Tags

, , , , ,

సత్య

   అబ్బో ఆ భూములన్నీ వారే దగ్గరుండి కొనిపించినట్లు, రిజిస్టర్‌ చేయించినట్లు రాశారే అని అమరావతి ప్రాంతంలో అధికారపక్ష నేతలు భూములు కొనుగోలు గురించి వచ్చిన వార్తలను చూసి ఒక వ్యక్తి వ్యాఖ్య.

   నిజమే, వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని ఇప్పటికీ తెలుగు దేశం వారు చెబుతున్నారు. అంటే జగన్‌ ఆ డబ్బంతా తీసుకుంటున్నపుడు వారంతా దగ్గరుండి చూశారా, లేక వారే ఇప్పించారా అని తాపీగా మరొకరి ప్రశ్న.

     వాస్తవం ఏమిటి ?ఎంతో కొంత రెండూ నిజమే. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.అసలు అవినీతి పాల్పడని వారు ఎవరు అని జనం అనుకొంటున్న స్ధితిలో ఎవరూ అక్రమంగా సంపాదించటానికి వెనుకాడటం లేదు. సిగ్గు పడటం అసలే లేదు, ఆడామగా తేడా, వయస్సు బేధం లేదు, సంపాదించకపోతే జనమే అసమర్ధులంటారు కదా !

    అమరావతి ప్రాంతంలో ఎవరి డబ్బు పెట్టి వారు భూములు కొంటే తప్పేంటి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అమాయకంగా, ఎంతో ప్రజాస్వామ్య యుతంగా అడుగుతున్నారు. ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం, నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే అని కూడా చెప్పారు. నిజమే కదా తప్పేముంది !

    జగన్‌ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ముఖ విలువ కంటే ఎన్నో రెట్లకు వాటిని కొనుగోలు చేసినట్లు ,ఆ రూపంలో అక్రమంగా లంచాలు సమర్పించినట్లు తెలుగుదేశం వారు విమర్శించారు. వారి డబ్బు వారిష్టం ఒక రూపాయి వస్తువును వందరూపాయలు పెట్టి ఎందుకు కొన్నారంటే అది వారిష్టం అని జగన్‌ మద్దతుదార్లు సమర్ధించారు.అదీ చట్టబద్దంగానే జరిగింది, రికార్డులలో వున్నది కావాలంటే చూసుకోండి అన్నారు. చిత్రంగా వుందే అదీ నిజమే కదా ! కాదంటారా ?

    అప్పుడు జగన్‌ కంపెనీ రికార్డులను చూపి అవినీతి జరిగిందని తెలుగు దేశం వారు విమర్శించారు.ఇప్పుడూ అదే పద్దతుల్లో దస్తావేజులను చూసి చూపి జగన్‌ మీడియా లేదా మద్దతుదార్లు బదులు తీర్చుకున్నారు. కాదంటారా ? అవునంటారా ?

   పక్కవారిపై బురదజల్లి తుడుచుకోమన్నట్లు నిజం నిరూపించుకో అంటున్నారు ఎక్కడైనా అవినీతి వుంటే చర్యలు తీసుకోవచ్చు అన్నారు చంద్రబాబు.

   లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌పై ఆరోపించి కాదని రుజువు చేసుకోమన్నపుడు చంద్రబాబుకు ఆయన సైనికులకు ఈ తర్కం బహుశా గుర్తులేదేమో కదా !

    జగన్‌ లేదా రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నాయకుడు, నాయకురాలూ, వారి వారసులూ అవినీతికి పాల్పడలేదని ఎవరూ అనటం లేదు, అవి తేలే వరకు ఆరోపణలు, అంతవరకు నిందితులు మాత్రమే.

     అప్పుడూ-ఇప్పుడూ జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. అదే నేటి ప్రత్యేకత. ఎవరూ అతీతులు కాదు.

     జగన్‌ పత్రిక ఇష్టానుసారం రాసిందని, ఆ రాతలతో అమరావతి ఇమేజ్‌కు పెద్ద డామేజ్‌ చేయటమే లక్ష్యమని, ఆ పత్రిక రాసిన రాతలు నిరూపించకపోతే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ప్రతి భారత పౌరుడికీ వున్న హక్కు. వుపయోగించండి, మరొకరు ఇలా రాయకుండా చేయండి.

     ఇక్కడ మరో సమస్య అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్‌ ఇమేజ్‌ను ఎవరు ఎంత డామేజ్‌ చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పది సంవత్సరాల పాటు రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులపై పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా, కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి రెండు పత్రికలు, రెండు టీవీ ఛానల్స్‌ మద్దతుతో చేసిన ఆరోపణలతో రాష్ట్ర ఇమేజ్‌ డామేజ్‌ కాలేదా ? అక్కడకు వెళితే మా కెంత ఇస్తారు అని పీక్కు తింటారని విదేశీ కంపెనీలు అనుకోలేదా ? అందువలన ఇప్పుడు అమరావతి కుంభకోణాల గురించి రాయటంతో కొత్త వారు వచ్చినా ఇంతే కదా అని ఎవరూ రారని కదా చంద్రబాబు లబలబలాడి పోతున్నారు. ఇక్కడొక పాయింటు వుంది, గతంలో ఇలాంటి డామేజ్‌ను ఎదుర్కొన్నవారు దాన్ని తొలగించలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు తన చాణక్య నీతితో దాన్ని సరిచేయలేరా ? అవి కేవలం ఆరోపణలే వాస్తవాలు ఇవీ అని టెక్‌ బాబు డిజిటల్‌ టెక్నాలజీతో నిరూపించలేరా ?

     కానీ కొన్ని విషయాలు సామాన్యులకు అర్ధం కావటం లేదు. భూములు కొన్నది ఎవరో ప్రయివేటు వ్యక్తులైతే వారి గురించి చర్చ, బయట పెట్టాల్సిన అవసరం లేదు.అవి కూడా వాస్తవానికి రహస్యమైనవి కాదు. ఎవరైనా ఆసక్తి ప్రదర్శిస్తే వాటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాంటి దారిలోనే కదా జగన్‌ కంపెనీల వివరాలన్నీ చంద్రబాబు లేదా ఆయన మద్దతుదారులు తెలుసుకోగలిగింది. అసలు అమరావతి ప్రాంతం, గ్రామాలు కూడా ఎక్కడుంటాయో తెలియని వారు కోట్లు పెట్టి స్ధలాలు కొనటం దగ్గరే అసలు సమస్య వచ్చి పడింది. డబ్బున్న వారు స్దలాలు కొనటం కొత్త విషయమేమీ కాదు, అధికారంలో వున్న పెద్దలందరూ కూడబలుక్కున్నట్లు అమరావతి ప్రాంతంలోనే ఎలా కొన్నారన్నది సమస్య. మిగతా వారంతా వేరే చోట ఎందుకు కొన్నారు, అమరావతి ప్రాంతంలో కొన్న వారంతా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యుల బినామీలన్నది విమర్శ. దస్తావేజుల వివరాలతో సహా ఒక పత్రిక ప్రచురించింది. అవే రుజువులని, చెబుతోంది. అంతకంటే ఇంకా ఏమి రుజువులు ఇవ్వాలి. ఒక వేళ అవి నకిలీ దస్తావేజులైతే సదరు పత్రిక యాజమాన్యం మీద, వాస్తవమే అయితే తన మంత్రులు, ఎంఎల్‌ఏల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకుంటారా లేదా ? అధికారంలో వున్నవారికి ఆ మాత్రం కనీస బాధ్యత కూడా లేదా, ఎవరికీ ఇవ్వని అవకాశం తనకు ఇచ్చారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు కదా? అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా వారందరూ ఎదురు చూస్తున్న వాస్తవాలను బయట పెట్టి అవసరమైతే తాటతీసి తన నిజాయితీని వెల్లడించుకోవచ్చు కదా ! లేకపోతే తన ఇమేజ్‌ను తానే డామేజ్‌ చేసుకున్నట్లు అవుతుందేమో ?