Tags
dirty picture, JNU, JNU ROW, JNUSU, kanniah kumar, parivar, RSS, RSS game
సత్య
జెఎన్‌యు విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను దేశద్రోహిగా చిత్రించేందుకు అతని బహిరంగ కార్యక్రమాలను తప్పుపట్టటంలో ఘోరంగా విఫలమైన పరివార్ యంత్రాంగం ఇప్పుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ప్రచారంతో అతని ప్రయివేట్ పార్టుల(మర్మావయాల)ను వెతికే పనిలో పడింది. జెఎన్‌యులో రోజుకు మూడువేల కండోమ్‌లను వుపయోగిస్తారంటూ కచ్చితంగా లెక్క పెట్టి చెప్పిన పార్టీ త్వరలో కన్నయ్య ప్రయివేట్ పార్టుల గురించి ఒక వీడియోను రూపొందించి విడుదల చేసి తమతో చేతులు కలిపిన టీవీఛానల్స్, సామాజిక మీడియాలో ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలను ఎంత నీచ స్థాయికి దిగజార్చుతున్నారు !
గత సంవత్సరం ఒక రోజు కన్నయ్య జెఎన్‌యు ప్రాంగణంలో ఒక చోట బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో సమీపంలో వున్న ఒక మాజీ విద్యార్ధిని అభ్యంతర పెట్టింది. అతని ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు విచారణ జరిపి మూడువేల రూపాయల జరిమానా విధించారు. దానిని అతను చెల్లించాడు. దాంతో ఆ వుదంతం ముగిసింది. తరువాత జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో అతను పోటీ చేశాడు, గెలిచాడు. మూత్ర విసర్జన వుదంతాన్ని ఇప్పుడు బయటకు తీసి దాన్ని అందమైన భాషతో వర్ణించి విప్లవం గురించి కబుర్లు చెప్పే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జన చేయటం ఏమిటి, దాన్ని అభ్యంతర పెట్టిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించటం విప్లవ కార్యక్రమమా అంటూ ఆ యువతి పేరుతో తయారు చేసిన ఒక లేఖను తీసుకొని ప్రతివారినీ తట్టి మరీ చదివిస్తున్నారు. హద్దులు మీరనంత వరకు, నేరం కానంత ఎవరికైనా ఏం చేయటానికైనా అభ్యంతరం లేదు. దీనిపై ఎఐఎస్ఎఫ్ ఒక ప్రకటన చేస్తూ కన్నయ్య జరిమానా చెల్లించిన మాట వాస్తవమేనని, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేది తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక్కడ సమస్య ఏమిటంటే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జనను ఎవరూ సమర్ధించరు అది ముగిసిపోయిన అంశం. మన దేశంలో బహిరంగ మల, మూత్ర విసర్జన ఒక పెద్ద సామాజిక సమస్య.పట్టణాలలో వుండేవారికి ఇది నిత్యం కనిపించే దృశ్యం.దాని మంచి చెడ్డల గురించి వేరే సందర్బంలో చర్చించుకోవచ్చు. గతేడాది జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఎబివిపి కూడా పోటీ చేసింది. సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్ధుల గురించి విద్యార్దినీ, విద్యార్ధులు ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. ప్రత్యర్ధులు సందు దొరికితే ప్రతి లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎబివిపి ఆ ఎన్నికలలో ఈ డర్టీ పిక్చర్‌ను ముందుకు తేలేదు. నిజంగా కన్నయ్య మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే కీచకుడే అయితే అతను అరెస్టయినపుడు వందల మంది విద్యార్ధినులు ప్రదర్శనలు, సభల్లో పాల్గొని వుండేవారా ?
కన్నయ్యపై దేశద్రోహ నేరం కట్టుకధ అని తేలటంతో పరివార్ రెండో డర్టీ సీన్‌కు తెరతీసింది. ఇలాంటి ఎత్తుగడలు పశ్చిమ దేశాలనుంచి అరువు తెచ్చుకున్న బాపతు తప్ప భారతీయ సంస్కృతి కాదు. నరేంద్రమోడీతో సహా అనేక మంది ఆరాధించే అమెరికాలో అక్రమ సంబంధాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కోపం వస్తే విడాకులిచ్చి మరొకర్ని చూసుకుంటారు. వారు అంతకు ముందు ఎలా తిరిగినా ఫరవాలేదు, పట్టించుకోరు. అందుకే అక్కడ ఏ తల్లికి జన్మించారు అనేది ముఖ్యం. ఎవరైనా ఎన్నికలలో పోటీ చేస్తే ప్రత్యర్ధులు వారి రంకు, గొంకులు, అవినీతి అక్రమాలను ముందు పెట్టి వుతుకుతారు. అంతకు ముందు మనకు తెలియని అనేక విషయాలను ప్రచారంలో పెడతారు, అవి వాస్తవమా కాదా అని తేలే లోపల ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు దేశద్రోహం అనే తప్పుడు కేసులో బెయిలుపై బయటకు వచ్చాడు. దాన్ని గురించి ఇంక ఎన్నికధలు చెప్పినా జనం నమ్మే స్ధితిలేదు. అందుకని ఈ డర్టీ ప్రచారానికి తెరలేపారు.
గురివింద గింజ తన కింది నలుపెరగదట. గుజరాత్లో ఒక యువతి ఎక్కడికి వెళుతోంది, ఎవరితో తిరుగుతోందో తెలుసుకొని తనకు నివేదించమని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ ఆదేశించిన విషయాన్ని పరివార్ దాచి పెట్టినా దాగేది కాదు. కుమార్తె ప్రవర్తన గురించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే అలా ఏర్పాటు చేసినట్లు ఆ చర్యను సమర్ధించుకున్నారు. ఇది భారతీయ యువతుల గౌరవాన్ని పెంచే, మాన మర్యాదలను కాపాడే చర్యగా కన్నయ్యపై లేఖ రాసిన యువతికి గాని దాన్ని పట్టుకుతిరుగుతున్న పరివారానికి గానీ కనిపిస్తోందా ?
ఆశారాంబాపు ఒక బాలికపై అత్యాచార కేసులో జైలులో వున్న పెద్దమనిషి. అతగాడి అనుగ్రహం కోసం తపించినవారిలో నరేంద్రమోడీ ఒకరు. ఆశారాం నిజస్వరూపం తెలిసిన తరువాత కూడా వుమాభారతి వంటి నేతలు అతనికి మద్దతుగా మాట్లాడటాన్ని చూసి రాజకీయంగా నష్టదాయకం కను ఎవరూ నోరు విప్పవద్దని 2013లో మోడీ కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సుబ్రమణ్యస్వామి జైలులోవున్న బాపును కలసి నువ్వు నిరపరాధివి బెయిలు పిటీషన్‌పై నీ తరఫున నేను వాదిస్తా అని చెప్పి జోద్పూర్ కోర్టులో వాదించాడు. అప్పటికే దిగువ, గుజరాత్ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా బెయిల్ పిటీషన్‌ను ఐదుసార్లు తిరస్కరించిన ఈ కేసును వాదించకపోతే సుబ్రమణ్యస్వామికి రోజు గడవదా ? ఆ స్ధాయిలో వున్నవారు ఇలాంటి చర్యల ద్వారా ఏ సందేశం పంపారు. వీరు జెఎన్‌యు విద్యార్ధుల గురించి గుండెలు బాదుకుంటున్నారు? సమాజానికి నీతులు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది బిజెపి నేతలు వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. వీరు రెచ్చగొట్టే మతోన్మాదం, అసహనం, కుహనా దేశభక్తి వంటి ముప్పు తెచ్చే అంశాలను వదలి వారి డర్టీ పిక్చర్స్‌పై కేంద్రీకరించటం అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించటమే.
కన్నయ్య ఇతర జెఎన్‌యు విద్యార్ధుల విషయంలో బిజెపి ఇప్పుడు ఇరకాటంలో పడింది. పులినెక్కిన మాదిరి వారి పరిస్థితి వుంది. దాన్ని అదుపులోకి అయినా తెచ్చుకోవాలి లేదా దానికి బలి కావాలి. దానిలో భాగంగానే గోబెల్స్ మాదిరి వారి తప్పుడు ప్రచారాన్ని కొనసాగించటం, వాటికి తోడు ఫలానా వాడు ఫలానా విధంగా జిప్ విప్పాడు, ఫలానాచోట మూత్రం పోశాడు వంటి అంశాలను ముందుకు తీసుకు వచ్చి తమపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకు చూసే ఎత్తుగడమాత్రమే.