Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో దేన్నయినా తీసుకోండి, గతేడాది మా పాలన సజావుగా సాగి ఒకటి రెండు రంగాలు మినహా ఎన్నో రంగాలలో పురోగతి సాథించాం, కొన్ని ఇబ్బందులున్నా వచ్చే ఏడాది మరెంతో పురోగమించేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తాం. ప్రజల సంక్షేమానికి కొత్తగా వేల కోట్ల రూపాయలను కొత్తగా కేటాయించనున్నాం. బడ్జెట్లను ప్రవేశపెట్టబోయే ముందు చెప్పే ఈ పోసుకోలు కబుర్లు వినీ వినీ బోరు కొడుతోంది. పార్టీలు మారే వారు కూడా అభివృద్ధి కోసమే అంటూ ఇవే సోది కబుర్లు చెప్పి జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎక్కడిక్కడ ‘అపరిచితులు’ తయారైతే తప్ప ఇలాంటి వారు నోర్మూసుకోరా అనిపిస్తోంది. ఇలా కబుర్లు చెప్పేవారు ఒక్కొక్కటిగా వున్న పధకాలను నీరుగారుస్తున్నారు. లేదా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. భారాలు మోపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గితే ఆ మేరకు ఎందుకు మనకు తగ్గటం లేదనే ప్రశ్న మరోసారి అడగాలంటే సిగ్గుగా వుంది.మన పాలకులు అంతలా తెగించారు. మన పక్కనే వున్న చిన్న దేశం శ్రీలంక దశాబ్దాల తరబడి అంతరుద్ధ్యంతో లేదా వుగ్రవాదరతో నాశనమైంది. అయినా అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధర(ఈనెల 22న) మన కంటే తక్కువగా లీటరు 89,66 సెంట్ల చొప్పున వున్నాయి.( అంతర్జాతీయ కరెన్సీ డాలరు విలువలో సులభంగా వుంటుంది కనుక ఆ ధరలలో చెప్పాల్సి వస్తోంది. ఒక డాలరుకు వంద సెంట్లు) మన కంటే దరిద్రం వున్న పాకిస్తాన్‌లో 68,72 సెంట్ల చొప్పున వుండగా మోడీ గుజరాత్‌ మోడల్‌ పాలనలో మాత్రం 91,69 సెంట్ల చొప్పున చెల్లించాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు ? గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న ఈ సొమ్మంతటినీ ఎవరికి చెల్లిస్తున్నారు. చైనా కంటే మన దేశంలోనే అభివృద్ధి రేటు ఎక్కువ అని లెక్కలు చెబుతారు. ఓకే అంగీకరిద్దాం. మరి అభివృద్ధి ఫలితాలు జనానికి ఎందుకు అందటం లేదు. మనది ప్రజాస్వామ్యం అంటారా ?

గడచిన మూడు నెలల్లో మన ఆసియాలోని వియత్నాంలో పెట్రోలు ధరలు 19.4, డీజిలు ధరలు 29.1శాతం తగ్గాయి. ఇంత మొత్తంలో ప్రపంచంలో ఏ దేశంలోనూ తగ్గలేదు. మరి ఇదే సమయంలో మన దగ్గర తగ్గింది 3.1,4.4శాతమే. పాకిస్ధాన్‌లో 6.6,9.5శాతం తగ్గాయి. ఇంత కంటే సిగ్గు చేటైన విషయం ఏముంది?ఈ కాలంలో బ్రెంట్‌ ముడిచమురు ధర పీపా 43 నుంచి 30 డాలర్లకు పడిపోయింది. మన మౌన బాబా మోడీ దీని గురించి తన మన్‌కీ బాత్‌లో ఎందుకు మాట్లాడరు ?నిఖార్సయిన జాతీయ వాదులు ప్రతిరోజూ ప్రతిదాని మీదా మాట్లాడరు అనుకుందాం అసలు మనం ఎందుకు అడగటం లేదు !

గత మూడు సంవత్సరాలు 2012-13, 13-14,14-15 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకు మొండి బకాయిల కింద రద్దు చేసిన మొత్తాలు 1,14,000 కోట్ల రూపాయలు.అంతకు ముందు తొమ్మిది సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ. అన్నింటి కంటే తాను చాయ్‌ వాలానని ప్రతి పైసాకు జవాబుదారీగా వుండటంతో పాటు బ్లాక్‌మనీ బయటకు లాగి తలకు 15లక్షలు చొప్పున పంచుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ తొలి ఏడాది కాలంలో రద్దు చేసిన మొత్తం 53,100 కోట్లు కాగా రెండో ఏడాది ఈ మొత్తం మరో అంత వుంటుందని అంచనా, అంటే లక్ష కోట్ల రూపాయలు రద్దు చేసి మోడీ సర్కార్‌ రికార్డుల మోత మోగిస్తోంది. మంగళగిరి పానకాల స్వామికి ఎంత పానకం పోసినా పైకి కనపడదంటారు, మరి ఇదేమిటి ? బహిరంగంగా అప్పనంగా దొబ్బపెట్టటం కాదా ? చివరికి ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లుగా జనం పాటలు పాడుకోవటమేనా?

ఈ ఏడాది రైల్వేబడ్జెట్‌ను చూస్తే ఎప్పుడూ వచ్చే రైలు వచ్చిందీ, పోయింది అన్నట్లుగా వుంది. పరిస్ధితులన్నీ బాగుంటే ఈ ఏడాది రైల్వే మంత్రి కొత్త పధకాలను ఎందుకు ప్రకటించలేదు? డబ్బు లేకుండానే గతంలో ఎన్నో పధకాలు ప్రారంభించారు, వాటిని పూర్తి చేయటం ప్రధమ కర్తవ్యం కనుక వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని అందమైన కబుర్లు చెప్పారు. పోనీ గతం కంటే మెరుగ్గా కేటాయింపులేమైనా చేశారా అంటే అదీ లేదు. కాగితాల మీద వున్న పధకాల ఫైళ్లు కొనసాగించటానికి సరిపడా నిధులు కేటాయించారు తప్ప ఒక్కటంటే ఒక్క పధకమూ సకాలంలో ముగిసే విధంగా కేటాయింపులు లేవు. ప్రయాణీకులపై భారం పెంచలేదని మీడియాలో కొన్ని సంస్ధలు బాకాలు వూదాయి.గతంలో పెంచిన ఛార్జీలు, వివిధ సందర్భాలలో తత్కాల్‌, టిక్కెట్ల రద్దు పేరుతో భారీగా వసూలు చేస్తున్న విషయాన్ని దాచి పెట్టారు.కొన్ని తరగతుల టిక్కెట్ల ధరలు పెంచితే అవి విమాన ఛార్జీలకు దగ్గరగా చేరి ఆ బోగీలు ఖాళీగా వుండే ప్రమాదం పొంచి వుండబట్టి తప్ప ప్రయాణీకుల మీద ప్రేమతో కాదని గమనించాలి. సరకు రవాణా చార్జీలు పెంచితే ఇప్పటికే పెరుగుతున్న ధరలు మరింతగా పెరుగుతాయి, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రెండవది ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచకుండా కేవలం చార్జీలు పెంచితే జనంలో వ్యతిరేకత కూడా వస్తుందన్న విషయం తెలిసిందే.

నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది కాలంగా రైల్వేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందేమీ లేదు. దేశ ఆర్ధిక వ్యవస్ధలో అల్లావుద్దీన్‌ అద్భుత దీపంతో దేశ ఆర్ధిక వ్యవస్థ రూపు రేఖలను మార్చివేస్తామని చెప్పిన పెద్దలు దీపం అరిపోయే విధానాలు అనుసరిస్తున్నారు. సరకు రవాణా, ప్రయాణీకుల నుంచి వస్తుందని అంచనా వేసిన మొత్తానికి వచ్చిన మొత్తానికి 17వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది.ఇవిగాక ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరిపితే రైల్వేలపై మరో 32వేల కోట్ల రూపాయల ఖర్చు మొత్తం 50వేల కోట్ల రూపాయల వరకు లోటు ఏర్పడ నుంది. ఈ లోటును పూడ్చుకొనేందుకు రైల్వే ఆస్ధులను అమ్మటం, ప్రయివేటీకరణ చేయటానికి పూనుకోవటం తప్ప చార్డర్డ్‌ ఎకౌంటెంట్‌ సురేష్‌ ప్రభుగారి బడ్జెట్‌ మరొకటి ఏమైనా వుందా ?

సాధారణ బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్ధిక సర్వేలోనే బడ్జెట్‌ ఎలా వుండబోతోందో స్ధూలంగా తెలియ చేస్తారు. తాజా ఆర్ధిక సర్వేలో చెప్పిన అంశాలు సబ్సిడీలన్నీ ధనికులకే దక్కుతున్నాయన్న ప్రచార దాడి చూస్తే మిగిలిన వాటికి కూడా త్వరలో మంగళం పాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపాలో ముందు సబ్సిడీలను రద్దు చేశారు.పోయింది సబ్సిడీలే కదా అని జనం పెద్దగా పట్టించుకోలేదు. తరువాత వేతన స్ధంభన, అది తాత్కాలికమే అనుకున్నారు, ఆ తరువాత పెన్సన్లలో కోత ,మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూశారు. అన్న వస్త్రాలను అడిగితే వున్న వస్త్రాలనే లాగి వేసినట్లుగా ఒక్కొక్కదానిని లాగి వేసిన తరువాతే జనానికి తత్వం తలకెక్కి వీధులకు ఎక్కుతున్నారు. మరి మనం ఏం చేద్దాం ? ఏం చేయాలి? ఎలా చేయాలి ?