చివరి భాగం
సత్య
రంగు రంగుల పూల చొక్కా వేసుకొని మత్తెక్కించే మదన వాసనల సెంటు గుభాళిస్తుండగా గోబెల్స్ దిగాడు. వెనుకే జూనియర్ రంభ కూడా వుంది. చొంగ కార్చుకుంటూ నోరెళ్ల బెట్టిన కాషాయం గోబెల్స్ బదులు ఆమెను ఆబగా చూశాడు. ఇదేం పాడుబుద్ది , ఒకరి ఇలాకాలో వున్న దాన్ని ఇలా చూస్తాడు , ఆ మాత్రం నీతి లేదా అనుకుని చీదరించుకొని కాషాయాన్ని కోపంగా చూస్తూ తలపై చీర కొంగు కప్పుకొని పైకి వెళ్లి పోయింది.
దాంతో గతుక్కుమన్న కాషాయం నాజీ వందనం చేయటం కూడా మరిచి పోయి అలవాటు ప్రకారం గురువుగారూ అంటూ గోబెల్స్ కాళ్లమీద పడిపోయాడు. ఇది వూహించని గోబెల్స్ కాళ్లు లాగి పడవేయటానికి వచ్చిన వాడేమో అనుకొని అంతే వేగంగా వెనక్కు తగ్గాడు, దాంతో కాషాయం నేలమీద పడి మోచేతులూ , ముక్కు బద్దలు కొట్టుకున్నాడు.
దులుపుకుంటూ లేచి నేను సార్ కాషాయాన్ని అన్నాడు. గోబెల్స్ సాలోచనగా నఖశిఖ పర్యంతం చూశాడు. అక్కడక్కడా స్వస్తిక్ బొమ్మలు కనిపిస్తున్నాయి. వెంటనే ఎవరో తోటి జర్మన్ అనుకుని తాను ఇక్కడికి వచ్చే 70ఏళ్లు దాటింది కదా, తోటి నాజీలందరూ విచారణ తప్పించుకొనేందుకు ఎటెటో వెళ్లి పోయి రకరకాల వేషాలు వేశారని తెలిసింది, గనుక ఎవరో గుర్తుకు రావటంలేదు ,అయినా ఎవరు నువ్వు అని అడిగితే బాగుండదని వై గెట్ ఎస్ డిర్ అన్నాడు. అర్ధంగాని కాషాయం తనను కాదనుకున్నాడు. వెర్రిమొహం వేసుకు చూశాడు. ఎలా వున్నారు మీరు అని గోబెల్స్ జర్మన్ భాషలో అడిగాడు. వెంటనే స్పందన లేకపోవటంతో వచ్చిన వాడు తెలుగు వ్యక్తి అని గ్రహించాడు.
స్వర్గం అంటే తినటం, తాగటం రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమల వంటి వారో లేక వారు బిజీగా వుంటే జూనియర్స్‌తోనో విచ్చల విడిగా తిరగటమే కదా. మన వాడు జర్మనీలో కూడా అలాంటి గ్రంధసాంగుడే గాక మంచి మాటకారి కూడా. కనుక పలు భాషల భామలతో సంబంధాలు పెట్టుకోవాలంటే దాదాపు ముఖ్యమైన భాషలన్నీ నేర్చుకున్నాడు. వాటిలో తెలుగు ఒకటి. వెంటనే జర్మన్ యాసలో కాషాయం ఎలా వున్నారు, బాగున్నారా అని అడిగాడు.
అసలు గోబెల్స్ దర్శనం దొరకటమే గొప్ప అనుకుంటే ఇంత ఆప్యాయంగా పలకరింపా అని కాషాయం మరింతగా తబ్బిబ్బు అయిపోయాడు. బాగున్నా బాగున్నా అంటూ ఆనందబాష్పాలు రాల్చాడు
ఈ మధ్య ఏపికి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుల గుర్తింపు, సింగపూర్, మలేషియా, తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు, హైదరాబాదు పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మార్చటం, భూపంపకం వంటి వార్తలను ఇంటర్నెట్ తెలుగు పేపర్లలో చదివి తెలుగు వారంటే అల్ప సంతోషులనే భావం ఏర్పరచుకున్నాడు గోబెల్స్ . అది బయటకు రానివ్వకుండా మన వాళ్లంతా క్షేమమేనా అని అడుగుతూ బోయ్ నాకు విస్కీ మన కాషాయానికి మంచి నీళ్లు పట్రా అని…. సారీ మీరు కూడా విస్కీ తీసుకుంటారా ? ఈ మధ్య మీ దగ్గర ఎక్కడ బడితే అక్కడ విస్కీ దొరుకుతోందటగా అన్నాడు. ఈలోగా బోయ్ వెళ్లటం ఒక చేత్తో విస్కీ, మరో చేత్తో మంచినీళ్లు తెచ్చాడు.
ఫరవాలేదు సార్ ఫరవాలేదు సార్ అన్నాడే గానీ విస్కీ వద్దనలేదు, నాక్కూడా విస్కీ తెస్తే నీ సొమ్మేమైనా పోయిందా అన్నట్లు మొహం పెట్టి ఇష్టం లేకుండానే మంచినీళ్ల గ్లాసు అందుకున్నాడు కాషాయం. ఇంతలో ఒక సేవకుడు వచ్చి గోబెల్స్ చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే కాషాయం మీరు ఎలా వచ్చారు, ఎక్కడ దిగారు అని అడిగాడు గోబెల్స్.
సార్ నేను వేద కాల విమానంలో నేరుగా వచ్చాను, వూర్వశీ నిలయంలో రూమ్ రిజర్వు చేసినట్లు చెప్పారు, వీలైతే మీ దగ్గరే మంచి రూం ఇప్పిస్తే అన్నట్లు చూశాడు. దానిని పట్టించుకోనట్లుగా ఓకే అయితే మనం సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడే కలుద్దాం అంటూ మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచాడు గోబెల్స్.
ఓకే సార్ నేను మూడు గంటలకే వస్తా, వద్దు వద్దు మేము సమయ పాలన పాటిస్తాము,మీరు ముందూ,వెనుకా రావద్దు ,సరైన సమయానికి , సరైన చోటికి రండి అని నవ్వుతూ గోబెల్స్ మెట్లు ఎక్కాడు. సార్ సార్ అంటూ పరుగెత్తి రెండు మెట్లు ఎక్కి తాను తెచ్చిన పరిచయ లేఖను అందచేశాడు కాషాయం.
సాయంత్రం అనుకున్న సమయానికి ఇద్దరూ వచ్చారు. పొద్దున్నే ఎవరో ఏమిటో తెలిసింది కనుక ఈ సారి పరస్పరం నాజీ వందనాలు చేసుకున్నారు. తన్మయత్వంలో కాషాయం తాను అసలు ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు.
చెప్పండి కాషాయం ఇప్పుడు మీ మిత్రులంతా అమెరికన్స్ కదా ! మా జర్మన్లతో పని పడింది అంటే ఏదో ప్రత్యేకత వుండి వుంటుంది, ఏమిటో చెప్పండి.
ఏం లేదు సార్ మేం ఏం చేసినా కొద్ది రోజుల్లోనే జనానికి వాస్తవం ఏమిటో తెలిసి పోతోంది.మా కార్యక్రమాలన్నీ దెబ్బతింటున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా ఏబివిపి పోరగాడు తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. కానీ అది వాస్తవం కాదని వెంటనే పోలీసులు తేల్చేశారు. మీ హయాంలో పార్లమెంట్ భవనాన్ని మీరే తగుల పెట్టుకొని ఆ దుర్మార్గానికి కమ్యూనిస్టులే పాల్పడ్డారని చాలా కాలం ఎలా నమ్మించారు సార్?
చూడు కాషాయం ఆ రోజులే వేరయ్యా ! ఇప్పటికీ దాన్ని నమ్మే ఫూర్ ఫెలోస్ వున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు…..అయినా మీతో వచ్చిన చిక్కు ఇదే …పాడిందే పాడరా అని మీ తెలుగు వారు ఒక సామెత చెబుతారు కదా అంటే అర్ధం నన్ను ఆదర్శంగా తీసుకోవాలి తప్ప నాలాగే చేయకూడదు.
అదే సార్ మేము ఎన్నోసార్లు మా శాఖల్లో ఇదే చెప్పాము. మన పధకాలన్నీ ఎదురు తంతున్నాయి, కొత్త పద్దతులు నేర్పండి అంటే వినకుండా మనం మనుస్మృతి మార్చలేనట్లే అవి కూడా అంతే అంటూ తాతల కాలం నాటివే నేర్పుతున్నారు…… మీరు ఏవనుకోను అంటే నేను ఒకటి చెబుతా…..
అనుకోను లేవయ్యా చెప్పు.
కాదు, ప్రామిస్,
ప్రామిస్,
అమ్మతోడు .
అమ్మతోడు అంటే భారత మాత తోడు… ఒకే విసుగ్గా అన్నాడు గోబెల్స్.
అక్కడికీ నేను ఒకసారి ఆ గోబెల్స్ పద్దతులు మనకు ఎందుకు ? మన వేదాల్లోనే అన్నీ వున్నాయంటున్నారు కదా వాటిని వెలికి తీసి అందచేయకూడదా , మన దేశ భక్తి వెల్లడి అవుతుంది, మిగతా దేశాల వారు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా అన్నాను. మీరు ఏమీ అనుకోవటం లేదు కదా అన్నది అన్నట్లు చెప్పాను.
ఏముందయ్యా ఇందులో అనుకోవటానికి, మనం ఇప్పుడు స్వర్గలోక వాసులం. మనలో మనమాట అలాంటి పుక్కిటి పురాణాలు అన్ని దేశాలలో వున్నాయి. అవన్నీ మూసిన గుప్పిట వంటివి. అవి మూసి వున్నంత వరకే ఆసక్తి, తెరిస్తే విరక్తి . అయినా దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లు అలాగే వుంటాయ్. అది సరేగాని ఆ ఎంజాయ్ జోషి,అదే సెక్స్ సిడీ పెద్దమనిషి ప్రేమరోగ్ నిందాచార్య ఏం చేస్తున్నారయ్యా ఇప్పుడు, ఎక్కడున్నారు ?
ఏం చెప్పమంటారు సార్ మా ఓడీ సాబ్ సిడి ట్రిక్కు ప్రదర్శించి జోషీ గారిని ఇంటికి పంపారు, ఇప్పుడాయన గోళ్లు గిల్లుకుంటూ ఎక్కడ వుభయం దొరికితే అక్కడ అన్నట్లు అక్కడా ఇక్కడా వుంటూ తన దగ్గరికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తుంటారు. నిందాచార్య పరిస్ధితి మరీదారుణం.ప్రేమ ఫెయిలయింది. దేశభక్తి అంటే స్వదేశీ జాగరణ మంచ్, స్వదేశీ జాగరణ మంచ్ అంటే దేశభక్తి అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ! కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది, ఇప్పుడు స్వదేశీ జాగరణ మంచ్ అంటే దేశద్రోహం అన్నట్లుగా మారిపోయింది. అందుకు ఎవరూ మాట్లాడటం లేదు. మా ఓడీ సాబ్ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పుడు ఓడీ విదేశీ జాగరణ మంచ్ హవా నడుస్తోంది.
బాధ పడకు కాషాయం, అంతా దేవుడి లీల. ఏ ఛానల్లో మంచి సీరియల్ వస్తుందంటే దాన్ని నొక్కినట్లుగా పై వాడు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు.కింది వారు ఎలా ఎక్కడ వుంటారో తెలియదు.
అదేసార్ నకిలీ సీడీతో జోషీ గారిని ఇంటికి పంపినట్లే జెఎన్‌యులో కూడా అదే ట్రిక్కు చేసి వామపక్ష విద్యార్ధులను దెబ్బతీద్దాం అని చూశాం.ఇపుడు చూడండి దొరికి పోయార? సీతనే మా రాముడు ఆరోజు అగ్ని పరీక్షకు పంపాడు. తెలివి తక్కువతనం కాకపోతే ఇప్పుడు సీడీలను పరీక్షించకుండా వుంటారా ? ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి నకిలీ సీడీలు తయారు చేసిన వాళ్లమీద, వాటిని ప్రసారం చేసిన వారి మీద కేసులు పెడతానంటున్నారు. పరువూ పోయె కేసులూ వచ్చే అన్నట్లుంది.
కాషాయం మీ వారి మీద కేసులను చూసీ చూడనట్లు పొండి అని చెప్పే పెద్దలు మీ దగ్గర అధికారంలో వున్నారు. మా పరిస్ధితి చూడు రెండవ ప్రపంచ యుద్ధంలో నేరాలంటూ మా మీద పెట్టిన కేసులను ఇంకా కొనసాగిస్తూనే వున్నారు. అందువలన కర్మ చేసిన వాడు ఫలితం అనుభవించక తప్పదని గీతా కారుడు చెప్పలేదా ?
సార్ మీదో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ ఇంకా మీతో చాలా మాట్లాడలని వుంది.ఆ రోజుల్లో మీరు మీడియాను ఎలా అదుపు చేశారు.
ఈ రోజుల్లో మాదిరి టీవీలు లేవయ్యా, అప్పుడే ప్రయోగాలు జరుగుతున్నాయి. జనానికి అందుబాటులో లేదు. అందువలన రేడియాను పూర్తిగా మా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు మీకు ప్రతి టీవీలో గోలగోల గోస్వామి లాంటి వారు తామర తంపరగా కనపడుతున్నారు. మీ వారి పని సులభం అవుతోంది. అలాంటివారిని ఇంకా ఇంకా పెంచండి. చెప్పుకోకూడదు గానీ నిజానికి నేను వారి ముందు మరుగుజ్జును.చూడు కాషాయం మనం స్వర్గంలో వున్నాం అన్నీ ఒకే రోజు మాట్లాడుకుంటే మిగతా రోజుల్లో బోరు కొడుతుందయ్యా ఖాళీ దొరికినపుడల్లా కొన్ని చెప్పుకుందాం. రంభ నుంచి కబురు రాక ముందే వెళితే మంచిది.
ఓకే సార్ .