Tags

, , , , ,

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.