Tags

, , , ,

కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని రక్షించటం అంటే ? అనే శీర్షికతో రిటైర్డ్‌ డిజిపి కె అరవిందరావు తన వ్యాసపరంపరలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన ప్రస్తావించిన విషయాల మంచి చెడ్డలను పరిశీలించబోయే ముందు ధర్మాన్ని రక్షించటానికి ముగింపులో ఆయన చెప్పిన మార్గంతో ప్రారంభిద్దాం. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరు చేయటం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చెప్పారని, అందరికీ వుపనయనం చేయాలని, గాయత్రీ మంత్రం నేర్పాలని ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనపడవచ్చు కానీ లోతుగా ఆలోచించాల్సిస విషయం.పైన చెప్పిన వర్గాల వారికి మేలు చేస్తున్నామనే భావంతో వారిని వుద్యమాల్లోకి దింపి మన దేశాన్నీ, సంస్కృతిని ద్వేషించేట్లు చేసేవారిని అడ్డుకోవటానికి ఇదొక మార్గం అని అరవిందరావు గారు సూక్ష్మంలో ధర్మాన్ని రక్షించే మోక్ష మార్గం చెప్పారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి మహానుభావులు ఆనాటికి తమకు తోచిన దానిని నిజాయితీగానే చెప్పారు. మన సమాజం ఎంతగా చీలిపోయి వుందంటే కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

      ఇక అరవిందరావుగారు ఆరోపించినట్లుగా మొదటి విషయం ఈ దేశంలో పుట్టిన వారెవరూ దేశాన్ని ద్వేషించటం లేదు. పుట్టుక అనేది ఒక ప్రమాదం వంటిది. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు తెలియదు. యాదృచ్చికంగా ఒక కుటుంబంలో పుడితే అగ్రకులమని, మరొక కులంలో పుడితే అధమ కులమని వెంటనే ముద్రవేసే కుసంస్కృతిని, సామాజిక దుష్టత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి కులాల అంతరాలను తరతరాలుగా కాపాడుతూ, అనుమతిస్తున్న ‘మను’ సంస్కృతిని కాపాడాలి అని ఎవరైనా అంటే ఏడునిలువులలోతున పాతి వేయాలంటూ దానిని ద్వేషిస్తున్న వారు మెజారిటీగా వున్నారు. సంస్కృతి పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి అడ్డగోలు వ్యవహారాలను రుద్దాలంటే కుదరదు. పనికిరానిదానిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆరోగ్యకరమైన దానిని ప్రోత్సహించటమే మానవ సంస్కృతి. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ప్రతిదాని మంచి చెడ్డలను విశ్లేషించినట్లే సంస్కృతిపై కూడా నిరంతరం చర్చ జరగాలి. నవీకరణ జరగాలి. కానీ అరవిందరావు గారు కొన్ని విశ్వవిద్యాలయాలూ, మీడియాలోనూ జరుగుతున్న చర్చను అసత్య ప్రచారంగా చిత్రిస్తున్నారు. విమర్శలకు రెండు కారణాలంటూ ఒకటి మన దేశాన్ని బలహీన పరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న వుద్యమాలు, రెండోది నిజంగానే మన వ్యవస్ధలో రావాల్సిన మార్పు. మొదటి అంశాన్ని ఇక్కడ చర్చించటం లేదు, కొంత మంది వేదాలు చదవటానికి అనర్హులు అని గీత గీసినట్లు రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోది అని చెప్పేశారు.

      పోలీసు వ్యవస్ధలో దీర్ఘకాలం పనిచేసిన అరవిందరావు వంటి వారికి విశ్వవిద్యాలయాలూ, మీడియాలో జరుగుతున్న చర్చలు దేశాన్ని బలహీనపరచాలనే వుద్యమాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఒక ఆరోపణ చేసి వాటిని ఇక్కడ చర్చించటం లేదు అని తప్పుకుంటే కుదరదు. మీ ఆరోపణ కూడా ఒక మీడియా వేదికలో చేసిందే అని గమనించండి. మీ దగ్గర ఆ చర్చలకు సరైన సమాధానం లేదని అనుకోవాల్సి వస్తుంది. రెండోది మన వ్యవస్ధలో రావాల్సిన మార్పులు పీఠాలు, ఆచార్యుల పరిధిలోనివి అన్నారు. ప్రపంచ మతాల చరిత్రలో ఏ పీఠం లేదా ఆచార్యులు కూడా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మనకు ఎక్కడా కనపడదు. వారిపై తిరుగుబాటు చేసిన వారికి ప్రతి దేశం,ప్రతికాలంలోనూ సామాన్య జనం మద్దతు ఇచ్చారు. మన దేశంలో స్థూలంగా హిందూ మతం అని పిలిచేదానిపై తిరుగుబాటుగానే బౌద్దం,జైనం అవతరించాయి. ఆ హిందూ మతంలో భిన్న భావజాలంతో వున్న శైవ, వైష్ణవ శాఖలు ఎలా కొట్టుకున్నాయో, ఒకదానినొకటి అంతం చేసుకోవటానికి ఎంత రక్తపాతానికి పాల్పడ్డాయో, అవే రాజీపడి బౌద్ధ,జైనాలను, అసలు మతాలనే సవాలు చేసే చార్వాకులు, లోకాయతులను, వారి గ్రంధాలను ఎలా నాశనం చేశాయో చరిత్రలో నమోదయ్యే వుంది. అనేక బౌద్ధ,జైనాలయాలను శివాలయాలుగా మార్చిన చరిత్ర ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందువలన ఇసు నుంచి తైలాన్ని తీయవచ్చుగానీ పీఠాధిపతుల నుంచి సంస్కరణలు ఆశించటమా? ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు జరగవు. మొత్తంగా చెప్పాలంటే సంస్కృతి మంచి చెడ్డల గురించి చర్చించటానికి, మార్చుకోవటానికి అరవిందరావు వంటి వారు సిద్ధం కాదు.

     ‘ప్రస్తుతం ఎలాంటి ఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టటం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించటం, అందుకు మన సమాజం మౌనం వహించటం ప్రమాదకరం.’ అని అరవిందరావుగారు వాపోయారు. పురాతన కాలంలో తక్షశిల, పాటలీ పుత్రవంటి మన విశ్వవిద్యాలయాలకు విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే వారని గర్వంగా చెప్పుకుంటాం. ప్రస్తుతం అంతకంటే విస్తృతమైన ప్రపంచీకరణ యుగంలో వున్నాము. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా విమర్శలు సరైనవా కావా అన్నది పాయింటు. అనేక తూర్పు ఆసియా దేశాలలో హిందూమతం, ఆచారాలు వ్యాపించాయి. వర్తమానంలో అనేక దేశాలలో మన దేశం నుంచి వలస వెళ్లిన వారు అక్కడ స్ధిరపడుతున్నారు, దేవాలయాలు నిర్మిస్తున్నారు, మతాచారాలను మరింతగా రెచ్చిపోయి పాటిస్తున్నారు. అందువలన ఎవరు ఎక్కడ చర్చించాలో చర్చించకూడదో గీతలు గీయటం సంకుచితం.

    ప్రతిదానికీ సంస్కృతితో ఎవరు ముడిపెడుతున్నారు? మతం వేరు సంస్కృతి వేరు. అన్ని మతాలు,అలవాట్లు, ఆచారాలను సహించటం మన సంస్కృతి. దాన్ని తిరస్కరించటం మత సంస్కృతి.దానిలో భాగంగానే అది ఏమతమైనా ఎవరేం తినాలో, దుస్తులు ఎలా ధరించాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పరుగెత్తాలో కూడా నిర్దేశించేందుకు పూనుకున్నారు. మీరే చెప్పినట్లు భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు వున్నాయనేది నిర్వివాదాంశం అయినపుడు చర్చలపై సమాజం మౌనం వహిస్తున్నదంటే వాటిని అంగీకరించినట్లే, మీ కెందుకు అంత దుగ్ద, లేదూ మీరు మౌనం వీడి చర్చలు, విమర్శలు ఎలా సరైనవికాదో విమర్శించండి. ఇస్లాం పుట్ట ముందే భారత దేశంలో బ్రాహ్మణులు లేత గోమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినటం గురించి రాసింది వాస్తవమా కాదా? గోవులు, కోడె దూడల మాంసం తినటం గురించి వేదాల్లో వుందా లేదా ? అలాంటపుడు గోవును హిందూ సంస్కృతికి ముడిపెట్టి గోవధ చేసిన వారిని చంపివేయాలని వేదాలు చెప్పాయని తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారి గురించి అరవిందరావు ఏమంటారు ? భారత్‌లో పురాతన కాలంలోనే హిందూ మత భావజాలాన్ని అనేక మంది సవాలు చేశారు. దాన్ని మన సమాజం అంగీకరించింది. అరవిందరావుగారే చెప్పినట్లు వైదిక సంప్రదాయంలోనే శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్దాంతాన్ని ఒకరు విమర్శించుకున్నారు. అలాంటిది వీరందరి సిద్ధాంతాలను కమ్యూనిస్టులో మరొకరో ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని అసహనం ఎందుకు వెల్లడి అవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశం వివిధ మతాల, మతరహిత భావజాలాల కేంద్రంగా వుంది. అలాంటి దానిలో జాతీయత అంటే హిందూయిజమే, హిందూయిజమే జాతీయత అన్న తమ భావాన్ని రుద్దేందుకు కాషాయ తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.వాదనలో తమతో ఏకీభవించని వారిని అంతం చేసేందుకు కూడా వీరశైవులు వెనకాడలేదని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు అది మరో రూపంలో పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

    పురాణాలు, ఇతిహాసాలపై విశ్వాసం వున్న వారి ప్రకారం నాలుగు యుగాలున్నాయి. వాటిలో మొదటిదైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచిందట. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సమాజం వున్నప్పటికీ ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదని, ఎవరి వృత్తి వారికి గొప్పదని, అందరికీ దేవుడు ఒక్కడేనని, ఆయనను ,స్వర్గం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి తపస్సు చేసుకోవటానికి అవకాశం వుందని చెబుతారు.ఈ యుగాలు, సామాజిక తరగతుల గురించి ఎవరికి వారు తమవైన వ్యాఖ్యానాలు చేస్తున్నందున వాటిలో ఒకదానిని నేను ప్రస్తావించాను.త్రేతాయుగం నాటికి ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదంతో నడుస్తుందని చెబుతారు. ఇది కలియుగ అంతం కనుక అసలు ఏకపాద ధర్మం అయినా వుందో లేదో తెలియటం లేదని బాధ పడేవారు కూడా లేకపోలేదు. అరవిందరావు వంటి వారు కలియుగ అంతంలో అసలు ధర్మం ఏమిటో అంత స్పష్టంగా తెలియని స్ధితిలో గడిచిపోయిన యుగాలలోని ధర్మాలను ఇప్పుడు అమలు జరపాలని చెబుతున్నారా అనిపిస్తోంది. ఎలా సాధ్యం ? మాతృగర్భం నుంచి ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తరువాత తిరిగి అమ్మకడుపులోకి వెళ్లటం ఎంత అసాధ్యమో గడచిపోయినట్లు చెబుతున్న యుగ ధర్మాలను ఇప్పుడు అమలు జరపటం అంత కష్టం.

     సత్యయుగంలో అందరూ సమానమే అని చెబుతూనే శూద్రులు మిగతా తరగతులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేయాలని కూడా చెప్పారు. ఇదొక వైరుధ్యం. సత్యయుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చని చెప్పారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి శూద్రులు తపస్సు చేయటం ధర్మవిరుద్ధంగా మారిపోయింది. వాల్మీకి రామాయణంలోని వుత్తరకాండలో రాసినదాని ప్రకారం ఒక రోజు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని శ్రీరాముడి వద్దకు వస్తాడు. నీవు కచ్చితంగా పాపం చేసిన కారణంగానే తన బిడ్డ మరణించాడని లేకుంటే బతికేవాడని ఆరోపిస్తాడు. ఆ సమయానికి ప్రత్యక్షమైన నారదుడు అసలు విషయం రాముడి పాపం కాదని ఒక శూద్రుడు తపస్సు చేస్తున్న కారణంగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడని చెబుతాడు. వెంటనే రాముడు తనిఖీకి బయలు దేరి వెళ్లగా శంబుకుడు కనిపిస్తాడు. రామా నేను బొందితో కైలాసానికి వెళ్లటానికి ఈ తపస్సు చేస్తున్నానని చెబుతాడు.అది అధర్మం అంటూ శంబుకుడిని రాముడు వధిస్తాడు. తన కంటే ముందున్న సత్య యుగంలో శూద్రులు కూడా తపస్సు చేయటానికి అవకాశం వున్న విషయాన్ని రాముడెందుకు గ్రహించలేకపోయాడు. అప్పుడు కానిది తరువాత అధర్మం ఎందుకు అయింది అని ధర్మ చర్చకు ఎందుకు పెద్దలను సమావేశ పరచలేకపోయాడు? నియంతల పాలనలో మాదిరి అంతా రామరాజ్యంలో కూడా ఏకపక్షంగా నడిచినట్లు కనిపించటం లేదూ?అసలు శూద్రులు తపస్సు చేయటం ఎందుకు నిషిద్ధం ? అరవిందరావు వంటి వారు చెబుతున్నట్లుగా వేదాలలో చేసిన వృత్తులు బట్టి వర్ణాలు వచ్చాయంటున్నారే, రాముడి కాలంలో ఆ వేదాలలో చెప్పిన దాని ప్రకారం శూద్రులు తపస్సు చేయటం ఎలా అధర్మం అవుతుంది? అంటే వేదాల స్ఫూర్తిని రాముడి కాలంలోనే తోసిపుచ్చారా ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవచేయటానికి శూద్రులు కట్టుబడి వుండాలి తప్ప ఇతరత్రా పనులు చేస్తే ఇదే జరుగుతుందని శంబుక వధతో రాముడు మిగతా శూద్రులను హెచ్చరించాడా ? నేటి దృష్టితో నాడు జరిగిన వాటిని ప్రశ్నించటం సమంజసమా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. నిజమే ! అది ప్రశ్నించేవారికే కాదు, నాటి ఆదర్శాలను నేటికీ వల్లె వేస్తున్నవారికి అమలు జరపాలని చూస్తున్న వర్తించదా ?

     బ్రాహ్మలు కాని వారు పూజా పునస్కారాలు, పౌరోహిత్యం చేయటం వల్ల, కమ్యూనిస్టులు వేదమంత్రాలతో పనిలేకుండా వివాహాలు చేయటం వలన బ్రాహ్మలకు కష్టకాలం వచ్చిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నారద మునీంద్రుల వంటి వారు నిజమే అని చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా ? తనపైన ప్రశ్నించే మరొకరు లేరనే కదా ఎవడో ఏదో అన్నాడని శ్రీరాముడు గర్భిణీ అని కూడా చూడకుండా సీతను అడవులలో వదలి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నేను రాముడిని అనుసరిస్తున్నాను, నా భార్య శీలం గురించి ఎవరో ఏదో అన్నారు కనుక నేను ఆమెను వదలి వేస్తున్నాను అంటే చెల్లుతుందా? లేదా నేను కృష్ణ భక్తుడిని ఆయన మాదిరి బహు వివాహాలు చేసుకుంటుంటే నిత్య పెళ్లి కొడుకు అని పోలీసులు జైల్లో పెట్టి నా మనోభావాలను గాయపరిచారు అని అంటే కుదురుతుందా ?

     ధర్మం నిర్వచనాన్ని ఎప్పుటి కప్పుడు పున:పరిశీలించాలి, మత పెద్దలు తప్ప మరెవరు చెప్పినా దీనికి ప్రామాణ్యం వుండదు అని అరవిందరావు అభిప్రాయపడ్డారు. అది జరిగేదేనా ? మత రాజ్యాలలోనే అలా జరగలేదు. అనేక మంది రాజులు మతాలు మారారు లేదా ఇతర మతాలను అనుమతించారు. ఇప్పుడు అది అసలు కుదిరేది కాదు.మత ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మా విశ్వాసంలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోకూడదు, మా మనోభావాలు దెబ్బతినకూడదు అంటున్నారు.ఇటువంటి స్ధితిలో ధర్మాన్ని ఎవరు నిర్ణయించాలి శైవులా, వైష్ణవులా ఇతర శాఖల వారా ?పోనీ వీరంతా రాజీ పడినా, ఇతర మతాల వారి ధర్మాన్ని అంగీకరించే పరిస్ధితి వుందా ?

     చివరిగా అరవిందరావు గారి మరో ఆవేదన గురించి చూద్దాం. ‘ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటి కపుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు…..ఎదుటి వాడి సిద్దాంతాన్ని సమీక్షించి తమ సిద్దాంతాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించటం, విమర్శలు వచ్చినా మన పండితులు, మత పెద్దలు స్దబ్దంగా వుండటం చాలా ఆశ్చర్యకరం ‘ అని వాపోయారు. మన మతం గురించి విదేశీ విశ్వవిద్యాలయాలలో చర్చించటాన్ని తప్పుపట్టిన అరవిందరావు ఈ విషయంలో పాశ్చాత్యులు కూడా వేలెత్తి చూపారని తన వాదనకు సమర్ధనగా తీసుకున్నారు. ఇది అన్యాయం కదా ? షెల్డన్‌ పోలాక్‌ అనే రచయిత ‘పదహారవ శతాబ్దం వరకు వున్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలు ఎలా వున్నా ఈ వ్యాఖ్యలో మాత్రం సత్యముంది అని ముక్తాయింపు నిచ్చారు.

     ‘ఈ కాలమందు మత త్రయము వారు( అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మత శాఖల్ని ప్రచారం చేసిన శంకర-రామానుజ- మధ్వాచార్వుల గురించి ) తమ తమ మత వ్యాప్తికై పరస్పర హింసా దూషణములతో వివాదపడి హిందూ రాజ్యముల దుర్బలతకు, తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునదేకు, తర్వాతి యరాజక స్ధితికి దేశము య్కె అత్యంత దయనీయ స్ధితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో, ఎంత గొప్ప భాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంధమవసరమగును’ అని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంలో రాశారు. విజయనగరం, కాకతీయ సామ్రాజ్యపతనాలకు ఈ మతాల చిచ్చు ఒక కారణంగా చెబుతారు. అవి పతనమైన తరువాత వాటి స్దానాన్ని నవాబులు, ఆంగ్లేయులు ఆక్రమించిన చరిత్ర తెలిసిందే. ఈ కాలంలో మత కొట్లాటలలతో లాభం లేదని ఆదరించే వారు వుండరని గ్రహించి ఒకరు కొకరు రాజీపడి కొత్త పాలకులను కొలవటానికి, బోగలాలసతకు అలవాటు పడిన మత పెద్దలు, పండిత లోకం వాడి,వేడిగా తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది?