Tags

, ,

సత్య

     ‘తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి.’ అని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పర్యవసానాల గురించిన వ్యాఖ్యలో పేర్కొన్నాను. జనమే కాదు, తెలుగుదేశం నేతలు కూడా అదే నిర్ధారణకు వచ్చారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలుగుదేశంలో ఇంకే మాత్రం కొనసాగినా తమకు భవిష్యత్‌ లేదని ఇంతకాలం దాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన వారంతా భావిస్తున్నారు. అందుకే తట్టాబుట్టా సర్ధుకుంటున్నారు. ఇంకా మేయర్‌ ఎన్నికలు జరగక ముందే ఏకంగా తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెరాస కారు ఎక్కేశారు. తిమ్మినిబమ్మిని చేయటంలో, చాణక్య నీతిని ప్రదర్శించటంలో తెలుగుదేశం నేతలు తిరుగులేని చంద్రబాబు నాయుడిని చూసి ఎంతో నేర్చుకొని ఆయనకే పాఠాలు చెబుతున్నారంటే అతిశయోక్తికాదు. పార్టీలు మారటం సాకులు చెప్పటం ఇప్పుడు ఎంత సులభమైందో. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరవచ్చు. అందుకు మారేవారికే కాదు, చేర్చుకొనే వారికి కూడా సిగ్గు ఎగ్గులు లేవు.ఎక్కడ ఎలా కట్టిందా అని కాదు మా దొడ్లో ఈనిందా లేదా అన్నదే ప్రాతిపదిక. ఇంతకాలం కాంగ్రెస్‌లో వున్నా తెలుగుదేశంలో వున్నా వారు జ నానికి చెప్పిందేమిటి తమ నియోజకవర్గాలను, ప్రజలను తామెంతో అభివృద్ధి చేశామనే కదా ! అలాంటి వారు పార్టీ మారటానికి చెబుతున్న తొలిసాకు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు తీర్చటం కోసమే అని కదా చెబుతోంది. ఎంత ఆత్మవంచన. అయినా సరే జనం అలాంటి వారికి పట్టం కడుతున్నారు. ఇదింకా సామూహిక ఆత్మవంచన.

     హైదరాబాదు ఎన్నికలలో అనూహ్యంగా మట్టి కరచిన తెలుగుదేశం నేతలు కింద పడ్డా మాదే పైచేయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో తమకు హైదరాబాదులో లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చెబుతున్నారు. ఇంకా నయం గత ఎన్నికల కంటే నా వయస్సు ఐదేళ్లు పెరిగింది అని చెప్పలా. తాను తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడానని ఇంకెవరూ పార్టీ నుంచి బయటకు పోరని చెప్పిన మాటలు ఇంకా టీవీలలో మోగుతుండగానే ఏకంగా పార్టీ శాసనసభా పక్షనేతే ఫిరాయించటాన్ని లోకేష్‌ బాబు పసిగట్టలేకపోయారు. ఒకే ఒక్కడు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడెందుకు అంటే దానికి కారణాలు చెప్పకుండా తాము వేసిన ఎత్తుగడలో తెరాస చిక్కుకు పోయి జనానికి అమలు జరపలేని 60వేల కోట్ల రూపాయల వాగ్దానాలు చేసిందని లోకేష్‌ చంకలు కొట్టుకుంటున్నారు. అదీ ఎక్కడా ? విజయవాడ నడి గడ్డ మీద ! అమరావతితో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా మారుస్తానని వాగ్దానం చేసిన చోట. కాపులకు రిజర్వేషన్లు, రైతులతో సహా అన్ని తరగతుల రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం, బాబొస్తే ఇంటికో జాబు ఇలా ఎన్నిలక్షల కోట్లో తెలియని వాగ్దానాలను తెలుగుదేశం ఎవరి వలలో చిక్కుకొని చేసినట్లో లోకేష్‌ చెప్పగలరా ? తెరాస అమలు జరపలేని వాగ్దానాలు చేసి ఇరుక్కు పోయిందని సంతోష పడుతున్న లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో తాను, తన తండ్రి చేసిన వాగ్దానాలతో ముందుంది ముసళ్ల పండుగ అని గుర్తించినట్లు లేదు. తెలంగాణాలో తగిలిన ఎదురు దెబ్బలతో జనం దృష్టిని మరల్చటానికి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించటానికి తెలుగుదేశం ప్రయత్నించవచ్చు. ఈ రోజుల్లో అత్యంత సులభమైన చౌకబారు వ్యవహారమది. కోట్ల రూపాయలలో పెట్టుబడి పెట్టి ఎన్నికలలో గెలిచిన వారు వాటితో పాటు లాభాలను కూడా రాబట్టుకొనేందుకు అధికారం ఎక్కడ వుంటే అక్కడ చేరతారు. అందులో తెలియనిదేముంది?

     చంద్రబాబు నాయుడు డబ్బుతో కూడుకున్న వాగ్దానాలు అమలు జరపకుండా కాలక్షేపం చేస్తున్నారంటే కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం చేసిన కాపురిజర్వేషన్ల వాగ్దానం వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడేదేముంది. అయినా ఇరవై నెలల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక కమిషన్‌ వేసి ఏడు నెలలు, తొమ్మిది నెలల్లోనో ఫలితం చూపాలని హడావుడి చేస్తున్నారు. ఇది కొత్త సమస్యలు, సమీకరణాలకు దారి తీయటం అనివార్యంగా కనిపిస్తోంది. ఆ గందరగోళం కారణంగానే బుర్ర ఖరాబై గత వారంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అని పిస్తోంది.

     అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణాలో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్‌ కృష్ణయ్య అని చంద్రబాబు నాయుడు ప్రకటించి వెనుకబడిన తరగతులలో ఒక బలమైన తరగతి ఓట్ల కోసం గాలం వేశారు. ఎవరినైనా వాడుకో, వుపయోగించుకో, అవసరం తీరిన తరువాత వదిలెయ్‌ అన్న ఆధునిక నీతి చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్యను కనీసం శాసనసభా పక్ష నేతగా కూడా చేయలేదు. గత ఎన్నికలలో ఎల్‌బి నగర్‌ నియోజకవర్గంలో కృష్ణయ్యను నిలిపిన కారణంగా అపుడు తమకు రావాల్సిన మెజారిటీ తగ్గిపోయిందని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో అక్కడ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానమైనా దక్కించుకోలేకపోయిన తరువాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. బోడిగుండుకు మోకాలికీ ముడి పెట్టటం అంటే ఇదే. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేత చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం అంటే మున్సిపల్‌ ఎన్నికలు ఆయన బుర్రను ఎంతగా ఆందోళనకు గురిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీలలో ఎవరూ పుట్టాలని కోరుకోరు అని ఒక అసందర్భ ప్రేలాపన దాని పర్యవసానమే.తనకు కుల పట్టింపులు లేవని చంద్రబాబు నాయుడు నమ్మబలుకుతారు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా అని తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీ చరిత్ర విప్పితే కులాన్ని వుపయోగించుకొని పైకి వచ్చిన పెద్ద మనుషులెవరో బహిరంగ రహస్యం. విశ్వవిద్యాలయాలలో కుల జాడ్యం అక్కడి నుంచే వ్యాపించిందన్నది దాచినా దాగని సత్యం .

     కుల రాజకీయాలు చేయటం, దాని వలన పొందేలబ్ది ఏమిటో ఈ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు తప్ప మిగతా పార్టీలన్నింటికీ వెన్నతో పెట్టిన విద్య.ఎవరు దీనికి కారకులు అని తర్కించుకోవటం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుల గురించి మాట్లాడుకోవటం వంటిదే. ఎవరు వాటి నుంచి బయట పడ్డారన్నదే నేడు గీటురాయిగా వుండాలి. రిజర్వేషన్లు సమస్యల పరిష్కారానికి మార్గాలు కావన్నది చరిత్ర చెబుతున్నది. అసలు ప్రభుత్వ రంగమే అంతరిస్తున్న తరువాత ప్రభుత్వ వుద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం అవుతున్నాయి. రిజర్వేషన్లు కుల నిర్మూలనకు ఒక మార్గంగా అంబేద్కర్‌ భావించారు. ఇప్పుడు ప్రయివేటీకరణ పర్యవసానంగా ప్రభుత్వ వుద్యోగాలు తగ్గిపోతూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు తగిన అభ్యర్ధులు లేని కారణంగా ఎస్‌సిఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెరుగుతున్నాయి. కొన్ని సందర్బాలలో వుద్యోగ ప్రకటనలు చేసినపుడు అవే ఎక్కువగా వుండటంతో మిగిలిన వారు అపార్ధం చేసుకోవటం కూడా జరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే రిజర్వేషన్ల పరిధిలోకి తమనుకూడా తీసుకురావాలని కొత్త వారు డిమాండ్‌ చేయటం, కొత్త వారిని తీసుకువచ్చి తమ అవకాశాలను దెబ్బతీయ వద్దని ఇప్పటికే రిజర్వుడు తరగతులుగా వున్నవారు ప్రతిఘటించటం దేశమంతటా జరుగుతోంది.ఏది సమర్ధనీయం ఏది కాదు కాదు అంటే తిరిగి చర్చ విత్తు ముందా చెట్టుముందా అన్నదగ్గరకు చేరుతోంది.

     అందరికీ విద్య, వుద్యోగ అవకాశాలు వుంటే ఇలాంటి సమస్యలు అంతగా ముందుకు రావు. మన దేశంలో ఈ సమస్యలతో పాటు ప్రపంచంలో ఎక్కడాలేని సామాజిక విభజన, వివక్ష సమస్యలు కూడా జనానికి తోడయ్యాయి. ముందుగా వర్గదోపిడీ అంతమైతే కుల సమస్య అంతరిస్తుందని కమ్యూనిస్టులు చాలా కాలంగా నమ్మారు. ముందు కుల సమస్య అంతరించిన తరువాతే వర్గ సమస్య సంగతి చూడాలని అంబేద్కరిస్టులు నమ్మారు. భారత్‌లో వున్న సంక్లిష్టతల కారణంగా రెండు వైఖరులను పునరాలోచించుకోవాల్సి వచ్చింది. వర్గ సమస్యలతో పాటు కుల వివక్ష సమస్యను కూడా తక్కువగా చూడరాదని కమ్యూనిస్టులు చాలా కాలం క్రితమే గుర్తించారు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో కుల వివక్ష వ్యతిరేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ సమస్యపై పని చేస్తున్నారు. తాము కలలు కన్న కుల నిర్మూలన ఇప్పట్లో జరిగేది కాదని అంబేద్కరిస్టులు అంతర్గతంగా ఆలోచిస్తున్నా అంగీకరించటానికి ముందుకు రావటం లేదు.ఈ వైఖరి అటు వర్గ, కుల నిర్మూలన పోరాటాలు రెండిండికీ హాని కలిగిస్తుందని గుర్తించటం అవసరం. ఎవరి అభిప్రాయాలు వారు కలిగి వుండవచ్చు, అదే సమయంలో ఎక్కడ ఏ సమస్య ముందుకు వస్తే దానిని, రెండు సమస్యలపై ఐక్యంగా పని చేయవచ్చు. కావాల్సింది చిత్త శుద్ధి.