Tags

, ,

ఎంకెఆర్‌

     ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ తరచూ వినిపిస్తున్న మాట ఇది. భూతల స్వర్గం అనుకున్న అమెరికాలో పేదల సంఖ్య పెరుగుతూ భూతాల స్వర్గంగా మారుతోందనే వార్తలు. సోషలిస్టు రాజ్య నిర్మాణ బాటలో వున్న చైనాలో దారిద్య్రం తగ్గటం ఒకవైపు అసమానత పెరగటం మరోవైపు సమస్యగా వుందనే సమాచారం. తాజాగా ప్రపంచ సంతోష సూచికలో ప్రధమ స్ధానంలో వున్న డెన్మార్క్‌ కూడా ఆదాయ అసమాత పెరుగుతున్న దేశాలలో ఒకటిగా వున్నట్లు విశ్లేషణలు. దీనికి కారణాలు ఏమిటి ?

    గడచిన మూడు దశాబ్దాల కాలంలో అర్ధిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ(ఓయిసిడి)లోని 34సభ్య దేశాలలో ఇరవై రెండింటిపై విశ్లేషణ నివేదిక గతవారంలో వెలువడింది. వాటిలో 1985-2013 మధ్య సంభవించిన మార్పుల గురించి చర్చించారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీతో సహా 17 చోట్ల అసమానతలు బాగా పెరగటం, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, గ్రీసులో స్వల్ప మార్పులు, ఒక్క టర్కీలోనే అసమానత తగ్గినట్లు తేలింది. పదిహేడు ధనిక దేశాలలో ఎగువన వున్న పదిశాతం మంది ప్రధానంగా లబ్ది పొందగా దిగువన వున్న 40శాతం నామమాత్రంగా అభివృద్ధి ఫలాలను అందుకున్నారని తేలింది.

   ఏదేశంలో అసమానతలు ఎలా వున్నాయనే విషయం వివరించే ముందు ఎక్కడైనా అసమానతలకు కారణాలేమిటన్నది ముఖ్యం. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వారు చెబుతున్నదేమిటంటే అసమానతలకు మూలం సాంకేతిక పరిజ్ఞానమే. దాని కారణంగానే వద్దన్నా సంపదలు పోగు పడుతున్నాయి. ఇది వాస్తవాలను మరుగు పరిచే, లేదా అసలు కారణాలనుంచి దృష్టిని మళ్లించే వాదన అన్నది స్పష్టం.ఇదే కారణమైతే అన్ని ధనిక దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం దాదాపు అందుబాటులో వుంది. అయినా అసమానతల్లో, సమయాల్లో తేడా వుంది.అందువలన ఏ దేశానికి ఆ దేశంలోని ప్రత్యేక కారణాలు కూడా అసమానతకు దోహదపడుతూ వుండి వుండాలి.వాటిపై విశ్లేషణ జరగాల్సి వుంది.

     అమెరికాలో ప్రస్తుతం అసమానతలు తీవ్ర స్ధాయిలో వున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత   1951లో 26.8 శాతంగా గరిష్టంగా వున్న కార్పొరేట్ల లాభదాయకత 1982 నాటికి 9.4శాతానికి పడిపోయి తిరిగి 2011 నాటికి 13.2శాతానికి పెరిగింది.ఈ కాలంలో మనకు కనిపించే ప్రధాన లక్షణాలు ఏమంటే అంతర్జాతీయంగా కార్పొరేట్ల మధ్య పెరిగిన పోటీ లాభాల రేటు తగ్గటానికి, అదే సమయంలో లాభాలను నిలుపుకోవటానికి లేదా పెంచుకోవటానికి యాంత్రీకరణ, సిబ్బంది నియామకంలో నూతన వ్యవస్ధలు, ఇతర పద్దతులను పెట్టుబడిదారీ వర్గం ప్రవేశపెట్టింది. వాటిలో వేతనాల వాటాను గణనీయంగా తగ్గించటం ఒక ముఖ్యాంశం. ముందే చెప్పుకున్నట్లు యాంత్రీకరణ, కార్మిక సంఘాలను దెబ్బతీయటం,యూనియన్ల నుంచి కార్మికులను వేరు చేయటం, శిక్షణ(అప్రెంటిస్‌షిప్పు) పేరుతో ఎలాంటి చట్టాలు, రక్షణ వర్తించని నామమాత్ర వేతనాలతో సంవత్సరాల తరబడి పని చేయించుకోవటం, పర్మనెంటు వుద్యోగాలకు కూడా తక్కువ వేతనాలు చెల్లించటం, పొరుగు సేవలు, పొరుగుదేశాలలో వుత్పత్తి యూనిట్ల ఏర్పాటు, ఎక్కడ శ్రమశక్తి రేటు తక్కువగా వుంటే ఆక్కడ వుత్పత్తి వంటి అనేక నూతనాంశాలను తెరమీదకు తెచ్చారు. వీటన్నింటి పర్యవసానం ఏమంటే జిడిపిలో వేతన శాతాలు గణనీయంగా పడిపోవటం. ఆధునిక పరిజ్ఞానం వుత్పత్తి, వుత్పాదకతను గణనీయంగా పెంచటం, మార్కెట్‌ పోటీవలన లాభదాయకత తగ్గినా లాభాలు తగ్గలేదు. సంపద కేంద్రీకరణ పెరిగింది.అమెరికాలో 1970లో జిడిపిలో వేతనాల వాటా 59.9శాతం వుంటే 2011 నాటికి 50.7శాతానికి పడిపోయింది.

    ఇటీవలి కాలంలో పన్ను ఎగవేత, రాయితీల గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ అంశాలు కూడా సంపదలు పోగు పడటంలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వడ్డించేవారు మనవారైతే కడబంతిలో వున్నా మనకు అన్నీ దక్కుతాయన్న సామెత తెలిసిందే. గతంలో నాకేమిస్తావ్‌ అనే పద్దతి స్ధానంలో నీకిది, నాకది అనే ముందస్తు ఒప్పందాలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ భాగం చట్టబద్దంగానే జరుగుతోంది. పిల్లలను పెద్దలను విపరీతంగా ఆకర్షించిన సినిమాలు, సీరియల్స్‌లో హారీ పోటర్‌ ఒకటి.ఈ సినిమాతో పాటు ఇతర మరికొన్ని సినిమాలకు పంపిణీ హక్కులను రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ పొందింది. 1998 నుంచి 2007 సంవత్సరాల మధ్య ఆ హక్కులను కొన్ని స్టూడియోలకు లీజుకు ఇచ్చింది. స్టూడియోల వద్ద పెట్టుబడులు లేకపోవటంతో వాటికి అదే బ్యాంకు అప్పులిచ్చింది. బ్రిటీష్‌ చిత్ర పరిశ్రమను సంరక్షించేందుకు రూపొందించిన పన్ను రాయితీలను పొందటం ద్వారా కేవలం స్టూడియోలకు రుణాలు ఇచ్చినందుకు కోటిన్నర పౌండ్ల పన్ను రాయితీ పొందింది.ఇలా రకరకాల పధకాల కింద మొత్తం 25 పంపిణీ కంపెనీలకు రుణాలు ఇచ్చి వంద కోట్ల పౌండ్ల మేరకు లబ్ది పొందింది. ఈ మార్గం గురించి తెలిసిన అనేక మంది ఈ సినిమా పధకాలలో పెట్టుబడులు పెట్టారు. ఇలా ప్రజల సొమ్ము లూటీ చేయటం గురించి బయట పడగానే సదరు బ్యాంకు 2007లో ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చింది.

   గత పదిహేను సంవత్సరాలలో బ్రిటన్‌లో పోగుపడిన నూతన సంవదలో నాలుగో వంతు అక్కడి ఒకశాతం మంది దక్కించుకున్నట్లు ఆక్స్‌ఫామ్‌ సంస్థ వెల్లడించింది. స్విస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూసీ సమాచారం ప్రకారం గతపదిహేను సంవత్సరాలలో బ్రిటన్‌ సంపద 6 నుంచి 10లక్షల కోట్ల పౌండ్లకు పెరిగింది. ఈ మొత్తంలో జనాభాలో సగం మంది పేదలుగా వున్న మూడు కోట్ల మందికి ఏడు శాతం దక్కగా ఆరులక్షల మందిగా వున్న ఒక శాతం ధనికులకు 26శాతం చేరింది. మరో వైపు ఈ ధనికులు పన్ను చెల్లింపును తప్పించుకొనేందుకు ఏటా 170 బిలియన్‌ పౌండ్లను పన్నుల స్వర్గాలుగా పిలిచే ప్రాంతాలలో దాస్తున్నారు. దీని వలన ప్రభుత్వం ఐదు బిలియన్‌ పౌండ్లు నష్టపోతోంది.

    అసమానతల పెరుగుదల అన్ని దేశాలలో జరుగుతోంది కాబట్టి అన్నింటికీ మూల కారణం ఆర్ధిక విధానాలు అన్నది స్పష్టం.వుదాహరణకు మన దేశంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో అమలు జరిపిన విధానాలకు మోడీ అమలు జరుపుతున్నవాటికీ తేడా లేదు. 1991 నుంచి ప్రభుత్వ రంగంలో పరిశ్రమల స్ధాపన అన్నది ఎత్తి వేశారు.తరువాత క్రమంగా విద్య, ఆరోగ్య రంగాలలో పెట్టుబడుల నిలిపివేత లేదా తగ్గింపు జరుగుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ వుద్యోగులకు తప్ప కార్పొరేట్‌ కంపెనీలకు పన్ను పెంపుదల, అమలు లేదు. అనేక రాయితీలు ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి రాయితీల మొత్తం ఏడాదికి ఆరులక్షల కోట్ల వరకు వుంది. మరోవైపున కార్మిక చట్టాలను నీరు గార్చుతున్నారు. అటవీ భూములు, ఇతర వ్యవసాయ భూములను కార్పొరేట్లకు వుదారంగా కట్టబెడుతున్నారు.

   మన దేశంలో కార్మికులకు ఇచ్చే వేతనాలు పెరిగి పోయి వ్యయసాయం గిట్టుబాటు కావటం లేదనే మాట తరచూ వినిపిస్తుంటుంది. విలువ తగ్గిన రూపాయల మొత్తం పెరిగినట్లు కనిపించినా నిజవేతనాల పరిస్థితి అలా లేదు. మనకు స్వాతంత్య్రం వచ్చిన 30 సంవత్సరాల తరువాత సమాజంలో అగ్రస్థానంలో వున్న జనాభాలో 0.01శాతం మంది వేతనాలు ఏటా 11శాతం పెరుగుతున్నాయి. కానీ మిగతా వారిలో అది 1.5శాతమే వుంది. గ్రామీణ ప్రాంతాలలో 1980 దశకంలో నిజవేతనాల పెరుగుదల ఐదుశాతం వుంది. నూతన ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత 1990 దశకంలో అది రెండు శాతానికి , 2000 దశకంలో సున్నా శాతానికి పడిపోయింది.

    గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంలో పని లభ్యత తగ్గిపోతోంది. 1987-88లో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంలో పురుషులు 74.7శాతం మంది వుపాధి పొందితే అది 2009-10 నాటికి 62.5 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో మహిళలలో 82.6 నుంచి 78.8కి పడిపోయింది.

    పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాలలో అసమానతలు పెరగటానికి పైన చెప్పుకున్న కొన్ని కారణాలు సరే మరి చైనాలో ఎందుకు పెరుగుతున్నట్లు అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. చైనాలో సంస్కరణలను ప్రారంభించే ముందు దానికి ఆద్యుడిగా వున్న డెంగ్‌సియావో పింగ్‌ మంచి గాలికోసం మనం కిటికీ తెరిస్తే గాలితో పాటు దోమలూ, ఈగలూ వస్తాయి. వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అని చెప్పారు. అలాంటివాటిలో ఆదాయ అసమానత ఒకటా ? గత మూడు దశాబ్దాల కాలంలో ధనిక పెట్టుబడిదారీ దేశాలలో దారిద్య్రరేఖకు దిగువన వున్న వారి సంఖ్య పెరగటం ఇదే సమయంలో చైనాలో తగ్గటం అన్న అంశాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. పెట్టుబడిదారీ దేశాలన్నీ ఒకటి రెండు శాతాల అభివృద్ధి రేట్లతో, సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుంటే చైనాలో గణనీయమైన అభివృద్ధి రేటు ఎలా సాధ్యమైంది? అక్కడ కూడా పెట్టుబడిదారీ విధానం అమలు జరిగితే ఇదెలా సాధ్యం ?

    చైనాలో పట్టణ పేదరికాన్ని దాదాపు నిర్మూలించారని గతేడాది ఆగస్టులో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ రాసింది. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలతో పట్టణ పేదల ఆదాయం కనీసంగా 4,476 యువాన్లు లేదా 446 డాలర్లకు పెరిగింది.ఒక్కొక్క యువాన్‌ మన పది రూపాయలకు సమానం.ఇంతకంటే తక్కువ ఆదాయం వస్తున్న వారు పట్టణాలలో 2013లో కేవలం 1.6శాతమేనని తెలిపింది. తలసరి ఆదాయం చైనాలో 1990-2005 మధ్య ఐదు రెట్లు పెరిగింది. చైనాలో అసమానతలు పెరిగి 2008లో గినీ సూచిక 0.491 వుండగా 2013 నాటికి 0.473కు తగ్గిపోయింది. అయితే ఇది నామమాత్రమే అన్నది వేరే చెప్పనవసరం లేదు. చైనా సంస్కరణలు పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వటంతో పాటు పెట్టుబడిదారీ దేశాలలో మాదిరి స్టాక్‌ మార్కెట్లను కూడా తెరిచింది. అంతే కాదు, హాంకాంగ్‌, మకావు దీవులను చైనాలో విలీనం చేసే సందర్భంగా అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధలను 50 సంవత్సరాల పాటు యధాతధంగా కొనసాగిస్తామని 2000 సంవత్సరంలో చైనా ఒప్పందం చేసుకుంది. దీన్నే ఒకే దేశం రెండు వ్యవస్థలు అంటున్నారు. ప్రయివేటు పెట్టుబడులను కూడా అనుమతిస్తున్న కారణంగా వాటితో పాటు వచ్చే అసమానతలు చైనాలో ఆదాయ అంతరాలను, శతకోటీశ్వరులను కూడా పెంచాయి. తమదేశంలో కూడా వేతన శాతం తగ్గిందని ఆల్‌ చైనా ట్రేడ్‌యూనియన్స్‌ ఫెడరేషన్‌ పేర్కొన్నది. అయిత 2008 తరువాత తగ్గిన వేతనశాతంలో పెరుగుదల కనిపించింది. తమది ఇంకా పేద దేశమే అని, తమ పౌరుల అవసరాలకు ఇంకా గణనీయంగా వుత్పత్తులను పెంచాల్సి వుందని చైనా చెబుతున్నది. అందుకు గాను మిశ్రమ ఆర్ధిక విధానాలను అనుసరిస్తున్నది. ఇప్పటికీ సింహభాగం ప్రభుత్వరంగంలోనే ఆర్ధిక వ్యవస్ధ వున్నది. అందువలననే మిలీనియం లక్ష్యాలకు ముందుగానే అక్కడ పేదరికాన్ని తగ్గించగలుగుతున్నారన్నది స్పష్టం. అయితే అదే సమయంలో ఏం చెప్పినప్పటికీ ఒక సోషలిస్టు దేశంలో ఆదాయ అసమానతలు పెరగటాన్ని ప్రశ్నించేవారిని, వారు లేవనెత్తే అనేక సందేహాలను వెంటనే తీర్చటం సులభంగా సాధ్యం కాదు. ప్రపంచ పెట్టుబడి దారులకు నాయకురాలిగా వున్న అమెరికాలో బెర్నీ శాండర్స్‌ రూపంలో అసమానతలు, కనీస వేతనాల పెంపుదల అంశాన్ని తొలిసారిగా ఎన్నికల ఎజెండాలోకి చేర్చటంలో అక్కడి డెమోక్రాటిక్‌ పార్టీలోని అభ్యుదయవాదులు ప్రధమ విజయం సాధించారు. రానున్న రోజుల్లో అసమానతలకు కారణాలను విశ్లేషించటం, దానికి వ్యతిరేకంగా అసమానతకు గురైన వారు సమీకృతం కావటం అని వార్యం. వెనుకా ముందూ తప్ప అందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు.