Tags

, , , ,

 

సత్య

అబ్బ దేశభక్త అరుణ్‌ జెట్లీ బలే చెప్పిండు కదా ! జనం సొమ్ము ప్రతి పైసాకు జవాబుదారీగా వుంటా, అవినీతి పరుల భరతం పడతా, చీల్చి చెండాడుతా అని వీర, శూర ప్రతిజ్ఞలు చేసిన నరేంద్రమోడీ గత రెండు సంవత్సరాలుగా తమ పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా అవినీతిని చూపమని సవాలు చేస్తున్నారు. అవినీతి అంటే ఫలానా రూపు రేఖలు వుండేదే అని ఎక్కడా నిర్దిష్టంగా నిర్వచించలేదు. ప్రధాన మంత్రి ఇంకే మాత్రం తమది శుద్ధమైన పాలన అని చెప్పుకోవటానికి లేదు. ఇంతవరకు ఒక్క అవినీతి పరుడిని, నల్లధనం దాచుకున్న వారిని శిక్షించిన లేదా అందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు.అన్నింటికీ మించి తొమ్మిదివేల కోట్ల రూపాయల సొమ్ము ఎగవేసిన విజయ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఇవ్వటాన్ని అవినీతి అని గాక దేశభక్తి అని చెబుతారా ?

మాల్యా అంటే దేశద్రోహ నిందలు మోపి కేసులు బనాయించిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధులు దేశం విడిచి తప్పించుకోకుండా కనిపిస్తే నిర్బంధించమని జారీ చేసిన నోటీసుల(అవుట్‌లుక్‌) విషయం గుర్తుకు వచ్చింది ! వారి కోసం పోలీసులు జెఎన్‌యు గేట్ల ముందు పడిగాపులు కాశారు. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ మాల్యా అనే పైలా పచ్చీసు దేశం విడిచి వెళ్లే కేంద్రాలలో కనిపిస్తే నిర్బంధించండని తొలుత నోటీసులు జారీ చేసిన సిబిఐ కొద్ది రోజుల్లోనే ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని సవరించింది. ఇదంతా జరిగింది ఎప్పుడు ? 2015 అక్టోబరు 16, నవంబరు మాసాలలో, అదీ మోడీ పాలనలోనే ! దీని భావమేమి తిరుమలేశా !

ప్రభుత్వాన్ని ఇరకాటం నుంచి తప్పించేందుకు విజయ్‌ మాల్య విదేశీ పర్యటన గురించి తమకు తెలుసునని, గతంలో కూడా వెళ్లాడని, తిరిగి రాకపోతే ఏం చేయాలో కూడా తెలుసునని సిబిఐ అనధికారికంగా మీడియాకు చెప్పింది. ఇక్కడే చిన్న తిరకాసు వుంది. లలిత్‌ మోడీ అనే పెద్ద మనిషి కూడా పారిపోతే ఏం చేశారో చెబితే బాగుండేది. పార్లమెంట్‌ సభ్యులెవరైనా పది రోజుల పాటు సమావేశాలకు హాజరు కాలేని పరిస్ధితులలో సభాధ్య్ష స్ధానం నుంచి అనుమతి తీసుకోవాలి. మాల్య మార్చి ఒకటవ తేదీన రాజ్యసభకు హాజరయ్యాడు.ఈనెల 16న సమావేశాలు వాయిదా పడతాయి. అంటే సరిగ్గా పదిరోజులు జరుగుతాయి. అయినా ఎలాంటి అనుమతి తీసుకోకుండా లండన్‌ వెళ్లాడు. అంతే కాదు ఎంపీలు ఎవరైనా విదేశీ పర్యటనలు జరపదలచుకుంటే ఆ విషయాన్ని విదేశాంగశాఖకు తెలియచేయాలని కూడా సలహా వుంది. ఇవేవీ పాటించలేదు, తాను విదేశాలకు వెళుతున్నట్లు అటు రాజ్యసభ అధ్యక్ష స్ధానానికి, విదేశాంగశాఖకు, నోటీసు జారీ చేసిన సిబిఐకి కూడా చెప్పలేదు. తీరా అది వివాదం అయిన తరువాత గతంలో చాలాసార్లు వెళ్లాడు, తిరిగి వచ్చాడు, పిలిచినపుడు వచ్చి మాకు సహకరించాడు, అతను వాణిజ్యవేత్త కనుక ప్రతి ఏడాది కనీసం 183 రోజులకు పైగా విదేశాలలో వుంటారు అనే కాకమ్మ కబుర్లు చెబుతోంది సిబిఐ.

మొత్తం మీద జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే సదరు మాల్యా దేశం విడిచి పోవటానికి నవంబరులోనే మోడీ సర్కార్‌ దోవ చూపిందన్నమాట. తనకు రావాల్సిన బకాయి వసూలుకు గాను మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని బెంగలూరులో ఎస్‌బిఐ పిటీషన్‌ దాఖలు చేసిన రోజే , మార్చినెల రెండవ తేదీనే సరిగ్గా మాల్యా కూడా దేశం నుంచి తప్పించుకున్నాడు. అంటే ముందే వుప్పందకుండా అది ఎలా సాధ్యం? ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో వారు మాల్యా విమానాశ్రయానికి రాగానే వెంటనే సిబిఐకి తెలియచేసినప్పటికీ అయితే ఓకే అన్నట్లుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు. ఎప్పుడూ నలుగురైదుగురు రంగీలాలను వెంట వేసుకు తిరిగే మాల్యా లండన్‌ వెళుతూ తన వెంట ఒక యువతితో సహా ఏడు పెద్ద సూట్‌కేసులు తీసుకు వెళ్లాడని వెల్లడైంది. ఇది వాణిజ్యం కోసం వెళ్లినదిగా లేదని అనేక మంది చెబుతున్నారు.

ఈ విషయాలేవీ తెలియనట్లు, అపర దేశభక్తుడైన మన ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అరే మాల్యా దేశం విడిచి వెళ్లాడా? ఎప్పుడు ? అని ఆశ్చర్యం నటించి వెంటనే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగి మీ హయాంలో బోఫోర్సు కుంభకోణంలో నిందితుడు కత్రోచీ దేశం విడిచి తప్పించుకుపోయిన విషయాన్ని మర్చిపోవద్దు, అయినా మాల్యాకు కాంగ్రెస్‌ హయాంలోనే కదా రుణాలు ఇచ్చారు అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆ పెద్దమనిషి రెండవ సారి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినపుడు బిజెపి ఓట్లతోనే విజయం సాధించాడు. ఏ బంధంతో బిజెపి ఓట్లు వేసింది. కింగ్‌ ఫిషర్‌ విమానాల కంపెనీ బండారం 2012లోనే బయట పడింది. మరుసటి ఏడాది మూత పడే సమయానికి దాని మొత్తం నష్టం 16వేల కోట్ల రూపాయలు దాటిందన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కంపెనీకి అన్నివేల కోట్ల రూపాయల అప్పులిచ్చారు? ఎలా వసూలు చేస్తారని ప్రతిపక్షంగా బిజెపి ఇతర అనేక సందర్బాలలో చీటికి మాటికి ఆందోళన చేసిన పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్‌ను స్ధంభింప చేసిందా? ఎందుకు చేయలేదు?మాల్యా తమకు సాయం చేసే దేశభక్తుడనా ? బోఫోర్సు కుంభకోణంలో లబ్దిదారులు కాంగ్రెస్‌ వారు కనుక విదేశీ కత్రోచీని స్వదేశానికి పంపినదానికి బదులు తీర్చుకొనేందుకు మీరు స్వదేశీ మాల్యాను విదేశాలకు పంపినట్లా ? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన రుణాలను వసూలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా ?

కేంద్ర దర్యాప్తు సంస్ధ సిబిఐ మాల్య కనిపిస్తే నిలిపివేయండని తొలుత ఇచ్చిన నోటీసును ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని ఎందుకు సవరించినట్లు ? సవరించింది పో, మార్చి రెండవ తేదీన మాల్యా లండన్‌ వెళ్లే విమానం ఎక్కినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలియ చేసిన తరువాత మాల్యా విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వచ్చిన వెంటనే ఆ విషయం తమకు తెలుసని సిబిఐ ఎందుకు ప్రకటించలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా ఇంత ముఖ్యవిషయం మంత్రులకు కూడా వెంటనే తెలపలేదా ? లేక తెలిసి కూడా కావాలనే దాచి పెట్టారా ? పార్లమెంట్‌లో ఈ విషయాలను ఎందుకు ప్రకటించలేదు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగితే కుదరదు.

పరారీ గురించి దేశంలో, పార్లమెంటులో గగ్గోలు చెలరేగిన తరువాత శుక్రవారం నాడు తాను దేశం విడిచి పారిపోలేదని మాల్య ట్విటర్‌ ద్వారా తెలిపాడు, ఎక్కడున్నదీ వెల్లడించలేదు. మీడియా తనను వేధిస్తున్నదని, తన నుంచి సాయం పొందిన ఛానల్స్‌ యజమానులు దానిని మరిచిపోవద్దని, ఛానల్స్‌ రేటింగ్‌ను పెంచుకొనేందుకు అవాస్తవాలు చెబుతున్నారని, వారికేం చేసిందీ తన దగ్గర రికార్డులు వున్నాయని మాల్యా పేర్కొన్నాడు. తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై కూడా ధ్వజమెత్తాడు.

మాల్యా తనపై వచ్చిన వార్తలను వక్రీకరణలని ఆరోపించటమే కాదు, తాను పారిపోవటం లేదని ఇంతకు ముందు కూడా వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో తాను లండన్‌లో తన పిల్లల దగ్గర ఎక్కువ సమయం గడిపేందుకు వెళుతున్నానని చెప్పినదానిని లండన్‌లో స్ధిరపడేందుకు అన్నట్లుగా రాశారని, క్రమంగా వ్యాపారాన్ని తగ్గించుకోవటం తన వుద్ధేశ్యమన్నాడు.డియాజియో సంస్ధకు తన లిక్కర్‌ కంపెనీని పూర్తిగా అమ్మివేసి తనకు రావాల్సిన సొమ్మును కూడా తీసుకున్నాడు.

బ్యాంకులు తన ఆస్తులను వెల్లడించమని కోరుతున్నాయని, తనకేమి వున్నాయో తెలియకుండా వున్నాయా అంటూ తనకున్న ఆస్తులేమిటో తాను రాజ్యసభకు రెండు సార్లు ఇచ్చానని కావాలంటే చూసుకోవచ్చని చెప్పాడు. వాటి ప్రకారం మాల్యాకు ఆస్తులు, అప్పులు లేవు. అంటే స్వాధీనం చేసుకొనేందుకూ కూడా ఏమీ లేకుండా ముందే జాగ్రత్త పడినట్లే.

మరోవైపు మాల్యా తీసుకున్న అప్పుల కంటే ఎక్కువ ఆస్తులున్నాయని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహతగి సుప్రీం కోర్టుకు తెలిపారు. పాస్‌పోర్టుతో సహా దేశానికి తిరిగి రావాలని నోటీసు జారీ చేయాలని సోమవారం నాడు సుప్రీ ం కోర్టు వుత్తరువు జారీ చేసింది.అయితే ఆ నోటీసు ఎప్పుడిస్తారో తెలియదు. మొత్తం మీద సరళీకరణ విధానాలతో ప్రభుత్వ బ్యాంకులను ఎలా వాడు కోవచ్చో, కొల్లగొట్టవచ్చో విజయమాల్య వుదంతం వెల్లడించింది. ఇవే కాదు, నిరర్ధక ఆస్తుల పేరుతో బ్యాంకులు చెబుతున్న లక్షల కోట్ల పారుబకాయిలన్నీ ఇలా ముంచినవే. ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుందంటారు. మరోవైపు బ్యాంకులను ముంచని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టని బడా ప్రయివేటు సంస్ధ ఒక్కదానిని కూడా మనం చూడలేము.