Tags

, ,

కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. వీటిలో చమురు దిగుమతులపై పన్ను అందరికీ వుపయోగపడుతుందనుకుంటే ఎక్కువ భాగం కార్పొరేట్‌లు, ధనికులకే అన్నది స్పష్టం

ఎం కోటేశ్వరరావు

సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాల దిగుమతిపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే.

ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలలో పేదలకు దక్కాల్సిన దాదాపు లక్ష కోట్ల రూపాయల మొత్తాన్ని ధనికులు కొట్టేస్తున్నారు, కనుక వాటికి కోత పెట్టాలన్నది తాజా ఆర్ధిక సర్వే సందేశం. ప్రతి ఏటా సాధారణ బడ్జెట్‌కు ముందు ఆర్ధిక సర్వే పేరుతో విడుదల చేసే పత్రంలో ప్రభుత్వ ఆలోచనను ముందస్తుగా వెల్లడిస్తారు. మన కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు, ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ తత్వం పూర్తిగా తలకెక్కిన అరవింద సుబ్రమణ్యం దీన్ని రూపొందించారు. సబ్సిడీలు మంచివే కాని వాటిని కానివారు కొట్టేస్తున్నారు కనుక కోత పెట్టాలి. ఎంత తెలివిగా వాదిస్తున్నారో కదా ?పైన పేర్కొన్న వాటిని ఏమంటారు? సబ్సిడీలు కావా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు ?కానీ ఈ పెద్దలే ప్రతి ఏటా పరోక్షంగా ఇస్తున్న లక్షల కోట్ల సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు.

కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13        5,66,234.7

2013-14        5,72,923.3

2014-15        5,54,349.04

2015-16       6,11,128.31

కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. వీటిలో చమురు దిగుమతులపై పన్ను అందరికీ వుపయోగపడుతుందనుకుంటే ఎక్కువ భాగం కార్పొరేట్‌లు, ధనికులకే అన్నది స్పష్టం.మరోవైపున నరేంద్రమోడీ ఈ మధ్య రైతుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.మరోవైపున ఏదో ఒక పేరుతో వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలను తగ్గిస్తున్నారు.