Tags

, , , , , , , ,

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.