Tags
bankers, cbi, farmer, luxuries, nare, Narendra Modi, Narendra Modi Failures, non-payment of dues, vijay mallya
ఎం కోటేశ్వరరావు
తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యను విలాసాలకోసం సగౌరవంగా విదేశాలకు పంపిన బ్యాంకర్లు, అధికారయంత్రాంగం సామాన్య రైతును మాత్రం పరలోకానికి పంపింది. తమిళనాడులోని ఒక రైతు లక్షా 30వేలు చెల్లించలేకపోయినందుకు పోలీసులు, రికవరీ ఏజంట్లు కలిసి చితకబాదటాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వుదంతం వెలుగులోకి వచ్చింది. అరయలూరు జిల్లాకు చెందిన బాలన్ ఒక ట్రాక్టరు కొనుగోలుకు రు.3.4లక్షల రుణం తీసుకున్న ఆ రైతు వడ్డీతో సహా రు.4.1లక్ష చెల్లించాడు. ఇంకా 1.3లక్షల బకాయి వుంది. పంటలు దెబ్బతిన్న కారణంగా దానిని చెల్లించలేకపోయాడు తప్ప పని గట్టుకొని ఎగవేసిన వ్యక్తి కాదు.బాలన్‌ను కొట్టిన దృశ్యాలు వీడియో చిత్రీకరించినట్లు కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.మాల్య మంచి వాడంటూ కొందరు రాజకీయ వేత్తలు బహిరంగంగా ప్రకటించారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నందుకు యావత్ జాతి నిజంగా సిగ్గు పడాల్సి వుంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మన దేశంలో వున్నత దర్యాప్తు సంస్ధ. ప్రతిష్టతో పాటు అప్రతిష్టను కూడా సమపాళ్లలో మూట కట్టుకుంది. తాజాగా విజయ్ మాల్యా వుదంతంలో అది వ్యవహరించిన తీరుపై దానిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలని ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ చేసిన డిమాండ్‌పై మామూలు ప్రకారం మోడీ నోరు విప్పుతారని ఎవరూ అనుకోవటం లేదు నిజంగా నోరు విప్పితే అది మేకిండియా తొలి వుత్పత్తే అవుతుంది.
విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన పది రోజుల తరువాత సిబిఐ తన అధికారి తప్పు చేసినట్లు చెప్పిందంటే యధా ప్రధాని తధా సిబిఐ అని చెప్పుకోవాల్సి వుంది. గతేడాది అక్టోబరులో తొలి లుక్ అవుట్ నోటీసు జారీ చేసినపుడు తమ అధికారి తప్పు చేశాడని ఇప్పుడు సిబిఐ చెప్పటం నష్ట నివారణ చర్యలలో భాగంగా కట్టుకధ అంటే తప్పేముంది? ఆ తప్పు చేసింది ఒక గుమస్తా కాదు, ఎస్పి స్ధాయి అధికారి.ఒక వేళ నిజంగా పొరపాటే అయి వుంటే వెంటనే గుర్తించి వుండాలి, అదే జరిగి వుంటే మాల్య పరారీ వార్తలు వచ్చిన మరుక్షణమే అది వాస్తవం కాదని ప్రకటించాలి అదేమీ జరగలేదే ? ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల్య తమకు అందుబాటులో వుండి సహకరించారని చెప్పిన సిబిఐ లుక్అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేశారంటే ఇప్పుడే చెబుతోంది?
ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయల చెల్లింపులో విఫలమైన మాల్య గురించి అది చేసిన ఫిర్యాదుతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత అక్టోబరు పదిన జరిపిన సోదాల సందర్భంగా మాల్య ఆచూకీ తెలియలేదు. దాంతో ప్రశ్నించేందుకు అందుబాటులో వుంచేందుకు అతనిని పట్టుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు రాసినట్లు సిబిఐ చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారంట్ లేని వ్యక్తులను అడ్డగించటం కుదరదని ఆ విషయం తెలియక ఒక అధికారి నోటీసు జారీ చేశారని, తరువాత దానిని గుర్తించి మరుసటి నెలలో అతని గురించి తెలియచేస్తే చాలని మరోనోటీసు జారీ చేసినట్లు ఇప్పుడు చెబుతోంది. ఆ విధంగా చూసినపుడు మాల్య లండన్ వెళ్లటం గురించి తమకు తెలుసునని , వెళ్లటంలో తప్పులేదని వెంటనే సిబిఐ ఎందుకు చెప్పలేకపోయింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈనెల 18వ తేదీన హాజరు కావాలని జారీ చేసిన నోటీసుపై ఇంతవరకు మాల్య స్పందన వెల్లడి కాలేదు. ఇదిలా వుండగా మాల్య కర్ణాటక బిడ్డ అని అనేక విమాన సంస్ధలు నష్టాలపాలైనట్లే అనేక కింగ్ ఫిషర్ కూడా నష్టపోయిందని అలాంటి వారిని అనేక మందిని వదలి కేవలం మాల్యనే ఎందుకు వెంటాడుతున్నారని నిద్రలేచిన మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం నాడు ప్రశ్నించారు. బ్యాంకులకు చెల్లించటంలో విఫలమైన వారు 60 మంది వరకు వున్నారని, మాల్య రాజ్యసభ సభ్యుడు గనుకనే ఇలా చేస్తున్నారని గౌడ ఆరోపించారు. మాల్య పెద్దమనిషి అని ఆయన భారత్‌కు తిరిగి వస్తారని జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విటర్ ద్వారా మాల్యాకు ఒక సలహా ఇచ్చారు. మాల్య వెంట తిరిగే బికినీ భామలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాంకుకు పంపి రుణం తీర్చుకోవచ్చన్నారు. అయితే బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించవేమోగాని బ్యాంకర్లు సిద్దపడతారని పేర్కొన్నారు.