Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

     మూఢ భక్తి, భక్తులతో ఇదే సమస్య . దేవుడు నిజంగా ప్రత్యక్షమైనా తట్టుకోలేరు, నమ్మిన దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతున్నా భరించలేరు. ఏం మాట్లాడతారో తెలియని వున్మాదంలోకి వెళ్లిపోతారు. కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచార పటాటోపంతో ముందుకు తెచ్చిన నరేంద్రమోడీ మామూలు మనిషేనని ఆయన దగ్గర మంత్రదండం లేదని హనుమంతుని వంటి వెంకయ్య నాయుడితో సహా అనేక మంత్రులు, ఇతర పెద్దలు ముందు జాగ్రత్త చర్యగా పదే పదే మొత్తుకుంటున్నారు. మోడీ దగ్గర మంత్రదండం వుందని ప్రతిపక్షాలు ఎప్పుడైనా చెప్పాయా ? మహామాంత్రికుడని గుజరాత్‌ను మాయా మహలుగా నిర్మించాడని, దేశమంతటికి దానిని వర్తింప చేస్తారని చెప్పింది ఎవరు ? నరేంద్రమోడీ పాచి పాటనే పాడి బోర్‌ కొట్టిస్తున్నారని రాసినందుకు కొందరు భక్తులకు కోపం వచ్చింది. అంతా వ్యతిరేక దృక్పధమే తప్ప బి పాజిటివ్‌గా వుండటంలేదని, అన్నింటినీ తీసుకుని వచ్చి మన కంచాల్లో వడ్డించాలన్నట్లు కొందరు భావిస్తున్నారని, అసలు పౌరులుగా మన బాధ్యతలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదని వాపోతున్నారు.

     దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికేమిచ్చామని ఆలోచించటమే దేశభక్తి అన్నట్లుగా గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది కూడా బి పాజిటివ్‌లో భాగమే. మంగళవారం నాడు పార్లమెంట్‌ వుభయ సభలను వుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం రాసి ఇచ్చిన వుపన్యాసాన్ని చదివి వినిపించటం తప్ప వేరు కాదన్నది తెలిసిందే. దాన్ని పూర్తిగా విన్నవారికి లేదా చదివిన వారికి దేశంలో ఇంక పరిష్కరించాల్సిన పెద్ద సమస్యలేవీ లేవనే భ్రమ కలుగుతుంది. ప్రధాన మంత్రి జన ధన యోజన పధకం కింద తెరిచిన 21 కోట్ల ఖాతాలలో 15 కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయని, 32వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వాటిలో వున్నట్లు చెప్పటానికి గర్వపడుతున్నట్లు రాష్ట్రపతి చెప్పారు.

     ‘జన ధన యోజన,ముద్రా బ్యాంక్‌, సామాన్యుడికి ఆరోగ్యబీమా వంటి పధకాల వంటి పెద్ద ప్రకటనల ప్రభావం ఆచరణలో కనపడాలంటే అనేక దశాబ్దాలు పడుతుంది’ ఈ మాటలు చెప్పింది నేను కాదు, ‘ఒక భక్తుడి అపరాధ అంగీకారం ‘ పేరుతో తనను తాను మోడీ ‘భక్తుడి’గా ప్రకటించుకున్న రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ మాజీ డైరెక్టర్‌ ముత్తురామన్‌ స్వరాజ్య అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో పేర్కొన్నఅంశమిది.గ్యాస్‌ సబ్సిడీని వదులు కోవాల్సిన అవసరం గురించి ప్రభుత్వం చేసిన ప్రచారఖర్చుకు సరిపడా కూడా స్వచ్చందంగా గ్యాస్‌ సబ్సిడీని వదులు కున్నారో లేదో అనుమానమే. పదహారు కోట్ల కనెక్షన్లకు గాను సబ్సిడీ వదులుకుంది కేవలం 62 లక్షల మందేనని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు. ప్రపంచంలో తమదే అతి పెద్ద పార్టీ అని పది కోట్ల మంది సభ్యులున్నారని ప్రకటించుకున్న అధికార పార్టీ సభ్యులు కూడా గ్యాస్‌ సబ్సిడీని వదులుకోలేదన్నది స్పష్టం.సభ్యులు కాని మోడీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారన్నది గమనించాలి.

      హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయంలో దళితుడైన ఒక యువశాస్త్రవేత్తను ఆత్మహత్యకు పురికొల్పిన పార్టీ పార్లమెంట్‌లో సుభాషితాలు చెబుతోంది. దీన్ని కూడా బి పాజిటివ్‌గా తీసుకోవటం సాధ్యం కాదని జెఎన్‌యులోని ముగ్గురు ఎబివిపి విద్యార్ధి నాయకులే ప్రకటించిన తరువాత కూడా ‘సామాజిక ప్రజాస్వామ్యపునాది లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదని అంబేద్కర్‌ చెప్పిన అంశాన్ని రాష్ట్రపతి వుటంకించారు.

      రైతుల సంక్షేమం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలోనే మహారాష్ట్ర బిజెపి ఎంపీ రైతులు ఆత్మహత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని, అలాంటి ఫ్యాషన్‌ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చేసిన వ్యాఖ్యను కూడా రైతులు ‘సహించారు.’ఇలాంటి విషయాలలో బిజెపి నేతలు పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, తగు సమయంలో స్పందించటం లేదని మోడీ భక్తుడు ముత్తురామన్‌ మొత్తుకున్నాడు. ‘ టాంజానియా యువతిపై మూకదాడి సందర్భంగా బెంగలూరులో జాత్యంహంకారం గురించి మాట్లాడటానికి మీడియా అత్యుత్సాహం చూపుతున్న సమయంలో విదేశీ విద్యార్ధులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిజెపి నేత సదానంద గౌడ వ్యాఖ్యానించటం ఏమిటంటూ దాని బదులు శాంతి భద్రతలు దిగజారాయాని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించవచ్చు. చర్చిలపై దాడులు లేదా దాద్రి వుదంతాలను గట్టిగా ఖండిస్తూ ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తే వాటి భారం ముఖ్యమంత్రులపై పడేది, దానికి బదులు బిజెపి నేతలు మౌనం వహిస్తున్నారు,అలాగే బీఫ్‌ గురించి మాట్లాడకూడని సమయంలో మాట్లాడారు ‘అని కూడా ముత్తురామన్‌ తల మీద కొట్టుకున్నాడు. వీటన్నింటినీ కూడా పౌరులు తమ బాధ్యతగా సహించారా లేదా భక్తులారా ?

     గతేడాది కాలంగా ఎగుమతులు పడిపోయి, పారిశ్రామిక వుత్పత్తి తగ్గిపోయినట్లు అధికారికంగా ఒకవైపు ప్రభుత్వమే ప్రకటించినా జనానికి మతిమరపు ఎక్కువ అనే ధృడాభిప్రాయంతో కిందపడ్డా విజయం సాధించామన్నట్లుగా ప్రభుత్వం తీసుకున్న సరికొత్త చొరవల కారణంగా సులభంగా వ్యాపారం చేసే దేశాల ప్రపంచబ్యాంకు జాబితాలో మన దేశం పన్నెండు ర్యాంకులు ఎగువకు పోయిందని ప్రభుత్వం ప్రకటించుకుంది.అయితే పెట్టుబడిదారులకు మోడీ పదే పదే వాగ్దానం చేసినట్లుగా పన్ను సంస్కరణలు చేయలేదని మోడీ భక్తుడు నిష్టూరాలాడుతున్నాడు. అందుకే మోడీ పాచి పాట పాడి బోరు కొట్టిస్తున్నారన్న వ్యాసంలో కనీసం భక్తులకు కూడా విశ్వాసం కలిగించలేకపోతున్నారని వ్యాఖ్యానించాను.

      పౌరులు డిమాండ్లు చేయటం తప్ప తమ బాధ్యతలను గుర్తెరగటం లేదని శుద్దులు చెప్పేవారు మరి వీటినేమంటారో. మోడీ భక్తుడు ముత్తురామన్‌ చెప్పిన ప్రకారం (సామాన్యులు తిరిగే) విమానాలకు లీటరు పెట్రోలు రు.37 రూపాయలకు పోస్తుంటే విలాసంగా ద్విచక్ర వాహనాలు, కార్లు,బస్సులు ఎక్కే వారికి పెట్రోలు 60 రూపాయలకు పోస్తున్నారు. దీన్ని నోరు మూసుకొని అధిక చెల్లింపు బాధ్యతగా జనం భావిస్తున్నారా లేదా ? పెట్రోలు అసలు ఖరీదు 20 అయితే పన్నులు 40 చెల్లిస్తున్నారా లేదా ? ప్రపంచ మార్కెట్‌లో చమురు ధర తగ్గినా ద్రవ్యలోటు తగ్గించుకోవటానికి ఎప్పటికపుడు పెట్రోలుపై ఎక్సయిజ్‌ పన్ను, వ్యాట్‌ పెంచుతుంటే దేశభక్తులుగా, రాష్ట్ర భక్తులుగా భరిస్తున్నారా లేదా ? దాని వలన ధరలు పెరిగితే నోర్మూసుకొని వస్తువులు కొంటున్నారా లేదా ? వెంటనే పెట్రోలుపై లీటరుకు పది రూపాయలు, డీజిల్‌పై ఆరు రూపాయలు తగ్గించే విషయం పరిశీలించమని ముత్తురామన్‌ కూడా కోరుతున్నాడు. ఆయనను కూడా కమ్యూనిస్టుగా జమకడతారా ?

      పెద్ద ఎత్తున జరిగిన 2జి, కోల్‌గేట్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ తదితర అవినీతి చర్యల పూర్వరంగంలో అనేక మంది తటస్తంగా వున్నవారు మోడీకి ఓట్లు వేశారని రెండు సంవత్సరాల తరువాత కనీసం ఒక గుమస్తాను కూడా శిక్షించలేకపోయారని మోడీ భక్తుడు ఆక్షేపించారు.సోనియా, మన్మోహన్‌సింగ్‌ వంటివారిపై చర్య తీసుకుంటే వేధింపులకు పాల్పడుతున్నారని అంటారు కనుక వారి జోలికి పోవటంలేదు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. కానీ కోడా, బన్సాల్‌, మారన్‌, రాజా, కనిమొళి, కల్మాడీ వంటివారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. నిర్బయ అత్యాచార కేసును పదినెలల్లో ముగించగలిగినపుడు రోజు వారీ ప్రాతిపదికన అవినీతి కేసులను ఎందుకు విచారించటం లేదు, కొద్ది మందినైనా రాజకీయ నేతలను, అధికారులను అదే మాదిరి జైలుకు ఎందుకు పంపలేదు. దీనికి సంబంధించినదే నల్లధనానికి సంబంధించి అశాభంగం కలిగించారు, ప్రభుత్వం ఏమి చేస్తున్నదో లేదో పట్టుకున్నవారి జాబితా, ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్నది స్పష్టంగా తెలియచేయాల్సిన అవసరం లేదా అని అని ముత్తురామన్‌ ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్‌ అంటే నిజంగానే రోడ్లు శుభ్రపడతాయనుకున్నారు అమాయక పౌరులు. అనేక మంది తొలి రోజుల్లో చీపుర్లు పట్టుకొని నిజంగానే వూడ్చారు. తీరా చెత్త పన్ను పేరుతో జనంపై అదనపు భారం మోపుతున్నా కడుతున్నారే. పన్ను సంస్కరణలంటే సామాన్యులపై భారం తగ్గిస్తారేమోనని అందరూ నిజంగానే నమ్మారు. చివరికి సంస్కరణ అంటే సేవాపన్ను 12.36 శాతం నుంచి 14కు రాబోయే రోజుల్లో 16శాతానికి పెంచబోతున్నా నిబద్దతగల ఏ పౌరుడూ ఇదేమి అన్యాయం అనటం లేదే ఇంతకంటే పౌరులు తమ విధులను ఏమి నిర్వర్తించాలి?అందువలన కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు మోడీ సంజాయిషీ ఇవ్వకపోతే మానే కనీసం తన భక్తులకైనా చెప్పకపోతే ఏం జరుగుతుందో వారే రాబోయే రోజుల్లో వారే చెబుతారు. ముత్తురామన్‌ కార్పొరేట్‌ వర్గాల ప్రతినిధి, మతవాది, మితవాది అని కూడా అతని వ్యాసం చదివితే అర్ధం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు అమ్ముతామని చెప్పి అమ్మలేదని విమర్శించటంతో పాటు మతపరమైన చర్యలు తీసుకోని కారణంగా తాను అపరాధాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంటే పచ్చిమితవాదుల నుంచి కూడా రానున్న రోజుల్లో మోడీకి కష్టాలు తప్పేట్లు లేవు. ఒకసారి మతోన్మాద పులిని తామెక్కినా జనాన్ని ఎక్కించినా దాన్ని అదుపు చేయాలి లేదా దానికి బలి కావాల్సి వుంటుంది. ఏది జరిగినా దేశం, సామాన్యజనం ఎంతో మూల్యం చెల్లించాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో కనిపిస్తున్న ముప్పు అదే.