Tags

, ,

ఒడిషాలో తెలుగు వారిని వేధిస్తున్నారంటూ దీర్ఘకాలం ఆందోళన చేసిన తరువాత విశాఖ డివిజన్‌ను సికిందరాబాద్‌ జోన్‌లో కలిపారు. ఇప్పుడది తెలంగాణాలో వున్నది. రెండు రాష్ట్రాలలో అధికారంలోవున్న రాజకీయ నేతల తీరుతెన్నులు చూసినపుడు గతం పునరావృతం అవుతుందేమోనని అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎం కోటేశ్వరరావు

     తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లినపుడల్లా అక్కడి పాదుషా మోడీతో ఏం మాట్లాడతారో తెలియదు. మరుసటి పొద్దున్నే తాటి కాయలంత అక్షరాలతో వారి వెనుకాలే బండ్ల కొద్దీ సరకులు ఢిల్లీ నుంచి రాబోతున్నాయని, పౌరులు వాటిని అందుకోవటానికి ఆధార్‌ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడాలన్నట్లుగా కొన్ని మీడియా సంస్ధలు అందమైన కధలు అల్లుతాయి. మళ్లీ ఢిల్లీ వెళ్లేంత వరకు అసలు అలాంటి వాటి గురించి రాసినట్లు లేదా చూపినట్లే ఆ మీడియా మరిచిపోతుంది. మళ్లీ ముఖ్యమంత్రులు తిరిగి రాగానే మళ్లీ అదే తంతు. తన్నే జనం లేకనే కదా ఈ తంతు అని ఎవరైనా అనుకోవద్దు. మీరు బుర్ర వుపయోగించకుండా ఏది రాసినా లేదా చూపినా చదవటం, చూస్తుండబట్టే కదా మేమా పని చేస్తున్నాం అని వారంటారు. మీరు రాస్తూ, చూపుతుంటేనే కదా మేం చూస్తున్నాం. అని జనం అంటారు. ఇక్కడ ఎవరి బాధ్యతను వారు నిర్వహించటం లేదు కనుకనే ఈ విధంగా జరుగుతోందని చెప్పక తప్పదు.

     గురువారం నాడు మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన రెండవ రైలు బడ్జెట్‌లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చేస్తామన్న న్యాయం జరగలేదు, గతం నుంచీ జరుగుతున్న అన్యాయం ఈసారి కూడా కొనసాగింది.హైదరాబాదు, అమరావతిలో కొండంత రాగం తీసి ఢిల్లీ వెళ్లి వుదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఏమనుకోకండి సార్‌ అని నరేంద్రమోడీతో చెప్పి వస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ప్రాణ,విత్త,మాన భంగములందు ఆడితప్ప వచ్చు అన్నారు కానీ రాష్ట్ర విభజనందు అని కూడా చేర్చి వుంటే జనానికి ఇలా ఎదురు చూసే పరిస్ధితి తప్పేది. ఎందుకంటే సర్దుకుపోదాం పదండి అనే తత్వం మనకు ఎక్కువ కద. నానాటికీ తీసికట్లు నాగం భొట్లు అన్నట్లు అసలే ప్రభుత్వ వుద్యోగాలు తగ్గిపోతున్నాయి. వున్న వాటికి రిజర్వేషన్లేమిటి అని ఒకవైపు వాటిని వ్యతిరేకించే వారు, రెండోవైపు మాకు మాత్రం రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు అనే ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్న రోజులివి.

      ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామన్నది రాష్ట్ర విభజన సమయంలో చేసిన వాగ్దానాలలో ఒకటి. వుపస్త మినహా కన్యాదాన అని ఒక మొరటు సామెత వుంది. మన ఘనత వహించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక కొత్త పధకం తెస్తున్నట్లు ఈ మఢ్య చెప్పటం ఆ సామెతను గుర్తుకు తెస్తున్నది. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోను సంగతి తేల్చకుండా ఏమిటీ నాటకాలు? ఇవెందుకు కావాలని యువత అడుగుతున్నది?

      మన దేశంలో ప్రస్తుతం 16 రైల్వే జోన్లు వున్నాయి. పాలనా సాలభ్యం, ప్రయాణీకుల సౌకర్యం కోసం వీటిని ఏర్పాటు చేశామని చెప్పారు. రాజకీయాల ప్రాతిపదికన కొన్ని కొత్త జోన్లు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో 21 రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డులు వున్నాయి.ఇవి గ్రూప్‌ సి వుద్యోగాలను భర్తీ చేస్తాయి. ప్రస్లుతం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలోనూ గుంటూరు, విజయవాడ, గుంతకల్‌ తెలంగాణాలోని దక్షిణ మధ్య రైల్వేలోనూ వున్నాయి. ఒడిషాలో తెలుగు వారిని వేధిస్తున్నారంటూ దీర్ఘకాలం ఆందోళన చేసిన తరువాత విశాఖ డివిజన్‌ను సికిందరాబాద్‌ జోన్‌లో కలిపారు. ఇప్పుడది తెలంగాణాలో వున్నది. రెండు రాష్ట్రాలలోని అధికారంలోవున్న రాజకీయ నేతల తీరుతెన్నులు చూసినపుడు గతం పునరావృతం అవుతుందేమోనని అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలు ఏర్పడినపుడు గ్రూప్‌ డి వుద్యోగాలను రెండేళ్లకు ఒకసారి, సి వుద్యోగాలను ఏడాదికి ఒకసారి భర్తీ చేస్తారు.అప్పుడు ఏపి వారికి అవకాశాలు దెబ్బ తింటాయని ఇప్పటికే అనేక మంది కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అందువలన ఈ పూర్వరంగంలో కొత్త రైల్వే జోన్‌ కోసం జనం ఎదురు చూస్తున్నారు.అది విశాఖలోనా, విజయవాడలోనా అని కొంత మంది అసలు జోన్‌ ఏర్పాటు కాక ముందే తగాదా పెట్టి ఆ పేరుతో తప్పించుకో చూస్తున్నారు.

     మరి కొద్ది నిమిషాలలో నూతన రైల్వే జోన్‌ రాబోతున్నది అన్నట్లుగా దాని గురించి గత రెండు సంవత్సరాలుగా చెబుతున్నారు. గతేడాది రైల్వే బడ్జెట్‌కు ముందు జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే జోన్‌ ప్రకటన బడ్జెట్‌లో ప్రకటించటమే లాంఛనం అని చెప్పినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ వాత్సవ ఫిబ్రవరి మొదటి వారంలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక రైల్వే జోన్‌ అవసరమా లేదా అన్నదానిని తేల్చేందుకు ఒక కమిటీని వేశారని, అ కమిటీ అవసరం అని భావించిన తరువాత దానిని ఎక్కడ పెట్టాలనే సమస్య వస్తుందని,దీని గురించి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి చర్చలు జరిపారని కొన్ని నివేదికలు సమర్పించారని బడ్జెట్‌ సమావేశాలలో మొత్తం మాజిక్‌ బాక్సును తెరుస్తారని చెప్పారు. ఏడాది గడిచింది, మరో బడ్జెట్‌ కూడా వచ్చింది, బాక్సు తెరుచుకోలేదు. జోన్‌ ప్రస్తావన కూడా లేదు. నాయకులు నోళ్లు తెరవటం లేదు.