ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ? అని నేను రాసిన అంశంపై వచ్చిన విమర్శల సారాంశం ఏమంటే ఒకటి పూర్తిగా ‘ఎడమవైపు’నుంచే రాశారు, మావోయిజాన్ని విశ్వసించే డిఎస్‌యు అనే విద్యార్ధి సంస్ధ కాశ్మీరీ వేర్పాటు వాదులకు సానుభూతిగా సభ ఏర్పాటు చేయటం నిజమే కదా , అక్కడ జాతి వ్యతిరేక నినాదాలు చేశారు కదా అంటే దానర్ధం వారు కూడా మద్దతు ఇచ్చినట్లే అలాంటపుడు వారిపై చర్య తీసుకుంటే తప్పేమిటి అన్నది ఒక సమర్ధన. ఇవే కాదు, ఇంకా ఎవరైనా చేసే విమర్శలకు ఆహ్వానం. మన దేశంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తర్క శాస్త్రాన్ని (వాద విద్య) అభివృద్ధి చేసిన వారిలో గౌతముడు ఒకరు.ఈ గౌతముడు పురాణాలలో కనిపించే సప్త రుషులలో ఒకరు గానీ, గౌతమ బుద్దుడు గానీ కాదని గమనించాలి. వేదాలు, వుపనిషత్తులు మొదలైన వాటిని చార్వాకులు, లోకాయతుల వంటి ఆది భౌతికవాదులు ప్రశ్నించటం ప్రారంభించినపుడు వాటికి సమర్ధనగా రూపొందించినదే తర్కశాస్త్రమని ఒక అభిప్రాయం. దానితో ఎవరైనా విబేధించవచ్చు అది వేరే విషయం. శంకరాచార్యుడి చివరి దినాలలో తమకేదైనా వుపదేశం చెయ్యమని శిష్యులు అడిగినపుడు చెప్పిన అనేక అంశాలలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి రంధ్రాన్వేషణ చేయకుండా తర్కబద్దమైన సమాధానం చెప్పాలని వుపదేశించినట్లుగా రాశారు. అందువలన అటువంటి చర్చలు ఎన్నయినా జరపవచ్చు. ఇందుకు ‘కుడి,ఎడమ’లు ఎవరికీ మినహాయింపు కాదు. ఇది మా విశ్వాసం, తర్కానికి, న్యాయశాస్త్రానికి అతీతం అందువలన దీనిపై తర్కించేదేమీ లేదు, మేము చెప్పింది వినాలి తప్ప మరొకటి కాదు, మరీ కాదంటే తంతాం, చంపుతాం అంటే కుదురుతుందా ? సహించాలా ?
దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ను బుధవారం నాడు పాటియాల కోర్టుకు హాజరు పరిచే సమయంలో అతనిపై లాయర్ల ముసుగులో వున్న వ్యక్తులు గూండాల మాదిరి దాడి చేయటం లోకమంతా చూసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు అది తోపులాటలా కనిపించింది కనుక ఆయనకు వైద్య పరీక్షలు చేయటం అవసరం. వారు లాయర్లా లేక నల్లకోట్లు వేసుకొని వచ్చిన సంఘపరివార్ కార్యకర్తలా లేక లాయర్లలో వున్న దేశభక్తులైన సంఘపరివార్ కార్యకర్తలా అన్నది దాచినా దాగదు. వారు ప్రవర్తించిన తీరు గురించి ప్రత్యక్షంగా చూసిన మరొక లాయర్ చెప్పిన కధనాన్ని ఫిబ్రవరి 18వ తేదీ పత్రికలో హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. అదేమీ కమ్యూనిస్టుల లేదా అభ్యుదయ వాదుల పత్రిక కాదు. ఆ లాయర్ పేరు రాస్తే ఆయన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అని పేరు రాయలేదు. దీన్ని ఎవరైనా కట్టుకధ అంటే చేసేదేమీ లేదు. ఫాసిస్టుశక్తులు, ఫాసిజం లక్షణాలు తప్ప ఇవి మరొకటి కాదు.
‘ బుధవారం నాడు వృత్తి చేస్తున్న ఒక లాయర్‌గా నా ప్రస్తానంలో అత్యంత ఆందోళనకరమైన వుదంతాన్ని చూశాను.అది సాయంత్రం ఒంటి గంట సమయం. పాటియాలా కోర్టుల ప్రాంగణంలో కన్నయ్య కుమార్‌ను చూసేందుకు రెండవ నంబరు గేటు దగ్గర వందలాది మంది లాయర్లు గుమికూడారు.పరిమితమైన సంఖ్యలో మాత్రమే కోర్టు లోపలికి అనుమతించనున్నట్లు ఒక పోలీసు ప్రకటన చేశాడు.అప్పుడు అంతా ప్రారంభమైంది. అందరు జర్నలిస్టులు మరియు జెఎన్‌యు విద్యార్ధులను బయటకు పంపాలని లాయర్లు డిమాండ్ చేయటానికి ఆ ప్రకటన ఒక సంకేతమైంది. కొంతమంది లాయర్ల బృందం బాల్కనీలో గుమికూడి వుంది. ఎవరైనా వీడియో తీస్తున్నారా అని వారు చూస్తున్నారు. ఆ తరువాత దేశభక్తి చర్యగా బాల్కనీ నుంచి ఒక లాయర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చాడు. అతని పక్కనే వున్న మరొక లాయర్ కన్నయ్యను తీసుకురానివ్వండి వాడిని సజీవ దహనం చేస్తాము అని అరిచాడు. పోలీసుల పక్కనే వున్న కొంత మంది లాయర్లు దానితో వుత్సాహపడ్డారు. వారిలోని ఒక లాయర్ సెల్‌ఫోన్ తీసి నువ్వు కూడా రా ఒకరిద్దరు జెఎన్‌యు విద్యార్ధులను బాదవచ్చు అని చెప్పాడు.
అది రెండున్నర గంటల సమయం. కన్నయ్య కుమార్ కోర్టు వద్దకు చేరాడు. అతనిని మరొక మార్గం ద్వారా లోపలికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసిన లాయర్లు వెంటనే ఆ గేటువైపు వెళ్లి కన్నయ్యపై దాడి చేశారు. ఆ తరువాత గర్వంతో తిరిగి వస్తున్న లాయర్లను నేను చూశాను. వారిలో ఒకరు నేను రెండుసార్లు తన్నాను, ముఖంపై కొట్టాను అని చెప్పాడు. మా నల్లకోట్లు మేము ఒక విద్యావంతులైన తరగతికి చెందిన వారమని వెల్లడించేందుకు వుద్దేశించినవి, కానీ కొంత మంది లాయర్లు బార్ ప్రతిష్టకు మచ్చతెచ్చారు.’ అని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. కావాలంటే అలాంటి వారు నల్ల కోట్లు తీసి వేసి కాషాయ దుస్తులతోనే గూండాయిజం చేయవచ్చు. అప్పుడు సమాజమే వారి సంగతి తేల్చుకుంటుంది. అలాగాక వారు కోర్టులో కన్నయ్యకు వ్యతిరేకంగా తమ వాద విద్య పటిమను ప్రదర్శించి వుంటే దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వారు నల్లకోట్లు వేసుకొని శంకరాచార్యుడి వుపదేశాలకు విరుద్ధంగా గూండాయిజానికి పాల్పడ్డారు.ఇలాంటి ‘కుడి’ వారి గురించి ఏమని చెప్పాలి?
మావోయిజాన్ని నమ్మే డిఎస్‌యు కాశ్మీర్ వేర్పాటు వాదులు, దేశద్రోహులతో కలసి సభ జరపటాన్ని ఎలా సమర్ధిస్తారన్నది. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. మావోయిజం అంటే దేశ వ్యతిరేకం కాదు. మార్క్స్-ఎంగెల్స్ రూపొందించిన దానిని మార్క్సిజం అని పిలిచారు. తరువాత దానిని రష్యాకు అనువర్తింపచేసి విప్లవాన్ని ముందుకు నడిపించిన లెనిన్ అనుభవాలను జోడించి తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అన్నారు. ఈ రెండింటినీ మేళవించి ఆసియాలో భిన్నమైన పరిస్ధితులున్న చైనాలో దోపిడీ వ్యవస్ధను కూలదోసేందుకు అక్కడి కమ్యూనిస్టుపార్టీ మావో నాయకత్వంలో అభివృద్ధి చేసిన విధానాన్ని మావోయిజం అన్నారు. అన్నింటినీ కలిపి మార్క్సిజం-లెనినిజం- మావోయిజాల అనుభవాలన్నింటినీ తీసుకొని ఆ తరువాత కాలంలో అనేక దేశాలలో కమ్యూనిస్టులు తమకు అనువైన విధానాలు, ఎత్తుగడలు రూపొందించుకుంటున్నారు.ఈ క్రమంలో భారత్‌లో కొందరు కమ్యూనిస్టులు స్వతంత్ర కార్యాచరణ, ఎత్తుగడలను విస్మరించి తాము చైనా పంధాలో విప్లవాన్ని తీసుకువస్తామని చెప్పేందుకు తమది మావోయిస్టు పంధా అని చెప్పటమే కాక మావోయే మా చైర్మన్ అన్నంత దుందుడుకు వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఐదు దశాబ్దాల నాటి చరిత్ర. ఆ వైఖరి విఫలం కావటమే కాక మావోయిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొనేవారు చీలికలు పీలికలై పోయారు. ప్రతి ఆందోళనను విప్లవ మార్గంవైపు మార్చాలనే మావో సూత్రీకరణకు తప్పుడు భాష్యం చెప్పి కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని సమర్ధించేవరకు వారు పయనించారు. దానితో సిపిఎం, సిపిఐ ఏకీభవించటం లేదు. అలాంటి వారిని సమర్ధించిన వుదంతం చరిత్రలో ఒక్కటంటే ఒక్కటీ లేదు. మరైతే సమస్య ఎక్కడ ?
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకవాదం నుంచి అన్ని రకాల భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేవారు వున్న ఒక విద్యా సంస్ధ. ఎవరికి వారు తమ భావజాలాన్ని విద్యార్ధులలో ప్రచారం చేసుకోవటానికి సభలు, సమావేశాలు పెట్టుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది. అందుకు అధికార యంత్రాంగం కూడా అనుమతిస్తోంది. కాశ్మీర్ సమస్య విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు అక్కడ సమస్యను మరింత క్లిష్టతరం గావించాయన్నది తిరుగులేని వాస్తవం. దానిమీద అనేక తరగతులలో భిన్న అభిప్రాయాలు వున్నాయి. వాటిని చర్చించేందుకు వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈనెల తొమ్మిదిన డిఎస్‌యు ఒక సభను ఏర్పాటు చేసింది. అదేమీ రహస్య సమావేశం కాదు, అధికార యంత్రాంగం కూడా అనుమతించింది. తీరా సభ జరగబోయే సమయంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారత విద్యార్ధి పరిషత్(ఎబివిపి) రంగంలోకి దిగి సభకు అనుమతివ్వటంపై అభ్యంతరం తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ వత్తిడికి వారు లొంగారు. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో అలాంటి సభలు జరపటానికి లేని అభ్యంతరం ఇప్పుడు పెడుతున్నారని ఈ విషయంలో సభ జరుపుకొనేందుకు తమకు మద్దతు తెలపాలని డిఎస్‌యు అక్కడ వున్న విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ వంటి సంఘాలను కోరారు తప్ప తమ భావజాలానికి మద్దతు ఇవ్వాలని వారు అడగలేదు. దాంతో అధికారులు సభ జరిగే ప్రాంతానికి కొంత మంది భద్రతా సిబ్బందిని పంపటంతో పాటు, మైకులు లేకుండా నిర్వహించుకోవాలని షరతు విధించారు. దానికి కూడా నిర్వాహకులు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన ఎబివిపి ఎలాగైనా సరే ఆ సభను జరగనివ్వకూడదని తన మద్దతుదార్లను సమీకరించింది.ఆ సమయంలో కన్నయ్యతో సహా అనేక విద్యార్ధి సంఘాలకు చెందిన వారూ , ఏ సంఘాలకూ చెందని వారూ, డిఎస్‌యు లేదా వారితో ఏకీభవించే ఇతర సంఘాలకు చెందిన వారు వున్నారు. వారిలో వుగ్రవాద సంస్ధలతో సంబంధం వున్న వారు కూడా వున్నారని ఆ వుదంతం తరువాత వెల్లడైంది. సభ నిర్వాహకులు, దానికి హాజరయ్యేందుకు బయటి నుంచి వచ్చిన వారిలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అంతే తప్ప కన్నయ్య లేదా ఎఎఫ్ఐ ఇతర సంఘాలకు చెందిన వారు కాశ్మీర్ వేర్పాటు వాద లేక పాక్అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేయలేదు. కొందరు చేసిన నినాదాలను సాకుగా తీసుకొని అక్కడి వామపక్ష విద్యార్ధి కార్యకర్తలను వేధించటానికి, విశ్వవిద్యాలయంలో వున్న భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నది స్పష్టం.
బయటి వ్యక్తులు లేదా అక్కడి కొంత మంది భారత వ్యతిరేక నినాదాలు చేసిన సమయంలో విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య మరికొందరు వున్న వీడియోలు తప్ప వ్యతిరేక నినాదాలు చేశారన్న సాక్ష్యాలు లేవు. తాము అ సమయంలో అక్కడ ఎందుకున్నదీ వారు స్పష్టం చెబుతున్నారు, లేరని బుకాయించటం లేదు. ఏబివిపి వత్తిడి, అభ్యంతరం పెట్టింది కనుక అధికారులు డిఎస్‌యు సభను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ రోజు డిఎస్‌యు సభను అడ్డుకున్న వారు రేపు తమ సభను మాత్రం అడ్డుకోరన్న గ్యారంటీ ఏముంది? అందువలన ఆ సంగతేదో ఇక్కడే,ఇప్పుడే తేల్చుకోవాలని ఇతర సంఘాల వారు కూడా అక్కడే వున్నారు. దీనికి దేశద్రోహం అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఎబిబివి ఆరోపణలను ఖండిస్తూ దేశభక్తి గురించి తాము ఎబివిపి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని కన్నయ్య చేసిన వుపన్యాసంలో కూడా విమర్శ తప్ప అభ్యంతరకర భాష, పదజాలం లేదు. అందువలన ఇప్పుడు జరుగుతున్న రచ్చ లేదా నిరసన, ఆందోళనలకు కారకులు ‘కుడి పక్షం’ తప్ప మరొకరు కాదు. అందుకే చివరికి ఎబివిపిలో కాస్త తర్కబద్దంగా ఆలోచిస్తున్నవారు కూడా దేశవ్యతిరేక నినాదాలు చేసిన వారిని తప్పుపడుతూనే చేయనివారి పట్ల అనుసరించిన వైఖరికి నిరసనగా ముగ్గురు ఎబివిపి కమిటీ నుంచి తప్పు కున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరించిన వైఖరితో తాము విబేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే వారు కూడా దేశద్రోహులను సమర్ధించినట్లా ?
కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో ఢిల్లీ పోలీసు నడుస్తున్నదనటానికి జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధుల గురించి ఎలాంటి నివేదిక ఇచ్చారో గురువారం నాటి పత్రికల్లో వచ్చింది. విద్యార్ధులు బీఫ్ పెట్టాలని కోరారని, కొందరు మహిషాసుర వర్ధంతి జరిపారని నివేదికలో ఆరోపించారంటే హిందూత్వ ఎలా తలకెక్కిందో అర్ధం అవుతోంది.అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ కనుసన్నలలో నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి ఏం చేసిందో దేశమంతా చూసింది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్ చూపిన కారణాలలో రాజభవన్ ఎదుట గోవధ చేశారని కూడాపేర్కొన్నారు. ప్రతిదానికీ ఆవు కధకు లంకె పెడుతున్నారు. అంటే ఎవరు ఏమి తినాలో ఎవరిని అభిమానించాలో,పూజించాలో కూడా మనువాదులు చెప్పినట్లు జరగాలా ? కేంద్రంలోని బిజెపి సర్కార్, వారిని నిత్యం సమీక్షించి, మార్గదర్శనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ సంఘపరివార్ దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి వివాదాస్పద, ఏకపక్షంగా తమ మతభావజాలాన్ని రుద్దే క్రమంలో తెగేదాగా లాగేందుకే నిర్ణయించుకున్నట్లు అనేక పరిణామాల సందర్బంగా అనుసరిస్తున్న వైఖరి వెల్లడిస్తోంది. అందుకే గతంలో పేర్కొన్నదే అయినప్పటికీ మరోసారి హిట్లర్ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్ మార్టిన్ నియోమిలర్ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని నేటి పరిస్ధితులకు మారిస్తే ఇలా వుంటుంది.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,
నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.
తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,
ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.
తరువాత మహిళల కోసం వచ్చారు,
ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.
ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,
నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.
తరువాత వారు దళితుల కోసం వచ్చారు,
వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.
తరువాత వారు బీసీల కోసం వచ్చారు,
నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.
చివరికి నా కోసం వచ్చారు,
అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.
చెన్నయ్ ఐఐటిలో,పూనా ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కలుబుర్గి, గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ల వుదంతాలలో ప్రజాస్వామిక వాదులు, భావప్రకటన స్వేచ్చను కోరుకొనే వారు, లౌకిక వాదులు తగినంతగా స్పందించి వుంటే ఇప్పుడు జెఎన్‌యు పరిణామాలు జరిగి వుండేవి కాదు. ఇప్పటి కైనా మేల్కొనకపోతే అన్ని జీవన రంగాలకు ఈ ధోరణి విస్తరిస్తుందని గమనించాలి.