Tags
ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS
ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.
ఎం కోటేశ్వరరావు
ప్చ్ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.
గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.
ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.
స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.
ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్ సర్దేశాయ్, బర్ఖాదత్ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.
మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్ ప్రొడ్యూసర్ విశ్వదీపక్ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్ జిందాబాద్ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.