Tags

, ,

ఎం కోటేశ్వరరావు

    వడ్డీ రేట్ల తగ్గింపు గురించి మన దేశంలో ఇప్పటికీ పెద్ద చర్చే జరుగుతోంది. వడ్డీ రేట్లు తగ్గించండి మా తడాఖా ఏమిటో చూపుతామని పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు విధాన నిర్ణేతలను సవాలు చేస్తుంటారు.అది నిజమా ? అయితే జపాన్‌తో సహా అనేక ధనిక దేశాలు అసలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నప్పటికీ ఆ దేశాలు తీవ్ర ఆర్ధిక మాంద్యాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ప్రతికూల వడ్డీరేటు విధానాన్ని ఎందుకు అమలులోకి తెచ్చింది? ఆ దేశాలలోని ధనికులు ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడిదారులు బయటి దేశాలకు పెట్టుబడులు తరలించాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎక్కడకు తరలిస్తారు ?

    ఈనెల మొదటి వారంలో ప్రపంచ ధనిక దేశాలలో మూడవ స్ధానంలో వున్న జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(మన రిజర్వు బ్యాంకు వంటిది) వడ్డీ రేేటును మైనస్‌ 0.1శాతానికి తగ్గించింది. అంటే ఒక పుల్లయ్య అనే ఒక బ్యాంకు జపాన్‌ రిజర్వు బ్యాంకులో డిపాజిట్‌ రూపంలో డబ్బు దాచుకుంటే జపాన్‌ ఎలాంటి వడ్డీ చెల్లించకపోగా డబ్బు దాచుకున్నందుకు పుల్లయ్య నుంచే వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే ప్రతి కూల వడ్డీ అంటారు. ప్రస్తుతానికి అనేక దేశాలలో ఇది రిజర్వు బ్యాంకులు-వాణిజ్య బ్యాంకుల మధ్యలావాదేవీలకు పరిమితం అయినప్పటికీ రాబోయే రోజుల్లో మదుపుదార్ల నుంచి కూడా ఇలాంటి ఎదురు వడ్డీ వసూలు చేసినా ఆశ్చర్యం లేదనే వ్యాఖ్యలు వెల్లడవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితి మన దేశంలో అర్ధం చేసుకోవటం కష్టం. అసలు ఇలాంటిది జరుగుతుందని అంటే నమ్మటం కూడా కష్టం. చైనాలో ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తున్న కారణంగా అంతర్గత ఆర్ధిక వ్యవస్ధ బలహీనపడుతున్నదని అందువలన అవసరమైతే ప్రతి కూల వడ్డీ రేటును మరింతగా పెంచాల్సి వస్తుందని కూడా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ హెచ్చరించింది. సరిగ్గా అంతకు ముందు ఎనిమిది రోజుల ముందు బ్యాంకు గవర్నర్‌ పార్లమెంట్‌కు నివేదిస్తూ ప్రతికూల వడ్డీ రేటు గురించి తీవ్రంగా పరిశీలించటం లేదని చెప్పిన పెద్ద మనిషి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

     జపాన్‌లో ప్రతికూల వడ్డీ రేటు ప్రకటన చేయగానే అమెరికా స్టాక్‌మార్కెట్‌లో సూచీలు పెరిగాయి. జపాన్‌ ఈ చర్య తీసుకున్నదంటే నాల్గవ ఆర్ధిక త్రైమాసికంలో దాదాపు స్ధంభనలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కొనసాగుతున్న పూర్వరంగంలో మార్చి నెల వరకు తమ దేశ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచ (మార్చ)బోదని స్పెక్యులేటర్లు అంచనాకు వచ్చారు.అంతే కాదు ఐరోపా యూనియన్‌లో కూడా వడ్డీ రేటును తగ్గించారు. ప్రపంచంలో ఇటు వంటి స్ధితి ఏర్పడటం గతంలో ఎన్నడూ సంభవించలేదని, 2008లో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం మరింత తీవ్రం అవుతున్నదనటానికి ఇదొక సూచిక అని కొందరు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల వడ్డీ రేటు నిర్ణయం జపాన్‌లో అంత తేలికగా జరగలేదు. బ్యాంకు బోర్టులోని తొమ్మిది మంది డైరెక్టర్లలో విబేధాలు రావటంతో ఓటింగ్‌ జరిగి 5-4 ఓట్లతో తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ చర్య ఫలితాలను ఇవ్వదనే అభిప్రాయం కూడా బలంగా వున్నదన్నది స్పష్టం. ఇప్పటికే జపాన్‌ వంటి ధనిక దేశాల ప్రభుత్వాలు ద్రవ్య పెట్టుబడిదారుల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకొని కార్పొరేట్‌ కంపెనీలకు దాదాపు వుచితంగా రుణాలు ఇస్తున్నాయి. అయినా ఫలితం వుండటం లేదు ఎగుమతులు పెద్దగా పెరగటం లేదు. ఈ స్ధితిలో ప్రపంచంలోనే అధిక మొత్తంలో వున్న ప్రభుత్వ అప్పును తగ్గించాలంటే బ్యాంకుల వడ్డీ రేట్లతో పాటు ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లను తగ్గించి నిరుత్సాహపరచాలని కొందరు సాంప్రదాయ ఆర్ధిక వేత్తలు ప్రతిపాదిస్తున్నారు.

      జపాన్‌లో కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా వాణిజ్య బ్యాంకు అక్కడి సెంట్రల్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలంటే 0.1శాతం ఎదురు వడ్డీ చెల్లించాలి. ఇది గతంలో చేసిన డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. అంటే ఏమిటి మీరు మీ డిపాజిట్లను వెనక్కు తీసుకోండి అని చెప్పటమే. ఎందుకయ్యా ఇలాంటి చర్య తీసుకున్నారంటే అంతర్గతంగా మా పరిస్ధితి బానే వుంది, చమురు మార్కెట్లో ధరలు తగ్గటం, చైనా ఆర్ధిక వ్యవస్ధ మందగించటంతో ఈ చర్య తీసుకున్నామని బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ చెబుతోంది. నిజానికి జపాన్‌ పరిస్ధితి దిగజారుతోంది. పారిశ్రామిక వుత్పత్తి అంచనాలు దిగజారుతున్నాయి, ఏడాది క్రితంతో పోల్చితే 0.3శాతం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తే 0.2శాతం జనవరిలో పెరిగాయి. ఇదే ఏడాది క్రితంతో పోల్చితే గృహస్తులు చేసే ఖర్చు 2.2 శాతం తగ్గుతుందని మార్కెట్‌ అంచనా వేస్తే డిసెంబరులో 4.4శాతం తగ్గింది. వరుసగా నాలుగు నెలల నుంచి తగ్గుతూనే వుంది. ఒకవైపు ఈ చర్య తీసుకున్నప్పటికీ మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ కార్పొరేట్లను ఆదుకొనేందుకు ఆస్తుల కొనుగోలు కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఈ చర్య స్పెక్యులేషన్‌ పెరుగుదలకు దారితీస్తుంది.

       ఐరోపాలో కూడా సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో కారుచౌకగా డబ్బు దొరకనుందని అమెరికా మార్కెట్‌ పండుగ చేసుకోంటోంది. డిసెంబరు నెలలో 0.25 వడ్డీ రేటు పెంచినందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వు చర్యను అనేక మంది తప్పు పడుతున్నారు.అయితే ఎదురు వడ్డీ రేటు విధానం వలన కలిగే లాభాల కంటే జరిగే నష్టమే ఎక్కువని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల వడ్డీ రేటు విధానాన్ని ప్రవేశ పెట్టటానికి అన్ని దేశాలకూ కారణాలు ఒకటిగానే వుంటున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గింపు ప్రధాన అంశం. విదేశాల నుంచి పెట్టుబడులు ప్రవేశించకుండా చూసేందుకు స్విడ్జర్లాండ్‌ ప్రతికూల వడ్డీ రేటు పద్దతిని ఎంచుకుంది.దీని వలన స్విస్‌ కరెన్సీ విలువ పడిపోతుంది. కరెన్సీ విలువ పడిపోతే ఎగుమతిదారులు సంతోషిస్తారు, దిగుమతి ఖర్చు పెరగటంతో దిగుమతిదారులు విచారిస్తారు.(ఈ కారణంతోనే మన రూపాయి విలువ పతనమౌతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందన్నది దిగుమతి దార్ల విమర్శ అయితే , ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వమే విలువ తగ్గింపు చర్యలకు పాల్పడుతోందని ఎగుమతిదార్ల సంతోషం). అయితే ఈ సాధారణ సూత్రం అన్ని సందర్బాలలో అన్ని దేశాలకూ వర్తించదని అనేక అనుభవాలు వెల్లడించాయి. మన దేశమే అందుకు వుదాహరణ. మనరూపాయివిలువ పతనంతో పాటు మన ఎగుమతులూ పతనమౌతున్నాయి. తన ఎగుమతులు ఖరీదైనవిగా మారినప్పటికీ అమెరికా తన డాలరు విలువ తగ్గకుండా చూస్తోంది. అయితే ఇతర ధనిక దేశాలన్నీ ప్రతికూల వడ్డీ రేటు విధానాలను అమలు జరిపితే అమెరికాపై కూడా ఆ వత్తిడి పెరుగుతుంది. ఒక ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమైన తరువాతే తెగింపుతో ప్రతికూల వడ్డీ రేటు విధానాన్ని అమలు జరుపుతారన్నది ఒక అభిప్రాయం. ఈ పద్దతి వర్తమాన తరాలకు కొత్తగా కనిపించినా గతంలో మరో రూపంలో ఈ ప్రతిపాదన వచ్చింది. జర్మన్‌ ఆర్ధిక వేత్త సిల్వియో గీసెల్‌(1862-1930) కరెన్సీ నోట్లు విలువను కోల్పోయినపుడు పోస్టాఫీసుల్లో వాటి విలువ ఎంతో ప్రతినెలా నోట్లపై ముద్ర వేయించాలని ప్రతిపాదించాడు. అందుకు గాను కొంత చార్జీ వసూలు చేయాలని పేర్కొన్నాడు. దాన్నే స్టాంపడ్‌ మనీ అన్నారు.అయితే ఇది ఆచరణలో సాధ్యం కానప్పటికీ అది మంచి సూచనే అని ఆర్ధికవేత్త జాన్‌మేనార్డ్‌ కీన్స్‌ తనపుస్తకంలో ప్రస్తావించారు.

    ప్రతి కూల వడ్డీ రేట్లు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీస్తాయని, ఆర్ధిక అస్థిరతకు దారితీస్తాయని కొందరు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమలులో వున్న చర వడ్డీ రేట్ల ఒప్పందాలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పెట్టుబడిదారీ ప్రపంచంలో పెరుగుతున్న సమస్యలకు, వాటిని పరిష్కరించటంలో వైఫల్యానికి ఈ పరిణామం దర్పణం.