దిట్ట కావటం వలనే ప్రతి తరంలో ఎంతో కొంత మంది అపరచాణుక్యుడని నమ్ముతూ వుంటారు. మాటల ద్వారా మూతులు, డబ్బుతో చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాదులో అదే జరిగింది.

     తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ దుకాణం మూతపడటం గత ఎన్నికల మరుసటి రోజునుంచే ప్రారంభమైంది. అయినా అవకాశం లేని వారు, అనివార్యంగా ప్రతిపక్షంలో వుండాల్సిన వారు లేదా చంద్రబాబు చాణక్యం మీద అతి విశ్వాసం వున్నవారు గానీ మొత్తం మీద పార్టీలో మిగిలారు. ఇప్పుడు మిగిలిన పార్టీ కూడా ఎంత త్వరగా అంతరిస్తుందన్నదే సమస్య. దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ ఒకటికి మించి రెండు రాష్ట్రాలలో కొనసాగిన దాఖలా మనకు ఎక్కడా కనపడదు. బీహార్‌, వుత్తర ప్రదేశ్‌లను చీల్చి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన తరువాత సమాజవాది పార్టీ యుపికి, ఆర్‌జెడి బీహార్‌కు పరిమితం అయ్యాయి తప్ప రెండోచోట లేవు. తెలుగుదేశం పార్టీ అందుకు మినహాయింపు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఇంతటి పరాభవం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని వారు అసలు వూహించి వుండరు. ఎందుకంటే చంద్రబాబు మంత్రదండంపై నమ్మకం వున్నవారు ఇంకా గణనీయంగా వున్నారు. వారి సంఖ్యను హైదరాబాద్‌ ఎన్నికలు గణనీయంగా తగ్గిస్తాయి.

    హైదరాబాదు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడికి పోయేదేమీ లేదు, తీరని నష్టం బిజెపికి. మతోన్మాద అజెండా లేకుండా అది మనుగడ సాగించలేదు. ప్రస్తుతం హైదరాబాదులో అటువంటి పరిస్ధితులు లేవు. తెలుగుదేశం వంటి పార్టీతో అది సర్దుబాటు చేసుకోవాలంటే తాత్కాలికంగా అయినా అది మేకతోలు కప్పుకోవాలి. స్వంత ఎజండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది కనుక, ప్రతి ఎన్నికలో అది ఏదో ఒక పార్టీతో లోపాయికారీ వప్పందాలకు వస్తుండటంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. తెరాస స్వంతంగా మెజారిటీ తెచ్చుకున్నది కనుక మజ్లిస్‌ అప్రజాస్వామిక పోకడలను అడ్డుకొని హైదరాబాదు పాతబస్తీలో మార్పులకు శ్రీకారం చుడితే దానిని రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా హర్షిస్తారు.లేనట్లయితే మజ్లిస్‌ను చూపి బిజెపి, బిజెపిని చూపి మజ్లిస్‌ మత రాజకీయాలు చేస్తాయి. అది తెరాసకు రాజకీయంగా నష్టదాయకమే గాక, తెలంగాణాకు పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.

     కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని అవకాశ వాదానికి అటు వుమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌ జనమూ వ్యతిరేకించారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న చోటా అదే పరిస్ధితి కల్పించారు. వామపక్షాల విషయానికి వస్తే గతంలో వాటికి వున్నదీ లేదు ఇప్పుడు పోగొట్టుకున్నదీ లేదు. తమ నుంచి తమ జనం చేజారి పోయిన చోటే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాయి గనుక తిరిగి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనటానికి ఎలాంటి పద్దతులు అనుసరిస్తాయన్నది చూడాల్సి వుంది