Tags

, , , ,

గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం.

ఎం కోటేశ్వరరావు

     ఓకే, భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ ఇతర సపరివార బంధు మిత్రులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి లేదా ఫిరాయించటానికి సర్వహక్కులూ వున్నాయి.భూమాకు పార్టీలు మారటం కొత్తేమీ కాదు, కొట్టిన పిండే గనుక మార్గాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటాం, మా సహనాన్ని పరీక్షించవద్దు అని వైఎస్‌ఆర్‌సిపికి ముందే తెలుగుదేశం నాయకులు చెప్పారు, ఆ వెంటనే భూమా పార్టీ మారటం గురించి వార్తలు వచ్చాయి. ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పారు తప్ప వాటిని ఆయన పూర్తిగా ఖండించనూ లేదు తిరస్కరించనూ లేదు. తెలంగాణాలో జరిగిన పరిణామాలను చూసిన తరువాత ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. లెక్కలు తేల్చుకోవటాన్ని బట్టి వుంటుంది. పార్టీ మారితే భూమా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా అనో, లేకపోతే వైసిపి నాయకుడు జగన్‌ పనితీరు నచ్చలేదనో ఏదో ఒక కారణం చెప్పవచ్చు. ఏ కారణం చెప్పినా తన అనుచరులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రతివారూ సమర్ధించుకుంటారు. దీనిలో పెద్ద కిక్కుండటం లేదు. మన రాజ్యాంగంలో ఓటర్లను సంప్రదించాలి లేదా వారి అంగీకారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవు గనుక ఫిరాయించటం సులభం. తిరిగి గెలుస్తామనే ధైర్యం వుంటే ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడినా తిరిగి ఎన్నికలలో నిలబడవచ్చు. ఈలోపల ఎంఎల్‌ఏ కాకున్నా ఆరునెలల పాటు మంత్రి పదవిలో వుండవచ్చు కనుక మంత్రిగా ఎన్నికలలో తిరిగి పోటీ చేయవచ్చు. లేదా తెలంగాణాలో మాదిరి వేరే పార్టీలో వుంటూ కూడా మంత్రివర్గంలో చేరవచ్చునని కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. స్పీకర్‌ను బట్టి అది వుంటుంది. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. లేదా తేలే లోపల ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంకా ఇలాంటివి చాలా చూశాము గనుక పెద్దగా చర్చించాల్సినపని లేదు.

     గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం. దీని వలన అనుచరులే కాదు సామాన్య ఓటర్లను కూడా చైతన్య వంతులను చేసిన వారౌతారు. ఓటు వేసిన వారికి కాస్త సంతృప్తి అయినా మిగులుతుంది. పార్టీ మారే వారే కాదు, వారిని చేర్చుకొనే అధికార పార్టీ లేదా ప్రతిపక్షం ఎందుకంటే జగన్‌ కూడా తనతో టిడిపి ఎంఎల్‌ఏలు టచ్‌లో వున్నారని చెబుతున్నారు గనుక వారు కూడా ఆ నియోజకవర్గాల ఓటర్లకు శ్వేతపత్రం వెల్లడించాలి. ఫలానా నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఇది, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి తమ పార్టీలో వుండి వుంటే అభివృద్ది ఇంకా ఏమి జరిగి వుండేదో, చేర్చుకుంటే ఏమేమి చేయాలనుకుంటున్నామో అని అధికార పార్టీ కూడా ప్రకటించాలి. లేదా అధికార పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్షంలోకి ఫిరాయిస్తే తమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో, పార్టీ మారి దాన్ని ఎలా పట్టాలపైకి ఎక్కించాలనుకుంటున్నారో ప్రతిపక్షపార్టీ అయినా ఓటర్లకు తెలపాలి.

   ఏదో ఒక పద్దతి పాటించాలి. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరింది, తరువాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరింది. ఆ కుటుంబ సభ్యులు మధ్యలో కొంతకాలం తప్ప ఎక్కువ భాగం ప్రజాప్రతినిధులుగానే వున్నారు. అందువలన ఒకవేళ పార్టీ మారితే గీరితే ఇంతవరకు తాము ప్రాతినిధ్యం వహించిన కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటో, పార్టీ మారి ఇంకా ఏమి చేయబోతున్నారో చెబితే ఆ కుటుంబంపై వున్న గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. పార్టీలు మారే వారికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపినవారు అవుతారు. అభివృద్ధి అయినా మరొక కారణం చెప్పినా నైతిక బాధ్యత ఒకటి వుంటుంది. కలియుగంలో నీతి నియమాలేమిటి తూనా బొడ్డుబాలు అనుకుంటే వేరే విషయం. లేదు కేవలం అధికారం కోసమే పార్టీ మారుతున్నాం అని నిజం చెప్పినా అదీ ఒక నిజాయితీయే ఈ రోజుల్లో, ఏం చెబుతారో చూద్ధాం. రాయలసీమలో ముఠాకక్షలలో ఎన్నోమార్పులు జరుగుతున్నాయి. వారిలో కూడా పాతకాలపు మొరటు పద్దతులు పోయి ఆధునిక సర్దుబాటు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. మా ప్రయోజనాలకు మీరు అడ్డురావద్దు, మీకు మేము అడ్డురాము అనే సహనం,సహజీవనం పెరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం క్రితం అక్రమంగా తిన్నవాడెవడో చెప్పాలని నిలదీసిన జనం ఈ రోజు అసలు తినని వాడెవడో చెప్పండని దబాయిస్తున్న రోజులివి.జనం ఇలాంటి ఫిరాయింపులు, అనైతిక వ్యవహారాలను సహించినంత కాలం ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.