Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

    ఏమో ? తాను దేశం విడిచి పారిపోలేదని, తనకు భారతీయ న్యాయ వ్యవస్థపై ఎంతో విశ్వాసం వుందని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పిన కొన్ని గంటలలోనే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, తగిన సమయం ఆసన్నమైనపుడే తిరిగి వస్తానని, తాను ఎక్కడ వున్నదీ వెల్లడించనని చెబుతున్నాడు. ఈనెల పదవ తేదీన ఒక చెక్కు చెల్లని కేసులో హైదరాబాదు కోర్టులో హాజరు కావాల్సిన మాల్య రాకపోవటంతో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.మాల్యపై తమ మౌన బాబా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు తీసుకొనే అద్బుతం జరగబోతోందని అప్పుడు మోడీ మహిమలను పొగిడేందుకు సిద్ధంగా వుండాలని మోడీ భక్తులు ఇప్పటికీ చెబుతున్నారు. గార్డియన్‌ పత్రిక వెల్లడించిన తాజా అంశాల ప్రకారం ఈనెల 18న ఇడి ముందు మాల్య హాజరు కావటం లేదని తేలిపోయింది. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి వుంది. లండన్‌ నుంచి వెలువడే సండే గార్డియన్‌ పత్రిక ఇమెయిల్‌ ద్వారా మాల్యతో చేసిన ఇంటర్వ్యూను ప్రచురించింది. దానిలోని అంశాలు ఇలా వున్నాయి.

ప్రశ్న: మీరు మార్చి రెండవ తేదీన ఎందుకోసం దేశం విడిచి వెళ్లారు? బ్యాంకు రుణాలు చెల్లించటంలో వైఫల్యానికి దానికీ సంబంధం వుందా ? మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు?

జవాబు: నేను వ్యక్తిగత పనుల మీద ఒక ఫ్రండ్‌తో కలసి ఢిల్లీ వదలి వెళ్లాను, ఇది వ్యాపార సంబంధమైనది కాదు,చాలా మంది నేను ఏడు పెద్ద సంచులతో సామాన్లు మోసుకొని వెళ్లినట్లు రాశారు.నేను అలా చేశానా లేదా అన్నది వేరే కధ.అయితే ఇద్దరు మనుషులకు అవేమీ ఎక్కువ అనుకోవటం లేదు. నేను భారీగానే వెళ్లాను. గతేడాది నాపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ అయింది.కానీ నేను తప్పించుకోలేదు.ఇప్పుడు నన్ను క్రిమినల్‌ అని ఎందుకు చిత్రించాలి? రుణాల చెల్లింపులో వైఫల్యం అన్నది వాణిజ్య వ్యవహారం.బ్యాంకులు రుణాలు ఇచ్చేటపుడు వచ్చే రిస్కులను కూడా అవి వుంటాయని వారు తెలుసుకోవాలి. నిర్ణయించుకోవాల్సింది వారు మేము కాదు.గతంలో వర్ధిల్లు తున్న మా స్వంత వ్యాపారం ఆకస్మికంగా దిగజారింది. నన్ను ఒక విలన్‌గా చేయవద్దు. నాకు వున్నతమైన ఆలోచనలు వున్నాయి. నేను శాంతంగా వున్నాను, నా వ్యాఖ్యలను ఇతరుల మాదిరి వక్రీకరిస్తారేమోనని భయపడుతున్నాను.

ప్రశ్న: బ్యాంకులు కోర్టుకు వెళ్లటానికి ముందు మీరు దేశం విడిచారు, ఎవరైనా మీకు వుప్పందించారా ?

జవాబు: అది భాష్యానికి సంబంధించిన అంశం. దేశం వదలి వెళ్లటం ఇదే ప్రధమం కాదు, నేను ఏ తప్పు చేయలేదు. దేని గురించీ ఎవరూ నాకు వుప్పందించనవసరం లేదు. పెద్ద మీడియాలోని ఎక్కువ సంస్ధలు నాగురించి అనేక అబద్దాలు చెబుతున్నాయి. పత్రికల్లో ఊహాగానాలు రాజ్యమేలుతున్నాయి. నాకు ముందస్తు సమాచారం వున్నట్లు తమకున్న సంబంధాల ద్వారా తెలిసినట్లు టీవీ చానల్స్‌ పేర్కొంటున్నాయి.నాకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు ముందుకు నెడుతున్న పెద్ద అజెండా ఇది.నన్ను బలి చేసేందుకు చూస్తున్నారు.బ్యాంకు వుద్యోగుల విస్వసనీయతను అనుమానించేవారు నన్నెందుకు వేలెత్తి చూపుతున్నారు.నేను నా దురదృష్టాని ఎల్లవేళలా ధైర్యంగా ఎదుర్కొన్నాను. నేను ఎంతో గొప్పగా జీవించాను, అనేక మందికి సాయం చేశాను. నా జీవితంలో నేను దేన్నీ దాచుకోలేదు. బహిరంగంగా జీవించే వారిలో నేను ఒకడిని.అజ్ఞాతంలోకి వెళ్లే విధంగా నన్ను నెట్టారు, అది నాకు విచారం కలిగించింది.

ప్రశ్న: మీరు భారత్‌కు రావటానికి ఎప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారా అవును అయితే ఎప్పుడు ?

జవాబు: నేను మౌలికంగా భారతీయుడిని. నేను తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నాకు న్యాయమైన అవకాశం దొరుకుతుందని నమ్మకం లేదు. నేను నేరస్తుడినని ఇప్పటికే ముద్ర వేశారు. ఇది సరైన సమయం అనుకోవటం లేదు.ఆగ్రహం ఎక్కువగా వుంది, జనం హేతుబద్దంగా ఆలోచించాలి. బిజినెస్‌ అన్నతరువాత అది చిన్నదైనా పెద్దదైనా రిస్కులు వుంటాయని అర్ధం చేసుకోవాలి.ఈ విషయాల్లో నేను వున్నతిని, అగాధాలను చూశాను.అయితే నేను ఒక రోజు తిరిగి వస్తానని ఆశతో వున్నాను.భారత్‌ నాకు అన్నీ ఇచ్చింది. నన్ను విజయ్‌ మాల్యగా చేసింది.

ప్రశ్న: ప్రస్తుతం మీరు ఎక్కడ జీవిస్తున్నారు? లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో మీ ఆస్తిదగ్గర మిమ్మల్ని చూసినట్లు జనం చెబుతున్నారు.

జవాబు: నేను ఎక్కడ వున్నదీ చెప్పటం తెలివిగల పని అనుకోవటం లేదు, అధికారులు నన్ను వేటాడటానికి నేనేమీ పేరు మోసిన నేరగాడిని కాదు,ప్రస్తుతానికి నేను సురక్షితంగా వుండాలని భావిస్తున్నాను.

    ఈ అంశాలను చూసిన తరువాత మాల్య ముందస్తు పధకంతోనే దేశం విడిచి వెళ్లాడన్నది స్పష్టం.తనను వేధిస్తున్నారని కధ వినిపించటం కూడా ఆశ్చర్యం కలిగించదు. మాల్య అక్రమాల గురించి ఆయన వుద్యోగులు, బ్యాంకు యూనియన్లు ఎప్పటి కప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే వున్న విషయాలను తొక్కి పెట్టిన టీవీ ఛానల్స్‌ ఇప్పుడు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు మాల్యను వినియోగించుకుంటున్నాయి. పత్రికలు కూడా తక్కువేమీ తినలేదు.

    శంషాబాద్‌ విమానాశ్రయానికి కింగ్‌ పిషర్‌ చెల్లించాల్సిన ఎనిమిది కోట్ల రూపాయలకు గాను పదకొండు కేసులను దాఖలు చేశారు. ఒక కేసులో 50లక్షల రూపాయల చెక్కు చెల్లలేదు.దీనిపై శనివారం నాడు విచారణ జరిగినపుడు మాల్య హాజరు కావటానికి మరింత సమయం కావాలని మాల్య న్యాయవాది కోరాడు.తిరస్కరించిన కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.