Tags

, , , , ,

ఆళ్వార్‌ ప్రాంతంలో రోడ్లపై నిఘావేసే బృందాలకు నాయకత్వం వహించేవారు. ఏ దారుల్లో ఆవులను ఎలా తరలిస్తున్నారో పసిగట్టటంలో దిట్ట అట. బహుశా అందుకే ఆ అనుభవాన్ని జెఎన్‌యులో వాడిపాడేసిన కండోమ్‌లు, మద్యం సీసాలు ఎక్కడ వుంటాయో ఎన్ని వుంటాయో కనుగొనేందుకు పనికి వస్తుందని ఆయనను వినియోగించుకొని వుంటారు.

సత్య

     ఎవరైనా ఏదైనా అంటే అన్నారని గుంజుకుంటారు గానీ ఎవరైనా ఎందుకంటారు అని ఆలోచించేవారు తక్కువ. పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత ఎవరు ఏమన్నా భరించక తప్పదు, అభ్యంతరం అనుకుంటే బయటకు రాకూడదు.రోమ్‌ పోతే రోమన్లా వుండాలన్నది ఒకసామెత. ఇప్పుడు దానిని చెప్పటం దేశద్రోహం అని మనకు తెలియకుండానే ఎవరైనా తన్ని తగలేసే ప్రమాదం వుంది. కనుక కాస్త వెనుకా ముందూ చూసుకోవాల్సిన రోజులివి. రోమ్‌ అన్నది పరమత కేంద్రం, అందునా విదేశీకను అది దేశద్రోహం అని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ బసీ వంటి వారు పాలకుల మెప్పుకోసం లేదా మరో వున్నత పదవి కోసం ముందు కేసు పెట్టి జైల్లో వేసి తరువాత తాపీగా నిరపరాధివని నిరూపించుకో అనే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఎక్కడకు వెళితే అక్కడి పద్దతులను గౌరవించాలి అనిచెప్పుకుందాం. ఎక్కడికి వెళితే అక్కడి పద్దతులను గౌరవించాలి అన్నట్లుగానే ఎవరి పనివారు చేయాలి.

     ఇటీవల జరిగిన కొన్ని వుదంతాలను చూసిన తరువాత నల్లకోటు వేసుకొని లాయర్‌ను అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా వుంది, ప్రతి వారూ నన్ను ఎగా దిగా చూసి భయం, భయంగా దూరంగా జరుగుతున్నార అని కాస్త నాటకీయత జోడించి చెప్పారు. మద్దెల వచ్చి రోటితో మొరపెట్టుకున్నట్లుగా నేను ఎవరితో చెప్పుకోవాలి. మా నాన్న జర్నలిస్టుగా పనిచేస్తున్నారు అంటే జీ న్యూస్‌లోనా ఫ్రెండ్సందరూ నవ్వుతున్నారు, నువ్వు వేరే పని చూసుకో నాన్నా అంటున్నాడు నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఎదురు ప్రశ్నించాను. ఇంతలో మా మావయ్య ఎంఎల్‌ఏ అని మరొక మిత్రుడు సినిమా ఫక్కీలో అందుకున్నాడు. ఏ యూనివర్సిటీలో కండోమ్‌లను లెక్క పెడతాడు అని జోక్‌ పేలింది. కుక్క పని గాడిద చేస్తే ఏమైందో చిన్నపుడు కధ చదువుకున్నాం కదా. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రోజు ఎన్ని కండోమ్‌లను వాడుతున్నారో, ఎన్ని బీరు సీసాలు తాగుతున్నారో రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ గ్యానదేవ్‌ ఆహుజా ప్రకటించటం ఇలాంటిదే కదా ? ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం రోజుకు మూడువేల కండోమ్‌లు, రెండువేల మద్యం సీసాలు, పదివేల సిగిరెట్‌ పీకలు, నాలుగువేల బీడీ ముక్కలు , 50వేల చిన్నా పెద్దా ఎముకలు పోగుపడుతున్నాయట. అంత కచ్చితంగా లెక్క తేల్చారంటే ఎన్నో రోజుల నుంచి సదరు ఎంఎల్‌ఏ తిష్టవేసి వుండి వుండాలి. లేకుంటే ఎలా సాధ్యం ?

     ఇక్కడ మరొక విషయాన్ని కూడా ముచ్చటించుకోకపోతే అసంపూర్ణంగా వుంటుంది. ఒక కుక్కను చంపదలచుకుంటే దానికి పిచ్చి వుందని ముందుగా ప్రచారం చేయాలట. అలాగే సంఘపరివార్‌ పధకాలు కూడా ఎంత పక్కాగా వుంటాయో ఎవరిని ఏ పనికి వినియోగించాలో అర్ధం చేసుకోవటానికి ఈ వుదంతాన్ని అధ్యయనం చేయాలేమో ! ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అనే ఒక ప్రఖ్యాత సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ దెబ్బతీయదలచుకుంది.ఎందుకంటే అక్కడ పాగా వేయించాలని ఎబివిపి చేత ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. నాకు దక్కనిది బతకటానికి వీల్లేదని కొంత మంది కుర్రవాళ్లు అమ్మాయిలపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నట్లే జెఎన్‌యు విషయంలో కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లుంది. సమయం కోసం చూసి అది దేశద్రోహుల కేంద్రం అని ప్రచారదాడి ప్రారంభించింది. అధికారయంత్రాంగం, తన కనుసన్నలలో మెలిగే మీడియా సంస్ధల సహకారంతో అణచివేతకు పూనుకుంది. అది వికటించేట్లు కనిపించటంతో జెఎన్‌యు అన్ని రకాల అనైతిక కార్యక్రమాల అడ్డాగా వుందని మరొక అస్త్రాన్ని వదలింది. అది రాజస్ధాన్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ గ్యానదేవ్‌ ఆహుజా చేత చేయించింది. ఇక్కడ గ్యానదేవ్‌ అజ్ఞానం ఏమిటంటే ఆ విశ్వవిద్యాలయంలో బిజెపి నిర్వచనం ప్రకారం దేశ ద్రోహుల కోవలోకి వచ్చేవారితో పాటు ఏబివిపి దేశభక్తులు కూడా వున్నారు. సదరు ఏబివిపిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వున్నారు. సదరు మూడువేల కండోమ్‌లు, రెండువేల మద్యం సీసాలు, బీడీ సిగిరెట్‌ పీకలు మొత్తం దేశద్రోహుల వేనా లేక దేశభక్తులవి కూడా వున్నాయా అన్న వివరాలు కూడా వెల్లడించి వుంటే పరిశోధనకు పిహెచ్‌డి వచ్చి వుండేది.

     అయినా మనలో మాట హానికరం కాని శృంగారానికి కండోమ్‌లు వాడండని టీవీ, రేడియోలలో ప్రభుత్వమే నిత్యం ప్రచారం చేస్తున్నది. వైన్‌షాపులు, బార్లకు లైసన్సులు ఇచ్చి ఎంతతాగితే అంత దేశభక్తి పరుల కింద లెక్క అని ప్రోత్సహిస్తున్నది. సదరు ఎంఎల్‌ఏ కనుగొన్న వన్నీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వున్నాయి కదా? కండోమ్‌లు అమ్మటం, వినియోగించటమే అనైతికం అయితే మరి వీధి వీధినా దుకాణాలలో ఎందుకు అమ్ముతున్నట్లు ? ఇంతకీ సదరు ఎంఎల్‌ఏ ఖాళీ సమయాలలో ఢిల్లీ వచ్చి ఈ పని చేసినట్లా లేక ఎవరూ గుర్తు పట్టకుండా వుంటారు గనుక సంఘపరివార్‌ ఆయనకు ఆపని అప్పగించిందా ? ఇంతకీ ఈ పెద్ద మనిషి కథా కమామిషు కూడా తెలుసు కుంటే బాగుంటుంది.

     గతేడాది జనవరిలో భరత్‌ సింగ్‌ అనే వ్యక్తి జైపూర్‌లో ఒక క్యాషియర్‌ నుంచి 18లక్షలు దోపిడీ చేశాడు. ఇతగాడు ఎంఎల్‌ఏ జ్యానసింగ్‌ మేనల్లుడి దగ్గర డ్రైవర్‌, ఆ దోపిడీకి ఎంఎల్‌ఏగారి కారునే వుపయోగించాడట.డబ్బును కూడా ఎంఎల్‌ఏ గారింట్లోనే వుంచాడట. స్వంత ఇంటి కంటే ఎంఎల్‌ఏ ఇల్లు పదిలం కదా ! అంతే కాదు జూలై నెలలో మరో దోపిడీకి ఏకంగా ఎంఎల్‌ఏనే ఒక కవచంగా వాడుకున్నాడట.తాను దోపిడీ చేసిన సొమ్మును ఎంఎల్‌ఏ ప్రయాణించిన కారులోనే వేరే చోటికి చేరవేశాడట. ఇదంతా ఎలా సాధ్యమైందంటే సదరు ఆహుజా తన మీసాల గురించి తప్ప మిగతా విషయాలేమీ పట్టించుకోరని ఆ నేరగాడు తరువాత పోలీసులకు చెప్పాడు.ఆహుజా రామలీలా వుత్సవాల సమయంలో వేషాలు వేసేందుకు మీసాలను ప్రత్యేకంగా పెంచి పోషించాడట.ఎంఎల్‌ఏ అయినా గానీ అదే విధంగా మీసాలను మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడట.ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన ఆహుజా ఒక పోలీసును కొట్టిన కేసులో పాత నేరస్ధుడి కింద నమోదయ్యాడు. పోలీసులకు దొరక్కుండా పదేళ్లపాటు తప్పించుకు తిరిగాడు.2003లో ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యాక అధికారంలో వున్న స్వంత పార్టీ బిజెపి ప్రభుత్వాన్ని తనపై వున్న కేసును ఎత్తివేయమని కోరితే కోర్టు ఒప్పుకోలేదట. దాంతో పోలీసులకు లొంగిపోయిన కొద్ది క్షణాలలోనే ఆయనకు పొట్టలో నొప్పి రావటం, ఆసుపత్రిలో చేరటం, వైద్యులు సీరియస్‌గా వుందని సర్టిఫికెట్‌ ఇవ్వటం, బెయిలు వచ్చేంత వరకు ఆసుపత్రిలోనే సౌకర్యాలను అనుభవించటం వరుసగా జరిగిపోయాయి.

     ఈ ఎంఎల్‌ఏ గారు గోవులపై ఎంతో పరిశోధన కూడా చేసినట్లున్నారు. బిబిసి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవుపేడను బయోగ్యాస్‌గా వినియోగించి కాలిఫోర్నియా నగరం మొత్తానికి విద్యుత్‌ సరఫరా చేస్తారని, ఆవు పాలలో బంగారం వుందని, భారత్‌లో ఆవును చంపితే అగ్ని పర్వతాలు బద్దలౌతాయని, భూకంపాలు, కరవులు వస్తాయని విదేశీ నిపుణులు కూడా చెప్పారని వివరించాడు. ఇలాంటి పెద్ద మనిషి గోరక్షణ మహానుభావుడిగా కూడా పనిచేయకుండా వుంటాడా ? ఆళ్వార్‌ ప్రాంతంలో రోడ్లపై నిఘావేసే బృందాలకు నాయకత్వం వహించేవారు. ఏ దారుల్లో ఆవులను ఎలా తరలిస్తున్నారో పసిగట్టటంలో దిట్ట అట. బహుశా అందుకే ఆ అనుభవాన్ని జెఎన్‌యులో వాడిపాడేసిన కండోమ్‌లు, మద్యం సీసాలు ఎక్కడ వుంటాయో ఎన్ని వుంటాయో కనుగొనేందుకు పనికి వస్తుందని ఆయనను వినియోగించుకొని వుంటారు.