Tags

, , , , , , ,

 

ఎం కోటేశ్వరరావు

   సాంకేతికంగా చూస్తే రెండోదే కావచ్చు గానీ నరేంద్రమోడీ గారీ ముచ్చటైన మూడో బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు పెద్ద ఇబ్బందే తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన సామెత ‘కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్క కూతురై పోయింది’ అన్నట్లుగా ఇద్దరు చంద్రుల పరిస్ధితి తయారైంది. జనం ముందు ఎలా కనిపించినా తగిలిన ఎదురు దెబ్బలతో వెనక్కు తిరిగి గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు. బడ్జెట్‌ అంటే నిబంధనల ప్రకారం రూపొందించేది. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. మహారాజులు, పాదుషాల హయాం కాదిది. ఒక రాష్ట్రానికి ఒక రూపాయి అదనంగా కేటాయించాలన్నా ఏదో ఒక ప్రాతిపదిక, వాటికి సవాలక్ష నిబంధనలు వుంటాయి.వాటిని దాచి పెట్టి కేంద్రం దగ్గర తమ కెంతో పలుకుబడి వుందని చూపుకొనేందుకు కబుర్లు చెప్పటం ఒక ఫ్యాషనై పోయింది.

   హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి సీట్లేమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసని ఆయన అంతరంగంగా అందరూ పరిగణించే ఒక మీడియా వ్యాఖ్యాత ఫలితాలు వెలువడిన తరువాత ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పాటు వున్న కాలంలో చంద్రబాబు జోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి వుండాలి. తాను అభివృద్ధి చేసిన పరాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తన జనం తనకు ఒక్కటంటే ఒక్కటే కార్పొరేటర్‌ సీటను కట్టబెడతారని ముందే తెలుసుకున్నపుడు తన స్వంత రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా మోడీ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వరని చంద్రబాబుకు తెలియకుండా ఎలా వుంటుంది. అందుకే తాత్కాలిక సచివాలయం పేరుతో కధ నడిపించేందుకు పూనుకున్నారా ? ఏపికి ప్రత్యేక హోదారాదని ముందే నిర్ధారణ అయినందున అసలు అలాంటి ఒక ప్రతిపాదన వుందని కూడా ఎరగనట్లుగా అమాయకత్వం నటిస్తున్నారు.తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తారని కట్టుకధలు ప్రచారం చేశారు. వాటిని ఎంతో కాలం చెప్పలేరు కదా. దాంతో ఇప్పుడు లీకుల్లో గానీ చెప్పేవాటిలో గానీ దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

    పైసా పైసాను ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకోవాల్సిన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మాట తిరుగులేని నిజం. చంద్రబాబు నాయుడి ఇరవై నెలల పాలన చూస్తే అసలు విషయాలను దాచిపెట్టి ఏదో ఒకదానిపై జనం దృష్టిని మళ్లించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ స్థితిలో చంద్రబాబు అభివృద్ధి ఆకర్షణకు తట్టుకోలేక ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పిన లేదా రేపు చెప్పబోయే వైసిపి ఎంఎల్‌ఏలలో కొందరికి మంత్రి పదవులు, కొందరికి పైరవీలు తప్ప దక్కేది మరేమీ వుండవు, వచ్చే ఎన్నికలలో మరో పార్టీ కండువా కప్పుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేయటం కూడా అవసరమేమో ? ఎంత లేదనుకున్నా తొలిసారి మారటానికి కాస్త సిగ్గూ బిడియం, మాన,మర్యాదల గురించి జంఝాటం వుంటుంది. ఒకసారి అలవాటు పడి అదొక జీవన విధానం అయినపుడు మారేవారు , చేర్చుకొనే వారు సిగ్గుపడితే పనులెలా అవుతాయి? రాజకీయాల్లో కిక్కేముంటుంది?

     అమరావతి శాశ్వత రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర బడ్జెట్‌ మౌనం దాల్చింది. నూతన రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదా నిర్మించాలని చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. నాలుగు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది కావాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. పెద్ద ఎత్తున వందల కోట్లు ఖర్చు చేసి రాజధాని శంకుస్తాపన పేరుతో నిధులు తగలేశారు. దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని చెబుతున్న మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతాయి . జనం సొమ్ము కాంట్రాక్టర్ల పాలు కావటమే. ఇప్పటికే రెవెన్యూ ఆర్ధిక లోటు రు.13,779 కోట్లు వుండగా ఒకటి తాత్కాలికంగా, మరొకటి శాశ్వత రాజధాని నిర్మాణానికి వుదారంగా ఖర్చు చేసే డబ్బు ఎక్కడుంది? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా ఈ ఖర్చు ? వుమ్మడి రాజధానిగా మరో ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదులో వున్న వసతులను వుపయోగించుకోవటానికి అవకాశం వుండగా తాత్కాలిక సచివాలయం పేరుతో మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం ఏ జవాబుదారీతనం కిందికి వస్తుంది ? వాటినే శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఎందుకు వుపయోగించరు? ఈ ప్రశ్న వస్తుందని గ్రహించే తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా భవిష్యత్‌లో వుపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదే వాస్తవం అయితే తన మకాం విజయవాడకు మార్చే సమయంలోనే హైదరాబాదులోని తన కార్యాలయ సుందరీకరణకు పదుల కోట్లు ఎందుకు వెచ్చించినట్లు ? ఆ తరువాత ఒక్క రోజైనా ఆఫీసును వుపయోగించుకున్నారా ? ఇప్పటికే మంత్రులు, అధికారులు పనీ పాటా లేకుండా విజయవాడ-హైదరాబాదు చుట్టూ తిరుగుతూ అనవసరంగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది.

     కేంద్ర నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా అడుక్కోవటంలో పిసినారితనం ఎందుకన్నట్లుగా రాజధాని పరిసరాల్లో పెట్టబోయే పరిశ్రమలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీలు ఇవ్వాలన్న కోరికను కేంద్రం అసలు పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు రెండువేల కోట్లు అడిగితే వంద కోట్లు ప్రకటించారు. అంతకంటే పెద్ద దైన విశాఖ మెట్రోకు మాత్రం మొండిచేయి చూపారు.అసలే అవి గిట్టుబాటు కావన్న అభిప్రాయం వుండగా ఇలాంటి కేటాయింపులతో నిర్మాణ భారం పెరిగిపోతే వాటిని జనం నెత్తిమీదే కదా రుద్దేది? ఇక కేంద్రం ప్రకటించిన విద్యా సంస్ధల భవన నిర్మాణాలకు కూడా విదిలింపులే తప్ప గణనీయమొత్తాలను కేటాయించలేదు. దీని వలన అరకొర అద్దె లేదా వసతులు లేని భవనాలలోనే వాటిని దీర్ఘకాలం కొనసాగించాలన్నమాట.

      తెలంగాణా పరిస్ధితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఆ మధ్య ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జరిపి మోడీ పాదుషా గారిని ఖుషీ చేసేందుకు ముఖస్తుతి చేసి వచ్చినట్లు ,ఎంతో ఆత్మీయంగా, చొరవగా మాట్లాడినట్లు మీడియా కధనాలు వచ్చాయి. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పధకాలకు 30వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని, కొన్నింటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభువులకు కెసిఆర్‌ పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 30వేల కోట్ల పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న బకాయిలను కూడా పూర్తిగా చెల్లించని కేంద్రం గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా వంద కోట్లు కేటాయించింది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు 150వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి గాని పూర్తి కాదేమో ?అలాంటపుడు అలూచూలూ లేని తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందా?

     బడ్జెట్‌ ప్రతిపాదనల తీరుతెన్నులను చూసినపుడు గత యుపిఏ పాలనకూ, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ వర్తింప చేస్తామన్న నరేంద్రమోడీ పాలనకూ ఇంతవరకు పెద్ద తేడా ఏముంది? కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచారు. ఇది హర్షణీయమే. ఇదే సమయంలో కొన్ని పధకాల అమలు బాధ్యతను రాష్ట్రాలపై మోపటం ద్వారా ఆ పెంపుదల కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా అయింది తప్ప వేరు కాదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాని పర్యవసానం రానున్న సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పధకాలపై తీవ్రంగా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.నిధులకు ఎంత కటకట ఏర్పడితే పాలకులు కబుర్లు అంత ఎక్కువగా చెబుతారు.అంతగా జనం మోసపోతారు.