Tags

, ,

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !