Tags

, , , , , , , ,

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.