Tags

, , , , , , ,

నేతి బీరలో నెయ్యి -మోడీ రైతు బడ్జెట్‌

మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌  2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది.

ఎం కోటేశ్వరరావు

       సుప్రసిద్ద లాయర్‌ అయిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అందమైన పదాలతో ఈనెల ఒకటిన ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ గురించి కల్పించిన భ్రమలు లేదా ప్రచారంతో నిజంగానే రైతులు తమ ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఆశపడుతున్నారు. తాను రావటమంటేనే రైతులకు మంచి దినాలు వచ్చినట్లని నరేంద్రమోడీ రెండు సంవత్సరాల క్రితం తెలిపారు. పాపం ఈ విషయం తెలియక లేదా చెడుదినాలు దాపురించి గాని స్వయంగా బిజెపి పాలనలోని మహారాష్ట్రలోనే మోడీ గద్దె నెక్కిన తరువాత 1130 మంది రైతులు బలవన్మరణం చెందారు. అదే రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీ గోపాల్‌ షెట్టి రైతులు ఆత్మ హత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని సెలవిచ్చారు. అది తమ పాలన అని కూడా మర్చిపోయారు పాపం. ఆత్మహత్యలు కొనసాగుతుండటంతో మహారాష్ట్రలోని 28 మంది మంత్రులు ఒకే రోజు పర్యటన జరిపి అసలేం జరుగుతోందో తెలుసుకొమ్మని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ఆదేశించారు.ఇదంతా మోడీ రైతు బడ్జెట్‌ ప్రకటించిన తరువాతే సుమా !

    మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌ 2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన సూటూ బూటూ నలగ కుండా అలాంటి వారి మధ్యనే విదేశాలు, స్వదేశంలో తిరిగే ప్రధాని నరేంద్రమోడీ ఈ మధ్య కాలంలో తొలిసారిగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. త్వరలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నాయి కదా అని ఎవరైనా అంటే వారి గోడు ఎవరు వినిపించుకుంటారు చెప్పండి. ప్రతివారికీ ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ద్వారా తాము చెప్పదలచుకున్నదానిని గోబెల్స్‌ మాదిరి పదే పదే చెప్పటం తప్ప ఎదుటివారి విమర్శలను విననట్లు ప్రవర్తించటం మోడీ గారికి బాగా అబ్బింది. అందుకే మన్‌కీ బాత్‌ పేరుతో నెల నెలా జన్‌కీ బాత్‌తో పని లేకుండా తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు.

    బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు ఒడిషా, కర్ణాటకలోలో బిజెపి నిర్వహించిన రైతుల సభలో ప్రధాని ఒక విషయం చెప్పారు. అది కొందరికి స్వంత డబ్బాలాగా అనిపించవచ్చు, మరి కొందరికి ‘అబ్బ ఎంతబాగా చెప్పిండు’ అన్న పరవశం కూడా కలిగించవచ్చు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందంటూ చేసిన ఆరోపణల సందర్బంగా తన ప్రభుత్వం యూరియా దుర్వినియోగం కాకుండా దానికి వేపపూత పూస్తున్నందుకు అక్రమార్కులకు మంటగా వుందని, వారు తనను వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పారు.

   యూరియా మన దేశం నుంచి పక్కనే వున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు దొంగ రవాణా అవుతోందని చాలా కాలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంటుంది కనుక దాన్ని అరికట్టటానికి మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్రంపై ఎక్కువగా వుంటుంది. ఒక్క యూరియా మాత్రమే ఎందుకు దుర్వినియోగం అవుతోంది, మిగతా ఎరువులు ఎందుకు తరలి పోవటం లేదు? దీని గురించి కూడా ప్రధాని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.

     అసలు విషయం ఏమంటే మన ప్రధాని నరేంద్రమోడీ (ప్రధానిగా) పుట్టక ముందే వేప పూత యూరియా తయారు చేస్తున్నారు. యూరియా నుంచి విడుదలయ్యే నైట్రోజన్‌ సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే దానికి వేప పూత అవసరమని, అలాంటి యూరియా వలన దిగుబడులు పెరిగాయని కనుకొన్న మన శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు గత దశాబ్ది కాలంగా దాని వినియోగం, తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2011-12లో 3.62 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు(ఎంఎంటి)గా వున్న వేప పూత యూరియా అమ్మకాలు 2013-14లో 6.34 ఎంఎంటికి పెరిగాయి. గత ప్రభుత్వమే వేప పూత యూరియా తయారీపై వున్న కొన్ని అంక్షలను తొలగించి సబ్సిడీ యూరియాను నూటికి నూరుశాతం వేప పూతతో తయారు చేయాలని స్వదేశీ వుత్పత్తిదారులను ఆదేశించింది. ఇతరంగా కూడా కనీసం 75శాతం వేప పూత యూరియా తయారు చేయాలని ఆదేశించింది.మోడీ అధికారానికి వచ్చిన 2014లో మన దేశంలో టన్ను యూరియా ధర 86.76 డాలర్లు వుండగా పాకిస్ధాన్‌లో 260.19, బంగ్లాదేశ్‌లో206.74, చైనాలో 264.82 డాలర్లుగా వుంది. అందువలన దొంగరవాణాను వేపపూత అడ్డుకుంటుందని చెబితే పిచ్చి బియ్యం పెడతానని బెదిరించే చిన్ననాటి అమ్మమ్మ కబుర్లు తప్ప మరొకటి కాదు.

     ఎరువుల ధరల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో డిఎపి ధర 2011 అగస్టు నెలలో 603 డాలర్లు వుండగా 2016 జనవరిలో 385 డాలర్లకు తగ్గింది. అదే మన దేశంలో 2010-11లో సగటున టన్ను ధర రు.10,750 వుండగా ఈ ఏడాది జనవరిలో 26 వేల రూపాయలు వుంది. ఇదే విధంగా ఎంఓపి ఇతర ధరల నియంత్రణ నుంచి తొలగించిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా ధరలో పెద్ద మార్పులేదు. మిగతా దేశాలలో కూడా యూరియాఏతర ఎరువుల ధరలు పెరిగిన కారణంగా దొంగరవాణా లేదు. దీని అర్ధం ఈ కారణంగా మన దేశంలో యూరియా ధర పెంచమని కాదు, పెంచాలన్నా వీలు కాని స్ధితి అన్నది వేరే కధ.

      1997-98 వరకు డిఎపి, ఎంఓపి వంటి ఎరువుల ధరలు యూరియా కంటే కొంచెం తక్కువగానో ఎక్కువగానో వుండేవి. అందువలన రైతులు శాస్త్రవేత్తలు చెప్పినట్లు తగు పాళ్లలో వాటిని వినియోగించారు. తరువాత సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు నూట్రియంట్‌ ప్రాతిపదిక విధానాన్ని ఎప్పుడైతే అమలులోకి తెచ్చారో ఇతర ఎరువుల ధరలు యూరియా కంటే ఐదు రెట్ల వరకు పెరిగి అందుబాటులో లేకుండా పోయాయి.మన పాలకుల అసమర్ధత కారణంగా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్‌లో డిఏపి, ఎంఓపి ధరలు తగ్గినా మన రైతాంగానికి పెద్దగా తగ్గలేదు.మరోవైపున సబ్సిడీ రద్దయింది.దీంతో రైతులు యూరియాను ఎక్కువగా వినియోగించటంతో రైతులకు నష్టదాయకమైన అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందువలన కాంప్లెక్స్‌ ఇతర ఎరువుల ధరలను యూరియా స్ధాయికి తగ్గిస్తేనే రైతాంగానికి అచ్చే దిన్‌ వచ్చినట్లు లేకుంటే పొలాల సారం దెబ్బతిని మరింతగా చచ్చే దినాలు వస్తాయి. గతేడాది ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ నిమిత్తం 72,447 కోట్లను ప్రకటించింది. ఎంత ఇచ్చిందీ తెలియదు. ఈ ఏడాది 70వేల కోట్లని పేర్కొన్నది. ఈ మొత్తంలో 51వేల కోట్ల రూపాయలు కేవలం యూరియాకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిన్నింటికి కలిపి కేవలం 19వేల కోట్లే. ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని రైతుల వారీ లెక్కవేస్తే సాగు భూమి 14 కోట్ల హెక్టార్లుగా వున్నందున సగటున ఎకరానికి రెండువేల రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేసి ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని మోడీ సర్కార్‌ ఆలోచిస్తున్నది. ఇదే జరిగితే యూరియా ధరకు కూడా రెక్కలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. దీని వలన కౌలు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. వారికి ఈ మాత్రం కూడా దక్కే అవకాశం లేదు. పది ఎకరాలు మించి పెద్ద రైతులకు సబ్సిడీ లేదన్నా లేదా తగ్గించి ఇస్తామన్నా వారి పొలాలను సాగు చేసే అరక్షిత కౌలుదార్లు అదనంగా ఖర్చు చేయాల్సిందే. నరేంద్రమోడీ ఈ విధానాలను సవరిస్తారా లేదా అనేదాన్ని బట్టి రైతుల సంక్షేమం వుంటుంది.అలాంటి సూచనేమీ బడ్జెట్‌లో లేదా ఆర్ధిక సర్వేలో లేదు కాబట్టి గత కాంగ్రెస్‌ బూట్లతోనే నడిచేందుకు పూనుకున్నారని అన్న వారిని దేశద్రోహులు అంటే కుదరదు.

     రైతుల నేటి దుస్ధితికి గత పాలకుల విధానాలే కారణమని బిజెపి విమర్శించింది. దానిలో ఎలాంటి తప్పు లేదు. 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలు లేదా నయా వుదారవాద విధానాలు దీనికి నూటికి నూరు పాళ్లు కారణం, ఈ కాలంలో వాటిని గతంలో ఐదు సంవత్సరాలు అమలు జరిపిన బిజెపి ఎన్‌డిఏ ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వక తప్పదు. ఇప్పుడు సమస్య ఏమంటే ఆ విధానాలను మార్చ కుండా మోడీ రైతాంగానికి మంచి దినాలను ఎలా తీసుకు వస్తారు? గుజరాత్‌ మోడల్‌ అన్నారు. దాని ప్రకారం పెట్టుబడులైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు , మద్దతు ధరలు ఎక్కువ ఇచ్చారా ? లేదు దేశ వ్యాప్తంగా ఒకే ధరలు. మొదటి బడ్జెట్‌లో విధానపరమైన అంశాలేమీ పేర్కొన లేదు. రెండు, మూడవ బడ్జెట్లలో కూడా వాటి ప్రస్తావనే లేదు. గత పాలకుల విధానాలు మార్చకుండా రైతాంగానికి రెట్టింపు ఆదాయం ఎలా కల్పిస్తారు? మంత్రదండం ఏమైనా వుందా ?

      మన వ్యవసాయ రంగం కుదేలవటానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారకులు ఎవరు? మహారాష్ట్ర బిజెపి ఎంపీ చెప్పిన ప్రకారమైతే ఆత్మహత్య కూడా ఒక ఫ్యాషన్‌గా మారింది.అంటే తమ ఆత్మహత్యలకు తామే కారకులు. పాలకుల విధానాలు ఎలా దెబ్బతీస్తున్నాయో ఎరువుల గురించి చెప్పుకున్నాము. ప్రకృతి వైపరీత్యాలైన అతి వృష్టి,అనా వృష్టి అందుకు తోడ్పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే వుప్పు సముద్రం పాలవుతున్న గోదావరి జీవ జలాలతో లక్షలాది బీడు భూములు పచ్చపచ్చగా మారతాయని, విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతాయని ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు. రైతు బడ్జెట్‌ అని అనేక మంది కీర్తిస్తున్న ఆ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గంగ శుద్ధికి రెండున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించిన పోలవరానికి కేటాయించిన మొత్తం వంద కోట్ల రూపాయలు. ఈలెక్కన కేటాయింపులు జరిపితే అది పూర్తి కావటానికి మరో 50-60 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.అయినా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తలుపు చెక్కతో కాకపోయినా తమలపాకుతో కూడా అంటించి గట్టిగా మాట్లాడటానికి సాహసించటం లేదు. విరోధంతో కంటే స్నేహంతో సాధించుకోవాలని కబుర్లు చెబుతున్నారు. విరోధం తెచ్చుకోమని, తొడగొట్టమని ఎవరు చెప్పారు. కనీస నిరసన తెలపటం బాధ్యత కాదా? గుడ్డి కన్ను మూస్తే ఏమిటి తెరిస్తే ఏమిటి అన్నట్లుగా స్నేహంగా వుండి, కొంత మందికి కేంద్ర మంత్రి వర్గంలో వుద్యోగాలిప్పించి సాధించింది ఏముంది ? గంగ శుద్ధికి నిధులు ఇవ్వవద్దని చెప్పటం లేదు. అది ఈనాటి సమస్య కాదు, అంత తేలిక కూడా కాదని హైదరాబాదులో మూసీ, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి పధకాలు వెల్లడించాయి. ముందు గంగను కలుషితం చేస్తున్న వారిని అదుపు చేసిన చర్యలున్నాయా ? జనానికి అవసరమైన ఆహారాన్ని పండించే ప్రాజెక్టులకా మొదటి ప్రాధాన్యత లేక మరొకదానికా ?

      వ్యవసాయరంగ పునరుద్దరణ అంటే ఖాయిలా పడినదానిని తిరిగి పనిచేయించటానికి వివిధ పధకాలకు 35,984 కోట్ల కేటాయింపుతో పాటు పన్నులు వేసే అన్ని సేవలపై 0.5శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ వసూలు ద్వారా సమకూరే మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేస్తారు. అంటే జనంపై అదనపు భారాలు మోపుతారు. జనంలో రైతులు కూడా వుంటారు కనుక కొత్త పెన్షన్‌ పధకం ప్రకారం వుద్యోగులు, కార్మికులు తమ పెన్షన్‌కు తామే నిధులు సమకూర్చుకున్నట్లుగా రైతులు కూడా తమ కల్యాణానికి తాము కూడా తమ వంతు నిధులు సమకూర్చుకోవాలి. నూతన పంటల బీమా పధకం గురించి రైతాంగంలో ఎన్నో ఆశలు కల్పించారు.అది అమలులోకి వచ్చిన తరువాత గానీ అసలు విషయం అర్ధం కాదు. ఈ పధకం అమలుకు కేంద్రం-రాష్ట్రాలు చెరి సగం నిధులు భరించాలి. ఏడాదికి 17,600 మేరకు అవసరమౌతాయని అంచనా వేశారు. కానీ బడ్జెట్‌లో రు.5500 కోట్లు మాత్రమే ప్రకటించారు. అంటే ఈ ఏడాది పూర్తిగా అమలు జరగదని అనుకోవాలి.

   మరో ముఖ్య సమస్య కనీస మద్దతు ధరలు. అవి వున్నా రైతాంగానికి పెద్ద వుపయోగం లేకుండా పోతోంది. ఒక్క యూరియా తప్ప మిగతా పెట్టుబడులన్నీ విపరీతంగా పెరిగి పోయాయి. వాటితో పోలిస్తే మద్దతు ధరలు ఏ మూలకు చాలవు. వాటిపై తమ విధానమేమిటో ఇంత వరకు వెల్లడించలేదు.మిగతా అంశాలకు సంబంధించి రైతాంగానికి భారాలు తగ్గించే లేదా ఆదాయాలు పెంచే నిర్దిష్ట పధకాలు, విధానాలేవీ బడ్జెట్‌లో లేవు.ఫలానా సమస్యపై మాది ఫలానా విధానం అంటే దాని గురించి ఒక అభిప్రాయమో అభినందనో చెప్పవచ్చు. అదేమీ లేదు. వాటి గురించి కారణ జన్ముడిగా భావిస్తున్న నరేంద్రమోడీ నోరు విప్పరని తేలిపోయింది. కనీసం ఆయన శిష్య పరమాణువులు లేదా భక్తులైనా చెప్పాలి.