Tags

, , , , , , , , , ,

ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

సత్య

     విస్సన్న చెప్పిందే వేదం అన్నట్లుగా తాము చెప్పిందే అసలైన జాతీయవాదం, దానికి భిన్నమైనది దేశ ద్రోహం అని సంఘపరివార్‌ ఈ దేశ పౌరుల చేత బలవంతంగా అంగీకరింపచేయాలని చూస్తున్నది. దానితో ఏకీభవించినా లేకపోయినా ఒకటి మాత్రం వాస్తవం. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ వుదంతాలపై మొత్తానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌ ప్రసంగపు కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఎవరిదో గానీ అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్న పాత సినిమా పాటలా అయింది. పెద్ద పెద్ద చదువులు, పట్టాలు పొందటం,పరిశోధనలు చేయటం, తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్లు తప్ప సామాజిక అంశాలపై అసలు చర్చలు, వాదోపవాదాల మధనం లేకుండా నిస్సారంగా, నిస్తేజంగా, తాతగారి నాన్నగారి భావాలకు దాసులుగా తయారవుతున్న మెజారిటీ యువతను మరోమారు మంచి-చెడు చర్చించే దిశగా కాషాయ పరివార్‌ వ్యవహరించింది. అది చెప్పే భావజాలాన్ని అంగీకరించే లేదా వ్యతిరేకించే శిబిరాలుగా సమీకృతం అయ్యే విధంగా జనాన్ని ముందుకు నెడుతున్న సంఘపరివార్‌కు  ‘అభినందనలు’చెప్పాలి.

   మానవ సమాజం ఎప్పుడూ ముందుకే పోయిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. దానిని వెనక్కు తిప్పే శక్తులు ప్రతి తరంలోనూ ప్రయత్నిస్తాయి, ఎదురు దెబ్బలు తింటాయి. అందువలన పురోగమన వాదులెవరూ చర్చకు భయపడరు. మా తాత చెప్పాడు గనుక మానాన్న చేశాడు, మా నాన్న చేశాడు గనుక ఎలాంటి ఆలోచన లేకుండా నేనూ చేస్తున్నాను, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, దాని వలన లాభం సంగతేమో తెలియదు గానీ నష్టం లేదు కదా అనే గొర్రెదాటు పద్దతి ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. అలాంటి వారిని సున్నితమైన మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఆకట్టుకోవటం సులభం. ప్రపంచంలో ప్రతి తిరోగమన శక్తీ ఈ బలహీనతను వుపయోగించుకొనేందుకు ఎల్ల వేళలా ప్రయత్నిస్తుంది. మన దేశం అందుకు మినహాయింపు కాదు. అలా చేయటం తనకు లాభదాయకమన్న దురాశ అంతర్గతంగా లేకపోతే సంఘపరివార్‌ తన అజెండాను ముందుకు నెట్టదని అనేక గత వుదంతాలు, పరిణామాలు రుజువు చేశాయి. అది శృతి మించి బలప్రయోగానికి దిగినపుడు ప్రతిఘటన ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతోంది అదే.

   

       జాతీయవాదానికి మన స్వాతంత్య్ర వుద్యమం చెప్పిన అర్ధం, ఆచరణ వేరు.ఇది బానిస బంధాల నుంచి విముక్తి . జర్మన్‌ నాజీ హిట్లర్‌ తన దేశంలో ముందుకు తెచ్చిన జాతీయవాదపు లక్ష్యం, లక్షణం వేరు. అది ప్రపంచ దేశాలను ఆక్రమించుకొనే, కార్మిక వర్గాన్ని అణచేందుకు. స్వాతంత్య్ర వుద్యమ జాతీయ వాదంతో సంఘపరివార్‌ ఏకీభవించలేదు కనుకే అది దూరంగా వుంది. దాని నాయకత్వం బ్రిటీష్‌ ప్రభుత్వానికి సలాం కొట్టి లొంగిపోయింది. హిట్లర్‌ మాదిరి తాను చెప్పే అఖండ భారత్‌ జాతీయ వాదానికి తనదైన భాష్యం, లక్ష్యంతో సంఘపరివార్‌ ఒక మతాన్ని, ఒక పరాయి దేశాన్ని మిళితం చేసి మనోభావాన్ని చొప్పించి యువతను ప్రభావితం చేసేందుకు పూనుకుంది. కేంద్రంలో, పలు రాష్ట్రాలలో తన అధికారాన్ని వుపయోగించి ప్రతి చోటా తన భావజాలాన్ని రుద్ధేందుకు, అలాంటి శక్తులకు స్ధానం కల్పించేందుకు పూనుకుంది. గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర తప్ప పెద్దగా మరో అనుభవం లేని తన సభ్యుడైన ఒక చిన్న నటుడిని ప్రతిష్టాత్మక పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ అధిపతిగా నియమించినదానికి ప్రతిఘటన తలెత్తినపుడు , తరువాత మద్రాస్‌ ఐఐటిలో గుర్తింపు పొందిన పెరియార్‌ అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ ఆకాశరామన్న పేరుతో చేసిన ఫిర్యాదుపై దాని గుర్తింపు రద్దు చేసినపుడు జనం పెద్దగా స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యు వుదంతాలతో ఇప్పుడు మొత్తం చదువుకున్న వారందరూ ఇదేమిటి అని చర్చించకపోయినా ఒక గణనీయ భాగమైనా ఆలోచిస్తున్నది. కొన్ని శక్తులు, సంస్ధలు, వ్యక్తుల గురించి సానుకూల వైఖరితో గుడ్డిగా నమ్మే వారు ఇదేదో తేడాగా వుంది అనుకుంటున్నారా లేదా ? అది చాలు నిజాలేమిటో తెలుసుకొనేందుకు ? ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

     సంఘపరివార్‌ అసలు తర్కానికి, వాదోపవాదాలకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అది మా విశ్వాసం అంటారు తప్ప తర్క, హేతుబద్దతకు కట్టుబడే తెగ కాదు. వేదకాలంలోనే మన దగ్గర పైలట్లు, ఇంధనంతో పనిలేని ఖండాంతర విమానాలు వున్నాయి అంటారు. దానికి రుజువు ఏమిటంటే పురాణాల్లో , ఇతిహాసాలలో వుంది, మేం నమ్ముతున్నాం, మా విశ్వాసం అంటారు తప్ప మరో మాట వుండదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో వెల్లడించి దేశాన్ని అగ్రస్ధానంలో వుంచి మేరా భారత్‌ మహాన్‌ అనే పుణ్యం కట్టుకోండి, దేశభక్తులని నిరూపించుకోండి అని ఎవరైనా అంటే మన వేదాలూ, పురాణాలను అపహాస్యం చేస్తున్నారు, మా మనోభావాలను గాయపరుస్తున్నారంటూ దెబ్బలాటలకు దిగుతారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇంత పెద్ద దేశంలో సమాచారం అందుబాటులోకి వచ్చిన తరుణంలో మనోభావాల చాటున తప్పించుకోవాలంటే అంటే నడవదు. వక్రీకరణలు కుదరవు. అందుకే ప్రతి విద్యా సంస్ధ, ప్రతి ఫ్యాక్టరీ, వాణిజ్యసంస్ధ , ఆఫీసు, ఇల్లు , చివరికి ప్రతి మనిషీ ఒక చర్చా కేంద్రం కావాలి. మధనం జరగాలి. వాస్తవాన్ని రాబట్టాలి.

     దుర్గ అంటే మహిషాసురుడిని మర్ధించిన ఒక దేవతగా పురాణాలను బట్టి జనం ఇప్పటి వరకు అనుకుంటున్నారు. అవి పుక్కిటి పురాణాలని కూడా అనుకొనే వారు లేకపోలేదు. తమ వాదనలకు మద్దతుగా వాటి నుంచే వుదాహరణలుగా తీసుకొని ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. పురాణాలకు భిన్నమైన రీతిలో దుర్గ గురించి ఎక్కడా మనకు తెలియదు. ఆమె ఒక వ్యభిచారిణి అని ఒక సంఘం వారు ఒక కరపత్రంలో రాశారని కేంద్ర మంత్రిగారు పార్లమెంట్‌లో చదివి రికార్డులలో ఎక్కించటాన్ని ఏమనాలి. ప్రపంచంలో ఏసుక్రీస్తు, మేరీ, మహమ్మద్‌ ప్రవక్త, రాముడు, కృష్ణుడో మరొక దేవతో దేవుడి గురించో తూలనాడిన వారు చరిత్రలో మనకు ఎందరో కనిపిస్తారు. కానీ అలాంటి వాటన్నింటినీ సేకరించి చట్ట సభల్లో ప్రస్తావించిన ఘనత ప్రపంచంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏకు తప్ప నాకు తెలిసినంతవరకు మరొకరికి దక్కదు. ఎవరైనా వుదాహరణలు చూపితే నా అభిప్రాయాన్ని సవరించుకుంటాను. చట్ట సభలను ఎలా దుర్వినియోగం చేయవచ్చో ఇటీవల కాలంలో అందరూ చూస్తున్నారు. వాటిలో ఇది హైలెట్‌. దుర్గ కల్పిత పాత్రో లేక అనేక మంది నమ్ముతున్నట్లు దేవతా మరొకరా అన్నది వేరే విషయం. ఒక కరపత్రానికి వున్న సాధికారత ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న. ఒక పుస్తకమో, ఒక అధికారిక పత్రికో, వెబ్‌సైట్‌లో అలాంటి వర్ణన చేసి వుంటే అది చట్ట ప్రకారం నేరమైతే చర్య తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు. రెచ్చగొట్టటానికి , చిచ్చు పెట్టటానికి ప్రతి మూలనా రోజూ ఏదో ఒక కరపత్రం వెలువడుతూనే వుంటుంది. ఏదో ఒక పేరుతో ఎవరు ఒక కరపత్రం వేస్తే దానిని పార్లమెంట్‌ రికార్డులకు ఎక్కిస్తే వాటికి అంతం ఎక్కడ. అసలు తామా కరపత్రం వేయలేదని మహిషాసుర దినోత్సవ నిర్వాహకులలో ఒకరు చెబుతున్నారు.ఆ వుత్సవం తలపెట్టింది 2014 అక్టోబరులో, అప్పటికి కేంద్రంలో అధికారంలో వున్నది బిజెపి. దుర్గను అలా అమర్యాదకరంగా చిత్రిస్తూ తొలుత ప్రచురించింది యాదవ శక్తి అనే ఒక పత్రిక. దానిపై చర్య తీసుకోవటానికి కేంద్రానికి అధికారం వుంది. దానిని మరొక పత్రిక తరువాత కొద్ది మార్పులతో ప్రచురించిందని సంఘపరివార్‌ అనుయాయులే మరొకవైపు చెబుతున్నారు.మహిషాసుర దినోత్సవం సందర్భంగా ఆ పత్రికను పంపిణీ చేయటంతో ఘర్షణ జరిగి రెండో పత్రికపై కేసు కూడా నమోదైంది. నాటి వుదంతానికి ఇప్పుడు జెఎన్‌యు ఘటనలకు లంకెపెట్టి పార్లమెంట్‌లో ప్రస్తావించటం దురుద్ధేశం, ఎన్నికలలో లబ్దికోసం ప్రచార ఆస్త్రంగా చేయటం తప్ప మరొకటి కనిపించటం లేదు.

   రెండవది మంత్రి అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. మహిషాసుర దినోత్సవాన్ని జరపటాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదా లేక దుర్గను కించపరచటాన్ని తప్పుపడుతున్నారో స్మృతి ఇరానీ స్పష్టం చేయాలి. దుర్గను కించపరచటంపై కావాలంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు. మహిషాసుర దినోత్సవాన్ని వ్యతిరేకించటం అంటే భిన్నత్వాన్ని , మరొక అభిప్రాయాన్ని అణచివేయటం తప్ప మరొకటి కాదు. అసలు ఏ మాంసం తినని వారు ఈ దేశంలో చాలా మంది వున్నారు. అనేక మంది మహిళలు తాము తినకపోయినా ఇంట్లో తినేవారు వుంటే వండి పెట్టటం లేదా ? తినేవారిని అడ్డుకోవటం లేదే !అలాంటపుడు గొడ్డు మాంసం తినే వుత్సవం జరపాలని తినే వారు అనుకుంటున్నపుడు దానిని ప్రతిఘటించాల్సిన అవసరం ఏముంది. ఇష్టం లేకపోతే తినటం మానుకోవాలి లేదా ఆ పరిసర ప్రాంతాలకు ఆ సమయంలో దూరంగా వుండవచ్చు. గణేష్‌ వుత్సవాలు, దసరా వుత్సవాల పేరుతో పెద్ద పెద్దగా లౌడ్‌ స్పీకర్లు పెట్టటం, వూరేగింపుల పేరుతో రవాణాకు ఆటంకం కలిగించటం కొంతమందికి నచ్చదు.అర్ధరాత్రి అపరాత్రి వరకు భారీ సౌండ్‌తో ప్రార్ధనా స్ధలాలలో మైకులు పెడితే చుట్టుపక్కల విద్యార్ధులు, రోగులకు ఎంత ఇబ్బంది. అయినా చేయగలిగిందేమీ లేదు మన ఖర్మ అనుకొని అలాంటి వారు వాటికి దూరంగా తప్పుకుంటున్నారు తప్ప అడ్డుకోవటం లేదే? మహిషాసుర లేదా రావణలీల వుత్సవాలు జరపటం దేశ ద్రోహమా ? జరుపుకోనివ్వండి ఎవరికి నచ్చిన వారిని వారు అభిమానిస్తారు ! అసలు ఏ దేవుడు, దేవతను , రాక్షసులను నమ్మనివారిని కూడా పౌరులుగా దేశ రాజ్యాంగం గుర్తించిందని మర్చిపోతున్నారా ?

     ప్రపంచంలో ప్రతి మతం వాటి దేవతలు, ప్రవక్తల గురించి నిందలు వేయటం కొత్త విషయం కాదు. వాటిని సమాజం పెద్దగా పట్టించుకోదన్నది కూడా వాస్తవం. కొన్ని సందర్బాలలో కొన్ని శక్తులు పధకం ప్రకారం వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పూనుకుంటాయి. క్రైస్తవంపై తిరుగుబాటు నుంచి ఇస్లాం మతం ఆవిర్బవించింది. దాని ప్రవక్త మహమ్మద్‌కు విగ్రహారాధనపై విశ్వాసం లేదు, అందువలననే మక్కాలోని విగ్రహాలన్నింటిని ధ్వంసం చేయించారని చెబుతారు. ఐరోపా దేశాలలోని కొన్ని శక్తులు ముస్లింల ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేసేందుకు ఏకంగా ప్రవక్త బొమ్మలు గీయటం అన్నది ప్రతి శతాబ్దంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే వుంది. అలాంటి సందర్బాలలో నిరసన వ్యక్తం అవుతోంది. తరువాత ఎవరి జీవన క్రియల్లో వారు వుంటారు. దేవుళ్ల గురించి హేతువాదులు అనేక విమర్శలు చేశారు, తమ తర్కం ప్రకారం ప్రశ్నలు లేవనెత్తారు.వేమన ఇంకా అనేక మంది తమ రచనల్లో ఆచారాలు, మూఢనమ్మకాలు మొదలైన వాటిని చీల్చి చెండాడారు. అంతకు ముందు చార్వాకులు, లోకాయతులు దేవుడు, దేవతల వునికిని ప్రశ్నించారు. ఇప్పుడూ ఎవరైనా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. అంతే తప్ప దుర్గ గురించి మరొక దేవత గురించి ఎవరైనా అసభ్యంగా చిత్రించి, వర్ణించి వారిపై విశ్వాసం పొగొట్టగలమని, లేదా మహిషాసురుడు మరొకరి మీద ప్రేమపెంచగలమని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. నేలవిడిచి సాము చేయటం తప్ప మరొకటి కాదు. విమర్శ సభ్యతతో కూడినదిగా వుండాలి. శైవ-వైష్ణవ మతాల మధ్య మధ్యయుగాలలో ఎంతటి శతృత్వం వుందో ఆ కాలపు రచయితలు రాసిన గ్రంధాలలో సవివరంగా వుంది. విష్ణాలయంలో మోగే గంటను విన్న శివభక్తుడు శ్వపచుడితో (కుక్క మాసం తినేవారితో)సమానం అని శివపురాణంలో రాశారు.ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో కుక్క మాంసం తినేవారు ఇప్పటికీ వున్నారా లేదా ? మరి వారు నాటి పురాణాలు మా మనోభావాలను దెబ్బతీశాయని అంటే ఏం చెబుతారు ? ప్రపంచంలో అనేక దేశాలలో దాన్ని తినేవారు వున్నారు. ఇటీవలి కాలంలో దానిని కూడా వివాదాస్పదం చేశారు.కృష్ణుడి చోర చర్యలను, శృంగారం భక్తులకు పరవశం కలిగిస్తుంది. హేతువాదులకు జారత్వం, చోరత్వం కనిపిస్తుంది, అలాంటి విమర్శలు చేసినంత మాత్రాన కృష్ణ భక్తులందరూ పార్లమెంట్‌లో వాటిని పట్టుకొని చర్చిస్తారా ? అలాగే ప్రతి మతావలంబకులూ పార్లమెంట్‌ను మత విశ్వాస ప్రదర్శన సభగా మార్చివేస్తారా ?

     సృష్టి కర్త దృష్టిలో అందరూ సమానమే అని ఒకవైపు చెబుతారు, మరో వైపు అదే కర్త అందరినీ దేవతలుగా సృష్టించ కుండా కొందరిని రాక్షసులుగా పుట్టించటమెందుకు ? వారి చేత ముందు దేవతలను చావ చితక కొట్టించటం ఎందుకు, అంతా అయిపోయాక వారిని హతమార్చటానికి కొత్త శక్తులను సృష్టించటం ఇవేగా ప్రతి పురాణ సారాంశం. అలా ఎందుకు అంటే లీలా మానుష వినోదం అని టక్కున సమాధానం.అలాగే దుర్గ కూడా కొందరి నిందలకు గురికావటం కూడా అదే అని అలా రాసి పెట్టి వుందని ఎవరి పాపాన వారు పోతారులే అని ఎందుకు ఊరుకోరు ? వుదాహరణకు మహిషాసురుడినే తీసుకుందాం. మైసూరు ఆయన పేరునుంచే పుట్టిందండోయ్‌(మహిషాసుర వూరు మైసూరు అయిందట). జన్మ అంటూ ఎత్తిన తరువాత దానికి పరమార్ధం వుండాలంటారు. అదేమిటో ప్రతి యుగంలో దేవుడి, దేవత హయాంలో రాక్షసులు వారి చేతిలో చావటానికే పుట్టినట్లు అన్ని కధలూ చెబుతాయి. సత్య యుగంలో అందరూ ఒకటే అన్నారు కనుక మనకు రాక్షసులు కనిపించరు. త్రేతాయుగం, ద్వాపరయుగాలలోనే వారు దర్శనమిస్తారు, ధర్మం ఒంటి పాదంలో నడుస్తుందని చెబుతున్న కలియుగంలో మనకు ఎక్కడా కనపడరు. రాక్షసుల వలన జరిగేది యుద్ధాలు తప్ప లోక కల్యాణమేమీ లేదని త్రేతా యుగంలోనే తెలిసిపోయింది కనుక సృష్టి కర్త ద్వాపర యుగంలో అయినా రాక్షసుల సృష్టి నిలిపివేయాలి కదా ఎందుకా పనిచేయలేదు? రాక్షసులు లేకపోతే దేవతలకు గుర్తింపు వుండదనా ? అందువలన విశ్వాసులూ వుద్రేకాలను తగ్గించుకొని వెనుకా ముందూ చూసుకొని స్పందించాలి. చరిత్రలో లోకాయతులూ, చార్వాకులే ఎంతో హుందాగా విమర్శలు చేశారు, వారి వాదనల్లో తర్కం వుంది. మతశక్తులే పరమతాలను, తాము అంగీకరించని దేవతలను బండబూతులు తిట్టాయి. అందువలన లోకాయతుల వారసులు అనుకొనే వారు ఎవరినీ కించపరచకుండా, సభ్యతగా ప్రవర్తించటం ద్వారానే ఎక్కువ మందిని ఆ భావజాలంవైపు కర్షించగలం అని గుర్తిస్తే మంచిదేమో ఆలోచించండి. ఏమైనా ఇలాంటి చర్చలు జరిగేందుకు తెరతీసిన సంఘపరివార్‌కు మరోసారి ‘అభినందనలు’ చెప్పకుండా వుండగలమా ?