Tags

, , ,

మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో !

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని మీరు కాపాడండి-ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ మాట ఎక్కడో చూసినట్లు, విన్నట్లు వుంది కదూ ! చంద్రబాబు నాయుడు అనే గొప్ప సంస్క ర్త( ఇది నేను చెప్పింది కాదు, ఎవరూ ఎస్సీలుగా పుట్టాలనుకోరు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆయన ఒక సంస్కర్తలా అనుగ్రహ భాషణం చేశారని ఆయన మద్దతుదార్లు ఇచ్చిన టీకా తాత్పర్యంలో భాగం) తెలంగాణాలో మీరు పార్టీని కాపాడండి-పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన మాటలు వినగానే గుర్తుకు వచ్చాయి. తీరా చూస్తే అనేక చోట్ల గోడల నిండా రాసి కూడా వున్నాయి. యుగ యుగాలుగా, తరతరాలుగా ఇలాంటి సంస్కర్తలు నాలుగు పాదాల నడిచిన ధర్మానికి ఇప్పుడు అసలు ఒక పాదం అయినా వుందో లేదో తెలియకుండా చేశారు. అదీ ధర్మాన్ని రక్షించే పేరుతోనే సుమా ! అయినా ధర్మం తనను తాను కాపాడుకోలేక పోవటమే కాదు ధర్మంగా వున్న వారిని కూడా కాపాడలేకపోయిందని ప్రతి యుగంలో, తరంలో ఏ రంగంలో చూసినా మనకు తెలుస్తూనే వుంది.

      అలాంటిది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎలా కాపాడగలుగుతారు? ఆయన కుమారుడు లోకేష్‌ అంటే పుట్టుకతో తెలుగుదేశం కనుక సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక అర్హత వుంది.అయితే తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాత భూమ్మీదకు వచ్చిన లోకేష్‌ అంతకు ముందే పార్టీలోకి వచ్చిన నేతల కంటే ఎక్కడలేని అధికారం ఎలా చెలాయిస్తున్నట్లు అంటే సమాధానం కష్టం.(మన అదృష్టం కొద్దీ లోకేష్‌ ఇంకా సిద్ధాంతాల గురించి వాటి పవిత్రత, కాపాడటం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే కొంత మంది అవతార పురుషులు, కారణ జన్ములు అవసరం వచ్చినపుడే నోరు విప్పుతారు మరి ! చంద్రబాబు నాయుడు పుట్టింది కాంగ్రెస్‌లో పెరిగింది కాంగ్రెస్‌లో, తొలి మంత్రి పదవి వెలగబెట్టింది కాంగ్రెస్‌లో కనుక ఆయన నీతి సూత్రాల గురించి మాట్లాడటం వినేవారికి కాస్త ఇబ్బందే. తెలుగుదేశం హైదరాబాదులో సరిగ్గా పనిచేయని కారణంగానే నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. నిజమే, నారా లోకేషే అన్నీ అయి పని చేశారు అన్నది అందరికీ తెలిసిందే.

     మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో ! ఏకంగా శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించిన తరువాత జరిగిన సంతాపసభలో (పోయిన వారికి అని వక్తలు చెప్పినప్పటికీ మిగిలి వున్న వారికి ధైర్యం చెప్పిన సంతాపసభ అది అనటం బాగుంటుందేమో ) పాల్గొన్న నారాయణపేట(మహబూబ్‌ నగర్‌ జిల్లా) ఎంఎల్‌ఏ రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తన వంటి వారు హైదరాబాదు వచ్చి వెళితే శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరీక్షల అవసరం లేకుండా చేసుకొనేందుకు కాబోలు అలా మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే ఏం జరిగింది. సమావేశానికి పసుపు సైకిల్‌పై వచ్చి వెళ్లేటపుడు గులాబీ కారులో వెళ్లారు. అందరికీ ఎడాపెడా శరీరాన్ని కోసి ఆపరేషన్లు చేసే వైద్యుడు తన కాలుకు ముల్లు గుచ్చుకోగానే విలవిల్లాడి పోతాడట. పాపం చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువే బాధపడి వుంటారు.ఎందుకుంటే ఆకర్ష… ఆకర్ష అని నిత్యం ఏదో ఒక పార్టీలోని వారికి గాలం వేసే వారు తన గేలానికి చిక్కిన చేపలే తప్పించుకుపోతుంటే నిజంగా ఎంత బాధగా వుంటుందో కదా ! అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన కంటే ఎక్కువగా వీరాభిమానులు విలవిలాడి పోతున్నారు. ఆ క్రమంలో తమ నాయకుడికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చూడకుండా తెగ సుభాషితాలు చెబుతున్నారు. అలాంటి వాటిలో కొన్ని ఆణి ముత్యాలు ఇలా వున్నాయి. ‘పార్టీ మారటానికి ఒక విధానమంటూ వుంటుంది. మరీ ఇంత నిర్లజ్జగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది. ఎర్రబెల్లి దయాకరరావు ప్రభృతుల జంపింగ్‌ పట్ల ప్రజలెవ్వరూ ఆశ్చర్యపోలేదు.అయితే, ఈ సందర్బంగా వారు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు మాత్రం ఔరా అనిపించేలా వున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనవి కావని, పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్‌తోనే ఆ విమర్శలు చేశానని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పటం మాత్రం రోతగా వుంది.’అని ఒక పత్రికా వ్యాఖ్యాత వాపోయారు.

     గతంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటానికి ఏ విధానాన్ని అనుసరించింది? ఏ లజ్జ ప్రకారం వచ్చిన వారు వచ్చారు, చేర్చుకున్నవారు ముద్ర వేశారు. మామూలుగా పార్టీ మారితే ఎవరు గుర్తిస్తారు, ఏ ప్రచార సాధనాలు పట్టించుకుంటాయి.ఇప్పుడు దేనికైనా ఒక కిక్కు కావాలి.అదే జరుగుతోంది. ఒక మహానటుడు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఎందరో రాజకీయ మహానటులు చేరారు. అందువలన అక్కడ జరిగేది కూడా అంతా నాటకీయమే, సినిమా ఫక్కీనే .తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేరితే ఒక పద్దతి వున్నట్లు ఆ పార్టీ నుంచి బయటకుపోతే లజ్జలేనట్లా ?

    పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లి దయాకరరావు తాను టిఆర్‌ఎస్‌ నాయకత్వం గురించి అనుచితంగా మాట్లాడి వుంటే క్షమించాలని అదంతా అధినేత డైరెక్షన్‌ ప్రకారమే జరిగిందని చెప్పటంపై అభ్యంతరం ఎందుకు ? అసలు అలా మాట్లాడని వారెవరు? పార్టీ ఫిరాయించిన తరువాత అలా చెప్పని వారెవరు? ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి గనుక చంద్రబాబు నాయుడినే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో చంద్రబాబు నాయుడు తొలి ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ఎన్టీరామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారో కావాలంటే పాత పత్రికలు తిరగవేసుకోవచ్చు. ఎందుకు చేసినట్లు ? ఏ గూటి చిలక ఆగూటి పలుకులు పలికినట్లు అదే చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన తరువాత కాంగ్రెస్‌ పార్టీని తిట్టని తిట్టు , చేయని విమర్శ వుందా ? ఎవరి డైరెక్షన్‌ ప్రకారం అదంతా జరిగింది? మైసూరా రెడ్డి కాంగ్రెస్‌లో వున్నపుడు విద్యుత్‌ చార్జీల వుద్యమం సందర్బంగా తెలుగుదేశం నాయకత్వంపై చేసిన విమర్శలేమిటి ? తరువాత అదే పెద్దమనిషి తెలుగుదేశంలో చేరినపుడు చెప్పిన మాటలు తియ్యగా అని పించలేదా ? అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యులుగా వున్నవారు, పార్టీలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు,ఎంపీలుగా వున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు ? పూర్వపు పార్టీలలో వున్నపుడు చేసిన విమర్శలు తెలుగుదేశంలో చేరి తిరిగి తమ పాత పార్టీలపై చేస్తున్న విమర్శలు రోతగా అనిపించటం లేదా ? అంతెందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నూతన శాసనసభా పక్ష నాయకుడిగా నియమితుడైన రేవంత రెడ్డి ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్న పెద్ద మనిషే కదా ! అప్పుడు ఇతర పార్టీలను ఎందుకు తిట్టావంటే నాయకత్వ డైరెక్షన్‌ అనో పార్టీ విధానమనో గాక కొత్తగా ఇప్పుడేమి చెబుతారు ?

     ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలివున్న నేతలు, ఎంఎల్‌ఏలు కూడా ఆ పార్టీలో ఎంత కాలం వుంటారనేది ఒక ప్రశ్న. రేపు టిఆర్‌ఎస్‌తో రేవంత రెడ్డి సర్దుబాటుకు రారన్న గ్యారంటీ ఏమన్నా వుందా ? ఒకప్పుడు సిపిఎంలో వున్న సండ్రవెంకట వీరయ్య తెలుగుదేశంలోకి వెళ్లగలిగినపుడు మరో పార్టీలోకి వెళ్లటానికి అభ్యంతరం ఏముంటుంది? డొల్లుపుచ్చకాయలకు ఒక మార్గం, ఒక పద్దతి ఏముంటుంది?ఎటయినా దొర్లుతారు . ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన రేవంత రెడ్డి, ఇతరులు రేపు పార్టీ ఫిరాయించి దయాకరరావు మాదిరే తాము నాయకత్వ డైరెక్షన్‌ మేరకే ఆలా చేశాం, డబ్బు కూడా వారే సమకూర్చారు తప్ప మావరకు మేము పరిశుద్ధులమే అని అప్రూవర్‌లుగా మారరని గ్యారంటీ ఏముంది? తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలిగా రోజా కాంగ్రెస్‌ పార్టీని ఎలా తిట్టిందో తెలిసిందే. రేపు తిరిగి ఆమె మరో శుభముహూర్తాన స్వంత ఇంటికి రారని, వస్తే తిరస్కరిస్తారన్న గ్యారంటీ ఏమైనా వుందా ? నిత్యం వైఎస్‌ఆర్‌సిపి ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు దేశం వారు తిట్టిన తిట్లు లేదా మర్యాదస్తుల భాషలో చెప్పాలంటే విమర్శలను పట్టించుకుంటుందా ? ఎందుకీ ఆత్మవంచన ?