Tags

, , , ,

భాగం ఒకటి

సత్య

    భూలోకం నుంచి నేరుగా వేద కాలపు విమానంలో ఒక్కడే వచ్చిన కాషాయం స్వర్గం ద్వారం దగ్గరకు రాగానే జిపిఆర్‌ఎస్‌ చూసుకున్నాడు. తాను దిగాల్సిన భవనం తన కిందే వున్నట్లు గ్రహించిన కాషాయం విమానంలోంచే కిందికి చూశాడు.అంతే విమానం వెంటనే భావాన్ని గ్రహించి చటుక్కున కిందికి దిగటమేమిటి, ఆటోమాటిక్‌గా డోరు తెరుచుకోవటం క్షణ కాలంలో జరిగిపోయాయి.

     బృందావనం గేటెడ్‌ కాలనీకి పెద్ద గేటు, దానిలోంచి లోపలకు చూస్తే పెద్దగా వెతుక్కొనే పని లేకుండానే ‘రంభ సుఖ నివాస్‌’ పెద్దక్షరాలతో సంస్కృతంలో రాసి వుంది. విమానాన్ని గేటు ముందు ఆపగానే సాబ్‌ రోడ్డు అవతల పార్కింగ్‌ ప్లేస్‌ వుంది , ఇక్కడ మెంబర్స్‌ విమానాలను మాత్రమే అనుమతిస్తారు సాబ్‌ అంటూ ఒక సెక్యూరిటీ గార్డు వచ్చాడు.

   వేదకాలపు విమానాలకు రన్‌వేలు, పైలట్లు, ఇంధనంతో పని లేకపోవటంతో చిన్న పిల్లలు బొమ్మ విమానాలను తిప్పినట్లు వెంటనే రయ్యి మంటూ పైకి లేపి పక్కనే వున్న పార్కింగ్‌ ప్లేస్‌లో వుంచి తాళం చెవిని అక్కడి సిబ్బందిపైకి విసిరి వచ్చాడు కాషాయం.

     సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి రిసెప్షన్‌ ఎక్కడా అని అడిగాడు కాషాయం. జాతీయ జండాలోని మూడు రంగుల ముక్కలతో కుట్టిన పెద్ద చొక్కా పెరిగిన బొర్రను దాచలేకపోతోంది, దాని కింద కాషాయ పైజామా, ఒళ్లంతా స్వస్తిక్‌, కమలం పూల పచ్చబొట్లతో వున్న కాషాయాన్ని చూసి సెక్యూరిటీ పన్నెండు గంటల డ్యూటీ భారాన్ని కూడా మరిచిపోయి గోలీ సోడా కొట్టినపుడు వచ్చే సౌండ్‌ మాదిరి కిసుక్కున నవ్వాడు. స్వర్గమన్న తరువాత రకరకాల వారు వస్తుంటారు, వారు మన అతిధులు కనుక చూసి మర్యాదగా వుండాలి నవ్వినా, అమర్యాదగా ప్రవర్తించినా వుద్యోగం వూడుతుందని స్వర్గలోక సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ హెచ్చరిక గుర్తుకు రావటంతో పాపమా ముసలి గార్డు ముఖం మాడిపోయింది. అయినా చిరునవ్వు పులుముకొని ఆయియే సాబ్‌ అని గేటు తీసి రిసెప్షన్‌ ఎక్కడుందో చూపాడు.

    విలాసంగా వెళ్లిన కాషాయానికి వెంటనే అక్కడ వున్న ఒక యువతి లేచి పారిజాత పువ్వు అందిస్తూ బావగారూ బాగున్నారా అని నవ్వుతూ పలకరించింది. అది స్వర్గలోక మర్యాద అని తెలియని, తానెవరో తెలియకుండానే తనకింత ఘనస్వాగతం పలికారని, తెలిస్తే ఇంకెత గా వుంటుందో అని కాషాయం వుబ్బి తబ్బిబ్బు అయ్యాడు. అదే వూపులో రిసెప్షన్‌లో వున్న యువతిని చూసి ఒకసారి కాలర్‌ ఎగుర వేసి గోబెల్స్‌ గారిని కలవాలి అని అంటూ ఒక లెటర్‌ తీసి ఆమెకు అందిస్తూ బల్లమీద దరువేస్తూ అటూ ఇటూ చూస్తున్నాడు. ప్లీజ్‌ సార్‌ శబ్దం చేయవద్దు అని సైగ ద్వారా చెప్పి లెటర్‌ చూడకుండానే ఇదేమిటి అని అడిగింది.

   వెంటనే భూలోకం అమిత్‌ షా రికమెండేషన్‌ లెటర్‌, ముందు చదవండి మీకే తెలుస్తుంది అన్నట్లు సైగ చేశాడు కాషాయం. ఒకసారి స్వర్గానికి రావటం అంటేనే ఇక్కడి వసతులు అన్నీ మీకు వుచితంగా అందుబాటులో వుంటాయని అర్ధం.సిఫార్సులు అవసరం లేదు, భూలోకపు అలవాటును బట్టి లేఖలు తెస్తున్నారు. ఖాళీని బట్టి రూమిస్తాము, రంభా, వూర్వశుల్లో అందుబాటులో వున్న వారిని మీరు ఎంపిక చేసుకోవచ్చు ఓకే. అంటూ లేఖను విప్పకుండానే చెత్త బుట్టలో పడేసింది. ఇక మీకు ఏ గోబెల్స్‌ కావాలి అని అడిగింది.

    అదేమిటి ఎంత మంది వున్నారు, గోబెల్స్‌ అంటే ఒక్కడే కదా ఈ మాత్రం తెలియదా అన్నట్లు చూశాడు. లేదు సార్‌ హిట్లర్‌ కాలంలో అతనొక్కడే , ఇప్పుడో ఎక్కడో ఒకటీ అరా తప్ప ప్రతి టీవీ, ప్రతి పత్రికలో , ఇతర అనేక రంగాలలో ఒకరికి ఇద్దరు, ఇద్దరు నలుగురి మాదిరి తామర తంపరగా తయారయ్యారు, మీకు తెలియదు అసలు గోబెల్స్‌ వారిని చూసి సిగ్గు పడుతూ వుంటారు, ఆయనా వున్నారు. అందుకే మీకు ఎవరు కావాలి అని రిసెప్షనిస్టు అడగ్గానే మా ఆది గురువు అదే జర్మన్‌ మినిస్టర్‌ అన్నాడు కాషాయం.

     అక్కడ కూర్చోండి అంటూ రిసెప్షనిస్టు వలయాలుగా తిరిగే ఒక సోఫా చూపింది. ఇంటర్‌ కామ్‌లో రంగేళీ రాజా జి స్షెషల్‌ అని పెట్టేసింది. స్వర్గం రాజ్యాంగం ప్రకారం అక్కడకు వచ్చిన వారందరూ గతాన్ని గుర్తుంచుకోవచ్చు తప్ప పాత బంధాలను ముందుకు తేకూడదు.ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని అంటే వారి మాడు పగలగొడతారు, అవి స్వర్గవాసుల స్వేచ్ఛకు అడ్డు పడతాయి. వావి వరసలు వుండవు. రోమ్‌ వెళ్లినపుడు రోమన్‌లా వుండాలన్నట్లు స్వర్గంలో ప్రతివారూ రంభ, మేనకల కోసం తపించి పోతుంటారు. ముందు తాత, తరువాత కొడుకు ఆ తదుపరి మనవడు వచ్చినపుడు ముగ్గురూ ఒకే రంభ కోసమో, మేనక కోసమో పోటీ పడితే సమస్యలు వస్తాయి. అందువలన బంధాలు, బంధుత్వాలు ఇక్కడ నిషిద్ధం. అందుకే భూలోక పేర్లను పక్కన పెట్టి శాస్త్రీయ నామాలు తగిలిస్తారు. అందుకే అలా కబురంపింది. పావు గంట తరువాత అటువైపు నుంచి కాల్‌ రావటంతో గోబెల్స్‌ లైన్‌లో వున్నారంటూ కాషాయానికి ఫోన్‌ అందచేసింది .

    వెంటనే నేను సార్‌ కాషాయాన్ని అంటూ భూలోకంలో పరిచయం వున్న మాదిరి పెద్దగా చెప్పాడు. ఏమూడ్‌లో వున్నాడో తెలియదుగానీ వెంటనే గోబెల్స్‌కు అర్ధం కాలేదు, మరోసారి కాషాయం అదే చెప్పాడు. దాంతో అటు వైపు నుంచి రిసెస్పనిస్టు సార్‌ పది నిమిషాల్లో అక్కడికే వస్తారు వెయిట్‌ చేయండి అని చెప్పి పెట్టేసింది.

    ఈ మధ్య కాషాయం మంచి హుషారులో వున్నాడు. ఇంతకాలం తాను జాతీయ వాదినని చెప్పుకోవటానికి సిగ్గు పడేవాడు. ఎందుకంటే తమ గురువులందరూ బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన వారే అని బయట పడటంతో నోట మాట వచ్చేదే కాదు. జనానికి మతి మరుపు అని గట్టిగా నమ్ముతాడు కనుక కొంత కాలం తామంతా భగత్‌ సింగ్‌ , చంద్రశేఖర్‌ అజాద్‌ అనుయాయులం అని చెప్పుకు తిరిగాడు. వారిని వురి తీసినపుడు మీ పూర్వీకులు ఏం చేశారు, ఎక్కడున్నారు?మతం తప్ప మరొకటి పట్టని మీకూ మతం,దేవుడిపై నమ్మకంలేని కమ్యూనిస్టు భగత్‌సింగ్‌కూ అసలు సంబంధం ఎక్కడ అని తలోదిక్కునా ప్రశ్నించటంతో కాషాయం కుదేలై పోయి మాట్లాడటం మానేశాడు.

     ఇప్పుడు బస్తీమే సవాల్‌ నేనే అసలైన జాతీయ వాదిని, కాదన్నవాడిని ఖతం చేస్తా అని వీరంగం వేస్తున్నాడు. మాటి మాటికీ జాతీయ జెండా ఎగురవేయటానికి సిద్దం సుమతీ అంటున్నాడు.ఇంతలో జరగరాని ఘోరం జరిగి పోయింది. ప్రమాదంలో ప్రాణం పోయింది.

     ఈ మధ్య ప్రతి సంస్ధకూ అధిపతుల నియామకం సందర్భంగా వచ్చిన వారికి ఎక్కడో అక్కడ పరివార్‌ మచ్చ వుంటే సరే లేకపోతే ముద్రవున్న వారిని వెతికి మరీ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు కూడా బెనారస్‌ విశ్వవిద్యాలయ విసీ మాదిరి మరక మంచి అని ఎత్తి మరీ చూపుతున్నారు. వుగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా స్వర్గంలోకి వుగ్రవాదులు ముఖ్యంగా ఇస్లామిక్‌ తీవ్రవాదులు ప్రవేశించకుండా తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఏజన్సీకి కూడా అలాంటి ఒక ముద్రగాడినే అధిపతిగా నియమించారు. ఆ పెద్దమనిషి కొన్ని ఖాళీ పత్రాలు ఇచ్చి నేరుగా స్వర్గానికి పంపాలనుకున్న కాకీ నిక్కర్ల పేర్లు అందులో రాసి అందచేయమన్నారు. ఆ రూటులో వచ్చే వారికి పాసింజరు ఫ్లైట్లకు బదులు వేదకాలపు రెక్కలు లేని సింగిల్‌ సీటరు విమానం కూడా అంద చేస్తారు.అదిగో కాషాయం అలా వచ్చాడు.అందుకే అంత టెక్కు. గోబెల్స్‌తో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ………….(ఇంకా వుంది)