Tags

, , ,

రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ?

ఎం కోటేశ్వరరావు

     సరైన దర్శకుడు, మాటల రచయిత లేకపోతే ఈ రోజుల్లో సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద హిట్‌కు బదులు ఫట్‌ అవుతున్నాయి. ఒక మహానటుడు పెట్టిన పార్టీకి ఈ రోజు సరైన దర్శకులు, పదునైన డైలాగులు రాసే మాటల రచయితలే కరవయ్యారా ? హత విధీ ఏమి ఖర్మ పట్టినది ? సమర్ధులైన నటులు రంగస్ధలం మీద వున్నపుడు తోటి నటీనటులు తమ డైలాగులు మరిచిపోతే దాన్ని కనిపించకుండా నాటకాన్ని రక్తి కట్టించిన ఎందరో నటుల గురించి మనకు తెలుసు. కానీ తెలుగు దేశం డ్రామాలో ఏ నటుడేం మాట్లాడుతున్నారో, దానికి అర్ధం తెలిసి పలుకుతున్నారా ? వెనుక నుంచి ప్రాంప్టింగ్‌ సరిగా లేక ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతున్నారా ?

     ఏమిటిది ? ఎన్ని ఇబ్బందులెదురైతే మాత్రం ఈ మాటలేమిటి ? రాజకీయాలు, విలువలు, ఫిరాయింపు నిరోధక చట్టం, ఫిరాయింపులు, నైతిక విలువలను పాటించాలను కొనే వారంతా రాజకీయాలకు పనికిరారని ఎప్పుడో తేలిపోయింది. అందువలన అ విలువల వలువలు విప్పిన వారు కూడా మరీ ఇంతగా బరితెగిస్తారా అని ఎవరైనా అనుకోవచ్చు. అధికార రాజకీయాలలో ఇలాంటివి సహజం. మహాను భావులు అయారాం గయారాంలు ఎప్పుడో వీటికి ప్రాతిపదిక వేశారు. అందుకే అలాంటి చర్చను రానివ్వకూడదని పాలకపార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకే వాటి గురించి ఎవరూ మాట్లాడరు.

     విషాద నాటకాలు, సినిమాలలో కూడా హాస్యాన్ని పండించే దృశ్యాలు వుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఏదైనా అకాల వైపరీత్యాలు సంభవించి ఏరులు వరదలై పారినపుడు ప్రాజెక్టుల గేట్లు తెరవండి అని ఆదేశించటం తెలుసు. కానీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు గేట్లు తెరవండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ మంత్రులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చదివేవారికి, వినే వారికి, చూసే వారికి బుర్రల్లేవనుకుంటేనే ఇలాంటి వార్తలను వండి వడ్డిస్తారు. అసలు తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వలసల నిరోధానికి తెరిచిన గేట్లను మూసిందెప్పుడు? అయినా ఈ వార్తలను ఖండించలేదు కనుక నిజమే అనుకోవాలి. ప్రతిదాన్నీ ఎక్కడ ఖండిస్తాం మా ముఖ్యమంత్రి ఆ మాట అన్నట్లు ఆధారాలున్నాయా అంటే ఎవరైనా ఏం చెబుతారు. మీడియాకు లీకులు ఇవ్వటంలో, అవసరమైనపుడు కధలు రాయించుకోవటంలో అందెవేసిన చేయి ఎవరిదో ఎవరికి తెలియనిది. 1950,60,70 దశకాలలో జనం సినిమాల గురించి ముఖ్యంగా పల్లెటూళ్లలో గుంపులు గుంపులుగా చెప్పుకొనే వారు. ఎవరైనా ఒక సినిమా చూసి వస్తే దానిలోని కథను సచిత్రంగా వర్ణిస్తుంటే అబ్బ ఎంత బాగా చెప్పిండు అన్నట్లుగా వినేవారు, సంతృప్తి చెందేవారు. ఇప్పుడు కూడా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్సు కూడా అంతకంటే గొప్పగా కధలు చెబుతున్నాయి. మంత్రివర్గ సమావేశాలలో సైతం పక్కనే కూర్చుని విన్నట్లు, స్వయంగా చూసినట్లు తమ ప్రతిభా పాటవాలను ఆ విలేకరులు ప్రదర్శిస్తున్నారు.అయితే ఫిరాయింపుల గురించి చంద్రబాబు నిజంగానే చెప్పి వుంటారనేందుకు ఆస్కారం వుంది. ఎందుకంటే తెలంగాణాలో తగిలిన షాక్‌ నుంచి ఇంకా ఆయన తేరుకోలేదు.అపర చాణుక్యుడనని తనకు తాను అనుకుంటారో లేదో తెలియదు గానీ తన మీద అనుయాయులకు వున్న అలాంటి విశ్వాసం తగ్గకుండా వుండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ! ఏ మాటకామాటే చెప్పుకోవాలి .చంద్రబాబు తన అనుయాయులకు కన్నుగీటటంలో ఆయన స్టైలే వేరు.

     చంద్రబాబు స్వయంగా చెప్పినట్లు తాను అభివృద్ధి చేసిన హైదరాబాదు నగరంలో పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లుగా తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానాన్ని గెలుచుకుంది. మావ తిట్టినందుకు కాదు తోడల్లుడు సానుభూతి పలికినందుకు ఎక్కడలేని బాధ అన్నట్లుగా తమకు ఒక్క సీటు రావటం కంటే తమదే పెద్ద పార్టీ అని బిజెపిని భాగస్వామిగా చేసుకొని పోటీ చేస్తే దానికి నాలుగు సీట్లు రావటం మరింత బాధ కలిగించింది. కంటి చూపు తప్ప నోట మాట రాలేదు. ఈ స్ధితిలో గోరుచుట్టు మీద రోకటి పోటు మాదిరి తెలంగాణాలో శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించటంతో వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జనం దృష్టి మళ్లించేందుకు తెలుగుదేశం నేతలకు చంద్రబాబు కన్నుగీటినట్లుగా వుంది. వెంటనే కొందరు మంత్రులు వైఎస్‌ఆర్‌ సిపి నుంచి తమ పార్టీలోకి ఫిరాయించే ఎంఎల్‌ఏల గురించి చెప్పి చంద్రబాబును ఓదార్చే యత్నం చేశారు. కారణాలేమయినా ఒకరిద్దరు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాం తప్ప పార్టీ మారేందుకు కాదని చెప్పారు.ఎంతో ఆశించి, ఏదో జరుగుతుందని భ్రమపడిన వారు ఇంతకాలం అధికారానికి దూరంగా వుండటమే విశేషం. చివరికి తమ నాయకుడి మాదిరి తాము కూడా ఐదు సంవత్సరాల పాటు ఓదార్పు యాత్రలతోనే కాలం గడపాలా అని కొందరిలో ఆలోచన రావటంలో ఆశ్చర్యం ఏముంది. అదేమి చిత్రమో ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ప్రోగ్రామ్‌లు వస్తున్నా వైఎస్‌ఆర్‌సిపి ఇంకా పాతబడిన ఓదార్పు యాత్రలనే కొనసాగిస్తున్నది.

     ఇంత జరుగుతున్న తరువాత తాను మాట్లాడకుండా వుంటే తన శిబిరంలోని వారు ఆందోళన పడరా మరి, దాంతో తాను తలచుకుంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొడతానని వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తొడగొట్టారు. 21 మంది తెలుగుదేశ పార్టీ ఎంఎల్‌ఏలు తనతో సంబంధాలలో వున్నారని అయితే వారి పేర్లు అవసరమైనపుడు చెబుతానని, చెప్పిన వెంటనే గంటలో ప్రభుత్వం పడిపోతుందని జగన్‌ చెప్పారు. మా వారు టిడిపిలోకి వెళ్లటం, వారు మాలోకి రావటం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టమని కూడా జగన్‌ సవాల్‌ చేశారు. తాను లేస్తే మనిషిని కానని దారిన పొయ్యే వారిని బెదిరించిన కుంటి మల్లయ్య కధ కొందరికి గుర్తుకు వస్తే రావచ్చు.

    జగన్‌ తొడగొట్టడాన్ని సహించలేని తెలుగుదేశం మంత్రులు మా ప్రభుత్వాన్ని పడగొట్టటం కాదు, మీ వారి చేతే రాజీనామాలు చేయించి, ఎన్నికలు జరిపించి మీ సంఖ్యను మీరు నిలుపుకుంటే మేం దేనికైనా రెడీ అని సినిమా డైలాగులు చెప్పారు. అన్నింటికంటే విచిత్రం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గ సభల్లో ప్రసంగించిన వుప ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి ‘ ఓర్పు వున్నంత వరకు సహిస్తాం, ఓర్పు నశిస్తే వైసిపి ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం, ఇక ఎవరూ మిగలరు జాగ్రత్త ! అడుగడునా అభివృద్ధికి అడ్డుపడితే వైసిపి నుంచి జంప్‌ చేయటానికి సిద్ధంగా వున్న 28 మంది ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం ‘ అని హెచ్చరించారు. వైసిపితో సంబంధాలలో వున్న టిడిపి ఎంఎల్‌ఏల పేర్లు బహిర్గతం చేయాలని ఎంఎల్‌సి ముద్దుకృష్ణమ నాయుడు సవాల్‌ చేశారు. ఇతర మంత్రులు, నాయకులు ఇలాంటి కామెడీ డైలాగులు సభల్లో చెప్పి జనాన్ని నవ్వించారు. దీన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో తెరవెనుక వుండి మంచి డైలాగులు రాసేవారు, డైరెక్షన్‌ చేసే సమర్దులు వున్నట్లు కనిపించటం లేదు. అన్ని వారే చూసుకోవాలంటే చంద్రబాబు, లోకేష్‌ బాబుకు ఎక్కడ సాధ్యం అవుతుంది.

   ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణా నేతలు మరింత హాస్యం పండిస్తున్నారు. మొగుడు పోతేనేం పొన్నకాయలా గుండు నున్నగా బలే వుందే అన్న సామెత మాదిరి వుంది. టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ చేశా , అటువంటి పరిస్ధితి రాకుండా కాపాడి తనను రాజకీయాల్లో నిలబెట్టినందుకు కూకట్‌పల్లి వాసులకు కృతజ్ఞతలంటూ తెలంగాణా టిడిపి నేత రేవంతరెడ్డి సన్మానాలు చేయించుకొని మరీ నవ్వులు పండిస్తున్నారు. హైదరాబాదులో టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రేవంతరెడ్డి ఎన్నికలకు ముందు సవాలు చేశారు. టిఆర్‌ఎస్‌కు 99 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు.ఈ ఒక్క సీటు రానందుకు కెసిఆర్‌ అసంతృప్తితో వున్నారు, గ్రేటర్‌ సవాల్‌లో నాదే విజయం అని చెప్పుకున్నారు. ఆ సభకు వచ్చిన అనేక మందికి దేనితో నవ్వాలో అర్ధం కాలేదట. ఇక మిగతా వుపన్యాస విషయానికి వస్తే టిడిపి నుంచి ఫిరాయించిన ఎమ్మేల్యేలది వెన్నెముక లేనిబతుకు అని వర్ణించారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ టిడిపిలోకి వచ్చిన వారందరి పరిస్ధితీ అదే. రావటానికి సిద్ధంగా వున్నారని చెబుతున్నవారిదీ అదే స్ధితి అని రేవంత రెడ్డి చెప్పినట్లే.

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాదు లేకుంటే తెలంగాణాలో ఏముంది అని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం చేసిన వారే అసూయపడేలా రాజధానిని నిర్మించి తీరతామని చెప్పారు. విద్యార్ధులకు చరిత్ర పాఠాలు ఎందుకు దండగ అన్న చంద్రబాబు నాయుడికి నిజంగా ఎంతో ముందు చూపు వుంది. చరిత్రలో తన గురించి చదువుకోకుండా వుండేందుకే ముందు జాగ్రత్త చర్యగా అలా చేసి వుంటారు. అందుకనే రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ? నేను చరిత్ర విద్యార్ధిని కాదు !