ఎంకెఆర్
హిట్లర్ పీచమణిచి ప్రపంచానికి నాజీల ముప్పు తప్పించిన వుక్కు మనిషి కమ్యూనిస్టు స్టాలిన్. ఆయన మరణించి 63 సంవత్సరాలు గడిచాయి.చరిత్రలో ఆయన గురించి జరిగినంత తప్పుడు ప్రచారం మరొక ఏ నేత పట్లా జరగలేదంటే అతిశయోక్తి కాదు. శనివారం నాడు ఆయన వర్ధంతి సందర్బంగా ఒక చిన్న వార్తను మీడియా సంస్ధలు అందచేశాయి. స్టాలిన్ పోయినా రష్యాలో కమ్యూనిజం అంతరించలేదన్నది దానిలో ఒక వ్యాఖ్య. లెనిన్, స్టాలిన్ నాయకత్వంలో నిర్మితమైన పార్టీని కృశ్చెవ్, గోర్బచెవ్ లాంటి వారు ఎంతగా దెబ్బతీసినా పాతికేళ్ల క్రితం సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసినా కమ్యూనిస్టుల వునికిని గుర్తించక తప్పలేదు.
కమ్యూనిస్టు పార్టీ తిరిగి అభిమానం పొందటం పట్ల రష్యన్ పాలకులు ఆందోళన చెందుతున్నారన్నది మరొక వ్యాఖ్య. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్న సమయంలో దానిని అమలు జరిపేందుకు పూనుకున్న రష్యాలో మంచి ఫలితాలు ఎలా వస్తాయి, ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి. ప్రస్తుతం రష్యా ఆర్ధిక వ్యవస్ధ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఒక సర్వేలో సగం మంది రష్యన్లు పాత సోవియట్ యూనియన్ రోజులే బాగున్నాయని అభిప్రాయపడ్డారని వెల్లడైంది.
స్టాలిన్ హయాం నాటి కళా రూపాల ప్రదర్శనశాల సంరక్షకురాలు మరియా క్రెచొటోవా మాట్లాడుతూ స్టాలిన్ గురించి ఆసక్తి పెరగటాన్ని అర్ధం చేసుకోదగినదే. రెండవ ప్రపంచ యుద్ధ విజయం 70 వార్షికోత్సవాన్ని నిర్వహించామని, ఆ విజయం ఎవరి నాయకత్వంలో జరిగిందో మనం మరిచి పోకూడదని అన్నారు.
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాలక పక్షమైన యునైటెడ్ రష్యా పార్టీకి ప్రధాన సవాలు కమ్యూనిస్టుల నుంచే వుంటుందని ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్ ప్రకటించారు.సోవియట్ యూనియన్ ఏర్పాటు ద్వారా లెనిన్ రష్యా కింద ఆణుబాంబును పెట్టారని అధ్యక్షుడు పుటిన్ తన వుక్రోషాన్ని వెల్లడించాడు.
స్టాలిన్ మరణించిన మూడు సంవత్సరాల తరువాత స్వయంగా సోవియట్ కమ్యూనిస్టు పార్టీ నేత కృశ్చెవ్ ప్రారంభించాడు.1956 ఫిబ్రవరి 25న కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభను అందుకు వేదికగా చేసుకున్నాడు.అది కూడా రహస్యంగా ప్రసంగించాడు. దాని కాపీని సంపాదించటానికి ఆరోజుల్లోనే అమెరికా సిఐఏ లక్ష డాలర్లు ఖర్చు చేసిందట.
స్టాలిన్ హయాంలో సాధించిన విజయాలు గొప్పవని 2008లో 27 శాతం మంది రష్యన్లు భావిస్తే గతేడాది జూన్‌లో జరిగిన సర్వేలో 45శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. క్రిమియాలో స్టాలిన్ ఇతర నేతలతో వున్న విగ్రహాన్ని పుతిన్ ప్రభుత్వం ప్రతిష్టించటం స్టాలిన్ పట్ల సామాన్య జనంలో వున్న ఆదరణ, అభిప్రాయానికి అద్దం పడుతోంది.రెండవ ప్రపంచ యుద్ద సమయంలో స్టాలిన్‌తో సమావేశమైన చర్చిల్, రూజ్వెల్ట్లతో కూడిన ఫొటోకు నకలుగా విగ్రహాన్ని తయారు చేశారు.