Tags

, , , , ,

పరిహాసంగా కనిపించవచ్చునేమో గానీ భవిష్యత్‌లో రష్యాలో ప్రజాస్వామ్యం మరియు సంస్కరణలు ముందుకు పోవటానికి కమ్యూనిస్టులు సాయం చేయవచ్చు.

మార్క్‌ గాలియోటి

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ వ్యవహారాల ప్రొఫెసర్‌

      రష్యనేతరులు విడిపోయేందుకు అవకాశం కల్పించిన జాతుల స్వయం నిర్ణయ హక్కును సోవియట్‌ యూనియన్‌ అనే పునాదుల కింద వుంచటం ద్వారా లెనిన్‌ ఒక అణుబాంబును పెట్టినట్లయిందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ జనవరి మాసాంతంలో రష్యన్‌ పట్టణమైన స్టావర్‌పూల్‌లో మాట్లాడుతూ చెప్పారు. పుతిన్‌ వ్యాఖ్యలు చారిత్రక రహస్యంగా కనిపించవచ్చుగాని, అది కాదు. లెనిన్‌ విప్లవ వారసత్వంగా వచ్చినదానిపై చర్చలో భాగమే అవి. అది కూడా వాస్తవానికి నేడు పుతిన్‌ ప్రభుత్వానికి అనూహ్య సవాలుగా పరిణమించిన కమ్యూనిస్టు పార్టీ.

     ఏదైతే లెనిన్‌ను అధికారానికి తీసుకువచ్చిందో ఆ 1917 బోల్షివిక్‌ విప్లవ శతవార్షికోత్సం వచ్చే ఏడాది జరగనుంది. రష్యన్‌ ఫెడరేషన్‌ కమ్యూనిస్టు పార్టీ ఆ వుత్సవాన్ని జరపాలని కోరుకుంటున్నది. దాని కంటే ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. పుతిన్‌ 1999లో అధికారానికి వచ్చిన తరువాత కమ్యూనిస్టులు తీవ్రమైన తొలి సవాలును విసిరేట్లు కనిపిస్తున్నది. కమ్యూనిస్టు పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న ఆకర్ణణీయమైన మార్పులను ఇది ప్రతిబింబిస్తున్నది. మరొక విప్లవం సంభవిస్తుందనే ఆశలేనప్పటికీ అది నిజమైన ప్రతి పక్షపార్టీగా పున:సృష్టి చేసుకుంటున్నది.ఇది కొన్ని ముఖ్యమైన మార్పులు చేసే విధంగా పుతిన్‌ ప్రభుత్వంపై వత్తిడి తేగలదు.

    పుతిన్‌ హయాంలో రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ క్రెమ్లిన్‌కు ఎలాంటి తీవ్రమైన సవాలు విసర కుండా రాజకీయ టీవీ సీరియల్‌లో తన పాత్రను పోషిస్తూ ఒక నకిలీ ప్రతిపక్షంగా వ్యవహరించింది. కానీ రష్యన్‌ కులీన తరగతుల్లో విభజనలు పెరగుతున్నాయనటానికి, నూతన రాజకీయ తరం వుద్భవించిందనటానికి చిహ్నంగా కమ్యూనిస్టు పార్టీ మరింత విమర్శనాత్మకంగా, బహిరంగంగా మాట్లాడుతున్నది.

     లెనిన్‌కు వ్యతిరేకంగా తన వ్యాఖ్యల ద్వారా దాడి చేశాడా లేక పార్టీ పునాదిపై దాడి చేసి తప్పిదం చేశాడా అన్నది పక్కన పెడితే పాత పద్దతులను అధిగమించటానికి అది తప్పకుండా వుపయోగపడుతుంది. రష్యా పార్లమెంట్‌ డ్యూమాలోని దిగువ సభకు సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నాయి.రిగ్గింగో మరొకటో తప్పనిసరిగా చేసి ఏదో ఒక విధంగా పుతిన్‌ పార్టీ యునైటెడ్‌ రష్యా, దాని మిత్రపక్షాలు మెజారిటీ స్ధానాలలో విజయం సాధిస్తాయని మనకు తెలుసు.

    కానీ పాయింట్‌ అది కాదు.ఎవరు దేశాన్ని నడుపుతారు, వారు చట్టబద్దంగా క్రతువు నిర్వహిస్తారా, రష్యా సంతోషంగా, విశ్వాసంగా, ఏకతాటిపై అంతా వుందని రుజువు చేయటానికి రష్యాలోని కుహనా ప్రజాస్వామ్యంలో నిర్ణయించేది ఎన్నికలు కావు. ఆర్ధిక సంక్షోభం మరియు రాజకీయ గాలివాటంలో ప్రజా అసంతృప్తి పెరుగుతున్నది. ఈ ఎన్నికలు అన్నింటికంటే అధిక ప్రాధాన్యతను, ఎంతో ప్రయాసను సంతరించుకోకున్నాయి.

    రష్యన్‌ పౌరులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల గురించి చర్చను ప్రారంభించటం ద్వారా కమ్యూనిస్టులు జాతీయ చర్చకు కొత్త రూపం ఇచ్చేందుకు నాంది పలకవచ్చు. 2011లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన బోలోటన్యా నిరసనలు సోవియట్‌ నాటి రోజుల తరువాత అతి పెద్ద ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు. అందువలన రాబోయే ఫలితాలు కనీసం పైకి కాస్తన్నా న్యాయంగా కనిపించాలంటే తగినంత మంది మద్దతుదార్లను, ఓటర్లను సమీకరించుకోవటం పాలకపక్షానికి ముఖ్యం అవుతుంది. దీని అర్ధం వచ్చే పార్లమెంట్‌ పొందిక ఎలా వుంటుందో అనే సందేహాలు లేనప్పటికీ తనకు అవసరమైన ఓట్లను తెచ్చుకొనేందుకు ప్రభుత్వం మరింతగా ప్రచారం, ప్రలోభాలు, వాగ్దానాలు, బలప్రయోగాలు చేయాల్సి వుంటుంది.కులీనులు పుతిన్‌ నాయకత్వం పట్ల మరింత అసంతృప్తికి లోనవుతారు.ఇది యాదృచ్చికం కాకపోయినా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ మరోసారి నిజమైన ప్రతిపక్ష పార్టీగా కనిపించేందుకు ఆకస్మికంగా పూనుకుంటుంది.

    గతంలో కమ్యూనిస్టుల ప్రసంగాంశాలను చూస్తే వాటిలో దాదాపు విబేధించేవేమీ వుండవు.అన్నీ హాస్యాస్పదంగా పెన్షనర్లకు మాజీ సైనికులకు మద్దతు వంటి నిస్సారమైన అంశాలుండేవి.ఈసారి పదునైన అంశాలుంటాయి. రష్యన్ల ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిన రెండు అంశాలైన ప్రభుత్వ అవినీతి, అసమర్ధతలను ప్రముఖంగా ప్రస్తావించాలని వారు ఇప్పుడు ప్రచారకులను ప్రోత్సహిస్తున్నారు.

     ఈలోగా 450 స్థానాలున్న పార్లమెంట్‌లో 92 మంది కమ్యూనిస్టు ఎంపీలు ఓటర్లకు దగ్గరయ్యే అవినీతిని కీలకాంశంగా తీసుకొని నూతన అవినీతి నిరోధక చర్యలను పతిపాదిస్తున్నారు.అవినీతి కేసులలో దొరికి పోయిన వారిని శాశ్వతంగా ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధించాలనటం వాటిలో ఒకటి. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎవరైనా అవినీతిలో దొరికిపోతే కొంత కాలం కనుమరుగై తిరిగి అధికార పదవులలోకి వస్తున్నారు. మాజీ రక్షణ మంత్రి అనతోలీ సెర్డ్‌యుకోవ్‌ను పదికోట్ల డాలర్ల అవినీతి కేసులో 2012లో పదవి నుంచి తొలగించారు. మూడు సంవత్సరాల తరువాత ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వ సంస్ధ రోస్టెక్‌ కార్పొరేషన్‌ డైర్టెర్‌గా నియమించారు. మరొక బిల్లు ఏమంటే ప్రభుత్వ సీనియర్‌ అధికారులను వాణిజ్య సంబంధిత అధికారులతో సంబంధాలు పెట్టుకోకుండా నిషేధించటం. అనేక దేశాలలో ఇది సాధారణం, రష్యాకు ఇది కూడా కొత్తదే. ఈ బిల్లులేవీ ఎన్నటికీ చట్టాలుగా మారవు.వాటిలో అనేక అనుచిత ప్రయోజనాలు దాగివున్నాయి. కానీ ఏ విధంగా చూసినా అదొక సమస్య కాదు. కమ్యూనిస్టులు ఈ అంశాలను ప్రతిపాదించటం ద్వారా యథాస్థితిని సవాలు చేసి అవినీతి వ్యతిరేపార్టీగా ముందుకు వస్తున్నారు.

      పుతిన్‌ నిర్మించిన రాజకీయ వ్యవస్ధలో అవినీతి కేంద్ర స్థానంగా తయారైంది, అది నిజంగానే ఒక పెను సవాలు.రష్యన్‌ కమ్యూనిస్టులలో ఈ నూతన సమరశీలత దాని ప్రముఖ నాయకుడు గెన్నడీ జుగనోవ్‌ నుంచి వస్తున్నదంటే నమ్మటం కష్టం. ధృడకాయుడైన 71 సంవత్సరాల జుగనోవ్‌ 1996 అధ్య క్ష ఎన్నికలలో బోరిస్‌ ఎల్సిన్‌ చేతిలో కొంతమేరకు, పూర్తిగా ఎన్నికల అక్రమాల కారణంగానే ఓడిపోయారు. అప్పటి నుంచి వినయశీలి అయిన ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రకు పరిమితం అయ్యేందుకు అంగీకరించినట్లు కనిపిస్తుంది.ఆయన పుతిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇచ్చగించినప్పటికీ ఆచరణలో ఆయన, పార్లమెంటులోని ఆయన సహచరులు ప్రతి కీలక సమయంలోనూ ప్రభుత్వంతో వుండేందుకు మెత్త పడ్డారు. మన:పూర్వకంగానే ఈనూతన వైఖరిని పార్టీలోని దిగువ స్ధాయి కార్యకర్తలు ఆయనపై రుద్దటం ఖాయం.రష్యన్‌ కమ్యూనిస్టుల పునాది వయస్సు మీరుతున్న సోవియట్‌ పెద్దలతో నిండి వుంది. అనేక మంది స్టాలినిస్టు భావాలతో సహా తీవ్రమైన తిరోగాములుగా వుంటారు. కానీ మహత్తరమైన మరియు నిబద్దతకు కట్టుబడి వుంటారు. రష్యా ప్రభుత్వ అదుపులో వుండని ఏకైక జాతీయ రాజకీయ యంత్రాంగంగా పార్టీ నిలబడిందంటే వారి కారణంగానే కనుక వారికి కృతజ్ఞతలు చెప్పాలి.

     ప్రత్యేకించి రష్యన్‌ ప్రాంతాలలో అక్కడక్కడ మరియు అనుభవాలతో అసంతృప్తికి లోనైన 20,30 దశకాలలోని యువత కమ్యూనిస్టుపార్టీలో నూతన తరం. ఏ రకమైన ప్రతిపక్ష రాజకీయ భావప్రకటనకైనా అలాంటి వారికి అవకాశం కల్పిస్తున్న రాజకీయ వ్యవస్ధ ఇదే. వారు సాధారణంగా సోవియట్‌ తరహా కమ్యూనిస్టులు కాదు.ఐరోపా సోషల్‌ డెమాక్రట్లకు దగ్గరగా వుంటారు. కులక్కులను అంతం చేయటం, బలవంతంగా అధికారాన్ని లాక్కోవటానికి బదులు ఆదాయాలు పెరిగే కొద్దీ పన్నులు పెంచాలని, పేద-ధనికుల మధ్య అంతరం తగ్గించాలని కోరుకుంటారు.

     అమెరికాలో ఈ దిగువ స్ధాయి యువతరం సభ్యులు బెర్నీ శాండర్స్‌కు ప్రచారం చేయచ్చు, కానీ రోజు వారీ తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న సమస్యలైన ప్రభుత్వ సేవల దిగజారుడు, దోపిడీ చేస్తున్న మరియు అసమర్ధ స్థానిక యంత్రాంగం, పైనుంచి కింది వరకు వ్యవస్థలో వున్న అవినీతిని పట్టించుకోవటానికి ఈ యువ కార్యకర్తలు రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోవటానికి సిద్ధం అవుతున్నారు.

    రష్యన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా బాహుళ్య దేశభక్త శక్తులు ఏకం అయ్యేందుకు నిర్ణయం తీసుకోవాల్సి అవసరం గురించి జుగనోవ్‌ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేవలం 13శాతం ఏక స్లాబు పన్ను మాత్రమే చెల్లిస్తున్న ధనికులపై ఆదాయం పెరిగే కొద్దీ పన్ను పెంచాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.సగానికిపైగా రష్యన్లు దారిద్య్ర రేఖకు దిగువన వున్నారని హెచ్చరిస్తున్నారు. రష్యన్‌ పౌరులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల గురించి మాట్లాడటం ప్రారంభించటం ద్వారా సున్నితమైన దారిద్య్రం, అవినీతి, అధికార యంత్రాంగ అవకతవకలను ప్రతి వారూ మాట్లాడేందుకు వీలుగా ముందుంచి వారు జాతీయ చర్చకు కొత్త రూపం కల్పించేందుకు నాంది పలకవచ్చు. ఇది విదేశీ సాహసాలపై డబ్బు, సమయం వెచ్చించటాన్ని తగ్గించే విధంగా , ఎక్కువగా అంతర్గత సమస్యలపై కేంద్రీకరించేందుకు ప్రభుత్వంపై వత్తిడి చేస్తుందా లేదా రష్యా రాజకీయ వ్యవస్ధలో పుతిన్‌ పట్టు సడలేందుకు తోడ్పడుతుందా అని చెప్పటం తొందర పాటు అవుతుంది. కానీ రెండూ జరగవచ్చు.ఇది విప్లవాత్మకతకు ఎంతో దూరంగా వుండవచ్చు, కానీ ఇది రష్యన్‌ వ్యవస్ధ పరిమితంగా అయినా సరైన దారిలో పయనించేందుకు అది కనీసం తట్టినట్లు చేయగలదు. పరిహాసంగా కనిపించవచ్చునేమో గానీ భవిష్యత్‌లో రష్యాలో ప్రజాస్వామ్యం మరియు సంస్కరణలు ముందుకు పోవటానికి కమ్యూనిస్టులు సాయం చేయవచ్చు.